

పశ్చిమ ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతి వారి కోసం ఒక కమ్యూనిటీ సెంటర్ను విల్లిటన్లో నిర్మించడానికిగాను 1.5మిలియన్ డాలర్ల సహాయాన్ని మెక్ గోవన్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం అందించనుంది.
రాష్ట్నంలోని భారతీయ సంతతికి చెందిన అన్ని సమాఖ్యలు ఈ సెంటర్ సేవలు వినియోగించుకునే విధంగా ఇండియన్ సొసైటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (ఇస్వా) ఆధ్వర్యంలో కమ్యూనిటీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాటరీవెస్ట్ అందించిన ఆర్ధిక సహాయంతో ఇప్పటికే ఇస్వా కమ్యూనిటీ సెంటర్ కు కావల్సిన భూమిని గత సంవత్సరము కొనుగోలు చేసింది.
ఈ కమ్యూనిటీ సెంటర్లో విద్య, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటుగా, వయోవృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, స్థానికులు ఒక్కచోట చేరి భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా పండగలను, ఉత్సవాలను జరుపుకోవడానికి వీలు కలుగుతుంది.
ఈ బహుప్రయోజన ప్రణాళికను పూర్తి చేయడానికి కావల్సిన ఆర్ధిక వనరులను ఫెడరల్ ప్రభుత్వం నుంచి కూడా ఇస్వా ఇప్పటికే సమకూర్చుకుంది.
వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని అత్యధికంగా పెరుగుతున్నబహుళ సాంస్కృతిక జనాభాలో భారతీయులు ముందుంటారు.
‘వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీ ఎంతో ఉత్సాహభరితమైనదని, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారాని, వీరు ఈ సమాజోన్నతికి ఎంతో తోడ్పడుతున్నారని’ రాష్ట్ర ప్రీమియర్ మెక్ గోవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
‘ఇటీవలి దీపావళి ఉత్సవాలలో పాల్గోన్నాక తన అభిప్రాయం బలపడిందని, నేటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం భారతీయ కమ్యూనిటీకి తమ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించుకోవడానికి, ప్రదర్శించడానికి ఈ సెంటర్ ఉపయోగపడగలదని,’ అన్నారు.
అలాగే ఈ సెంటర్ నిర్మాణం కార్యక్రమలు తనకెంతో ఆసక్తిని కల్గిస్తున్నాయని, మరిన్ని భారతీయ ఉత్సవాలలో పాల్గొనడానకి ఎదురు చూస్తున్నానని మెక్ గోవన్ తెలిపారు.
పెర్త్, డిసెంబర్ 11, 2020