
త్యాగరాజు రచించిన మూడు నృత్యనాటికల్లో ప్రసిద్ధమైనది ప్రహ్లాద భక్తి విజయం. మొదలు నుంచి తుది వరకు త్యాగరాజస్వామి తనను తాను ప్రహ్లాదునిగా ఊహించుకుంటూ, తన ఇష్టదైవమైన శ్రీరాముని ఇందులో కొలిచారు. పూర్ణ చంద్రిక రాగంలో రచించిన ‘తెలిసి రామా చింతనతో’ కీర్తనలో రాముని పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరించి, భక్తే మోక్షమార్గమని తెలిపారు. అలాగే రెండవ అంకంలో సహన రాగంలో కూర్చిన ‘వందనము శ్రీ రఘునందన’, కీర్తనలో విష్ణమూర్తి, శ్రీరామచంద్రులను ఒక్కరిగా సాక్షాత్కరింప చేశారు. ప్రహ్లాదుని రక్షించిన నరసింహుని ప్రస్తావన, నామోచ్ఛారణ ఎక్కడా ఈ గేయ నాటికలో కన్పించకపోవడం విశేషం.
యక్షగానాలతో ప్రేరణ పొందిడం వల్ల కర్ణాటక సంగీతాన్ని అందులో మిళితం చేసి త్యాగరాజు తమ నృత్య నాటికలను రచించారు. అందుకు నిదర్శనమే ఆది, అంత్య కృతులైన ‘శ్రీ గణపతిని’, ‘నీ నామ రూపములకు’. అయితే ఈ విషయంలో త్యాగరాజస్వామి కొత్త ప్రయోగం చేశారని చెప్పవచ్చు. అప్పట్లో నృత్యనాటికల్లో మంగళం ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లో ఉండేవి. అయితే త్యాగరాజు ప్రహ్లాద భక్తివిజయంలో అందుకు విరుద్ధంగా సౌరాష్ట్రం రాగంలో రచించారు. ఐదు అంకాలు గల ఈ నాటికలో 45 కృతులను 28 రాగాలలో త్యాగరాజు రచించారు. దివ్యనామ కీర్తనలను తలపించే ఈ కృతులతోపాటు కంద, సీస, ఉత్పలమాల, చంపకమాల పద్యాలు, ద్విపదలు ఈ నృత్యనాటికలో ఉన్నాయి. అలాగే కులశేఖర ఆళ్వారు రచించిన ‘ముకుందమాల’ వాల్మీకి రామాయణంలోని అనేక శ్లోకాలు ప్రహ్లాద భక్తి విజయంలో త్యాగరాజు విరివిగా ఉపయోగించారు.
వైకుంఠవాసుని లీలా విశేషాలను అమోఘంగా వ్యక్తపర్చే ‘జయతు, జయతు సకల నిగమానిగమ’ ఈ నాటికలోనిదే. ఇక పంతువరాళి రాగంలో ‘వసందేవయతిం’ మరియు ‘నారదముని వేదలిన’, నీలాంబరి రాగంలో ‘ఎన్నగ మనసుకురాని’, మోహన రాగంలో ‘దయరాని, దయరాని’, ‘జయమంగళం, నిత్య శుభమంగళం’, అసావేరి రాగంలో ‘రారా మాయింటిదాకా’ ఇలా ఈ నాటకంలోని అనేక కీర్తనలు ప్రజాదరణ పొందాయి.
ప్రహ్లాద భక్తి విజయంలోని కీర్తనలు వరసగా:
1. శ్రీ గణపతిని సేవింపరారే (సౌరాష్ట్ర)
2. వాసు దేవయని వెడలిన (కళ్యాణి)
3. సాగరుండు వెడలెనిదో (యమునా కళ్యాణి)
4. వినతాసుత రారా నా (హుసేని)
5. విష్ణువాహనుడిదిగో (శంకరాభరణం)
6. వారిధి నీకు వందన (తోడి)
7. వచ్చును హరి నిన్నుజూడ (కళ్యాణి)
8. వందనము రఘునందనా (సహన)
9. ఇందుకా ఈ తనువును (పున్నాగవరాళి)
10. ఎట్లా కనుగొందునో (ఘంట)
11. నిజమైతే ముందర (భైరవి)
12. నారదముని వెడలిన (కామవర్ధని)
13. ఇపుడైన నను (ఆరభి)
14. ఎన్నగ మనసుకు (నీలాంబరి)
15. ఏటి జన్మమిది (వరాళి)
16. ఎంతనుచు వర్ణింతునే (సౌరాష్ట్ర)
17. ఏనాటి నోము ఫలమో (భైరవి)
18. నన్ను బ్రోవకను (శంకరాభరణం)
19. అడుగు వరముల (ఆరభి)
20. వారిజ నయన (కేదార గౌళ)
21. తనలోనే ధ్యానించి (దేవ గాంధారి)
22. ఓ రామ రామ సర్వోన్నత (నాగ గాంధారి)
23. శ్రీ రామ జయరామ (మధ్యమావతి)
24. సరసీరుహ నయన (బిలహరి)
25. వద్దనుండేదే బహుమేలు (వరాళి)
26. తీరునా నాలోని (సావేరి)
27. రామాభిరామ రఘురామ (సావేరి)
28. దయరాని (మోహన)
29. దయ సేయవయ్య (యదుకుల కాంభోజి)
30. ఆనందమానందమాయెను (భైరవి)
31. జయమంగళం నిత్య (ఘంట)
32. నన్ను విడిచి (రితిగౌళ)
33. అందుండకనే (కామవర్ధని)
34. ఏమని వేగింతునే (హుసేని)
35. ఎంత పాపినైతినేమి (గౌళిపంతు)
36. ఓ జగన్నాథ (కేదార గౌళ)
37. చెలిమిని జలజాక్షు (యదుకుల కాంభోజి)
38. పాహి కళ్యాణ రామ (కాపీ)
39. రారా మాఇంటిదాకా (అసావేరి)
40. కమలభవుడు (కళ్యాణి)
41. దొరకునాయని (తోడి)
42. చల్లారే శ్రీరామచంద్రునిపైన (ఆహిరి)
43. వరమైన నేత్రోత్సవమును (ఫరజు)
44. జయమంగళం (మోహన)
45. నీ నామరూపములకు (సౌరాష్ట్ర)
తేటగీతి