
మునుపు వరాహ సమూహము
లనిశము వర్తించుచోట నా హరి కిటియై
నెనవుగ నిల్చిన కతమున
ననఘ! వరాహాద్రిపేర నా నగమొప్పన్. (శ్రీ వేంకటాచల మహాత్మ్యము)
శ్వేతవరాహావతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించిన పిదప భూలోకంలో ఈ తిరుమల కొండనే నివాసంగా నేర్పర్చుకుని శ్రీహరి నివసించాడని బ్రహ్మాండపురాణం మనకు తెలుపుతోంది. అందువల్లే ఈ క్షేత్రం ‘ఆదివరాహ క్షేత్రం’ అనీ, ‘శ్వేతవరాహ క్షేత్ర’ మని, భూదేవితో కల్సి ఇక్కడ విహరిస్తున్నందున్న ‘భూవరాహ క్షేత్ర’ మని ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ స్వామిపుష్కరిణికి వాయువ్యదిశలో లక్ష్మీసమేతుడై శ్వేతవరాహుడు విరాజిల్లుతున్నాడు.
వరాహ దర్శనా త్పూర్యం శ్రీనివాసం నమేన్న చ
దర్శనా త్ప్రా గ్వరాహస్య శ్రీనివాసూ న తృప్యతి.
క్షేత్రసాంప్రదాయం ప్రకారం శ్వేతవరాహస్వామిని దర్శించకుండా వేంకటేశ్వరుని దర్శించరు. కాలక్రమేణా ఈ సాంప్రదాయాన్ని భక్తుల పూర్తిగా విస్మరిస్తున్నారు. శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నివసించగోరి, ఆలయ నిర్మాణానికి 100 అడుగులచోటును వరాహస్వామి వద్ద నుంచి యాచించి పుచ్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిఫలంగా, ప్రథమ పూజ, ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే దక్కేటట్టు శ్రీనివాసుడు వరాలచ్చినట్టు ప్రతీతి. నేటికి ఈ సాంప్రదాయం ప్రకారమే తొలిపూజ, తొలి నైవేద్యం శ్వేతవరాహస్వామికే జరుపబడతాయి. అంతేకాక, బ్రహ్మోత్సవ చివరిరోజు స్వామివారు భూదేవి, శ్రీదేవిలతో కలసి ఇక్కడకి విచ్చేసి పూజలందుకుంటాడు.
‘మహావరాహో గోవిందః’ అనే విష్ణు సహస్రనామం ఈ పురాణగాథను తెలుపుతుంది. గో అనగా భూమి, వింద అనగా పొందినవాడు. వరాహస్వామి నుండి భూమిని పొందినవాడు వేంకటేశ్వరుడే! అన్న స్మృతి మనకు గోవిందా అన్న నామం స్మరించిన ప్రతిసారీ కలగకమానదు.
ఆ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేటికి ఆవలివైపు నమస్కార భంగిమలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీనిని వ్యాసరాయలవారు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమల కొండకు నడిచే వెళ్లే మార్గంలో దాదాపు 30 అడుగులు గల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అల్లంత దూరం నుంచే చేరుకున్నారు వేంకటగిరని చాటి చెపుతుంది. అన్నమయ్య మాటలలో చెప్పాలంటే,
ఆకాసమంతయ నిండి యవలికిఁదోఁక చాఁచి
పైకొని పాతాళానఁ బాదాలు మోపి
కైకొని దశదిక్కులు కరములఁ గబళించి
సాకారము చూపినాడిచ్చడ హనుమంతుడు
గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా
ధరణి మేరు కటితటము గాఁగా
ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై
బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుడు.
ఆంజనేయునికి తిరుమల కొండకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తోస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఇందుకు తగిన దివ్యగాథ కూడా ఉంది. మతంగముని ఆదేశంతో వేంకటాచలంపై ఆకాశగంగ తీర్ధావరణలో తపస్సుచేసి అంజనాదేవి వాయుపుత్రునికి జన్మనిచ్చింది. అందుకే ఈ గిరి అంజనాద్రిగా పేరొందింది. మాతృశ్రీ తరిగిండ వేంగమాంబ తన వేంకటేశ్వర మాహాత్మ్యంలో ఇదే గాథను అద్భుతంగా వర్ణించింది.
అంజనాదేవి తపము మున్నచట జేసి
పొసగ హనుమంతుడను వరపుత్రుంగాంచె
నపుడు దేవతలెల్ల సహాయు లగుచు
నా గిరికి నంజనాద్రి పే రమర నిడిరి.
ఈ క్షేత్ర మహిమను అన్నమయ్య తన కీర్తనలో ఈ కిందివిధంగా కొనియాడాడు.
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడవాడి కొండ.
ప్రసన్నాంజనేయుడు, కోనేటి ఆంజనేయునితోపాటు శ్రీవారి ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో బేడి ఆంజనేయస్వామి కోవెల ఉంది. చేతికి, కాళ్లకు బేడీలతో స్వామివారికి అంజలి ఘటిస్తుండే ఈ మూర్తి వెనకాల కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
పొదలు సొంపగు నింపుల పూబొదలు వాసన నదులూ
మొదలూగల తామర కొలంకులపై మెదలు తుమ్మెదలూ
కదలి మలయానిలు వలపుల పస కదళీ వనములనూ
మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా||
ఎల్లప్పుడు పచ్చని చెట్లతో, పరిమళ ఝరులతో, పూదోటలతో, తుమ్మెదల ఝూంకారాలతో, అరటి తోటలతో శోభిల్లే అంజనాద్రిపై ఆ అంజనాసుతుడు ఊరక ఉండమంటే ఉంటాడా? అల్లరి, చిల్లరగా చిలిపి పనులతో విసిగిస్తున్న హనుమంతుని కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఆ వేంకటేశ్వరుని ముందు కదలకుండా అంజనాదేవి నిలబెట్టిందట. సార్ధక నామధేయుడై అప్పటినుండి వేంకటేశ్వరుని చేరువలో కొలువై ప్రతి ఆదివారం పంచామృతాభిషేకాలను, పూజా నివేదనాదులను పొందుతూ స్వామివారి కనుసన్నలలో మెదులుతూ భక్తులకు తృప్తిని కల్గిస్తున్నాడు.
అందిరిలోనా నెక్కుడు హనుమంతుడు
కందువ మతంగగిరికాడి హనుమంతుడు
కనకకుండలాలతో కౌపీనముతోడ
జనియించినాడు యీ హనుమంతుడు
ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ
పెనుతోక యెత్తినాడు పెద్దహనుమంతుడు
తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా
అవలయివల నేసె హనుమంతుడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతూ
ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుడు
తిరమైన మహిమతో దివ్యతేజముతోడ
అరసి దాసులగాచీ హనుమంతుడు
పరగ శ్రీ వేంకటేశుబంటై సేవింపుచు
వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు.
అంజనాచలమే నివాసమైన ఏలిక ఒకరు కాగా, అంజలి ఘటిస్తూ మక్కువతో బంటువైన ఘనుండు మరొకడు. ఇదే అభిప్రాయాన్ని అన్నమయ్య మరొక కీర్తనలో వెలిబుచ్చాడు.
అంజనాచలము మీద నతండు శ్రీ వేంకటేశుఁ
డంజనీ తనయుఁడాయ ననిలజుఁడు
కంజాప్తకుల రామఘనుడు దానును దయా
పుంజమాయ మంగాంబుధి హనుమంతుఁడు.
అందుకేనేమో అన్నమయ్య కూడా ఆ పెద్దహనుమంతునికి తన సంకీర్తనలలో పెద్దపీటవేశారు.
మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడా
యీతడా రాముని బంటు యీతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూడందు రాతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన యాతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి యితడా
ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడితడా
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతమున నితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా
చిరంజీవి యీతడా జితేంద్రియుడితడా
సురల కుపకారపుచుట్ట మీతడా
నిరతి శ్రీ వేంకటాద్రీని విజనగరములో
నరిది వరములిచ్చీ నందరికి నితడా
అని ఒక కీర్తనలో కీర్తిస్తే, మరో చోట…
పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు
వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు
పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు
అట్టి పవనుజుడుని,
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య
ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె
సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట యీతని మహిమ యేమని చెప్పేమయ్య,
అంటూ, అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము,
పదియారు వన్నెల బంగారు కాంతులతోడ పొదిలిన కలశాపుర హనుమంతుడు,
త్రివిక్రమమూర్తియైన దేవునివలెనున్నాడు భువిసేవించే వారి పాలి పుణ్యఫల మీతడు
తేరి మీద నీ రూపు తెచ్చి పెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని వేర్వేరు కీర్తనలలో కొనియాడాటంతోపాటు, ఆ శ్రీఆంజనేయుని, ప్రసన్నాంజనేయుని పవిత్ర ద్వాదశనామాలను ఈ కింది కీర్తనలో గానం చేసి భక్తులందరిని తరిపంచేశాడు.
తలచరో జనులు యీతని పుణ్యనామములు
సులభమునే సర్వశుభములు గలుగు
హనుమంతుఁడు వాయుజుఁ డంజనాతనయుండు
వనధిలంఘనశీలవై భవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుఁడే
ఘనుఁడగు కలశాపురహనుమంతుఁడు
లంకాసాధకుఁడు లక్ష్మణప్రబోధకుఁడు
శంకలేని సుగ్రీవసచివుఁడు
పొంకపు రామునిబంటు భూమిజసంతోషదూత
తెంకినేకలశాపురదేవహనుమంతుడు
చటులార్జునసఖుఁడు జాతరూపవర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటివాఁడు
నటన శ్రీ వేంకటేశునమ్మిన సేవకుఁడు
పటు కలశాపురప్రాంత హనుమంతుడు.
సౌమ్యశ్రీ రాళ్లభండి