
భూదేవి, శ్రీదేవీలతో కల్సి స్వామి జలకాలాడే పరమపావన తీర్థం స్వామి పుష్కరిణి. శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు క్రీడాద్రిని భువికి తరలించినపుడు పుష్కరిణిని కూడా గరుత్మంతుడు తెచ్చి ఈ క్షేత్రమందు స్థాపించాడని స్థలపురాణం చెపుతోంది. సర్వ తీర్థాలకు నిలయమైన ఈ స్వామి పుష్కరిణిలో మునక వేస్తే సర్వ పాపాలు హరిస్తాయని ప్రతీతి.
స్వామి పుష్కరిణి గురించిన ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, స్కంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో మనకు గోచరమవుతుంది. స్వామి పుష్కరిణిని తెలిపే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శంకణ మహరాజు స్వామివారి దర్శనం ఇక్కడే లభ్యమయిందని, సర్వతీర్ధ ఫలసిద్ధిని ప్రసాదించే ఈ పుష్కరిణి ప్రదేశంలోనే కుమారస్వామి తపస్సు చేశాడాని అందుకే ఈ తీర్ధరాజానికి ‘స్వామి పుష్కరిణ’నని పేరు వచ్చిందని కథనం. ఇదే విషయాన్ని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ శ్రీ వేంకటాచల మాహాత్మ్యము లో మనోహరంగా తెలిపింది.
సీ. మును తారకాసురుఁడను వాని సేనాని
యదిమి చంపిన బ్రహ్మహత్య చేతఁ
బీడితుఁడై, నిజపితృవాక్యమంగీక
రించి గ్రక్కున నిర్గమించి, మొనసి
యా వేంకటాద్రికై యభిముఖుఁడై వచ్చు
నప్పుడాతని బ్రహ్మహత్య జడిసి
యా కుమారుని వీడి యార్చి చెచ్చెర డిగ్గి
పోయె, నంతట శివపుత్రుఁడలరి
తే. వేంకటాద్రికి వచ్చి, వేవేగ స్వామి
పుష్కరిణిలోనఁ గ్రుంకి, తెప్పున వరాహ
దేవు వీక్షించి చాలఁ బ్రార్ధించి మ్రొక్కి
యపుడు కృతకృత్యుఁడయ్యె షడాననుండు.
పుష్కరిణి స్నానం, ఏకాదశి వ్రతం, సద్గురుపాద సేవనం దొరకటం దుర్లభం. అయితే ‘కొండపై శ్రీవేంకటాద్రి కోనేటిరాయుడై, కొండవంటి దేవుడైనకోవిదుడా ఇతడ’న్నట్టు, అఖిల జనాల పాపాలను హరించే స్వామి పుష్కరిణి దర్శన, స్నాన భాగ్యాన్ని ఈ కలియుగంలో భక్తులకు కల్గించాడు.
గరుడగంభముకాడ కడుబ్రాణాచారులకు
వరము లొసగీని శ్రీ వల్లభుడు
తిరమై కోనేటిచెంత దీర్ధఫలములెల్ల
పరుషల కొసగీని పరమాత్ముడు
అంటూ, ‘సకల గంగాదితీర్ధ స్నానఫలములివి స్వామి పుష్కరిణి జలమే నాకు’ అని అన్నమయ్య కోనేరు తీర్థాన్ని సేవించి, సొబగులతో వెలుగొందుతున్న స్వామిపుష్కరిణి సొగసులను చూసి విస్మయం చెంది, మనోహరంగా స్వామి పుష్కరిణిని ఈ కింది విధంగా వర్ణించాడు.
దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా
ధర్మార్ధ కామమోక్ష తతులు నీ సోపానాలు
అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు
నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు
కూర్మము నీలోతు వో కోనేరమ్మ
తగిన గంగాదితీర్ధములు నీ కడళ్లు
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపు బుణ్యలోకాలు నీదరి మేడలు
మొగి నీ చుట్టు మాకులు మునులోయమ్మ
వైకుంఠనగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యే కడను శ్రీ వేంకటేశుడే నీవునికి
దీకొని నీ తీర్థ మాడితిమి కావమ్మ ||
ఇప్పుడు మనం చూస్తున్నా పుష్కరిణిగాక, పాత పుష్కరిణి ఒకటి ఉండేదని తిరుపతి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. 16వ శతాబ్ధంలో 2.5 ఎకరాలలో అచ్యుతరాయడు దీనిని నిర్మించాడు. కాని 19వ శతాబ్ధంలో మహంతులు దీనిని పూడ్పించారు. నేటి శ్రీ స్వామివారి పుష్కరిని 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది.
స్వామి పుష్కరిణిలో మహా శక్తి ప్రభావాలున్న తొమ్మిది తీర్థరాజాలు – తూర్పు భాగంలో ఆయుష్షుని కల్గించే మార్కండేయ తీర్థం, అగ్నేయంలో పాపాల్ని పారద్రోలే అగ్నేయ తీర్థం, దక్షిణంలో నరక కలుగకుండా యామ్య తీర్థం, నైఋతిలో ఋణ విముక్తి నిచ్చే వశిష్ఠతీర్థం, పశ్చిమంలో పుణ్యాన్ని అనుగ్రహించే వారుణ తీర్థం, వాయవ్యంలో కైవల్యాన్ని ప్రసాదించే వాయు తీర్థం, ఉత్తరంలో సంపదనలిచ్చే ధనద తీర్థం, ఈశాన్యంలో భుక్తి-ముక్తి ప్రదాత గాలవ తీర్థం, చివరగా, మధ్య భాగంలో మహాపాతక నాశిని సరస్వతీ తీర్థం నిత్యమూ కలుస్తాయని బ్రహ్మ పురాణం తెలుపుతోంది. ముక్కోటిద్వాదశీ పవిత్ర దినమున ముప్పడిమూడు కోట్ల పవిత్రతీర్ధాలు ఈ పుష్కరిణిలో కలుస్తాయని కూడా పురాణాలు తెలుపుతున్నాయి. ‘తీర్ధముక్కోటి’ ఖ్యాతినొందిన స్వామి పుష్కరిణి వైభవాన్ని అన్నమయ్య నోరారా కొనియాడి తరించాడు.
వీడివో లక్ష్మీపతి వీడివో సర్వేశ్వరుడు
వీడివో కోనేటి దండవిహరించే దేవుఁడు
కొండ గొడుగుగ నెత్తి గోవులఁ గాచెనాఁడు
కొండవంటిదానవుని గోరిచించెను
కొండ శ్రీ వేంకట మెక్కి కొలువున్నాడప్పటిని
కొండవంటి దేవుడిదే కోనేటికరుతును
మాకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే
మాకు వెరికి తెచ్చెను మహిమీదికి
మాకుమీద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి
మాకులకోనేటిదండ మరిగినాడిదివో
శేషునిపడగెనీడ జేర యశోదయింటికి
శేషజాతి కాళింగు జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీ వేంకటాద్రిపై
శేషమై కోనేటిదండ జెలగీని దేవుడు||
వరాహస్వామి ఆలయం ఎదురుగా ఉండటం చేత దీనిని వరాహ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణిలో బ్రహ్మోత్సవంలో చివరిరోజున, రథసప్తమి రోజున స్వామివారికి పవిత్ర స్నానాలు జరుపుతారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ స్వామి పుష్కరిణిలోనే సీతారామలక్ష్మణులకు, రుక్మినీ కృష్ణులకు, శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరునకు తెప్పోత్సవాలు జరుగుతాయి.
తీర్ధాలలోకెల్ల పావనమైన స్వామి పుష్కరిణిని, కోనేటిలో జలకాలాడే స్వామిని కనులారా మనోనేత్రంతో వీక్షించి మొక్కడోయని అన్నమయ్య ఆర్తితో కోరాడు.
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
రవిమండలమున రంజిల్లు తేజము
దివిజంద్రునిలో తేజము
భువి సనలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వ తేజము
క్షీరాంబుధిలో జెలగు సాకారము
సారె వైకుంఠపుసాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
పొలసిన యాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచినతలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము||
శాస్త్రాణాం పరమో వేదః, దేవానా పరమో హరిః
తీర్ధానాం పరమం తీర్థం, స్వామి పుష్కరిణీ నృప
సౌమ్యశ్రీ రాళ్లభండి