సంగీతం: పూర్వాపరాలు

“శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:” చిన్న పిల్లలు, పశువులు, పాములు, ఇలా జీవజాలాన్నంతటిని రంజింపచేయగలిగే ధ్వనే సంగీతం. వినడానికి, హాయిగా ఉండే శబ్దాల సమ్మేళనమే సంగీతం అని చెప్పవచ్చు. అయితే, “గీతం వాద్యం తధా నృత్యం త్రయం సంగీతముచ్చతే”, గీతము, వాద్యము, నృత్యము అను నీ మూడింటి చేరిక సంగీతమని పిలవపడుతుందని, మరియు రాగము, స్వరము, తాళము అను నీ మూడింటి చేరికయు సంగీతమని సంగీత రత్నాకరంలో చెప్పపడింది.

సంగీతం ఎప్పుడు, ఎలా ఏర్పడిందో చెప్పటం కష్టం. అయితే, ఇంద్రుడు, బ్రహ్మను ఒక కళను సృష్టించమని అడగగా, బ్రహ్మ సామవేదం నుంచి పరమశివుని సన్నిధానంలో సంగీతాన్ని సృష్టించాడని అంటారు. బ్రహ్మ ఈ సంగీతాన్ని భరతునికి నేర్పగా ఆయన భూలోకంలో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడని చెపుతారు.

సంగీతం ముఖ్యంగా మార్గ సంగీతం, దేశ్య సంగీతం అని రెండు విధాలుగా విభజింపబడింది. మార్గ సంగీతం గురించిన ప్రస్తావన సంగీత రత్నాకరం, సంగీత పారిజాతం, సంగీత దర్పణం వంటి గ్రంధాలలో మనకు కన్పిస్తుంది.

“గీతం ద్వేదా మార్గోదేశీ మార్గ: సయోవిరించాద్యై:| అన్విష్టో భరతాద్యై: శంభోరగ్రే ప్రయక్తోర్చ్య:|| (రాగ విభోధ:)
దుహిణేన యదన్విష్టం ప్రయుక్తం భరతేనచ, మహా దేవస్య పురత: సన్మార్గాఖ్యం విముక్తదం|| (సం.పారిజాతం)

వీటి తాత్పర్యం – బ్రహ్మ సంకల్పంతో ఆవిర్భవించినట్టి మోక్షప్రదంబైన సంగీతం, మార్గ సంగీతమనపడును. ఈ మార్గ సంగీతం భూలోకంమందు లేదనియు, దేవతల వల్ల, భరతాదుల వల్ల దేవలోకమునందు మాత్రం మభ్యసించపడి వెలుగొందుచున్నదని భావము. ఇక “దేశేదేశేతు సంగీతం తద్దేశీ త్యభిధీయతే”, ఆయా దేశములయందు జనరంజకముగా చేయపడు గానమును, వాయించే వాద్యమును, ఒనర్చే నృత్యం దేశ సంగీతమందురని సంగీత దర్పణము తెలియచేస్తోంది.

సంగీత విశిష్టత: ధర్మార్ధకామ మోక్షాలకు సంగీతమే ముఖ్య సాధనమని శాస్త్రలు వెల్లడిస్తున్నాయి. సంగీత దర్పణమందు “శారీర వివేక” మను ప్రశంసలో మనుష్య శరీరమందు గల మూలాధారాది ఆరు యోగధార చక్రములను చెప్పి, నాదము మూలాధారము నుండి వెలువడి క్రమేణా గాత్రమగుచున్నదని పేర్కొంది.

నాదోపాసన యాదేవ బ్రహ్మవిష్ణు మహేశ్వర: | భవం త్యుపాసితా నూనం యస్మాదేతే తదాత్మకా: ||

బ్రహ్మ, విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు నాదముచే స్వరూపముగా గలవారు. గాన, వారు నాదముచేతనే ఉపాసించపడుచున్నారని సంగీత రత్నాకరం తెలుపుతోంది.

నాదోత్పత్తి: శరీరమందుగల ఆత్మ మనస్సును ప్రేరేపించుచున్నది. మనస్సు దేహమందుగల వహ్నిని గొట్టుచున్నది. ఆ వహ్ని వాయువును ప్రేరేపంచగా, ఆ మారుతము బ్రహ్మగ్రంధియను మూలాధారమునుండి ఊర్ధ్వముఖముగా నాభి, హృదయము, కంఠము, శిరము, ముఖము వీటియందు క్రమేణా చరించునపుడు నాదము ఆవిర్భవించుచున్నది. నాదము వ్యవహారమునందు మంద్ర, మధ్య, తారమని మూడు విధములు. నాదము హృదయమందున్నపుడు మంద్రమని, కంఠమునందు మధ్యమనియు, శిరస్సునందు తారమని చెప్పపడుతున్నది.

శృతి అనగా నేమి? “శ్రూయాన్త ఇతి శ్రుతయ:”… శ్రోత్రమునకు వినని శ్రతియని చెప్పపడుతున్నది.

“శ్రవణార్ధస్య ధాతో:క్తి ప్రత్యయేచ సునంశ్రితే, శ్రుతిశబ్ద: ప్రసాధ్యోయం శబ్ధజ్ఞై కర్మసాధనై:” — చెవులకు వినునదియును శ్రోత్రోంద్రియములకు గ్రాహ్యమగునదియు శ్రుతియనపడును. వీణయందు గల మెట్లపైనున్న తంత్రుల నుండి వెలువడే శబ్ధం శ్రుతియనపడునని రాగవిభోధము తెలుపుతోంది. వీణయందుగాని, శరీరమందుగాని షడ్జపంచమ ప్రకారం గలుగు శ్రుతులు 22 అని శార్జ్గదేవుడు రత్నాకరంలో పేర్కోన్నాడు. అయితే, స్థాయి ఒక్కక్కటికి 22 చెప్పున మొత్తం 66 శ్రుతులని కూడా వాదన కలదు. సంగీతపారిజాతంలో ప్రకారం ఈ 22 శ్రుతుల నామాలు వరసగా: తీవ్రా, కుముద్వతీ, మన్దా, ఛన్దోవతీ, దయావతీ, రంజనీ, రతికా, రౌద్రీ, క్రోధీ, వజ్రికా, ప్రసారణీ, ప్రీతీ, మార్జనీ, క్షితీ, రక్తా, సన్దీపనీ, ఆలాపనీ, మదన్తీ, రోహిణీ, రమ్యా, ఉగ్రా మరియు క్షోభిణీ.

సప్త స్వరాలు

పూర్వమానవులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి అనేక స్వరాలను కనుగోన్నారు. నెమలి కూతలోను, ఏనుగు ఘీంకారంలోనూ, కోకిల కూతలోను, గుర్రం సంకిలింపులోనూ, ఎద్దులు వేసే రంకెల్లోనూ ఇలా అనేక జంతువుల ధ్వనుల నుంచి స్వరాలను ఏర్పరిచారు. ఈ ఆధునిక కాలంలో మనకు తెలిసిన స్వరాలు ఏడు. ఈ సప్తస్వరాలను నేడు పిలిచినట్టు షడ్జమం (నెమలి), రిషభం (వృషభ ధ్వని), గాంధారం (మేక), మధ్యమం (క్రౌంచము), పంచమం (కోకిల), దైవతం (గుర్రం) మరియు నిషాదం (గజము) అని పిలిచేవారు కాదు. పూర్వం వీటిని కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మన్ద్ర, అతిస్వర్య అని పిలిచేవారు.

ఇప్పటి స్వరాలతో పోలిస్తే, ఈ స్వరాలు ‘మగరసనిదప’ అనే స్వరాలన్నమాట. ఇవే క్రమేణా రూపాంతరాలు చెందుతూ, నేటి స్వరాల క్రమం ‘సరిగమపదని’ గా రూపుదాల్చాయి. ‘మగరసనిదప’అనే వరుసలో ఉన్న స్వరాలను మధ్యమ గ్రామం అని పిలిచేవారు. కొత్తగా ఏర్పడిన స్వరాల క్రమం ‘సరిగమపదని’ ని షడ్జగ్రామం అంటారు.

స్వరశ్రుతి స్థానాలు: మొదటినుండి నాల్గవశ్రతి వరకు షడ్జమ స్థానాలు, ఐదు నుండి ఏడు వరకు రిషభ స్థానాలు, ఎనిమిది, తొమ్మిది గాంధార స్థానాలు, పదిమొదలు పదమూడు వరకు మధ్యమ స్థానాలు, పదునాలుగు మొదలు పదిహేడువరకు పంచమ స్థానాలు, పద్దెనిమిది నుండి ఇరవై వరకు ధైవత స్థానాలు, ఇరవై ఒకటి, రెండు నిషాధ స్థానాలు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *