సంగీతం

సంగీతం

పాశ్చ్యాత జీవిన విధానం, సంస్కృతి ప్రభావం నేడు మనపై చాలా ఉందని పదే, పదే అంటుంటాం. దానికి కారణం, ఆంగ్లేయులు చాలాకాలం మన దేశాన్ని పరిపాలించటం కావచ్చు. అలాగే, పాశ్చ్యాత సంగీతం కూడా మన పూర్వీకులని, సంగీతజ్ఞులను అమితంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారే అందుకు నిదర్శనం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో చెన్నపట్టణంలోని సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఆంగ్లేయుల బ్యాండ్ వీక్షించి ప్రభావితులైన దీక్షితారు వారు ఆంగ్ల సంగీతానికి ప్రభావితులై ఆ బాణీలను అనుకరిస్తూ, కర్ణాటక సంగీతంలో ‘నొట్టు స్వరాల’ పేరిట రచనలు చేశారు. దాదాపు 30, 40 రచనల దాకా ఉన్న ఈ నొట్టుస్వరాలకు ఆంగ్ల జానపద గీతాలతోపాటు ఐర్లాండు, స్కాంట్లాండు జానపద సంగీతం కూడా ప్రేరణగా నిల్చాయి. పాశ్చ్యాత, కర్ణాటక సంగీతానికి వారధిగా నిలిచిన ఈ నొట్టు స్వరాలు పాశ్చ్యాత సంగీతంలో ‘సి’ మేజర్ స్కేలుకు దగ్గరగా ఉండే, శంకరాభరణ రాగంలో తిశ్ర, చతురశ్ర ఏకతాళాలలో రచించబడ్డాయి. పాశ్చ్యాత సంగీతంలో ఈ తాళ నిబద్ధతను 3/4 , 4/4 లయగా వ్యవహరిస్తారు. ఆంగ్లంలో ‘నోట్’ అంటే స్వరం అని అర్ధం. ఈ పదం భాషానుగుణంగా రూపాంతరం చెంది నొట్టుగా మారింది. విలియం బ్రౌన్ అనే ఆంగ్ల అధికారి అభ్యర్థన మేరకు ఆంగ్ల బాణీలకు సంస్కృతంలో పదరచన చేసి, కర్ణాటక బాణీలతో ముత్తుస్వామి దీక్షితార్ మెరుగులు దిద్దినట్టుగా చరిత్రకారులు చెపుతున్నారు. మొదట కేవలం 13 నొట్టు స్వరాలనే ముత్తుస్వామివారు రచించారు. చాలా వరకు నొట్టుస్వరాల సాహిత్యం సంస్కృతంలోనే రచించినా, కొన్ని తెలుగులో కూడా కూర్చారు. నొట్టు స్వరాలలో కూడా దీక్షితార్ వారి ముద్ర ‘గురుగుహ’ మనకు కన్పిస్తుంది. విచిత్రంమేమంటే, ఈ నొట్టు సాహిత్యాన్ని ముత్తుస్వామి దీక్షితార్ తన మొదటి కృతి రచించడానికి చాలాకాలం ముందే రచించారు. ముత్తుస్వామివారి సమకాలీకులైన మోజార్ట్, బేథోవన్ల ప్రభావం కూడా వారిపై మనకు కన్పిస్తుంది. వారి రచనలను అనుకరించి కూడా కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి వారు నొట్టు స్వరాలను, ఇతర కృతులను రచించారు. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా కన్పించే గమకాలు ఈ నొట్టు స్వరాలలో ఉండవు. అందువల్ల ప్రాథమిక సంగీత అభ్యాసకులకు ఇవి పాడుకొవడానికి వీలుగా ఉంటాయి. అలాగే ఇవి గణపతి, సరస్వతి, శివుడు, విష్ణువు, రాముడు, స్కంధుడు, మరియు ఆంజనేయుడు వంటి దేవతామూర్తులను, శ్రీనగరం, కంచి, తిరుపతి, మథుర వంటి పుణ్య క్షేత్రాలను కీర్తించే చిన్న, చిన్న ప్రార్థనా గీతాల రూపంలో ఉంటాయి. కర్ణాటక సంగీతంలోని గీతాలు, కీర్తనలలో లక్షణాలకు విరుద్ధంగా పల్లవి, అనుపల్లవి, చరణాలు ఈ నొట్టు సాహిత్యంలో ఉండవు. నొట్టు సాహిత్యానికి ఆలంబనగా నిలిచిన పాశ్చ్యాత గీతాలలో ప్రముఖమైనవి, ‘సంతానం పాహిమాం, సంగీత శ్యామలే’ – ‘గాడ్ సేవ్ ద కింగ్’, ఇది ఇంగ్లాండు జాతీయ గీతం. అలాగే, ‘శ్యామలే మీనాక్షి’కి ప్రేరణ మోజార్ట్ 12 వేరియేషన్స్ లోని ‘ఆహ్ ఔస్ డిరైజే మామన్’ అనే ఫ్రెంచ్ జానపద గీతం పిల్లల పాట ‘ట్వింకిల్, ట్వింకిల్ లిటిల్ స్టార్’కి కూడా ఈ బాణీయే ప్రేరణ. ఇక ఐరిష్ గీతం ‘లిమరిక్’ ఆధారంగా ‘వందే మీనాక్షీం’, ‘ఓల్జ్ వాజ్ డాన్సర్’ బాణీలో ‘శక్తి సహిత గణపతిం’ రచించబడ్డాయి.

నొట్టు స్వరము		           పాశ్చాత్య సంగీత ప్రేరణ

సంతతం పాహిమాం సంగీత శ్యామలే	        God save the King/queen – British National Anthem
శ్యామలే మీనాక్షీ		                Twinkle twinkle little star. Based on French tune ‘Ah! Vous dirai-je’       
జగదీశ గురుగుహ				Lord MacDonald’s Reel
పీతవర్ణం భజే				Persian verse ‘taza ba-taza nau ba-nau’ with English jingle
సుబ్రహ్మణ్యం సురసేవ్యం			British Army regimental march – British Grenadiere
కంచీశం ఏకాంబరం			Country dance
రామచంద్రం రాజీవాక్షం			Let us lead a life of Pleasure
సకల సురవినుత				Quick March
శక్తి సహిత గణపతిం			Voleuz –Vous-dancer
శౌరి విధినుతే				Oh Whistle and I will come to you, my lad.
వర శివబాలం				Castilian Maid
కమల వందిత				Playful tune of ‘Galopede’ folk dance
వందే మీనాక్షీ				Limerick

నొట్టు స్వర సాహిత్యం

1.  సంతతం పాహిమాం సంగీత శ్యామలే సర్వాధారే జనని
    చింతితార్థప్రదే చిద్రూపిణి శివే శ్రీ గురుగుహ సేవితే శివ మోహాకారే

2.  శ్యామలే మీనాక్షీ సుందరేశ్వరసాక్షి శంకరీ గురుగుహ సముద్భవే శివేవా
    పామరలోచని పంకజలోచని పద్మాసనవాసిని హరి లక్ష్మివినుతే శాంభవి

3.  జగదీశ గురుగుహ హరవిధి వినుతం దేహాత్రయ విలక్షణమానంద లక్షణం
    నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్య నిర్వికల్పం నిశ్ప్రపంచమానంద మజం

4.  పీతవర్ణ భజే భైరవం భూత వేతాళ సంసేవ్యమానం
    పీత వస్త్రం సువర్ణప్రదం వీతరాగం గురుగుహాత్మజం

5.  కంచీశం ఏకామ్రనాయకం నిత్యమహం భజే కామాది షట్చోరవృత్తమహం త్యజే
    పంచాక్షర స్వరూపమాగమాంతసారం పంచాస్యమాది కారణం విశ్వేష్వరం గురుగుహం

6.  రామచంద్రం రాజీవాక్షం శ్యామళాంగం శాష్వత కీర్తిం కోమలహస్తం కోశలరాజం
    మామక హృత్కమలాకరం మారుతియుక్తం ధిమంతం మానిత భక్తం శ్రీమంతం
    కౌమారవరం గురుగుహ మిత్రం కారుణ్యనిధిం దశరథ పుత్రం భూమిసుతాభం
    భూపతి రూపం కోమల పల్లవ పాదం మోదం కామగురుం సితారామం కౌస్తుభభూశం వందేహం

7.  శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత సేవితం
    భక్తాళిపోషకం భవసుతం వినాయకం భక్తిముక్తిప్రదం భూశితాంగం రక్తపదాంబుజం భావయామి

8.  వరశివ బాలం వల్లీలోలం వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం
    గురుగుహ రూపం గుప్తాకారం ఘోరక్షంతం సురపతిసేనంసుబ్రహ్మణ్యం సురవినుతం

9.  వందే మీనాక్షి త్వాం సరసిజ వక్రే పర్ణే దుర్గే నటసుర బృందే శక్తే గురుగుహ పాలిని జలరుహచరణే
    సుందర పాండ్యానందే మాయే సూరిజానాధారే సుందరరాజ సహోదరి గౌరి శుభకరి సతతమహం

10.  శౌరి విధినుతే శాంభవి లలితే శాంతే అతీతే శంకరముదితే గౌరి సురహితై ఏకామ్రపతియుతే
     కామాక్షీ మాం పాహి వీరవర వినుత చరణాంభోజే ఘోరతమలయవర హిమగిరిజే
     శూరహరణ గురుగుహ మాతహ సంసారతర చరణతర కమలే

11.  కమలాసన వందిత పదాబ్జే కమనీయ కరోదయ సామ్రాజ్యే కమలానగరే సకలాకరే
     కమల నయన ధృత జగదాధారే కమలే విమలే గురుగుహ జనని కమలాపతినుత
     హృదయే మాయే కమల శశి విజయ వదనే అమేయే కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ గౌరీపూజిత
     హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వరసతి కల్యాణి

12.  సకల సురవినుత శంభో స్వామిన్ వికట గురుగుహ విజయ త్రిపురహర ఏకామ్రపతే
     కరుణామూర్తే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకభోగ దాయకనందకర విభో

13.  సుబ్రహ్మణ్యం సురసేవ్యాబ్జపదం సుందర వదనం సుకుమార వినుత లావణ్యం
     శుభగాత్రం శుభకర నేత్రం సోమాత్మకమాశ్రిత కల్పభూరుహం
     సూరి గురుగుహం సురరాజ విధి వినుతం సర్వజ్ఞం సుమతే చింతయ గురునాథం
     స్వజ్ఞాన విదారణ ఫణితం సాధుజన సూనృత వచనం

తేటగీతి
సంగీతం పాడటమే ఒక కళ అంటే, పాటలను రాసి వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయలగలిగే వారే సంగీతకారులుగా ప్రసిద్ధి కెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి ఆశువుగా గానం చేసే కళాకారులని వాగ్గేయకారులు అంటారు. జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తివంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అలాంటి మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకుందాం. జయదేవుడు జయదేవుడు క్రీ.శ. 1098లో రమాదేవి, భోజదేవుల దంపతులకు జన్మించాడు. ఒరిస్సాలోని పూరీకి దగ్గరలోని ‘కిందుబిల్వం’ ఈయన స్వగ్రామం. జయదేవుడు గోవర్ధనాచార్యుల వద్ద శిష్యరికం చేసి సంస్కృతం, సంగీతం అభ్యసించాడు. జయదేవుడు క్రీ.శ. 1116లో బెంగాల్ లో నవద్వీపం రాజు లక్ష్మణసేనుడి ఆస్థానంలో ఆస్ధానకవిగా ఉండేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. జయదేవుడు కృష్ణ భక్తుడు. భార్య పద్మావతి నృత్యం, కృష్ణభక్తి ప్రేరణలతో జయదేవుడు రాధా, కృష్ణుల ప్రణయగాథను, భక్తితత్వ్తాన్ని సంస్కృతంలో అష్టపదుల రూపంలో రచించాడు. సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది. ఎనిమిది చరణాలు గల పాటలు, శ్లోకాలు రచించటం వల్ల వీటికి అష్టపదులు అని పేరు. ఈ అష్టపదుల సంకలనమే ‘శ్రీ గీతగోవిందం’. జయదేవుడు రాధాకృత, గోపికా కృత, గీత గోవిందం అని అర్ధం వచ్చేవిధంగా, శ్రీ గీతగోవిందం అని పేరుపట్టాడు. కానీ కాల క్రమేణా ఇది గీతగోవిందంగా ప్రసిద్ధి కెక్కింది. శ్రీ గీతగోవిందం గీతగోవిందంగా మారినట్టే శ్రీ జయదేవ నామం కూడా జయదేవగా రూపాంతరం చెందినట్టు విమర్శకులు భావిస్తున్నారు. జయదేవుడు తన పేరునే ముద్రగా అష్టపదులలో పొందుపర్చాడు. అనేక అష్టపదులలో చివరి చరణంలో శ్రీ జయదేవ శబ్దమే ప్రయోగితమవడమే ఇందుకు తర్కాణం. సరళమైన పదాలతో, పాటలతో రాసిన గీతగోవిందం భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానమని చెప్పవచ్చు. శృంగార వర్ణనలతో కూడిన శ్రీ గీతగోవిందంలో మొత్తం 12 సర్గాలు, 95 వివిధ వృత్త రచనలు, 78 శ్లోకాలు, 24 పాటలున్నాయి. గీత గోవిందంలోని 12 సర్గాలు భాగవతోంని 12 స్కంధాలకు మారురూపమని ఒక నమ్మకం. సకల వేదసారం గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలలో నిక్షిప్తమయినట్టు, గీత గోవిందలో కూడా 24 ప్రంబంధాలుండటం కాకతాళీయం కాదని గీతగోవిందం భాగవత స్వరూపమని మరో నమ్మిక. అందుకు తగినట్టుగానే అష్టపదులలో మొదటిది దశావతార అష్టపది కావటం విశేషం. 11 చరణాలు గల ఈ అష్టపదిలో జయదేవుడు విష్ణుమూర్తి దశావతారాలను వర్ణించాడు. జయదేవుని గీతగోవిందం గురించిన ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు జయదేవుడు 19వ అష్టపది రాస్తుండగా ఒక పంక్తి సరిగ్గా కుదరక రాసినదానిని కొట్టివేసి, స్నానానికి వెళ్లాడట. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అదే పంక్తి తిరిగి రాసి ఉన్నదట. ఆశ్చర్యంతో భార్య పద్మావతిని పిలిచి ప్రశ్నించగా మీరే వచ్చి రాశారని ఆమె బదులిచ్చిందట. సాక్షాత్తు కృష్ణభగవానుడే వచ్చి పంక్తిని పూర్తిచేశాడని జయదేవుడు గ్రహించాడు. పద్మావతికి కృష్ణదర్శనం లభించినందున ఈ అష్టపదిని దర్శన అష్టపది అని అంటారు. అంతేకాకా పద్మావతికి లభించిన భాగ్యానికి గుర్తింపు అన్నట్టు జయదేవుడు ఈ అష్టపది చివరి పంక్తిని ‘జయతు పద్మావతీ రమణ జయదేవకవి’ అని పూర్తిచేశాడు. జయదేవుని అష్టపదులలో బహుళ ప్రాచుర్యం పొందినవి ... ‘హరిరిహముగ్ధవధూనికరే’, ‘చందన చర్చిత నీల కళేబర’ మరియు ‘సావిరహేతవదీనా రాధా’ మొదలగునవి. జయదేవునికి ముందు రాగ, తాళాలతో పాటలు పాడినవారుకానీ, పాటలు రచించినవారుకానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. కావున జయదేవుడే మొదటి వాగ్గేయకారుడని చరిత్రకారులు అభిప్రాయం. జయదేవుని గీతగోవిందం సంగీతరత్నాకరం రాయటానికి దాదాపు రెండు, మూడు శతాబ్దాల ముందు పుట్టింది. గీతగోవిందాన్ని ఏఏ రాగాలలో పాడాలి అన్న మార్గదర్శకత్వం లేనందున సంగీతకారులు తమకు తోచిన రాగ, తాళాలలో అష్టపదులను ఆలపించారు, ఆలపిస్తున్నారు. సంగీతజ్ఙులు శ్రీ మంచాల జగన్నాథరావుగారు జయదేవుని అష్టపదులకు రాగతాళస్వరకల్పన చేస్తూ, తాళములకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. సాహిత్యము నందలి పదపొందిక గమనించినచో వాని ఛందస్సు స్పష్టంగా తెలుసుకోవచ్చని, దాని ఆధారంగా తాళములు కట్టవచ్చని వివరించారు. ఉదాహరణకు ఆరు మాత్రలు గల ’శ్రితకమలా కుచమండల’ అనే అష్టపదిని రూపక తాళంలోనూ, ‘రదసి యది కించిదపి’ అనే అష్టపదిని ఐదు మాత్రలు గల జంపెతాళంలోనూ, ‘మామియంచలితా విలోక్యా వృతం’అనే అష్టపదిని యేడు మాత్రలు గల త్రిపుట లేదా సాకు తాళంలోనూ, ‘లలిత లవంగ లతాపరిశీలన’ అనే అష్టపదిని ఆది తాళంలోనూ పాడుకోవలెనని తెలిపారు. ఖశ్చితంగా ఈఈ రాగాలలో పాడాలన్న నిబంధన లేకపోయినా, జయదేవుడు మంగళ గుర్జరి, బారడి, దేశీ బారడి, గుజ్జరి, భారబి, వసంత, రామఖేరి, గుండఖేరి, దేశాఖ్య వంటి రాగాలలో గీతగోవిందాని గానం చేశాడని అంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధ కాలంలో పుట్టిన అష్టపదులు నేటికి ప్రచారంలో ఉన్నాయి. భజనల్లో, నాట్య ప్రదర్శనల్లో మనకు ఈ అష్టపదులు విన్పిస్తుంటియి. ఒడిస్సి, భరతనాట్యం, మణిపూరి, కూచిపూడి, కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో అష్టపదులను ప్రదర్శింస్తుంటారు. నేటికి పూరిలో జగన్నాథస్వామికి పూజలు నిర్వహించేటప్పుడు, తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు పాడినట్టు, జయదేవుని అష్టపదులు ఆలపిస్తుంటారు. పూరీ జగన్నాథ రథోత్సవ సందర్భంలో 19వ అష్టపదిని ఆలపిస్తారు. కేవలం పూరీలోనే కాకా కేరళలోని గురువాయూరు దేవాలయంలో కూడా అష్టపదులను సోపాన పద్దతిలో గానంచేస్తారు. జయదేవుడు గీతగోవిందమేకాక, యీసత్కవిచంద్రాలోకం, రతిమంజరి, కారకవాదం, తత్త్వచింతామణి అనే గ్రంధాలను విరచించాడు. కృష్ణ భక్తితత్త్వాన్ని కళ్లకు కట్టినట్టుగా విరచించిన జయదేవుడు క్రీ.శ. 1153లో పరమపదించాడు. సౌమ్యశ్రీ రాళ్లభండి
త్యాగరాజు రచించిన మూడు నృత్యనాటికల్లో ప్రసిద్ధమైనది ప్రహ్లాద భక్తి విజయం. మొదలు నుంచి తుది వరకు త్యాగరాజస్వామి తనను తాను ప్రహ్లాదునిగా ఊహించుకుంటూ, తన ఇష్టదైవమైన శ్రీరాముని ఇందులో కొలిచారు. పూర్ణ చంద్రిక రాగంలో రచించిన ‘తెలిసి రామా చింతనతో’ కీర్తనలో రాముని పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరించి, భక్తే మోక్షమార్గమని తెలిపారు. అలాగే రెండవ అంకంలో సహన రాగంలో కూర్చిన ‘వందనము శ్రీ రఘునందన’, కీర్తనలో విష్ణమూర్తి, శ్రీరామచంద్రులను ఒక్కరిగా సాక్షాత్కరింప చేశారు. ప్రహ్లాదుని రక్షించిన నరసింహుని ప్రస్తావన, నామోచ్ఛారణ ఎక్కడా ఈ గేయ నాటికలో కన్పించకపోవడం విశేషం. యక్షగానాలతో ప్రేరణ పొందిడం వల్ల కర్ణాటక సంగీతాన్ని అందులో మిళితం చేసి త్యాగరాజు తమ నృత్య నాటికలను రచించారు. అందుకు నిదర్శనమే ఆది, అంత్య కృతులైన ‘శ్రీ గణపతిని’, ‘నీ నామ రూపములకు’. అయితే ఈ విషయంలో త్యాగరాజస్వామి కొత్త ప్రయోగం చేశారని చెప్పవచ్చు. అప్పట్లో నృత్యనాటికల్లో మంగళం ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లో ఉండేవి. అయితే త్యాగరాజు ప్రహ్లాద భక్తివిజయంలో అందుకు విరుద్ధంగా సౌరాష్ట్రం రాగంలో రచించారు. ఐదు అంకాలు గల ఈ నాటికలో 45 కృతులను 28 రాగాలలో త్యాగరాజు రచించారు. దివ్యనామ కీర్తనలను తలపించే ఈ కృతులతోపాటు కంద, సీస, ఉత్పలమాల, చంపకమాల పద్యాలు, ద్విపదలు ఈ నృత్యనాటికలో ఉన్నాయి. అలాగే కులశేఖర ఆళ్వారు రచించిన ‘ముకుందమాల’ వాల్మీకి రామాయణంలోని అనేక శ్లోకాలు ప్రహ్లాద భక్తి విజయంలో త్యాగరాజు విరివిగా ఉపయోగించారు. వైకుంఠవాసుని లీలా విశేషాలను అమోఘంగా వ్యక్తపర్చే ‘జయతు, జయతు సకల నిగమానిగమ’ ఈ నాటికలోనిదే. ఇక పంతువరాళి రాగంలో ‘వసందేవయతిం’ మరియు ‘నారదముని వేదలిన’, నీలాంబరి రాగంలో ‘ఎన్నగ మనసుకురాని’, మోహన రాగంలో ‘దయరాని, దయరాని’, ‘జయమంగళం, నిత్య శుభమంగళం’, అసావేరి రాగంలో ‘రారా మాయింటిదాకా’ ఇలా ఈ నాటకంలోని అనేక కీర్తనలు ప్రజాదరణ పొందాయి.   ప్రహ్లాద భక్తి విజయంలోని కీర్తనలు వరసగా: 1. శ్రీ గణపతిని సేవింపరారే (సౌరాష్ట్ర) 2. వాసు దేవయని వెడలిన (కళ్యాణి) 3. సాగరుండు వెడలెనిదో (యమునా కళ్యాణి) 4. వినతాసుత రారా నా (హుసేని) 5. విష్ణువాహనుడిదిగో (శంకరాభరణం) 6. వారిధి నీకు వందన (తోడి) 7. వచ్చును హరి నిన్నుజూడ (కళ్యాణి) 8. వందనము రఘునందనా (సహన) 9. ఇందుకా ఈ తనువును (పున్నాగవరాళి) 10. ఎట్లా కనుగొందునో (ఘంట) 11. నిజమైతే ముందర (భైరవి) 12. నారదముని వెడలిన (కామవర్ధని) 13. ఇపుడైన నను (ఆరభి) 14. ఎన్నగ మనసుకు (నీలాంబరి) 15. ఏటి జన్మమిది (వరాళి) 16. ఎంతనుచు వర్ణింతునే (సౌరాష్ట్ర) 17. ఏనాటి నోము ఫలమో (భైరవి) 18. నన్ను బ్రోవకను (శంకరాభరణం) 19. అడుగు వరముల (ఆరభి) 20. వారిజ నయన (కేదార గౌళ) 21. తనలోనే ధ్యానించి (దేవ గాంధారి) 22. ఓ రామ రామ సర్వోన్నత (నాగ గాంధారి) 23. శ్రీ రామ జయరామ (మధ్యమావతి) 24. సరసీరుహ నయన (బిలహరి) 25. వద్దనుండేదే బహుమేలు (వరాళి) 26. తీరునా నాలోని (సావేరి) 27. రామాభిరామ రఘురామ (సావేరి) 28. దయరాని (మోహన) 29. దయ సేయవయ్య (యదుకుల కాంభోజి) 30. ఆనందమానందమాయెను (భైరవి) 31. జయమంగళం నిత్య (ఘంట) 32. నన్ను విడిచి (రితిగౌళ) 33. అందుండకనే (కామవర్ధని) 34. ఏమని వేగింతునే (హుసేని) 35. ఎంత పాపినైతినేమి (గౌళిపంతు) 36. ఓ జగన్నాథ (కేదార గౌళ) 37. చెలిమిని జలజాక్షు (యదుకుల కాంభోజి) 38. పాహి కళ్యాణ రామ (కాపీ) 39. రారా మాఇంటిదాకా (అసావేరి) 40. కమలభవుడు (కళ్యాణి) 41. దొరకునాయని (తోడి) 42. చల్లారే శ్రీరామచంద్రునిపైన (ఆహిరి) 43. వరమైన నేత్రోత్సవమును (ఫరజు) 44. జయమంగళం (మోహన) 45. నీ నామరూపములకు (సౌరాష్ట్ర) తేటగీతి
శ్రీ కృష్ణలీలలు బ్రహ్మ, విష్ణు, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, కూర్మ, పద్మ, మార్కండేయ పురాణాలలో శ్రీగర్గ, శ్రీదేవీ భాగవతాల్లో, భారత, హరివంశాల్లో వర్ణించపడింది. సమ్మోహనాత్మకమైన కృష్ణ స్వరూపం పండితులను, పామరులను ఒకే విధంగా అలరించింది. లీలాశుకుడు, నారాయణతీర్ధులు, పురందర మరియు అన్నమయ్య వంటి వాగ్గేయకారులెందరో బాలకృష్ణుని లీలా విశేషాలను అభివర్ణించి తరించారు. ‘‘భక్తవత్సలు డౌటపరమ సంప్రీతి పరమ పదంచిచ్చు బాలకృష్ణుడు’’అంటూ ఫలశ్రుతి చేసింది తన ‘శ్రీకృష్ణమంజరి’లో తరిగొండ వేంగమాంబ. వేదాలలో ప్రాచీనమైన ఋగ్వేదంలో కూడా కృష్ణ శబ్ధం పలుచోట్ల విన్పిస్తుంది. శ్రీ భాష్యం అప్పలాచార్యులుగారు ‘‘తిరుప్పావు’’ అనే గ్రంధంలో ‘కృష్ణ’ శబ్ధానికి ఈ విధంగా నిర్వచనం చెప్పారు – కృష్ – అపరిమితము, ణ – ఆనందము, కృష్ణ – అపరిచ్ఛిన్న ఆనందము. అదియే బ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణతత్త్వాన్ని, లీలా వైభవాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో సాక్షాత్కరింప చేశాడు. అన్నమయ్య తీర్ధయాత్రల సందర్భంలో దర్శించిన ఉద్దగిరి, మాడుపూరు, విజయనగరం వంటి కృష్ణ క్షేత్రాలపై సంకీర్తనలు పాడాడు. అవేకాక పర్వ సంకీర్తనలు, బాలకృష్ణుని లీలావైభవ సంకీర్తనలు కూడా ఆయన కీర్తనల్లో ప్రముఖంగా కన్పిస్తాయి. ‘ఓయమ్మ చూడగదరె వుద్దగిరి కృష్ణుడు’, ‘చేరి యందల మోతతో చెన్నకేశవా, యీరీతి మాడుపూరిలో నిట్లాడేవా’, ‘వేడుకకాదు గదమ్మ విజయనగరములోన, వేడెవెట్టి సతులను వెన్నముద్ద కృష్ణుడు’ వంటివి క్షేత్ర సంకీర్తనల్లో కొన్ని ఉదాహరణలు. ఇక అన్నమయ్య కృష్ణ పర్వ సంకీర్తనలను, జయంతి సంకీర్తనలు, కృష్ణాష్టమి సంకీర్తనలు, తిధి జయంతులను గూడ సూచించే సంకీర్తనలు, చివరగా ఉట్ల పండుగ సంకీర్తనలు అను నాలుగు విధాలుగా విభజించవచ్చు. ‘జోజోయని మీరు జోలపాడరో, సాజపు జయంతి నేడే సఫల మిందరికి’, ‘హరి కర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో’ అంటూ, శ్రావణ, భాద్రపద మాసాల్లో అష్టమితో కలిసి వచ్చే రోహిణి నాడు కృష్ణజయంతిగా సూచిస్తూ అన్నమయ్య సంకీర్తనలు చేశాడు. ‘సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమినాడు’ అంటూ, ఎంతో విశిష్టమైన శ్రావణ బహుళాష్టమి ప్రాముఖ్యాన్ని, తత్ ప్రాశస్త్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో భావబంధురంగా అభివర్ణించి ఆలపించాడు. ఇందు కొన్ని మచ్చుతునకలు -- ‘కొడుకై జన్మించినాడు కూరిమి శ్రీ కృష్ణుడు, నడురేయి నిదే శ్రావణ బహుళాష్టమినాడు’ ‘శ్రావణ బహుళాష్టమి చంద్రోదయము రోహిణి కావింప జన్మదినమిదివో శ్రీ వేంకటపతికి’ ‘గోవిందుడు జనించె గోకులాష్టమిదే నేడు’ ‘అందమై మధురలోన నదివో కృష్ణావతరామందెను శ్రావణ బహుళాష్టమి నేడు’ ‘దేవకి కొడుకుగన్న దినమిది శ్రీజయంతి, వసుదేవుడెత్తెను శ్రావణ బహుళాష్టమిని‘, ‘పురాణ పురుషుడు భువి నవతరించె, సిరుల జయంతి నేడు సేయరో పండగలూ, శ్రావణ బహుళాష్టమిఁ జందురు డుదయించెను’ అంటూ శ్రీకృష్ణజన్మాష్టమి తిధి, నక్షత్రాలను మేళవించి కూడా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాడు. ‘పలువురు వుట్లపండుగను, చిలుకు చిడుక్కొని చిందగను’ అంటూ జన్మాష్టమినాడు భారతదేశ యావత్తు ఎంతో ఉత్సాహంగా, వినోదాన్ని పంచుకునే ఉట్లపండగకు అన్నమయ్య తన సంకీర్తనల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ‘బాలులతో వీధులలో బారాడువాడు, కోలలెత్తుక వుట్లు కొట్టిఁజుండీ’ ‘అక్కలాల చూడు డందరును, నిక్కి నారవట్టి నేడు కృష్ణుడు’ ‘పైకొని చూడరో వుట్లపండుగ నేడు, అకడ గొల్లెతలకు నానందము నేడు’ ఇలా సంకీర్తనల్లో ఉట్లపండగను ఉల్లేఖించడమేకాక, ఎన్ని రకాల ఉట్లు కట్టబడేవో, కొట్టబడేవో కూడా అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలియ చెప్పాడు. వక్కల, సెనగల, పప్పుల, తేనెల, చెక్కరల, నేతుల, బియ్యాల, చక్కిలాల, అటుకుల, చెఱకుల, నువ్వుల, బెల్లాల, చిమ్మిలాల, ఆనవాల, అడుకుల, పానకాల, పెరుగు, వెన్నఉట్లను బలరామకృష్ణులు కొట్టారని అన్నమయ్య సంకీర్తనల్లో తెలుస్తుంది. ఇక భాగవత దశమస్కంధంలో ఊటంకించిన శ్రీ కృష్ణుని దివ్యలీలలే అన్నమయ్య లీలావైభవ సంకీర్తనలకు ఆధారము. అన్నమయ్య తన సంకీర్తనల్లో పూతన, శకటాసుర, తృణావర్త, కంసాదుల సంహారం, ఉలూఖల బంధనం, కాళీయ మర్ధనం, గోవర్ధనోద్ధరణ మొదలైన ఘట్టాలను కూర్చి ఎంతో రసవత్తరంగా ఆలపించాడు. ‘ఎక్కడి కంసుడు యికనెక్కడి భూభారము, చిక్కువాప జనియించె శ్రీ కృష్ణుడు’ ‘కావిరి విరెసె కంసుడిగినిసె, వావిరి పువ్వుల వానలు కురిసె’ ‘చన్నుదాగి పూతనను సగ్గుడుగా చప్పరించె’ ‘పిసికిపూతకి చన్ను బిగియించి పట్టిన, యిసుమంతలు చేతులివియపో’ ‘చిమ్మెడి విషములు చేసిన రొమ్ములు, కొమ్మని యిచ్చిన గుడిచేని బొమ్మర పోవడు పూతకి బొరిగొని, అమ్మరో గయ్యాళి శిశువు’ ‘కాళింగు దొక్కితివట కటకట వుద్దండాలు, వోలిజేయ దొరకొంటివొ’ ‘బాలునీ కోపమిది సరిలేని మద్దలివి, రోలనే యిట్లను విరుగద్రోయుడు’ ‘కరికరించగ రోలగట్టితే నప్పుడు మా, హరిగాడుగదా ఆడనున్న బిడ్డడు’ ‘కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన, యినుమువంటి చేతులివియపో’ ‘గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు’ ‘తొల్లె గోవర్ధనమెత్తి దొరతనాలెల్లాజేసి, అల్లవాడె నిలుచున్నాడాతుడీతడా’ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంకీర్తనల్లో శ్రీ కృష్ణలీలలు మనకు దర్శనమిస్తాయి. బాలకృష్ణుని భక్తితత్వం: కేవలం కృష్ణలీలలను కీర్తనలుగా ఆలపించడమేకాక, తన సంకీర్తనల్లో భక్తి తత్వాన్ని ఇనుమడింపచేశాడు అన్నమయ్య. ‘నానాభక్తులివి నరుల మార్గములు’ అంటూ భక్తిలో అనేక విబేధాలను తెలిపాడు. ఉన్మాదభక్తి, పతివ్రతాభక్తి, విజ్ఞానభక్తి, ఆనందభక్తి, రాక్షసభక్తి, తురీయభక్తి, తామసభక్తి, వైరాగ్యభక్తి, రాజసభక్తి, నిర్మలభక్తి మరియు నిజభక్తి, ఇలా అనేకానేక భక్తితత్వాలను అన్నమయ్య తన సంకీర్తనలలో పొందుపర్చాడు. ‘ఇట్టి ముద్దులాడి బాలుడేడి వాడువాని, బట్టితెచ్చి పొట్టనిండ బాలుపోయరె’ అంటూ యశోద బాలకృష్ణునిపై కురిపించే వాత్సల్యం, ‘మొత్తకురె యమ్మలాల ముద్దులాడు వీడె, ముత్తెము వలె నున్నాడు ముద్దలాడు’ అని గోపికలు చిన్నారి కృష్ణుని యశోద శిక్షిస్తే నిలువలేక కురిపించే వాత్సల్యం, ‘తోయపుం గురులతోడ దూగేటి శిరసు, చింత కాయలవంటి జగడములతోడ మ్రెయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ పాయక యశోదవెంట బాఱాడు శిశువు చిన్ని శిశువు, చిన్నిశిశువు ఎన్నడు జూడమమ్మా యిటువంటి శిశువు’ అంటూ బాలకృష్ణుని సౌందర్య దర్శనంతో ఆ దేవదేవునిపై పెంచుకునే వాత్సల్యం భక్తితత్వానికి పరాకాష్ఠ. నవవిధ భక్తిమార్గాల్లో కీర్తనమొకటి. అన్నమయ్య గుణసంకీర్తనం మనకు ప్రధానం కన్పిస్తుంది. ‘కొండగొడుగుగబట్టి గోకులమునెల్లగాచి మెండుగు గొల్లెతలతో మేలమాడి అండనె నోరుదెరచి యశోదకు లోకములు దండిగాజూపె నితడెదంట యైనబాలుడు’ అని చెప్పడంలో గోవర్ధనోద్ధరణ, విశ్వరూప దర్శనం వంటి దివ్యలీలలను కీర్తించాడు అన్నమయ్య. సౌమ్యశ్రీ రాళ్లభండి
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం, అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలను భాగవతం మనకు ప్రతిపాదించింది. మనసా, వాచా కర్మణా ఈ తొమ్మిది మార్గాలను అనుసరించి భగవంతుని చేరుకొనవచ్చని, కమలాక్షు నర్చించు కరములే కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వయే జిహ్వ, చక్రధారి కథలు వినే చెవులే చెవులని, ఆ పరమాత్ముని స్మరణ విడనాడితే, భవబంధాల నుంచి విముక్తి పొంది పునర్జన్మలేని మోక్షాన్ని పొందజాలమని పోతన భాగవతంలో వివరించాడు. త్రికాల సత్యుడైన పరమాత్ముని సన్నిధిని చేరడానికి భక్తియే ఉత్తమ మార్గమని, అట్టి భక్తి యొక్క పదకొండు రూపాలను, గుణగణాలను నారదుడు నవవిధభక్తి సూత్రాలలో వివరించాడు. గుణమాహాత్మ్యా సక్తి, రూపాసక్తి, పూజాసక్తి స్మరణా సక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి కాంతాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయాసక్తి పరమవిరహాసక్తి, రూపా ఏకదా ఆపి ఏకాదశాభవతి. అట్టి గుణగుణాలకు, గుణమాహాత్మ్యాసక్తి భక్తికి నారదుడు, వ్యాసుడు, రూపాసక్తి భక్తికి బృందావన స్త్రీలు, పూజాసక్తి భక్తికి అంబరీషుడు, స్మరణాసక్తి భక్తికి ప్రహ్లాదుడు, దాస్యాసక్తి భక్తికి హనుమంతుడు, సఖ్యాసక్తి భక్తికి ఉద్ధవుడు, అర్జునుడు, వాత్సల్యాసక్తి భక్తికి దేవకీ, యశోద, కౌసల్య, కాంతాసక్తి భక్తికి రుక్మిణి, పార్వతీదేవి, ఆత్మ నివేదనసక్తి భక్తికి బలిచక్రవర్తి, విభీషణుడు, తన్మయాసక్తి భక్తికి సనత్కుమారుడు, పరమవిరహసక్తి భక్తికి గోపికలు పత్రీకలని కూడా భాగవతం తెలిపింది. ఇక అన్నమయ్య కూడా అనేక రూపాలలో బాసిల్లుతున్న భక్తి స్వరూపాలను తనదైన రీతిలో దర్శించి, ప్రతిపాదించాడు. నానాభక్తులివి నరుల మార్గములు యేనపాననై నా నాతఁడియ్యకొను భక్తి హరికిఁగా వాదించు టది ఉన్మాదభక్తి పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి అరమరచి చొక్కుటే ఆనందభక్తి అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి అతనిదాసుల సేవే అదియే తురీయభక్తి క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి అతఁడే గతని వుండు టదివైరాగ్యభక్తి అట్టే స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి నెట్టన శరణనుటే నిర్మలభక్తి గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి భక్తి మార్గాలనేకమైన ఆ స్వామి కృపాకటాక్షం లేనిదే గమ్యం చేరలేమని అన్నమయ్య తెలిపాడు. సత్వ, రజో, తమో గుణాల ప్రేరణతో భక్తుడు అవలంబించే మార్గాలను ఉన్మాద భక్తి, పతివ్రతాభక్తి, విజ్ఞానభక్తి, ఆనందభక్తి, రాక్షసభక్తి, తురీయభక్తి, తామసభక్తి, వైరాగ్యభక్తి, రాజసభక్తి, నిర్మలభక్తి, చివరగా నిజభక్తి అని అన్నమయ్య వర్గీకరించాడు. ఆ పరబ్రహ్మను నాయకుడిగా తమను నాయికలుగా తలపోసి పరమాత్ముని, దివ్య, శృంగార లీలను కీర్తించటం ద్వారా జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే మధుర భక్తిని అన్నమయ్య తన శృంగార కీర్తనల ద్వారా వెల్లడించాడు. ఆ పరమేశ్వరుని భువనమోహన రూపాన్ని దర్శించడానికే కళ్లున్నాయని, అతనికి దాస్యం చేయని జన్మ వృథాయన్న కాంతాసక్తి భక్తిని తన కీర్తనలలో రంగరించి మనకందించాడు అన్నమయ్య. ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి యిదిగాక వైభవం బిఁక నొకటి కలదా అతివ జన్మము సఫలమై పరమయోగివలె నితర మోహాపేక్శ లిన్నియును విడిచె సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ సతత విజ్ఞాన వాసన వోలె నుండె తరుణి హృదయము కృతార్థతఁ బొంది విభుమీఁది పరవశానంద సంపదకు నిరవాయ సరసిజానన మనోజయ మంది యింతలో సరిలేక మనసు నిశ్చలభావమాయ శ్రీ వేంకటేశ్వరునిఁ జింతించి పరతత్త్వ భావంబు నిజముగాఁ బట్టెఁ జెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు లావణ్యవతికి నుల్లంబు దిరమాయ పరమాత్మ తత్వ జ్ఞానము పొందాక ఇక మోహమనేది పుట్టదని, నాయికను యోగితో పొల్చటం ద్వారా మోహదశ నుంచి జీవుడు విజ్ఞానదశకు చేరుకుంటాడనే భక్తి తత్వాన్ని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలిపాడు. ‘నామసంకీర్తనం యస్య, సర్వపాప ప్రణాశనమ్’ అని భాగవతంలో తెలిపినట్లు పాపపంకిలాన్ని కడిగివేయగల భగవన్నామ సంకీర్తనానికి మించిన భక్తి మార్గం మరొకటి లేదని ఆ భగవంతుని పాదపద్మాలను తన సంకీర్తానా జలంతో అభిషేకించి నామ సంకీర్తనం యొక్క నిగూఢ రహస్యాన్ని భక్తులకందించాడు అన్నమయ్య. ఇన్నిటా నింతటా నిరవొకటే వెన్నుని నామమె వేదంబాయె నలినదళాక్షుని నామకీర్తనము కలిగి లోకమున కలదొకటే యిల నిదియే భజియింపగపుణ్యులు చెలగి తలప సంజీవని ఆయె కోరిక నచ్యుత గోవిందా యని ధీరులు తలపగ తెరువొకటే ఘోర దురితహర గోవర్ధనధర నారాయణ యని నమ్మగ కలిగె తిరువేంకటగిరి దేవుని నామము ధరతలపగ ఆధారమిదే గరుడధ్వజుని సుఖప్రద నామము నరులకెల్ల ప్రాణము తానాయె భగవంతుని కీర్తిని గానం చేయడం కీర్తనా భక్తిగా పరిగణించబడుతుంది. అలాగే నిరంతరమూ భగవంతుని మనసారా స్మరించడమే స్మరణభక్తి. అన్నమయ్య ఆ భగవంతుని లీలలను, మహిమలను, విశిష్ట, గుణగణాలను గానం చేయటం ద్వారా స్మరణ, సంకీర్తనా భక్తి విశిష్టతలను అభివ్యకం చేశాడు. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు । జాలెల్ల నడగించు సంకీర్తనం ॥ సంతోష కరమైన సంకీర్తనం । సంతాప మణగించు సంకీర్తనం । జంతువుల రక్షించు సంకీర్తనం । సంతతము దలచుడీ సంకీర్తనం ॥ సామజము గాంచినది సంకీర్తనం । సామమున కెక్కుడీ సంకీర్తనం । సామీప్య మిందరికి సంకీర్తనం । సామాన్యమా విష్ణు సంకీర్తనం ॥ జముబారి విడిపించు సంకీర్తనం । సమ బుద్ధి వొడమించు సంకీర్తనం । జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం । శమదమాదుల జేయు సంకీర్తనం ॥ జలజాసనుని నోరి సంకీర్తనం । చలిగొండ సుతదలచు సంకీర్తనం । చలువ గడు నాలుకకు సంకీర్తనం । చలపట్టి తలచుడీ సంకీర్తనం ॥ సరవి సంపదలిచ్చు సంకీర్తనం । సరిలేని దిదియపో సంకీర్తనం । సరుస వేంకట విభుని సంకీర్తనం । సరుగనను దలచుడీ సంకీర్తనం ॥ ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్యా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః’ అని భగవద్గీతలో కృష్ణభగవానుడు అన్ని ధర్మాలను విడచి, నన్నే శరణు వేడుము. సర్వపాపముల నుండి నిన్ను విముక్తుడిని చేసి మోక్షాన్ని కలుగచేస్తానని తెలిపాడు. అన్నమయ్య కూడా తన నిర్మల భక్తిని ప్రకటిస్తూ, ‘శ్రీ వేంకటేశ నేను చేకొని నీ శరణంటి, యేవిధులు నెరఁగను యిదివో చిత్తము’ అంటూ ఆ స్వామివారిని శరణు వేడాడు. జ్ఞాన, కర్మ మార్గాల ద్వారా నిన్ను శోధించి, అలసితినేగాని, నీ తత్త్వాన్ని గ్రహించలేకపోయానని, ఇక నువ్వే శరణంటూ విశిష్టాద్వైతం ప్రతిపాదించిన ప్రపత్తి మార్గాన్ని చేపట్టి అదే సర్వశ్రేష్టమైన మార్గమని భక్తులకు కూడా అవగాహన కల్పించాడు అన్నమయ్య. హరి నిను నెరఁగని యలమటలింతే శాయ శరణంటి నిదె నీకే సర్వేశ కావవే చొచ్చితి స్వర్గము దొల్లి సుకృతములెల్లాఁ జేసి ఇచ్చఁ గొలిచితి సుర లిందరిని గచ్చులఁ బుణ్యము దీరఁ గమ్మటి జన్మములకే వచ్చితి పురుషార్థము వడి నెందూ గానను వెదకితి భూములెల్ల విశ్వకర్తెవ్వడో యంటా చదివితిఁ బుస్తకాలు సారెసారెకు తుద ననుమానమున దొమ్మి నీకలు దెల్లఁగా ముదిసితి నింతేకాని ముందరేమీఁ గానను చింతలెల్ల నుడిగితి శ్రీవేంకటేశ్వర నిన్ను వింత లేక శరణని వెలసితిని చెంతల నిన్నాళ్లదాఁకా చిక్కి కర్మముల వట్టి గంతులు వేసితిఁగాని కడ గాననైతిని ఇక వైష్ణవ సాంప్రదాయంలో తురీయ భక్తికి పెద్దపీట వేస్తారు. భక్తి మార్గాన్ని అనుసరించే వారు భగవంతుని స్మరించటం కంటే ముందుగా అనునిత్యము భగవద్భక్తి ప్రబోధించే భాగవతులని ప్రశంసించి, కీర్తించాలి. ఆ భగవద్దాసులను సేవించి, కీర్తించి తన భాగవత భక్తిని ప్రకటించటం ద్వారా స్వామి వారికి మరింత దగ్గరియినాడు అన్నమయ్య. అతిసులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడు సాక్షి మోసపోకుమీ జన్మమా ముంచినయనుమానములను సేసినభక్తికిఁ జేటు లేదు యిసేఁత కెల్ల ధ్రువుఁడే సాక్షి తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి మురిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు అరయఁగ నిదియే యిడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి తిరుగుకుమీ విఙ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి సరిలే దితినిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి ‘శ్రవణం నామచరిత గుణాదీనా శ్రుతిర్భవేత్’ అన్నట్టు, ఆ భగవంతుని నోరారా కీర్తించటమే కాకా, శ్రవణానందరకరంగా భగవంతుని నామగుణగణాలను ఆలకించటమే శ్రవణ భక్తి. ఏడు రోజులపాటు శ్రీ విష్ణువు గాథలను విని ముక్తిని పొందిన పరీక్షితుడే ఇందుకు నిదర్శనమని భాగవతము పేర్కొంది. కలిగె మాకిదే కైవల్యము, విష్ణుకథా శ్రవణ భాగ్యమున అంటూ అన్నమయ్య శ్రీహరి పావన కథలను ఆలపించి శ్రవణ భక్తి ద్వారా మోక్షద్వారాలను తెరుచుకోండి రారమ్మని భక్తలకు పిలుపునిచ్చాడు అన్నమయ్య. వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ నాదించీనిదె నారదాదులచే వీదివీధులనే విష్ణుకథ వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లవిరియాయ విష్ణుకథ యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము వెల్లిగొలిపె నీవిష్ణుకథ భగవానుని పాద సేవ, తత్ పదార్చకులతోటి స్నేహం, ప్రాణకోటిపై దయ, ప్రసాదించమని సుదాముని మాటల ద్వారా పాదసేవన భక్తి ప్రాశస్త్యాన్ని పోతన భాగవతంలో వెల్లడించాడు. ‘శ్రీకాంతుడ నీ పాదసేవకులయినారు బ్రహ్మాదులు,’ ‘మేమెంత శ్రీమన్నారయణ నీ పాదమే శరణంటూ,’ శ్రీపతి పాదసేవే కామధేనువు, కల్పవృక్షమంటూ బ్రహ్మ కడిగిన పాదాన్ని, బలితల మోపిన పాదాన్ని, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదాన్ని, పరమయోగులకు వరముల నిచ్చే పాదాన్ని, బలి గర్వాన్ని అణచి, కామిని పాపాలను తొలగించిన పాదాన్ని, ఇహపరాలను ఒసగే పాదాన్నిప సర్వకాలముల యందు విడవక మొక్కమని పాదసేవా భక్తిని తనదైన రీతిలో జనులకు అవగతపరిచాడు అన్నమయ్య. చివరగా, తనువునే గుడిగా చేసి, హృదయ స్థానంలో హరిపీఠం వేసి, చూపులతో ఘనదీపాలు వెలిగించి, మాటనే మంత్రంగా ఉచ్ఛరిస్తూ, నిండు మనసుతో షోడశ కళానిధికి షోడశోపచారములను నిర్వర్తించటం ద్వారా నిండు మనసుతో మానసిక అర్చన భక్తి విధానాన్ని తెలిపాడు అన్నమయ్య. నరహరి కీర్తనతో నానిన జిహ్వ ఇతరులను నుతింపదని, శ్రీపతిని పూజించిన కరములు, మురహరి పాదల ముందు మ్రోకరిల్లిన శిరము భగవంతుని కైంకర్యానికే అంకితమని ఆత్మనివేదన భక్తిని ప్రకటించాడు అన్నమయ్య. నానావిధ భక్తిమార్గాలను తన సంకీర్తనల ద్వారా మనకు అందించమే కాక, భవబంధాలను విడనాడాలంటే అంతరంగాన్ని, తమ సర్వస్వాన్ని ‘అంతయు నీవే హరిపుండరీకాక్ష’ అంటూ, తాను నిమిత్తమాత్రుణ్ణి దైవమా నీవేగతని ఆత్మనివేదనా భక్తితో తనను తాను భగవంతునికి సమర్పించుకొని మోక్షసాధుకుడైనాడు అన్నమయ్య. అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే వింతవింత విధముల వీడునా బంధములు మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక తనువెత్తి ఫలమేది దయ గలుగుదాఁక ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా పనిమాలి ముదిసితే పాసెనా భవము చదివియు ఫలమేది శాంతము గలుగుదాఁకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా యెదుట తా రాజైతే నేలెనా పరము పావనుఁడై ఫలమేది భక్తి గలిగినదాఁకా జీవించేటి ఫలమేది చింత దీరుదాఁకను వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా భావించి తా దేవుఁడైతేఁ బ్రత్యక్షమవునా భాగవతం తెలిపిన నవవిధ భక్తిమార్గాలను, నారదుడుదహరించిన ఏకాదశాసక్త్యాది భక్తివిధానాల సమన్వయం మనకు అన్నమయ్య ఉపదేశించిన త్రిగుణాత్మకమైన నానావిధ భక్తి మార్గాలలో మనకు కన్పిస్తుంది. శ్రీహరి నామగుణ లీలావిశేషాలను తన శృంగార, ఆధ్యాత్మిక, వైరాగ్య కీర్తనలలో పొందుపర్చి, మోక్షమార్గాలైన జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను లోటుపాట్లను నిర్దేశించటంతోపాటు సకల శాంతికరమైనది సర్వేశ్వరునిపై భక్తి ఒక్కటే అంటూ భక్తి నిర్వచనాన్ని, భక్తి తత్త్వాన్ని, భక్తి బేధాలని, భక్తి మార్గాలని, భక్తి ప్రాశస్త్యాన్ని ఈ దిగువ కీర్తనలో పొందుపర్చి తాను ధన్యుడయి, మనలను ధన్యులని చేశాడు అన్నమయ్య. ఇహమేకాని యిక బరమేకాని బహుళమై హరి నీపైభక్తే చాలు యెందు జనించిన నేమి యెచ్చోట నున్ననేమి కందువ నీ దాస్యము గలిగితే జాలు అంది స్వర్గమేకాని అలనరకమే కాని అందపునీనామము నాకబ్బుటే చాలు దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు కరగి నిన్ను దలచగలితే జాలు పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు హరి నీ సేవాపరుడౌటే చాలు యిల జదువులురానీ యిటు రాకమాననీ తలపు నీపాదములతగులే చాలు యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె చలపట్టి నాకు నీశరణమే చాలు సౌమ్యశ్రీ రాళ్లభండి
కర్ణాటక సంగీతత్రయంలో రెండవవాడైన ముత్తుస్వామి దీక్షితార్ సంగీత విధ్వాంసుల కుటుంబానికి చెందిన వారు. వీరి తండ్రి రామస్వామి దీక్షితార్ గొప్ప సంగీతవిధ్వాంసులేకాక, హంసధ్వని రాగం సృష్టికర్త . కర్ణాటక ప్రాంతానికి చెందిన రామస్వామి దీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతులకు ముత్తుస్వామి 1775లో పుట్టారు. ఆయన తండ్రి వద్ద సంగీతంతోపాటు తెలుగు, సంస్కృత భాషలు కూడా నేర్చారు. ముత్తుస్వామి దేశమంతటా పర్వటించిన కారణంగా ఆయనపై హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాల ప్రభావం చూపింది. ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. ‘శ్రీనాథాదిగురుగుహో జయోతి జయతి’ ఆయన తొలి కీర్తన. తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన కుమారస్వామి (మురుగన్) పై ఈ సంకీర్తనను ముత్తుస్వామి రచించారు. ఆ తర్వాతికాలంలో ‘గురుగుహ’ ఆయన ముద్రగా రూపుదిద్దుకుంది. వేదవేదాంగాలు, పౌరాణిక ధర్మాలను, వ్యాకరణ, జ్యోతిష్య, వైద్య విద్యలను క్షుణంగా అభ్యసించిన ముత్తుస్వామి కీర్తనలలో ధ్యాన యోగం, జ్యోతిష్యశాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలెైనవి ప్రస్ఫుటంగా మనకు గోచరిస్తాయి. దీక్షితార్ కృతులు మంద్రస్థాయిలో నున్నప్పటికీ, గమకాలను ఉపయోగించిన రీతి ఆయా రాగాల ఔనిత్యాన్ని వెలికితీస్తాయి. చాలావరకు ఈయన రచనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ, కొన్ని కృతులను తెలుగులో కూడా రచించారు. మరికొన్ని కీర్తనలలో తెలుగు. తమిళం, సంస్కృత భాషలను కలిపి మణిప్రవాళిశైలిగా ఉపయోగించారు. మధ్యమకాల సాహిత్యాన్ని దీక్షితార్ తమ కృతులలో అద్భుతంగా పలికించారు. ఆయన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని 72 మేళకర్త రాగాల్లో, సూలాదిసప్త తాళాలకు మేళవిస్తూ రచనలు చేశారు. ఇందు ఆయన 191 రాగాలలో రాసిన 461 కృతులు మాత్రమే నేడు మనకు లభ్యమయ్యాయి. ముత్తుస్వామి తన మాతృభాషైన తమిళంలోకాక, శ్రావ్యమైన తెలుగులోనూ కాక సంస్కృతంలో రచనలు చేయడానికి కారణమున్నది. సంస్కృత శబ్ధోచ్ఛరణలో గంభీర ధ్వని కల్గి ప్రత్యేకతను సంతరించుకుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలో ప్రత్యేకత వాటియందున్న రాగసంచారముల యొక్క సౌందర్యశ్రేష్టత, ఉత్కృష్టలలో ఉంది. ఆయన కీర్తనలన్ని దేవతా సంకీర్తనములగుట వల్ల ఆయనకు కావాల్సిన భాష గాంభీరత, సాహిత్య భావములు సంస్కృతభాష యందు అనంతముగా లభించింది. అందుకనే వారు ఆ భాషను ఎన్నుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. దీక్షితార్ తండ్రిగారు వెంకటకృష్ణ మొదలియార్ ఆస్థానంలో సంగీతకారులుగా ఉన్నకాలంలో, ముత్తుస్వామివారికి ఈస్టిండియా కంపెనీవారి బ్యాండ్ వినే అవకాశం కల్గింది. దాని వలన ముత్తుస్వామి దీక్షితార్ పాశ్చాత్య సంగీతంలోని మర్మాలను గ్రహించగలిగారు. అనంతరం ఆంధ్రులకు తెలుగు నిఘంటవును ప్రసాదించిన బ్రౌను దొర ప్రోత్యాహంతో ఆంగ్లపాటలకు దీక్షితార్ బాణీలు కట్టారు. అందులో ప్రధానమైనది ‘గాడ్ సేవ్ ది కింగ్’ అనే బ్రిటన్ వారి జాతీయం గీతం. దీనికి ముత్తుస్వామి దీక్షితార్ సంస్కృత శబ్ధాల తొడుగును అమర్చి దేవీస్తుతి చేశారు. అదే, ‘సతతం పాహి మాం సంగీతశ్యామలే సర్వాధారే జననీ చింతితార్ధప్రదే చిద్రూపిణీ శివే శ్రీ గురుగుహ పూజితే శివమోహాకారే సతతం పాహిమాం’ గమకాలకు ఆస్కారంలేని నొట్టుస్వర సాహిత్యాన్ని పాశ్చాత్యసంగీత బాణీలలో ముత్తుస్వామి రచించి, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలకు శేతుబంధం చేయటంతోపాటు, పాశ్చాత్య సంగీతానికేపరమైన వయలిన్ (ఫిడేల్)ను కర్ణాటక సంగీతానికి పక్క వాయిద్యంగా చేసి రెండు సంగీతాలను పెనవేశారు. అయితే ఫిడేల్ను కర్ణాటకసంగీతంతో మేళవించిన ఘనత ముత్తుస్వామి కనిష్ట సోదరుడు బాలస్వామి దీక్షితులకు చెందుతుంది. నేటికీ హిందుస్తానీ సంగీతంలో వయలిన్ కు చోటులేదు. తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయిన దుఃఖ సమయంలో ఆయన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. అక్కడే అతడు ‘మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి’ అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ఆ తదనంతర కాలంలో ముత్తుస్వామి కమలాంబ అమ్మవారిపై ‘నవావర్ణ కీర్తనలను’ ఆలపించారు. దేవీనవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజుకు ఒక కీర్తన చొప్పున ఈ రచనలు చేశారు. ఈ కీర్తనలలో ఆయన శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యాలను నిగూఢపర్చారు. అదేవిధంగా ‘వర కృతుల’ను ఆయన వారంలోని ఒక్కొక్కరోజుకి ఒకటి చొప్పున రచించారు. అలాగే షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాశారు. అందులోనిదే ఎంతో ప్రసిద్ధి చెందిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం భజే’ కృతి. ఈ కృతిలో ముత్తుస్వామి ఎంతో అందంగా ఆద్యక్షర ప్రాసను పల్లవిలో (ఉదా: వాతాపి, వారణాస్యం, వరప్రదం), అనుపల్లవిలో (ఉదా: భూతాది, భూతభౌతిక; అలాగే వీత, వినుత, విఘ్న, విశ్వ మొదలయినవి) వాడారు. ఇక ద్వితీయాక్షర ప్రాస (పురా, మురా, పరా, నిర, కరా, హరా) మరియు అంత్యాక్షరప్రాస (చరణం, భరణం, రాగిణం, యోగినం, కారణం, వారణం; అలాగే తుండం, ఖండం, దండం మొదలయినవి) లను చొప్పించటం ఆయన ప్రతిభకు తార్కాణం. ఇవికాక, భూత అనే పదాన్ని మూడు చోట్ల మూడు వేర్వేరు అర్ధాలతో వాడారు - భూతాది, భూత-భౌతిక, భూతాకారం. అంతే కాక, తన వాగ్గేయకార ముద్ర అయిన 'గురుగుహ'ను, రాగం పేరైన 'హంసధ్వని'ని కృతి సాహిత్యంలో నిక్షిప్తం చేసి ఈ కృతికి మరింత సొగసు తెచ్చిపెట్టారు. ఆయన రూపొందించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు, పంచలింగ కృతులు, తమ గురువుగారిని స్తుతిస్తూ చేసిన గురుగుహ కృతులు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేతః శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవెైభవం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలెైనవి వీరి యితర ప్రముఖ రచనలు. పున్నాగవరాళి రాగంలోని ‘ఏహి అన్నపూర్ణే సన్నిధేహి, సదాపూర్ణే, సువర్ణే, చిదానందవిలాసిని’ అను కృతి ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఆఖరి కీర్తన. క్రీ.శ. 1835 సంత్సరం ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, నరకచతుర్ధశి దినమున ఆయన శిష్యులు ‘మీనాక్షి మేముదం దేహి’ (గమక క్రియరాగం) అను కృతి ఆలపిస్తుండగా, అందు అనుపల్లవిలో ‘మీనిలోచనను, పాశమోచని’ అను పదాలు రాగా ఆయన చేతులు జోడించి కనులు మూసుకొని, ‘శివే పాహి’ అనుచు ప్రాణాలు వదిలారని కథనం. (తరవాయిభాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచనలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.) సౌమ్యశ్రీ రాళ్లభండి
“శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:” చిన్న పిల్లలు, పశువులు, పాములు, ఇలా జీవజాలాన్నంతటిని రంజింపచేయగలిగే ధ్వనే సంగీతం. వినడానికి, హాయిగా ఉండే శబ్దాల సమ్మేళనమే సంగీతం అని చెప్పవచ్చు. అయితే, “గీతం వాద్యం తధా నృత్యం త్రయం సంగీతముచ్చతే”, గీతము, వాద్యము, నృత్యము అను నీ మూడింటి చేరిక సంగీతమని పిలవపడుతుందని, మరియు రాగము, స్వరము, తాళము అను నీ మూడింటి చేరికయు సంగీతమని సంగీత రత్నాకరంలో చెప్పపడింది. సంగీతం ఎప్పుడు, ఎలా ఏర్పడిందో చెప్పటం కష్టం. అయితే, ఇంద్రుడు, బ్రహ్మను ఒక కళను సృష్టించమని అడగగా, బ్రహ్మ సామవేదం నుంచి పరమశివుని సన్నిధానంలో సంగీతాన్ని సృష్టించాడని అంటారు. బ్రహ్మ ఈ సంగీతాన్ని భరతునికి నేర్పగా ఆయన భూలోకంలో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడని చెపుతారు. సంగీతం ముఖ్యంగా మార్గ సంగీతం, దేశ్య సంగీతం అని రెండు విధాలుగా విభజింపబడింది. మార్గ సంగీతం గురించిన ప్రస్తావన సంగీత రత్నాకరం, సంగీత పారిజాతం, సంగీత దర్పణం వంటి గ్రంధాలలో మనకు కన్పిస్తుంది. “గీతం ద్వేదా మార్గోదేశీ మార్గ: సయోవిరించాద్యై:| అన్విష్టో భరతాద్యై: శంభోరగ్రే ప్రయక్తోర్చ్య:|| (రాగ విభోధ:) దుహిణేన యదన్విష్టం ప్రయుక్తం భరతేనచ, మహా దేవస్య పురత: సన్మార్గాఖ్యం విముక్తదం|| (సం.పారిజాతం) వీటి తాత్పర్యం – బ్రహ్మ సంకల్పంతో ఆవిర్భవించినట్టి మోక్షప్రదంబైన సంగీతం, మార్గ సంగీతమనపడును. ఈ మార్గ సంగీతం భూలోకంమందు లేదనియు, దేవతల వల్ల, భరతాదుల వల్ల దేవలోకమునందు మాత్రం మభ్యసించపడి వెలుగొందుచున్నదని భావము. ఇక “దేశేదేశేతు సంగీతం తద్దేశీ త్యభిధీయతే”, ఆయా దేశములయందు జనరంజకముగా చేయపడు గానమును, వాయించే వాద్యమును, ఒనర్చే నృత్యం దేశ సంగీతమందురని సంగీత దర్పణము తెలియచేస్తోంది. సంగీత విశిష్టత: ధర్మార్ధకామ మోక్షాలకు సంగీతమే ముఖ్య సాధనమని శాస్త్రలు వెల్లడిస్తున్నాయి. సంగీత దర్పణమందు “శారీర వివేక” మను ప్రశంసలో మనుష్య శరీరమందు గల మూలాధారాది ఆరు యోగధార చక్రములను చెప్పి, నాదము మూలాధారము నుండి వెలువడి క్రమేణా గాత్రమగుచున్నదని పేర్కొంది. నాదోపాసన యాదేవ బ్రహ్మవిష్ణు మహేశ్వర: | భవం త్యుపాసితా నూనం యస్మాదేతే తదాత్మకా: || బ్రహ్మ, విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు నాదముచే స్వరూపముగా గలవారు. గాన, వారు నాదముచేతనే ఉపాసించపడుచున్నారని సంగీత రత్నాకరం తెలుపుతోంది. నాదోత్పత్తి: శరీరమందుగల ఆత్మ మనస్సును ప్రేరేపించుచున్నది. మనస్సు దేహమందుగల వహ్నిని గొట్టుచున్నది. ఆ వహ్ని వాయువును ప్రేరేపంచగా, ఆ మారుతము బ్రహ్మగ్రంధియను మూలాధారమునుండి ఊర్ధ్వముఖముగా నాభి, హృదయము, కంఠము, శిరము, ముఖము వీటియందు క్రమేణా చరించునపుడు నాదము ఆవిర్భవించుచున్నది. నాదము వ్యవహారమునందు మంద్ర, మధ్య, తారమని మూడు విధములు. నాదము హృదయమందున్నపుడు మంద్రమని, కంఠమునందు మధ్యమనియు, శిరస్సునందు తారమని చెప్పపడుతున్నది. శృతి అనగా నేమి? “శ్రూయాన్త ఇతి శ్రుతయ:”... శ్రోత్రమునకు వినని శ్రతియని చెప్పపడుతున్నది. “శ్రవణార్ధస్య ధాతో:క్తి ప్రత్యయేచ సునంశ్రితే, శ్రుతిశబ్ద: ప్రసాధ్యోయం శబ్ధజ్ఞై కర్మసాధనై:” -- చెవులకు వినునదియును శ్రోత్రోంద్రియములకు గ్రాహ్యమగునదియు శ్రుతియనపడును. వీణయందు గల మెట్లపైనున్న తంత్రుల నుండి వెలువడే శబ్ధం శ్రుతియనపడునని రాగవిభోధము తెలుపుతోంది. వీణయందుగాని, శరీరమందుగాని షడ్జపంచమ ప్రకారం గలుగు శ్రుతులు 22 అని శార్జ్గదేవుడు రత్నాకరంలో పేర్కోన్నాడు. అయితే, స్థాయి ఒక్కక్కటికి 22 చెప్పున మొత్తం 66 శ్రుతులని కూడా వాదన కలదు. సంగీతపారిజాతంలో ప్రకారం ఈ 22 శ్రుతుల నామాలు వరసగా: తీవ్రా, కుముద్వతీ, మన్దా, ఛన్దోవతీ, దయావతీ, రంజనీ, రతికా, రౌద్రీ, క్రోధీ, వజ్రికా, ప్రసారణీ, ప్రీతీ, మార్జనీ, క్షితీ, రక్తా, సన్దీపనీ, ఆలాపనీ, మదన్తీ, రోహిణీ, రమ్యా, ఉగ్రా మరియు క్షోభిణీ. సప్త స్వరాలు పూర్వమానవులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి అనేక స్వరాలను కనుగోన్నారు. నెమలి కూతలోను, ఏనుగు ఘీంకారంలోనూ, కోకిల కూతలోను, గుర్రం సంకిలింపులోనూ, ఎద్దులు వేసే రంకెల్లోనూ ఇలా అనేక జంతువుల ధ్వనుల నుంచి స్వరాలను ఏర్పరిచారు. ఈ ఆధునిక కాలంలో మనకు తెలిసిన స్వరాలు ఏడు. ఈ సప్తస్వరాలను నేడు పిలిచినట్టు షడ్జమం (నెమలి), రిషభం (వృషభ ధ్వని), గాంధారం (మేక), మధ్యమం (క్రౌంచము), పంచమం (కోకిల), దైవతం (గుర్రం) మరియు నిషాదం (గజము) అని పిలిచేవారు కాదు. పూర్వం వీటిని కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మన్ద్ర, అతిస్వర్య అని పిలిచేవారు. ఇప్పటి స్వరాలతో పోలిస్తే, ఈ స్వరాలు ‘మగరసనిదప’ అనే స్వరాలన్నమాట. ఇవే క్రమేణా రూపాంతరాలు చెందుతూ, నేటి స్వరాల క్రమం ‘సరిగమపదని’ గా రూపుదాల్చాయి. ‘మగరసనిదప’అనే వరుసలో ఉన్న స్వరాలను మధ్యమ గ్రామం అని పిలిచేవారు. కొత్తగా ఏర్పడిన స్వరాల క్రమం ‘సరిగమపదని’ ని షడ్జగ్రామం అంటారు. స్వరశ్రుతి స్థానాలు: మొదటినుండి నాల్గవశ్రతి వరకు షడ్జమ స్థానాలు, ఐదు నుండి ఏడు వరకు రిషభ స్థానాలు, ఎనిమిది, తొమ్మిది గాంధార స్థానాలు, పదిమొదలు పదమూడు వరకు మధ్యమ స్థానాలు, పదునాలుగు మొదలు పదిహేడువరకు పంచమ స్థానాలు, పద్దెనిమిది నుండి ఇరవై వరకు ధైవత స్థానాలు, ఇరవై ఒకటి, రెండు నిషాధ స్థానాలు. తేటగీతి
భూదేవి, శ్రీదేవీలతో కల్సి స్వామి జలకాలాడే పరమపావన తీర్థం స్వామి పుష్కరిణి. శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు క్రీడాద్రిని భువికి తరలించినపుడు పుష్కరిణిని కూడా గరుత్మంతుడు తెచ్చి ఈ క్షేత్రమందు స్థాపించాడని స్థలపురాణం చెపుతోంది. సర్వ తీర్థాలకు నిలయమైన ఈ స్వామి పుష్కరిణిలో మునక వేస్తే సర్వ పాపాలు హరిస్తాయని ప్రతీతి. స్వామి పుష్కరిణి గురించిన ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, స్కంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో మనకు గోచరమవుతుంది. స్వామి పుష్కరిణిని తెలిపే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శంకణ మహరాజు స్వామివారి దర్శనం ఇక్కడే లభ్యమయిందని, సర్వతీర్ధ ఫలసిద్ధిని ప్రసాదించే ఈ పుష్కరిణి ప్రదేశంలోనే కుమారస్వామి తపస్సు చేశాడాని అందుకే ఈ తీర్ధరాజానికి ‘స్వామి పుష్కరిణ’నని పేరు వచ్చిందని కథనం. ఇదే విషయాన్ని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ శ్రీ వేంకటాచల మాహాత్మ్యము లో మనోహరంగా తెలిపింది. సీ. మును తారకాసురుఁడను వాని సేనాని యదిమి చంపిన బ్రహ్మహత్య చేతఁ బీడితుఁడై, నిజపితృవాక్యమంగీక రించి గ్రక్కున నిర్గమించి, మొనసి యా వేంకటాద్రికై యభిముఖుఁడై వచ్చు నప్పుడాతని బ్రహ్మహత్య జడిసి యా కుమారుని వీడి యార్చి చెచ్చెర డిగ్గి పోయె, నంతట శివపుత్రుఁడలరి తే. వేంకటాద్రికి వచ్చి, వేవేగ స్వామి పుష్కరిణిలోనఁ గ్రుంకి, తెప్పున వరాహ దేవు వీక్షించి చాలఁ బ్రార్ధించి మ్రొక్కి యపుడు కృతకృత్యుఁడయ్యె షడాననుండు. పుష్కరిణి స్నానం, ఏకాదశి వ్రతం, సద్గురుపాద సేవనం దొరకటం దుర్లభం. అయితే ‘కొండపై శ్రీవేంకటాద్రి కోనేటిరాయుడై, కొండవంటి దేవుడైనకోవిదుడా ఇతడ’న్నట్టు, అఖిల జనాల పాపాలను హరించే స్వామి పుష్కరిణి దర్శన, స్నాన భాగ్యాన్ని ఈ కలియుగంలో భక్తులకు కల్గించాడు. గరుడగంభముకాడ కడుబ్రాణాచారులకు వరము లొసగీని శ్రీ వల్లభుడు తిరమై కోనేటిచెంత దీర్ధఫలములెల్ల పరుషల కొసగీని పరమాత్ముడు అంటూ, ‘సకల గంగాదితీర్ధ స్నానఫలములివి స్వామి పుష్కరిణి జలమే నాకు’ అని అన్నమయ్య కోనేరు తీర్థాన్ని సేవించి, సొబగులతో వెలుగొందుతున్న స్వామిపుష్కరిణి సొగసులను చూసి విస్మయం చెంది, మనోహరంగా స్వామి పుష్కరిణిని ఈ కింది విధంగా వర్ణించాడు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా ధర్మార్ధ కామమోక్ష తతులు నీ సోపానాలు అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు వో కోనేరమ్మ తగిన గంగాదితీర్ధములు నీ కడళ్లు జగతి దేవతలు నీ జలజంతులు గగనపు బుణ్యలోకాలు నీదరి మేడలు మొగి నీ చుట్టు మాకులు మునులోయమ్మ వైకుంఠనగరము వాకిలే నీ యాకారము చేకొను పుణ్యములే నీ జీవభావము యే కడను శ్రీ వేంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థ మాడితిమి కావమ్మ || ఇప్పుడు మనం చూస్తున్నా పుష్కరిణిగాక, పాత పుష్కరిణి ఒకటి ఉండేదని తిరుపతి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. 16వ శతాబ్ధంలో 2.5 ఎకరాలలో అచ్యుతరాయడు దీనిని నిర్మించాడు. కాని 19వ శతాబ్ధంలో మహంతులు దీనిని పూడ్పించారు. నేటి శ్రీ స్వామివారి పుష్కరిని 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. స్వామి పుష్కరిణిలో మహా శక్తి ప్రభావాలున్న తొమ్మిది తీర్థరాజాలు - తూర్పు భాగంలో ఆయుష్షుని కల్గించే మార్కండేయ తీర్థం, అగ్నేయంలో పాపాల్ని పారద్రోలే అగ్నేయ తీర్థం, దక్షిణంలో నరక కలుగకుండా యామ్య తీర్థం, నైఋతిలో ఋణ విముక్తి నిచ్చే వశిష్ఠతీర్థం, పశ్చిమంలో పుణ్యాన్ని అనుగ్రహించే వారుణ తీర్థం, వాయవ్యంలో కైవల్యాన్ని ప్రసాదించే వాయు తీర్థం, ఉత్తరంలో సంపదనలిచ్చే ధనద తీర్థం, ఈశాన్యంలో భుక్తి-ముక్తి ప్రదాత గాలవ తీర్థం, చివరగా, మధ్య భాగంలో మహాపాతక నాశిని సరస్వతీ తీర్థం నిత్యమూ కలుస్తాయని బ్రహ్మ పురాణం తెలుపుతోంది. ముక్కోటిద్వాదశీ పవిత్ర దినమున ముప్పడిమూడు కోట్ల పవిత్రతీర్ధాలు ఈ పుష్కరిణిలో కలుస్తాయని కూడా పురాణాలు తెలుపుతున్నాయి. ‘తీర్ధముక్కోటి’ ఖ్యాతినొందిన స్వామి పుష్కరిణి వైభవాన్ని అన్నమయ్య నోరారా కొనియాడి తరించాడు. వీడివో లక్ష్మీపతి వీడివో సర్వేశ్వరుడు వీడివో కోనేటి దండవిహరించే దేవుఁడు కొండ గొడుగుగ నెత్తి గోవులఁ గాచెనాఁడు కొండవంటిదానవుని గోరిచించెను కొండ శ్రీ వేంకట మెక్కి కొలువున్నాడప్పటిని కొండవంటి దేవుడిదే కోనేటికరుతును మాకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే మాకు వెరికి తెచ్చెను మహిమీదికి మాకుమీద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి మాకులకోనేటిదండ మరిగినాడిదివో శేషునిపడగెనీడ జేర యశోదయింటికి శేషజాతి కాళింగు జిక్కించి కాచె శేషాచలమనేటి శ్రీ వేంకటాద్రిపై శేషమై కోనేటిదండ జెలగీని దేవుడు|| వరాహస్వామి ఆలయం ఎదురుగా ఉండటం చేత దీనిని వరాహ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణిలో బ్రహ్మోత్సవంలో చివరిరోజున, రథసప్తమి రోజున స్వామివారికి పవిత్ర స్నానాలు జరుపుతారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ స్వామి పుష్కరిణిలోనే సీతారామలక్ష్మణులకు, రుక్మినీ కృష్ణులకు, శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరునకు తెప్పోత్సవాలు జరుగుతాయి. తీర్ధాలలోకెల్ల పావనమైన స్వామి పుష్కరిణిని, కోనేటిలో జలకాలాడే స్వామిని కనులారా మనోనేత్రంతో వీక్షించి మొక్కడోయని అన్నమయ్య ఆర్తితో కోరాడు. అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని రవిమండలమున రంజిల్లు తేజము దివిజంద్రునిలో తేజము భువి సనలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వ తేజము క్షీరాంబుధిలో జెలగు సాకారము సారె వైకుంఠపుసాకారము యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము పొలసిన యాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును తలచినతలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము||

శాస్త్రాణాం పరమో వేదః, దేవానా పరమో హరిః తీర్ధానాం పరమం తీర్థం, స్వామి పుష్కరిణీ నృప

సౌమ్యశ్రీ రాళ్లభండి
ఒకనాడు హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి, నారద,తుంబురులను తమ గానాన్ని విన్పించమని కోరాడు. ఇద్దరు వీణెలు సారించారు. గమక యుక్తంగా అలంకారాలు, గీతాలు మధురంగా పలికించారు. స్వర సందర్భం, శ్రుతులు, ఆలాపన, గమకాలూ గీత సరణి, ముక్తాయింపు భలేగా, అమోఘంగా వున్నాయని హనుమ మెచ్చుకున్నాడు. ఇంతటి ఉద్దండ పండితుల గానంలో లోటుపాట్లను విమర్శించటం తనకు సాధ్యం కాదేమో అని సవినయంగా విన్నవించుకున్నాడు. తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు వినిపిస్తానని, వారిద్దరిని కూడా వినమని హనుమ ప్రార్ధించాడు. తమ గానాన్ని అంతగా మెచ్చిన హనుమ తన గానాన్ని వినమనటంలో అర్ధమేమిటో నారద, తుంబురలకు అర్ధం కాలేదు. ”కోతులు సంగీత సభ చేస్తే కొండముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది హనుమ గానమని”, ఎగతాళి చేశారు. అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే, ఇంకా హనుమకు ఏం మిగిలింది విని పించాటానికి అని విసుక్కున్నారు. తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం. రామ సన్నిధానంలో ఏమీ చేయడానికి పాలుపోక తమ,తమ వీణలను హనుమకు అందించారు. నారదుని వీణను తీసుకొని హనుమ ఓంకారం పలికించాడు. ఓంకారం త్రిగునాత్మకము, త్రి మూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు. ఇందులో అ, ఉ, మ ఉన్నాయి. ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ. ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు. మ కారం తమో గుణాత్మకం -రుద్రుడు. అ కారం ఎడమ నాసిక పుట -ఇడ. ఉ కారం కుడి నాసా పుట. పింగళ. మ కారం వాటి మధ్య లో వున్న సుషుమ్న. ఈ విధం గా ఓంకారం మూడు నాడుల సమాహారం. ఇడా నాడి-చంద్రుడు. పింగళ నాడి -సూర్యుడు . సుషుమ్న నాడియే అగ్ని. ఈ విధం గా ఓంకారం త్రయాగ్న మైంది. ఓంకారంలో దశ విధ నాదాలు జన్మించాయి. నాభి, ఉదర, కంత, స్ధానాలు వాటి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ, కంత, శిరః స్ధానాల నుండి అభి వ్యక్తమై, మందార, మధ్యమ, తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి. ఆ స్వరాల నుండి ” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ” అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ, ఈశ్వర, సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశాన” అనే ఏడు ముఖాల నుండి పుట్టి, ”షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి. వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత, శిర, నాస, హృదయ, ముఖ, నాలుక, పూర్వాంగాలు. మయూర,రిషభ, అజ, సింహ,కోకిల, అశ్వ, మదగజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు. షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు, రిషభం నుంచి మూడు, గాంధారం నుండి రెండు, మధ్యమ నుంచి నాలుగు, పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు, నిషాదం నుంచి రెండు - సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి. ఈ శ్రుతులకు ఇరవై రెండు శృతి గమకాలూ, ఏడు దేశీ గమకాలున్నాయి. ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు, ఆ రాగాలకు గ్రామ త్రయం, దాని వల్ల పదిహేను రాగాలు -వాటికి ఆరు జాతులు, వాటికి ముప్ఫై ఆరు రాగాలు, - వాటికి నాలుగు అంగాలు, వాటికి నూటఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్త రించింది. ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకంలో ప్రసిద్ధ మైనవి. వాద్యాలలో తథా, ఆనద్ధ, సుషిర, ఘన అనే నాలుగు వున్నాయి. కాహల, పటహ, శంఖ, భేరి జయ, ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు. వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు. త కారం రుద్రుడు. ల కారం పార్వతి. ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు. తాళానికి కాల, మార్గ, క్రియ, అంగ, జాతి, గ్రహ కళ, లయ, యతి, ప్రస్తారం అనేవి పది ప్రాణాలు. హనుమ భరత శాస్త్రంలో కూడా నిష్ణాతుడు. ప్రవర్త కుడు, దర్శన కారుడు కూడా. భ అంటే భావం. ర అంటే రాగం. త అంటే తాళం. భావ ,రాగ ,తాళాలు అంటే సాహిత్య, సంగీత, నాట్యాల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం” అని పేరు వచ్చింది. రసాలు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యమములు, గానాలు, రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”. అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే. గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకొన్నాడు. శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్యను మనో ధర్మంగా అమోఘంగా ప్రదర్శించాడు హనుమ. ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి. చంద్ర కాంత శిలలు కరిగాయి. మ్రోడులు చిగిర్చాయి. లోకం సమ్మెహ మైంది. అతని వల్లకీ (వీణ) వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి. సభాసదులు పరవశించి పోయారు. బొమ్మల్లా అచేతను లైనారు. వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనం గా విని పించాడు. అతను ప్రదర్శించిన మెళకువలు, ప్రౌఢిమ, రాగాలాపన, గ్రామ స్ఫూర్తి, తారలో అంతర స్ఫురిత నాద ప్రౌఢి, మీటు, కంపితం, ఆన్దోలితం, మూర్చన, శ్రుతులు, డాలు, అనేక మైన తాళ మానాలు విని జనం మైమరచి పోయారు. ఆకాశం మేఘాలతో నిండి పోయింది. కొంగలు బారులు తీరాయి. చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాయి. నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేశాయి. పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి. వర్షం పుష్ప వర్షంగా కురిసింది. సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగి పోయాయి. శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి. దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి. హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చికోలుగా ”ఓహ్, ఔరా, భళా, మజ్జ్హారే, బాపురే ”అని అభినందిస్తూనే వున్నాడు. హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది. సభలోని వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణా పై పలికించాడు. మళ్ళీ ఆ రాయి కఠిన శిలగా మారి పోయింది. తన చేతి లోని వీణను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించ గలవాడే విద్యా ధికుడని, ఈ తాళాలను తీసుకోవాటానికి అర్హుడు అని చెప్పాడు. నారద, తుంబురులిద్దరు విశ్వ ప్రయత్నం చేశారు. రాయి కరగ లేదు. వీణలను నెలపై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిలబడ్డారు. ”మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించ లేము కదా. తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది మీరు. అది వాగ్గేయకారులైన మీకు ఆవమానం కదా”, అన్నాడు హనుమ. పాపం వారిద్దరూ మరింత సిగ్గుపడి ”గాయక సార్వభౌమా! హనుమా! మా గర్వం అణగి పోయింది. మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము. మీ ముందు మా గానం ఎంత. పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేడు. కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు. మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ల్ని కనికరించండ”, ని పశ్చాత్తాపం తో హనుమను వేడుకున్నారు నారద, తుంబురులు. దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహంతో క్షమించి, వారివీణలు, తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు. హనుమ కీర్తి గానం చేసుకొంటు, వాళ్ళిద్దరూ శలవు తీసుకొని వెళ్లి పోయారు. హనుమ సీతా రాముల వద్ద సెలవు తీసుకొని గంధ మాదనం చేరాడు.
తిరువారూరు త్యాగరాజస్వామివారిపై కీర్తనలు: తిరువారూరు త్యాగరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కీర్తనలనేకం ప్రసిద్ధి చెందాయి. తిరువారూరులోనున్న అనేక ఆలయాలు రమణీయ శిల్పచాతుర్యంతో ఉట్టిపడుతుంటాయి. తిరువారూరులోని త్యాగరాజస్వామి, శ్రీ కమలాంబ, శ్రీనీలోత్పలాంబ, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, రేణుకాదేవిలపై దీక్షితులవారు పెక్కు రచనలు చేశారు. అచ్చటి త్యాగరాజస్వామివారిపై విభక్తి కృతులను రచించాటమేకాక అనేక ఇతర కృతులను కూడా రాశారు. అందు గౌళ రాగంలో ‘శ్రీ త్యాగరాజ పాలయాశుమాం’, ఆనందభైరవిలో ‘త్యాగరాజ యోగవైభవం’, శ్రీరాగమున ‘త్యాగరాజ మహాధ్వజారోహ’ అను కృతులు ప్రసిద్ధాలు. ఇక వారు రాసిన విభక్తి కృతులు... 1. త్యాగరాజో విరాజితే – అఠాణ రాగం – ప్రథమా విభక్తి 2. త్యాగరాజం భజరే – యదుకుల కాంభోజి – ద్వితీయా విభక్తి 3. త్యాగరాజేన సంరక్షితోహం – సాలగ భైరవి – తృతీయా విభక్తి 4. త్యాగరాజాయ నమస్తే – బేగడ – చతుర్థీ విభక్తి 5. త్యాగరాజాదన్యం – దర్బారు – పంచమీ విభక్తి 6. శ్రీ త్యాగరాజస్యభక్తో – రుద్రప్రియ – షష్ఠీ విభక్తి 7. శ్రీ త్యాగరాజే కృత్యకృత్యం – సారంగ – సప్తమీ విభక్తి 8. వీరవసంత త్యాగరాజ – వీరవసంత – సంభోదనా ప్రథమా విభక్తి ఇక అచ్చటి అమ్మవారు శ్రీనీలోత్పలాంబ. ప్రాంతీయకథనాలననుసరించి, శివుని కొరకు తపస్సు చేసి స్వామివారిని వివాహమాడిన అనంతరం అమ్మవారి రూపం నీలోత్పలాంబ. ఆ అంబను కీర్తిస్తూ కూడా దీక్షితారు వారు విభక్తి కృతులు రచించారు. ఈ కృతులన్నీ గౌళవర్గ కృతులు కావటం విశేషం. అమ్మవారిపై రాసిన గౌళకృతులు.... 1. నీలోత్పలాంబ జయతి – నారాయణ గౌళ – ప్రథమా విభక్తి 2. నీలోత్పలాంబాం భజరే – రీతిగౌళ – ద్వితీయా విభక్తి 3. నీలోత్పలాంబికయా – కన్నడగౌళ – తృతీయా విభక్తి 4. నీలోత్పలాంబికాయై – కేదారగౌళ – చతుర్ధీ విభక్తి 5. నీలోత్పలాంబికాయాః - - గౌళ – పంచమీ విభక్తి 6. నీలోత్పలాంబాయాస్తవ – మాయామాళవగౌళ – షష్ఠీ విభక్తి 7. నీలోత్పలాంబికాయాం – పూర్వగౌళ – సప్తమీ విభక్తి 8. శ్రీ నీలోత్పలాంబికే – ఛాయాగౌళ – సంభోధనా ప్రథమా విభక్తి అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో గల పంచ శివలింగాలు అచలేశ్వరుడు, హటకేశ్వరుడు, వల్మీకేశ్వరుడు, ఆనందేశ్వరుడు మరియు సిద్ధీశ్వరులపై దీక్షితారువారు కృతులను రచించారు. కాగా, ఇచ్చటే ఆగమసంప్రదాయముననుసరించి, వివిధ మంత్ర, తాంత్రిక పూజా విధానాలతో, నామాలతో గణపతి మూర్తులు పదహారు కలవు. శ్రీ ముత్తుస్వామివారు ఆయా గణపతిమూర్తులను స్తుతిస్తూ ఆలపించిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం’, గౌళలో ‘శ్రీ మహాగణపతి రవతు మాం’, శ్రీరాగంలో ‘శ్రీమూలాధారచక్ర వినాయక’, మలహరి రాగంలో ‘పంచమాతంగముఖ గణపతినా’, సావేరినందు ‘కరికలభముఖం’ కృతులు బహుళ ప్రాచుర్యం పొందాయి. తమ శిష్యుని శూల నొప్పి తీర్చే నిమిత్తం జోతిష్య పాండిత్యంలో నిష్ణాతులైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు గురు, శని గ్రహాల శాంతి కొరకు ‘బృహస్పతే’ (అఠాణ రాగం), ‘దివాకర తనుజం’ (యదుకుల కాంభోజి) కృతులను రచించి వారిని నిత్యం గానం చేయవల్సిందిగా చెప్పారు. వారు అటులే చేసి నొప్పి నుంచి ఉపశమనం పొందారు. తదనంతరం ముత్తుస్వామి వారు మిగిలిన గ్రహాలపై కూడా కీర్తనలు రాసి నవగ్రహా (వార) కీర్తనలు పూర్తిచేశారు. ఈ కీర్తనలలో మొదటి ఏడు శూలాది సప్త తాళములలో (ధ్రువాది సప్తతాళాలాకు శూలాది తాళములని పేరు) నుండగా, పల్లవిలో గ్రహముద్రను నిక్షేపించారు. నవగ్రహ కీర్తనలు.... సూర్య గ్రహం – సూర్యమూర్తే -- సౌరాష్ట్ర రాగం (ధ్రువతాళం) చంద్ర గ్రహం – చంద్రం భజ – అసావేరి రాగం (మఠ్య తాళం) కుజ గ్రహం – అంగారకం – సురటి రాగం (రూపక తాళం) బుధ గ్రహం – బుధమాశ్రయామి – నాట కురంజి (ఝంపక తాళం) గురు గ్రహం – బృహస్పతే – అఠాణ (త్రిపుట తాళం) శుక్ర గ్రహం – శ్రీ శుక్ర భగవంతం – ఫరజు రాగం (అట తాళం) శని గ్రహం – దివాకరతనూజం – యదుకుల కాంభోజి (ఏక తాళం) రాహు గ్రహం – స్మరామ్యహం – రామ మనోహర రాగం కేతు గ్రహం – మహాసూరం – చామర రాగం ఇక మధుర మీనాక్షి అమ్మవారిపై ఎనిమిది భక్తి కీర్తనలు రచించారు. అందు దేవక్రియ రాగమున ‘మధురాంబా సంరక్షతు’, అఠాణా రాగామున ‘మధురాంబాయ’, దేవగాంధారి రాగమున ‘శ్రీ మీనాక్షికాయాః’, బేగడ రాగమున ‘మధురాంబికాయస్తవ’ కీర్తనలు ప్రచారమునందున్నవి. శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో గోపుచ్ఛ, ‘స్రోతోవాహ’ యతి నిర్మాణము ప్రత్యేకత. ఉదాహరణకు శ్రీరాగంలో ‘శ్రీ వరలక్ష్మీ నమామ్యహం’ అనే కృతి నందు ‘శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే’ అని వస్తుంది. అలాగే పూర్ణచంద్ర బింబ అనే రాగమాలిక చివరలో ‘నాగధ్వనిసహితే, ధ్వనిసహితే, సహితే, హితే, తే’ అని, ఆనందభైరవి రాగంలో ‘త్యాగరాజయోగ వైభవం’ అనే కృతియందు ‘త్యాగరాజయోగ వైభవం, అగరాజ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం’ అని, ‘మాయేత్వంకయాహి’అను కృతిలో ‘సరసకాయే, రసకాయే, సకాయే, కాయే’ అని కలదు. స్రోతోవాహయతి నిర్మాణమునకు ‘త్యాగరాజయోగ వైభవం’అను కృతిలో అనుపల్లవిలో ‘శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అనే చోట ‘స్రోతోవాహయతి – శం, ప్రకాశం, స్వరూపప్రకాశం, తత్త్వస్వరూపప్రకాశం, సకలతత్త్వ స్వరూపప్రకాశం, శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అని కలదు. సౌమ్యశ్రీ రాళ్లభండి
రాగాలాపన, స్వరకల్పన, నెరవు కలిగిన శుభప్రదమైన రాగం మధ్యమావతి. కర్ణాటక సంగీత కచేరీలలో ఏవైనా అపస్వరా దోషాలు దొర్లితే, దోష నివారణకు చివర్లో ఈ రాగాన్ని పాడటం ఒక సాంప్రదాయంగా ఉంది. 22వ మేళకర్త ఖరహరప్రియ దీని జన్య రాగం. ఇది ఉపాంగ, ఔడవ- ఔడవ రాగం. మధ్యమావతి శ్రీరాగానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ రాగం స్వర స్థానాలు: షడ్జమం, చతుశ్శ్రుతి రిషభం, శుద్ధమధ్యమం, పంచమం, కైశికి నిషాదం (స,రి,మ,ప,ని,స / S R2 M1 P N2 S) ఆరోహణ,అవరోహణ రెండింటిలోను గాంధారం, దైవతం వర్జ్యస్వరాలు. ఋషభ నిషాద మధ్యమములు జీవస్వర న్యాసస్వరములు. మధ్యమావతి రాగము ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే రాగము. రైతులు సేద్యం చేస్తూ పాడుకొని జానపదాలలో ఈ రాగము ఎక్కువగా కనపడుతుంది. మేఘాలు ముసిరేటి వేళ ఈ రాగము వినటానికి, పాడుకొనటానికి చాలా బాగుంటుంది. ప్రణయ సంకేతానికి కూడా ఈ రాగము చాలా విశిష్టమైనది. ఈ రాగాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాడదగినది. ఈ రాగములో ప్రసిద్ధిగాంచిన కీర్తనలు: 1. అదివో అల్లదివో – అన్నమాచార్య కీర్తన 2. పిడికెడ తలంబ్రాల పెండ్లి కూతురు – అన్నమయ్య 3. కలియుగం – అన్నమయ్య 4. చూడరమ్మ సతులాల – అన్నమయ్య 5. నీ నామమో – అన్నమయ్య 6. భాగ్యద లక్ష్మి బారమ్మా – పురందర దాసు 7. రామ కథా సుధా – త్యాగయ్య 8 అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా – త్యాగరాజు కీర్తన 9. రామా నను బ్రోవగరాదా – రామదాసు కీర్తన. 10. నిను పోనిచ్చెదనా సీతారామ – రామదాసు కీర్తన. 11. పాహి రామ ప్రభో పాహి రామప్రభో – రామదాసు కీర్తన. 12. ఓ రఘువీరా యని నే పిలిచిన – రామదాసు కీర్తన. 13. రామ సుధాంబుధి ధామ రామ నాపై – రామదాసు కీర్తన. 14. ధర్మసంవర్ధిని – ముత్తుస్వామి దీక్షితార్ 15. పలికించు కామాక్షి – శ్యామ శాస్త్రి 16. రామాభిరామ – మైసూర్ వాసుదేవచారి 17. గోవిందా మిహ గోపీనంద – నారాయణ తీర్థులు ఈ రాగములో ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా పాటలు: 1. సీతారాముల కల్యాణం చూతము రారండి – సీతారామ కల్యాణం 2. సువ్వి సువ్వి సువ్వాలమ్మ – స్వాతి ముత్యం 3. నేడే ఈ నాడే – భలే తమ్ముడు 6. వరించి వచ్చిన మానవ వీరుడు – జగదేక వీరుని కథ 5. శరణం అయ్యప్ప – స్వామీ అయ్యప్ప 6. మమతల పెరిగిన నా తండ్రి – తల్లా? పెళ్ళామా? 7. కాశికి పోయాను రామా హరే – అప్పుచేసి పప్పు కూడు 8. వరాల బేరమయ్య – శ్రీవేంకటేశ్వర మహత్యం 9. సోజా రాజ్కుమారి సోజా – అనార్కలి 10. పడ్డానండి ప్రేమలో మరి – స్టూడెంట్ నం. 1 11. కలకలవిరిసి జగాలే పులకించెనే – శభాష్ రాముడు 12. సమయానికి తగు సేవ సేయనీ – సీతయ్య 13. లేచింది నిదుర లేచినది మహిలా లోకం – గుండమ్మ కథ 14. చెయ్యి చెయ్యి కలుపుద్దాం – చెంచులక్ష్మి 15. పండు వెన్నెల్లో ఈ వేణు గానం – జానకి వెడ్స్ శ్రీరాం 16. ఇదియే హాయి కలుపుము చెయ్యి – రోజులు మారాయి 17. ప్రియే చారుశీలే – మేఘసందేశం / భక్త జయదేవ 18. అనగనగా ఆకాశం ఉంది – నువ్వే కావాలి 19. చీటికి మాటికి చీటి కట్టి – భలే అమ్మాయిలు 20. ఆకాశ వీధిలో అందాల జాబిలి – మాగల్య బలం 21. శంకరా.. నాద శరీర – శంకరాభరణం 22. భంభం భోలే – ఇంద్ర 23. రావమ్మ మహాలక్ష్మి (కడివెడు నీళ్ళు కల్లాపి జల్లి)- ఉండమ్మ బొట్టు పెడతా హిందుస్తానీ సంగీతంలో మధ్యమావతికి సమాన రాగం మధుమాద్ సారంగ్ రాగం. హింది సినిమా పాటలలో ఈ రాగములో అనేక పాటలు వెలువడ్డాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన కొన్ని పాటలు: 1. ఆ లౌట్ కే ఆజా మేరి మీత్ – రాణీ రూప్ మతి 2. దయ్యెరె దయ్యరే చడ్ గయి పాపీ బుచువా – మధుమతి 3. ముఝే నీద్ నా ఆయే – దిల్ 4. చోరి చోరి దిల్ క లాగాన బురి బాత్ హై – బడా భై 5. చడ్ తీ జవానీ మేరి చాల్ మస్తానీ – కర్వాన్ 6. దుఖ్ భర్ దిన్ గయే – మదర్ ఇండియ 7. మత్వాల జియా డోలే – మదర్ ఇండియ 8. హోలీ ఆయీ రే – మదర్ ఇండియ 9. ఆజ్ మేరి మన్ మే అఖీ – ఆన్ 10. రంగ్ లో ఆజ్ – కోహీనూర్ 11. రాత్ సుహానీ ఝూమే జవానీ – రాణీ రూప్ మతి 12. హం దోనో దో ప్రేమీ – అజ్ఞబీ 13. మేఘా నే బోలే చన్ చన్ – దిల్ దేఖే దేఖో తేటగీతి
అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటూ అవతారమూర్తులైన సీతారాములపై ఆత్మీయ భావాన్ని తెలుగువారికి కలిగించటంలో రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకంతోపాటు ఉన్నత పాత్ర వహించాయి అనడంలో సందేహంలేదు. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, శ్రీ రాముని విమల రూప సుధా రసమును రామదాసుతోపాటు తెలుగు పలక నేర్చిన, విన నేర్చిన భక్తులందరు ఆస్వాదించి తరించారు. ‘గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్చతే’. సంగీతమంటే గీత, వాద్య, నృత్యాల మేటి సమ్మేళనమని సంగీత రత్నాకరమందు చెప్పబడింది. అయితే కాలక్రమేణా గీత, వాద్యముల కలయిక సంగీతంగా రూపాంతరం చెందిది. నేడు కేవలం గానమే సంగీతమని వ్యవహారిస్తున్నారు. అయితే శృతి, లయ, స్వరములతో కూడిన సంగీతము రెండు విధాలు ఒకటి గాత్ర గానము రెండు వాద్యగానము. ప్రాచీన సంగీత సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా గాత్ర, వాద్య గానాలను పెర్త్ మహానగరంలోని తెలుగువారికి అందించాలని మా ‘తేటగీతి’ సంకల్పించింది. ఆ సంకల్పనకు రూపకల్పనే ‘భక్తరామదాసు వాగామృతవర్షిణి’. రామదాసు కృతులలోని నవరత్న కీర్తనలకు దీటైన దాశరథీ శతకంలోని పద్యాలను ఎన్నుకొని, సమన్వయించి కీర్తనలతోపాటు శతక సౌరభాన్ని మార్చి 1, 2014న తేటగీతి తెలుగు సంగీతాభిమానులకు అందించింది ఈ కార్యక్రమానికి పెర్త్ లో దౌత్యకార్యాలయానికి కాన్సుల్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ సుబ్బారాయుడుగారు ముఖ్యఅతిధిగా విచ్చేస్తారు. వారి సతీమణి శ్రీమతి హేమగారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడుగారు మాట్లాడుతూ, ‘తాను ఎన్నో దేశాల సందర్శించినప్పట్టికీ, పెర్త్ లో తెలుగువారు భాషపట్ల చూపుతున్న అభిమానం, జరుపుతున్న కార్యక్రమాలు మరెక్కడా చూడలేదన్నారు.’ ప్రత్యేకంగా తేటగీతి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి సంగీత కార్యక్రమాలు భావితరాలవారికి మన భాష పట్ల, సాహతీ, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు సంగీతాభిమానలను రజింపచేసిన ఈ కార్యక్రమం తేటగీతి వెబ్ సైట్ పాఠకులకు కూడా శ్రవణానందం కల్గిస్తుందని ఆశిస్తూ, పూర్తి కార్యక్రమం ఆడియో మీకోసం.. భక్తరామదాసు వాగామృతవర్షిణి-1 భక్తరామదాసు వాగామృతవర్షిణి-2 తేటగీతి, మార్చి 13, 2014