
‘కావ్యేషు నాటకం రమ్యమ్, నాటకేషు శకుంతలమ్ – అందులో చతుర్ధాంకం అందులో శ్లోకచతుష్టయమ్’, అన్న పంథాలో కావ్యరమ్యత్వాన్ని వెతుకుతున్నారు. అలాగే సంస్కృతీ మహద్భాగ్యాలు వెతుక్కుంటూ పోతే, సందేహంలేని జవాబు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు సౌభాగ్య నిధులు! అని త్యాగరాజ సంగీతజ్ఞులు ఒకానొక సందర్భంలో శ్రీ టి.వి. సుబ్బారావుగారు పేర్కోన్నారు.
త్యాగరాజస్వామివారు రచించిన కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలైన రసగుళికలు; తెలుగు నుడికారంలోని సొంపుల, తీపి తమలో అంతటా నిండేటట్లు సంతరించుకుని భావార్ధ సుశోభితాలైన మధుగుళికలు! వందలకొద్దీ ఉన్న కీర్తనలలో దేనికదే ప్రత్యేక శోభతో రాణించే మణివలె వెలిగిపోయినా, పంచరత్న కీర్తనలని ప్రఖ్యాతి చెందిన ఐదుకీర్తనలు, ప్రత్యేక ప్రతిష్టతో, ఉత్తమోత్తమ స్థానార్హాలుగా ప్రసిద్ధికెక్కాయి. స్వరాలు బిగిలో, కూర్పులో, సంగీతపుటుదాత్తతలో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడింది. కర్ణాటక సంగీత ప్పంచంలో హేమాహేమీలందరూ, త్యాగరాజస్వామి వారి ఆరాధనా క్రమంలో ఈ పంచరత్న కీర్తనలను, మేనులు మరచి, మనసులు లగ్నం చేసుకొని, ముక్త కంఠంతో భక్తిభావం వెల్లివిరిసేటట్లు గానం చేయ్యడమే సద్విధిగా ఎంచుకుంటారు! సంగీతపు విలువలలో ఈ కీర్తనల నాణ్యత సంగీతజ్ఞులకూ, తద్వారా శ్రోతలకు సుపరిచతమే. మిగిలిన కీర్తనలకన్న వీనిలో చరణాల సంఖ్య పెద్దది. ఒక్కొక్క పాటలో పల్లవి, అనుపల్లవిగాక ఎనిమిదిగాని పదిగాని చరణాలుంటాయి. ఒక్కొక్క చరణంలో కూడా సుదీర్ఘమైన కూర్పు; శబ్ధాల సంతరింపులోని విశిష్టత; భావప్రసారంలో నైపుణ్యం; మొదలైన నైజాలు కూడా శ్రోతలకూ, పాఠకులకూ చాలావరకు అవగతం అవుతాయి. ఇంకా విమర్శనా దృష్టితో పఠిస్తే, త్యాగరాజులవారు తన భక్తిబోధనామృతాన్నంతా యీ కీర్తనలలో ఇమిడ్చివైచినట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఈ ఐదు రత్నాలనీ ఒక ప్రయోజన సూత్రంతో బంధించి రత్నాలమాలగా సంతరించి సంఘతించినట్లనిపిస్తుంది. వీటిల్లో ఒక క్రమం, ఒక పద్దతి, ఒక సంపుటీకరణం స్పష్టం అవుతుంది.
నాట, వరాళి, గౌళ, ఆరభి, శ్రీరాగాలలో యీ కీర్తనలు నిబంధింపబడినాయి. ఈ ఐదింటినీ ఘనరాగాలంటారు. వాటి సర్వసాహిత్య ప్రక్రియ అత్యుత్తమ స్థాయినందుకోవడం వీటిని ఘనరాగాలంటారుట. (ఇరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడం చేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ వీటిని ఘనరాగాలంటారు.) సంగీతకచేరీల్లో ఆది నాట, అంత్య సురటి అనే సంప్రదాయం కూడా చెప్పుకుంటాం! అటువంటి ఈ ఘనరాగ పంచకంలో త్యాగరాజస్వామి ఐదు సర్వోత్కృష్ట వాక్ర్పబంధాలనదగ్గ పంచరత్న కృతులని రచించారు.
ఈ ఐదు పంచరత్న కీర్తనలు:
- నాటరాగంలో: జగదానంద కారక
- వరాళి రాగంలో: కనకన రుచిరా
- గౌళ రాగంలో: దుడుకుగల నన్ను
- ఆరభి రాగంలో: సాధించెనే, మనసా
- శ్రీరాగంలో: ఎందరో మహానుభావులు
వీనిలో మొదటి రెండు పాటలూ వర్ణనాత్మకాలు – సంబోధనాత్మకాలూను. త్యాగరాజస్వామి, ఆ శ్రీరామచంద్రుని అనేక విధాల వర్ణించి ప్రత్యక్షం చేసుకుంటారీ పాటల్లో! ‘జగదానంద కారక’ సంస్కృత సమాసాలతో నిండిపోయింది. పూర్వగాథలనీ, రామాయణంలో అనేక సన్నివేశాల్నీ స్ఫురింప చేసే బహువ్రీహి సమాసాలలో, ఆ జానకీ ప్రాణ నాయకుని జగదానందకారకునిగా ప్రత్యక్షం చేస్తుంది. రాజరాజేశ్వరునిగా, పురాణ పురుషునిగా, నిర్వికారునిగా, అగణిత గుణునిగా సృష్టి స్థిత్యంత కారకునిగా, ఆ దేవదేవుని నిరూపించి, త్యాగరాజస్వామి వారు తన్ను తరింపచేసుకున్నారు. పది చరణాల్లోనూ పదజాలం గుప్పించి, బహువిధాల వర్ణించి, కృతకృత్యులైనారు. చివర మూడు చరణాల్లోనూ శ్రీరామచంద్రుని, త్యాగరాజనుతుని ముమ్మారు స్మరించి (సాధారణంగా మకుటం ప్రతిపాటలో ఒకేసారి ఉంటుంది) తన్ను తాను పునీతుని చేసుకున్నారు. పదప్రయోగంలో త్యాగరాజస్వామివారికున్న ప్రతిభ ఈ కృతిలో బహుళంగా కన్పిస్తుంది.
‘కనకన రుచిరా’ అని మొదలుపెట్టే వరాళి రాగకృతిలో అలా నాటరాగ కృతిలో ప్రత్యక్షమైన దేవదేవుని త్యాగరాజస్వామి సానురాగంగా చూసిచూసి మురిసిపోతారు. ఆ పరమభక్తుడైన, ఆ వనజనయనుని మోము చూచుటే జీవనమని నెనరు గలవాడిని తానని ‘ననుపాలింప’ అనే మోహన రాగకీర్తనలో చెప్పుకున్నారు. అట్టి పరమభక్తుడీ కృతిలో, దినదినమును. చనువుతో, తన మనములో ఆ శ్రీరాముని చూచిన కొద్దీ రుచి హెచ్చుతుందనే సిద్ధాంతాన్ని, ప్రస్తావించారు; ప్రతిపాదించి స్థిరీకరించారు. తాను చూచే రాముడు కనకవసనుడు; పాలుగారు మోమున శ్రీ అపార మహిమతో తనరువాడు; మణిమయ మాలాలంకృతకంధరుడు; సురుచిర కిరీటధరుడు. కాని ఆ సిద్ధాంతానికి బలంగా తానిచ్చిన సాక్ష్యం ఒక్కటే చాలదనుకుంటారేమోనని, రామనామ రసికుడైన కైలాస సదనుడు (శివుడు), పవమాన సుతుడు (ఆంజనేయుడు), నారద, పరాశర, ళుక, శౌనక పురందరులను నగజను (పార్వతి), ధరజను (సీత) సాక్షులుగా పేర్కొంటారు. అటువంటి చూచినకొద్దీ రుచి హెచ్చే శ్రీహరిని ధ్యానించి, మనస్సులో చూసుకుంటూ మురిసిపోయే ధ్యానమనన సౌహార్ధ్రతా ప్రక్రియకి ఫలసిద్ధి, ధ్రువుడు అందుకొన్న సుగతినీ, సుస్థితినీ, సుసౌఖ్యాన్ని జ్ఞాపకం వలచి, సొక్కిన సీతాంజనేయులు సలిపిన సంవాదాన్ని, చర్చనీ పేర్కొని, తెలిసి, ఆ రాముని తాను గూడా అదేపనిగా చూచిచూచి తరించారు. ఈ కృతిలో తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు చరణాల్లో సంస్కృత సమాసాలు బహుళమైనా మిగిలిన పాటలో సామాన్య పరిభాష అనిపించే తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి.
(సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి)
తేటగీతి