
పేరడీ అనగానే మనలో చాలామంది దాన్ని ఏదో వెంట్రుక తీసిపారేసినట్టు పారేస్తారు. పేరడీ అంటే అనుకరుణ. అనుకరించటం అంటే తేలికని మన అభిప్రాయం. తల్లి పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు చేసే ప్రయత్నం ఏమిటి? అనుకరణే! కానీ ఆ అనుభూతి వేరు. అది అనుకరణగా అన్పించదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏవరినో ఒకరిని ఏదో ఒకదాన్ని అనుకరిస్తున్నాం. అనుకరిస్తూనే ఉంటాం. అయితే పేరడీ ఈ అనుకరణకు ఎంతో విరుద్ధం. ‘ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన. హేళనాత్మకమైన, హాస్యాత్మకమైన విషయాంతరంతో కూడిన అనుకరణయే – పేరడీ’. అంతేకానీ, ఒక కవి రచనాశైలినికానీ, ఒక పద్యాన్ని కానీ, ఒక ఖండికను కానీ అనుకరించినంత మాత్రాన అది పేరడీ అయిపోదు. హాస్యంకానీ, అధిక్షేపణ కానీ, పరిహాసంకాని అనుకరణలు పేరడీ కింద రావు.
పేరడీలో ముఖ్యంగా మూలంలోని పదాలను, పాదాలను ఇష్టం వచ్చినట్టు మార్చడం ఉండదు. ప్రతీపద్యంలో ఆయువు పట్టు అనదగ్గ కీలకమైన పదాలో, సందర్భ, స్వభావాలో ఉంటాయి. వాటిని మార్చడం ద్వారా ఆ పద్య స్వరూప, స్వభావాలు తారుమారయి సరికొత్త రూపం వస్తుంది. పేరడీ చదువుతుంటే దాని తాలుకు మాతృక మనకు స్ఫూర్తికి వస్తుంది. అప్పుడే ఆ పేరడీ పండినట్టు. లేదా అది గ్రంధచౌర్యం కింద లెక్క. పేరడీ అనే పదం గ్రీకు శబ్ధం పేరోడియా, నుంచి పుట్టుంది. అంటే అనుసరించి పాడుట అని అర్ధం. దీనికి తెలుగు పదాన్ని సృష్టించడానికి తెలుగు సాహితీకారులనేకులు ఇబ్బడిముబ్బడిగా ప్రయత్నించినా ఆ పదాలన్ని కృత్రిమంగా అన్పించినట్టున్నాయి, దాంతో పేరడీయే స్థిరపడిపోయింది.
తెలుగుసాహిత్యంలో పేరడీలు ఎక్కువగా చాటు పద్యాలలో మనకు కన్పిస్తాయి. అయితే, వికటకవిగా ప్రసిద్ధికెక్కి వికటత్వాన్ని తన కవిత్వంలో పోందుపర్చుకున్న తెనాలిరామకృష్ణుని తెలుగులో ప్రప్రథమ పేరడీకవిగా, ఆయన కవియిత్రి మొల్ల పద్యాన్ని అధిక్షేపిస్తూ చెప్పిన ఈ కింది పద్యం మొట్టమొదటి పేరడీ పద్యంగాను సాహితీ పరిశోధకులు భావిస్తున్నారు.
శ్రీకృష్ణదేవరాయులవారిని శ్రీ కృష్ణునితో పోలుస్తూ రాయలువారే మేలని మొల్ల ఈ దిగువ పద్యంలో స్తుతించింది.
అతడు గోపాలకుం డితడు భూపాలకం
డెలమి నాతని కన్న నితడు ఘనుడు,
అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు
డెలమి నాతని కన్న నితడు ఘనుడు,
అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి
యెలమి నాతని కన్న నితడు ఘనుడు
అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి
యెలమి నాతని కన్న నితడు ఘనుడు
పల్లెకాతండు పుట్టణ ప్రభవితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీల కితడు
సురలకాతండు తలప భూసురులకితడు
కృష్ణుడాతండు శ్రీ మహాకృష్ణుడితడు
పై పద్యాన్ని అనుకరిస్తూ, రామకృష్ణుడు ఈశ్వరునితో ఎద్దుని పోలుస్తూ చెప్పిన ఈ దిగువ పద్యాన్ని గమనించండి:
అతడంబకు మగం డితడమ్మకు మగండు
నెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతడమ్మున నేయు నితడు కొమ్మున డాయు
నెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు
నెలమి నాతనికన్న నితడు ఘనుడు
దాతయాతండు గోనెల మోత యితడు
దక్షుడాతండు ప్రజల సంరక్షిడితడు
దేవుడాతండు కుడితికి దేవుడితడు
పశుపతి యతండు శ్రీ మహాపశువితండు.
మాతృకలో వలెనే ప్రథమార్ధంలో పోలిక, ద్వితీయార్ధంలో నిశ్చయార్ధం నిక్షేపిస్తూ, ఎద్దును కథావస్తువుగా స్వీకరించి మహాశివునితో పోల్చి ఆయనకన్న మిన్న నిరూపించే ప్రయత్నం హాస్యం పుట్టిస్తుంది.
అలాగే, అల్లసాని పెద్దన్నవారి ‘అమవసనిసి’ పదప్రయోగాన్ని అధిక్షేపిస్తూ, తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఈ పేరడీ చూడండి.
కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమలగర్భునివశమా?
నెలనడిమి నాటి వెన్నెల
లలవడునే గాదె బోయ అమవసనిసికిన్. (అలసాని పెద్దన)
ఎమితిని సెపితివి కపితము?
బ్రమపడి వెరిపుచ్చకాయవడిదిని నెపితో?
ఉమెతఃకయ తిని నెపితో?
అమవసనిసి అన్నమాట అలసని పెదనా (తెనాలి రామరృష్ణుడు)
పోతన భాగవతంలోని ‘ఇంతింతై వటుడింతై’ పద్యానికి మహిళల పురోగమనాన్ని అన్వయిస్తూ ఆధునిక కవులు చెప్పిన పేరడీ –
ఇంతింతై వధువింతయై, గృహమునందింతై స్వయంవీధిలో
నంతై, గ్రామసభా విభాగమున కల్లంతై స్వతాలుకాపై
నంతై మండలమంతయై మరియు తానాంధ్రా ప్రదేశమ్ము పై
నంతై భారతదేశమంతయు బ్రహ్మాండాంత సంవర్ధియై
అలాగే కొన్ని ఇతర ప్రసిద్ధ పద్యాలకు పేరిడీలు చదివి ఆనందించండి…
ఇందిరమ్మ గుట్టు ఎరుగుట కష్టంబు
ధాతకైన వాడి తాతకైన
విబుధ జనుల వలన విన్నతం కన్నంత
తెలియ వచ్చినంత తేటపరుతు! (గజ్జెల మల్లారెడ్డిగారి పేరడీ)
ఇందుగలదందు లేదని
సందియము వలదవినీతి సర్వోపగతం
బెందెందు వెదికి చూచిన
నందందే గలదు ఇందిరా కాంగ్రెసునన్
పదవి వచ్చువేళ, పదవి పోయెడు వేళ
ప్రాణమైన పదవి భంగమందు
కూడబెట్టినట్టి ‘కోట్ల’ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొందడధిప! (వెలుదండ నిత్యానందరావుగారి పేరడీలు)
ఆధునిక యుగానికొచ్చేసరికి అనేకమంది కవులు పేరడీకి వన్నె తెచ్చారు. ప్రాచీన, ఆధునిక కవితలకు పేరడీలు అల్లారు. వారిలో జరూక్ శాస్త్రిగారు పేరడీకి కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. విశ్వనాథ సత్యనారాయరణ, దేవులపల్లి, శ్రీశ్రీ ఇలా ఒకరేంటి ఆధునిక కవులందరి కవితలకు అలవోకగా పేరడీలు చేసి, పేరడీలను ప్రజల నాల్కులపైకి తెచ్చారు. మచ్చుకు శ్రీశ్రీ ‘అద్వైతాన్ని’ జరూక్ శాస్త్రి ‘విశిష్టాద్వైతం’గా ఎలా మలిచారో చూడండి.
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచుల చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం (శ్రీశ్రీ మహాప్రస్థానం)
ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం. (జరుక్ శాస్త్రి పేరడీ)
ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు. జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకు చెప్పిన పేరడీలు గమనించండి –
నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను
నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను
ఇంకా,
ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం
ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం)
కవిత్వమొక వర్కర్ బూరా (కవిత్వమొక తీరని దాహం)
ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ (తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు)
ఇలా అనేక పేరడీలు చేసి మెప్పించాడు. అదేవిధంగా, మాచిరాజు దేవీప్రసాద్ గారు శ్రీశ్రీ కవితలకు కట్టిన పేరడీలు చూడండి…
ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం
రహదార్ల చరిత్ర సమస్తం, దూళిధూసర పరిన్యస్తం.
రహదారి చరిత్ర సమస్తం, యాతాయత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం, పథిక వాహన ప్రయాణ సిక్తం
అంటూ కొనసాగించి –
భూంకార గర్జిత దిగ్భాగం, చక్రాంగ జ్వలిత సమస్తాంగం
రహదారి చరిత్ర సమస్తం, పైజమ్మాలను పాడుచేయడం అని చెపుతారు.
ఇంకా –
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి
పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు (శ్రీశ్రీ)
ఒక కారును వేరొక కారూ, ఒక బస్సును వేరొక లారీ
చుంబించే ఆ క్షణమందున, రూల్సన్నీ దాగును యెచ్చట?
ఈ నడివీధికి సంగరముందా? ఆ రహదారి వాలం బెంతుందీ?
పోసిన రాళ్ళూ నడిపిన బళ్ళూ, ఇవి కావోయ్ బాటల భాగ్యం
రహదారుల మధ్య దారిలో, అగుపించే హంతుకెలవ్వరు?
ప్రక్కన పెట్టిన రోలర్ కాదోయ్, దాన్ని గ్రుద్దిన బండ్లెన్ని?
శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ –
అవాకులన్నీ, చవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ, ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తూ, అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు, వారికి జరిపే సమ్ మానాలకు
బిరుదల మాలకు, దుశ్శాలువలకు, కరతాళలకు ఖరీదు లేదేయ్!
అలాగే-
నేను సైతం తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం నల్లరంగును
తెల్లజుట్టుకు రాసిదువ్వాను
యింతచేసి, యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టునిచ్చాను.
శ్రీశ్రీ కవితలు ఎంతగా పేరడీకి గురయ్యయో, శ్రీశ్రీ కూడా తానేం తక్కువ తినలేదంటూ అనేక పేరడీలు రాశారు. సిరిసిరిమువ్వా అనే మకుటంతో ఆయన రాసిన శతకం, జలసూత్రం రుక్మిణీ శాస్త్రి పేరుమీద రాసిన రుక్కుటేశ్వర శతకం, ఇందుకు మచ్చుతునకలు.
కోయకుమీ సొరకాయలు, వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవఫిలిం, చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా.
పై పేరడీ ‘ఏరకుమీ కసిగాయలు, దూరకుమీ బంధు జనుల’ అన్న సుమతీ శతకం ఆధారంగా చెప్పిన పేరడీ.
ఏరి తల్లీ నిరుడు మురిసిన, ఇనప రచయితలు
కృష్ణ శాస్త్ర పుటుష్ట్ర పక్షి, దారి తప్పిన నారిబాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ, పలకరెంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్లికోసం, పండితా నారాధ్యుడాడిన
వంద కల్లల పంది పిల్లల, ఆంధ్ర పత్రిక ఎక్కడమ్మా?
ఎక్కడమ్మా ఎలక గొంతుక, పిలకశాస్త్రుల పనికిమాలిన
తలకు మించిన వెలకు తగ్గిన, రణగొణ ధ్వనులు
ఏవితల్లీ నిరుడు మురిసిన హిమ సమూహములు.
ఇలా చెప్పుకుంటూపోతే, కవితలకు, పేరడీలకు ఆదిమధ్యాంతరాలుండవు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ పేరడీకి అనర్హం! చివరగా కొన్ని సరదా పేరడీలు….
అక్కరకురాని బస్సును
చక్కగ సినిమాకురాక సణెగెడు భార్యన్
ఉక్కగ నుండెడు ఇంటిని
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!
తినదగు నెవ్వరు పెట్టిన
తిని నంతనె వెళ్లిపోక తిని తిట్టదగున్
తిని తిట్టి వెళ్లిపోయెడు
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
అరవదాని చీర ఆరుబారులునుండు
పార్సిపడతి చీర పదికి మించు
చీరగొప్పదైన శీలంబు గొప్పదా
విశ్వదాభిరామ వినురవేమ!
ఇంజనీరు కోర్సు ఇంగిలీసుననేడ్చి
ఇంటి చుట్టు కొలత నీయలేడు
బట్టి చదవుకంటె వట్టి చాకలిమేలు
విశ్వదాభిరామ వినురవేమ!
తేటగీతి
(‘తెలుగు సాహిత్యంలో పేరడీ’ అన్న శీర్షికతో డా. వెలుదండ నిత్యానందరావుగారు సమర్పించిన పి.హెచ్.డి సిద్ధాంత గ్రంధం ఆధారంగా రాసిన వ్యాసం)