

నరసింహ శతకం 1
సీ. తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయిననాడు వెంటరాదు
లక్షాధికారైనా లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటే కాని
కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుగకు దొంగలకిత్తురో దొరల కవునో
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
భావం: ఓ నరసింహా, పుట్టినప్పుడెవ్వుడ ధనము తీసుకొని రాడు. చనిపోయినపుడు తీసుకొనిపోడు. ఎంత ధనము సంపాదించనను, ఉప్పన్నమే గాని, బంగారము తినబోడు. ధనము సంపాదించితినని గర్వించుటనేగాని చనిపోవునపుడా డబ్బుకూడా రాదు. తేనెటీగలు కూడబెట్టిన తేనెను మనుజుల కిచ్చునట్లే, తాను దానధర్మములు చేయుకుండా కూడబెట్టిన ధనము చివరకు దొంగలపాలో, ప్రభువుల పాలో చేయదురు.