
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం
అను తొమ్మిది భక్తి మార్గాలను భాగవతం మనకు ప్రతిపాదించింది. మనసా, వాచా కర్మణా ఈ తొమ్మిది మార్గాలను అనుసరించి భగవంతుని చేరుకొనవచ్చని, కమలాక్షు నర్చించు కరములే కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వయే జిహ్వ, చక్రధారి కథలు వినే చెవులే చెవులని, ఆ పరమాత్ముని స్మరణ విడనాడితే, భవబంధాల నుంచి విముక్తి పొంది పునర్జన్మలేని మోక్షాన్ని పొందజాలమని పోతన భాగవతంలో వివరించాడు.
త్రికాల సత్యుడైన పరమాత్ముని సన్నిధిని చేరడానికి భక్తియే ఉత్తమ మార్గమని, అట్టి భక్తి యొక్క పదకొండు రూపాలను, గుణగణాలను నారదుడు నవవిధభక్తి సూత్రాలలో వివరించాడు.
గుణమాహాత్మ్యా సక్తి, రూపాసక్తి, పూజాసక్తి
స్మరణా సక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి
కాంతాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయాసక్తి
పరమవిరహాసక్తి, రూపా ఏకదా ఆపి ఏకాదశాభవతి.
అట్టి గుణగుణాలకు, గుణమాహాత్మ్యాసక్తి భక్తికి నారదుడు, వ్యాసుడు, రూపాసక్తి భక్తికి బృందావన స్త్రీలు, పూజాసక్తి భక్తికి అంబరీషుడు, స్మరణాసక్తి భక్తికి ప్రహ్లాదుడు, దాస్యాసక్తి భక్తికి హనుమంతుడు, సఖ్యాసక్తి భక్తికి ఉద్ధవుడు, అర్జునుడు, వాత్సల్యాసక్తి భక్తికి దేవకీ, యశోద, కౌసల్య, కాంతాసక్తి భక్తికి రుక్మిణి, పార్వతీదేవి, ఆత్మ నివేదనసక్తి భక్తికి బలిచక్రవర్తి, విభీషణుడు, తన్మయాసక్తి భక్తికి సనత్కుమారుడు, పరమవిరహసక్తి భక్తికి గోపికలు పత్రీకలని కూడా భాగవతం తెలిపింది.
ఇక అన్నమయ్య కూడా అనేక రూపాలలో బాసిల్లుతున్న భక్తి స్వరూపాలను తనదైన రీతిలో దర్శించి, ప్రతిపాదించాడు.
నానాభక్తులివి నరుల మార్గములు
యేనపాననై నా నాతఁడియ్యకొను భక్తి
హరికిఁగా వాదించు టది ఉన్మాదభక్తి
పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి
అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి
అరమరచి చొక్కుటే ఆనందభక్తి
అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి
అతనిదాసుల సేవే అదియే తురీయభక్తి
క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి
అతఁడే గతని వుండు టదివైరాగ్యభక్తి
అట్టే స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మలభక్తి
గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి
తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి
భక్తి మార్గాలనేకమైన ఆ స్వామి కృపాకటాక్షం లేనిదే గమ్యం చేరలేమని అన్నమయ్య తెలిపాడు. సత్వ, రజో, తమో గుణాల ప్రేరణతో భక్తుడు అవలంబించే మార్గాలను ఉన్మాద భక్తి, పతివ్రతాభక్తి, విజ్ఞానభక్తి, ఆనందభక్తి, రాక్షసభక్తి, తురీయభక్తి, తామసభక్తి, వైరాగ్యభక్తి, రాజసభక్తి, నిర్మలభక్తి, చివరగా నిజభక్తి అని అన్నమయ్య వర్గీకరించాడు. ఆ పరబ్రహ్మను నాయకుడిగా తమను నాయికలుగా తలపోసి పరమాత్ముని, దివ్య, శృంగార లీలను కీర్తించటం ద్వారా జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే మధుర భక్తిని అన్నమయ్య తన శృంగార కీర్తనల ద్వారా వెల్లడించాడు. ఆ పరమేశ్వరుని భువనమోహన రూపాన్ని దర్శించడానికే కళ్లున్నాయని, అతనికి దాస్యం చేయని జన్మ వృథాయన్న కాంతాసక్తి భక్తిని తన కీర్తనలలో రంగరించి మనకందించాడు అన్నమయ్య.
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిఁక నొకటి కలదా
అతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్శ లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె
తరుణి హృదయము కృతార్థతఁ బొంది విభుమీఁది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయ
శ్రీ వేంకటేశ్వరునిఁ జింతించి పరతత్త్వ
భావంబు నిజముగాఁ బట్టెఁ జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
పరమాత్మ తత్వ జ్ఞానము పొందాక ఇక మోహమనేది పుట్టదని, నాయికను యోగితో పొల్చటం ద్వారా మోహదశ నుంచి జీవుడు విజ్ఞానదశకు చేరుకుంటాడనే భక్తి తత్వాన్ని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలిపాడు.
‘నామసంకీర్తనం యస్య, సర్వపాప ప్రణాశనమ్’ అని భాగవతంలో తెలిపినట్లు పాపపంకిలాన్ని కడిగివేయగల భగవన్నామ సంకీర్తనానికి మించిన భక్తి మార్గం మరొకటి లేదని ఆ భగవంతుని పాదపద్మాలను తన సంకీర్తానా జలంతో అభిషేకించి నామ సంకీర్తనం యొక్క నిగూఢ రహస్యాన్ని భక్తులకందించాడు అన్నమయ్య.
ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నుని నామమె వేదంబాయె
నలినదళాక్షుని నామకీర్తనము
కలిగి లోకమున కలదొకటే
యిల నిదియే భజియింపగపుణ్యులు
చెలగి తలప సంజీవని ఆయె
కోరిక నచ్యుత గోవిందా యని
ధీరులు తలపగ తెరువొకటే
ఘోర దురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మగ కలిగె
తిరువేంకటగిరి దేవుని నామము
ధరతలపగ ఆధారమిదే
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయె
భగవంతుని కీర్తిని గానం చేయడం కీర్తనా భక్తిగా పరిగణించబడుతుంది. అలాగే నిరంతరమూ భగవంతుని మనసారా స్మరించడమే స్మరణభక్తి. అన్నమయ్య ఆ భగవంతుని లీలలను, మహిమలను, విశిష్ట, గుణగణాలను గానం చేయటం ద్వారా స్మరణ, సంకీర్తనా భక్తి విశిష్టతలను అభివ్యకం చేశాడు.
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు ।
జాలెల్ల నడగించు సంకీర్తనం ॥
సంతోష కరమైన సంకీర్తనం ।
సంతాప మణగించు సంకీర్తనం ।
జంతువుల రక్షించు సంకీర్తనం ।
సంతతము దలచుడీ సంకీర్తనం ॥
సామజము గాంచినది సంకీర్తనం ।
సామమున కెక్కుడీ సంకీర్తనం ।
సామీప్య మిందరికి సంకీర్తనం ।
సామాన్యమా విష్ణు సంకీర్తనం ॥
జముబారి విడిపించు సంకీర్తనం ।
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం ।
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం ।
శమదమాదుల జేయు సంకీర్తనం ॥
జలజాసనుని నోరి సంకీర్తనం ।
చలిగొండ సుతదలచు సంకీర్తనం ।
చలువ గడు నాలుకకు సంకీర్తనం ।
చలపట్టి తలచుడీ సంకీర్తనం ॥
సరవి సంపదలిచ్చు సంకీర్తనం ।
సరిలేని దిదియపో సంకీర్తనం ।
సరుస వేంకట విభుని సంకీర్తనం ।
సరుగనను దలచుడీ సంకీర్తనం ॥
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్యా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః’ అని భగవద్గీతలో కృష్ణభగవానుడు అన్ని ధర్మాలను విడచి, నన్నే శరణు వేడుము. సర్వపాపముల నుండి నిన్ను విముక్తుడిని చేసి మోక్షాన్ని కలుగచేస్తానని తెలిపాడు. అన్నమయ్య కూడా తన నిర్మల భక్తిని ప్రకటిస్తూ, ‘శ్రీ వేంకటేశ నేను చేకొని నీ శరణంటి, యేవిధులు నెరఁగను యిదివో చిత్తము’ అంటూ ఆ స్వామివారిని శరణు వేడాడు. జ్ఞాన, కర్మ మార్గాల ద్వారా నిన్ను శోధించి, అలసితినేగాని, నీ తత్త్వాన్ని గ్రహించలేకపోయానని, ఇక నువ్వే శరణంటూ విశిష్టాద్వైతం ప్రతిపాదించిన ప్రపత్తి మార్గాన్ని చేపట్టి అదే సర్వశ్రేష్టమైన మార్గమని భక్తులకు కూడా అవగాహన కల్పించాడు అన్నమయ్య.
హరి నిను నెరఁగని యలమటలింతే శాయ
శరణంటి నిదె నీకే సర్వేశ కావవే
చొచ్చితి స్వర్గము దొల్లి సుకృతములెల్లాఁ జేసి
ఇచ్చఁ గొలిచితి సుర లిందరిని
గచ్చులఁ బుణ్యము దీరఁ గమ్మటి జన్మములకే
వచ్చితి పురుషార్థము వడి నెందూ గానను
వెదకితి భూములెల్ల విశ్వకర్తెవ్వడో యంటా
చదివితిఁ బుస్తకాలు సారెసారెకు
తుద ననుమానమున దొమ్మి నీకలు దెల్లఁగా
ముదిసితి నింతేకాని ముందరేమీఁ గానను
చింతలెల్ల నుడిగితి శ్రీవేంకటేశ్వర నిన్ను
వింత లేక శరణని వెలసితిని
చెంతల నిన్నాళ్లదాఁకా చిక్కి కర్మముల వట్టి
గంతులు వేసితిఁగాని కడ గాననైతిని
ఇక వైష్ణవ సాంప్రదాయంలో తురీయ భక్తికి పెద్దపీట వేస్తారు. భక్తి మార్గాన్ని అనుసరించే వారు భగవంతుని స్మరించటం కంటే ముందుగా అనునిత్యము భగవద్భక్తి ప్రబోధించే భాగవతులని ప్రశంసించి, కీర్తించాలి. ఆ భగవద్దాసులను సేవించి, కీర్తించి తన భాగవత భక్తిని ప్రకటించటం ద్వారా స్వామి వారికి మరింత దగ్గరియినాడు అన్నమయ్య.
అతిసులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడు సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచినయనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యిసేఁత కెల్ల ధ్రువుఁడే సాక్షి
తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి
మురిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యిడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి
తిరుగుకుమీ విఙ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితినిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి
‘శ్రవణం నామచరిత గుణాదీనా శ్రుతిర్భవేత్’ అన్నట్టు, ఆ భగవంతుని నోరారా కీర్తించటమే కాకా, శ్రవణానందరకరంగా భగవంతుని నామగుణగణాలను ఆలకించటమే శ్రవణ భక్తి. ఏడు రోజులపాటు శ్రీ విష్ణువు గాథలను విని ముక్తిని పొందిన పరీక్షితుడే ఇందుకు నిదర్శనమని భాగవతము పేర్కొంది. కలిగె మాకిదే కైవల్యము, విష్ణుకథా శ్రవణ భాగ్యమున అంటూ అన్నమయ్య శ్రీహరి పావన కథలను ఆలపించి శ్రవణ భక్తి ద్వారా మోక్షద్వారాలను తెరుచుకోండి రారమ్మని భక్తలకు పిలుపునిచ్చాడు అన్నమయ్య.
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ
వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ
భగవానుని పాద సేవ, తత్ పదార్చకులతోటి స్నేహం, ప్రాణకోటిపై దయ, ప్రసాదించమని సుదాముని మాటల ద్వారా పాదసేవన భక్తి ప్రాశస్త్యాన్ని పోతన భాగవతంలో వెల్లడించాడు. ‘శ్రీకాంతుడ నీ పాదసేవకులయినారు బ్రహ్మాదులు,’ ‘మేమెంత శ్రీమన్నారయణ నీ పాదమే శరణంటూ,’ శ్రీపతి పాదసేవే కామధేనువు, కల్పవృక్షమంటూ బ్రహ్మ కడిగిన పాదాన్ని, బలితల మోపిన పాదాన్ని, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదాన్ని, పరమయోగులకు వరముల నిచ్చే పాదాన్ని, బలి గర్వాన్ని అణచి, కామిని పాపాలను తొలగించిన పాదాన్ని, ఇహపరాలను ఒసగే పాదాన్నిప సర్వకాలముల యందు విడవక మొక్కమని పాదసేవా భక్తిని తనదైన రీతిలో జనులకు అవగతపరిచాడు అన్నమయ్య.
చివరగా, తనువునే గుడిగా చేసి, హృదయ స్థానంలో హరిపీఠం వేసి, చూపులతో ఘనదీపాలు వెలిగించి, మాటనే మంత్రంగా ఉచ్ఛరిస్తూ, నిండు మనసుతో షోడశ కళానిధికి షోడశోపచారములను నిర్వర్తించటం ద్వారా నిండు మనసుతో మానసిక అర్చన భక్తి విధానాన్ని తెలిపాడు అన్నమయ్య. నరహరి కీర్తనతో నానిన జిహ్వ ఇతరులను నుతింపదని, శ్రీపతిని పూజించిన కరములు, మురహరి పాదల ముందు మ్రోకరిల్లిన శిరము భగవంతుని కైంకర్యానికే అంకితమని ఆత్మనివేదన భక్తిని ప్రకటించాడు అన్నమయ్య. నానావిధ భక్తిమార్గాలను తన సంకీర్తనల ద్వారా మనకు అందించమే కాక, భవబంధాలను విడనాడాలంటే అంతరంగాన్ని, తమ సర్వస్వాన్ని ‘అంతయు నీవే హరిపుండరీకాక్ష’ అంటూ, తాను నిమిత్తమాత్రుణ్ణి దైవమా నీవేగతని ఆత్మనివేదనా భక్తితో తనను తాను భగవంతునికి సమర్పించుకొని మోక్షసాధుకుడైనాడు అన్నమయ్య.
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక
తనువెత్తి ఫలమేది దయ గలుగుదాఁక
ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము
చదివియు ఫలమేది శాంతము గలుగుదాఁకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను
మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా
యెదుట తా రాజైతే నేలెనా పరము
పావనుఁడై ఫలమేది భక్తి గలిగినదాఁకా
జీవించేటి ఫలమేది చింత దీరుదాఁకను
వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
భావించి తా దేవుఁడైతేఁ బ్రత్యక్షమవునా
భాగవతం తెలిపిన నవవిధ భక్తిమార్గాలను, నారదుడుదహరించిన ఏకాదశాసక్త్యాది భక్తివిధానాల సమన్వయం మనకు అన్నమయ్య ఉపదేశించిన త్రిగుణాత్మకమైన నానావిధ భక్తి మార్గాలలో మనకు కన్పిస్తుంది. శ్రీహరి నామగుణ లీలావిశేషాలను తన శృంగార, ఆధ్యాత్మిక, వైరాగ్య కీర్తనలలో పొందుపర్చి, మోక్షమార్గాలైన జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను లోటుపాట్లను నిర్దేశించటంతోపాటు సకల శాంతికరమైనది సర్వేశ్వరునిపై భక్తి ఒక్కటే అంటూ భక్తి నిర్వచనాన్ని, భక్తి తత్త్వాన్ని, భక్తి బేధాలని, భక్తి మార్గాలని, భక్తి ప్రాశస్త్యాన్ని ఈ దిగువ కీర్తనలో పొందుపర్చి తాను ధన్యుడయి, మనలను ధన్యులని చేశాడు అన్నమయ్య.
ఇహమేకాని యిక బరమేకాని
బహుళమై హరి నీపైభక్తే చాలు
యెందు జనించిన నేమి యెచ్చోట నున్ననేమి
కందువ నీ దాస్యము గలిగితే జాలు
అంది స్వర్గమేకాని అలనరకమే కాని
అందపునీనామము నాకబ్బుటే చాలు
దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు
కరగి నిన్ను దలచగలితే జాలు
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు
హరి నీ సేవాపరుడౌటే చాలు
యిల జదువులురానీ యిటు రాకమాననీ
తలపు నీపాదములతగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చలపట్టి నాకు నీశరణమే చాలు
సౌమ్యశ్రీ రాళ్లభండి