హరిహరతత్త్వం

ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ

సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప్రీతి. ఈ శివ,విష్ణు విబేధాలు మనలాంటి పామరులకే గాని పండితులకు, విజ్ఞులకు లేదు.

ఉదాహరణకు విష్ణుసహస్రనామం పరిశీలిస్తే, మనకి అనేక శివనామాలు గోచరిస్తాయి. “స్వయమ్భూః శంభురాదిత్యః….” (5వ శ్లోకం). అలాగే, “రుద్రో బహుశిరా….”, “అజః సర్వేశ్వరః….” మొదలైనవి. నాలుగవ శ్లోకంలో అయితే నేరుగా “సర్వః శర్వః శివః ….” అని శివుడి ని విష్ణునామంగా మనం పారాయణం చేస్తాం. పరిశీలిస్తే, శివ స్తోత్రాలలో, విష్ణు సంబంధిత నామాలు అనేకం మనకి కన్పిస్తాయి. ఇలా విష్ణుసహస్రనామంలో శివుడి నామాలు, శివ స్తోత్రాలలో విష్ణునామాలేమిటి అనే సందేహాలకు సమాధానం మనకి శ్రీమద్భాగవతంలో కనిపిస్తుంది.

భాగవతంలో పరిక్షీత్తు మహారాజు శుకమహర్షిని ఈ విషయమే ప్రశ్నిస్తూ పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించమని కోరుతాడు. శుకమహర్షి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నఖశిఖపర్యంతం వర్ణించటంతోపాటు, ఆ పరబ్రహ్మ స్వరూపమే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలలో త్రిమూర్తులుగా సాక్షాత్కరిస్తున్నారని వివరిస్తూ, అంతర్లీనంగా విష్ణు, శివరూపాలకు తేడా లేదని స్ఫష్టం చేస్తాడు. అలాంటి ద్విగుణము (ద్వైతము) లేనిదే “అద్వైతము”. ఆ అద్వైతాన్నే మన భాగవత, రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు బోధిస్తున్నాయి.

పైన చెప్పిన రెండు మహా మంత్రాలని ఇంకొంచెం విస్తారంగా పరికించి చూద్దాం.

“ఓం నమః శివాయ” అన్న మంత్రంలో “మ” అన్న అక్షరాన్ని తొలగిస్తే, ఆ మంత్రానికున్న అర్థమే మారి పోతుంది. “ఓం నః శివాయ” అన్న మాటకి అర్థం అసలు శివుడు లేకపోవడమే. ఇది సంభవమయ్యే మాట కాదు. కానీ ఎప్పుడైతే పైన చెప్పినట్లు హరిహరులకు తేడా లేదని అంటున్నామో అప్పుడు శివుడన్న స్వరూపమే లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం మొట్టమొదటి శ్లోకం ఈ విషయాన్ని ప్రతిపాదిస్తుంది. మొదటి విష్ణునామం “విశ్వం”. ఈ అఖండ విశ్వమే ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఎవరిచేతా లిఖితం కాకుండా, ఎవ్వరి చేతా ప్రచురింపబడకుండా ఒక పుస్తకం మనకి కనిపించడం అసంభవమెలాగో, అలాగే ఇంతటి విశ్వరచన జరిగిందన్న మాట సత్యమైనప్పుడు, ఈ జగద్రచన చేసిన పరబ్రహ్మ ఉన్నాడనదీ సత్యమే. అలాంటప్పుడు, శివుడు లేడన్నమాటకి (ఈ సందర్భంలో పరబ్రహ్మఅన్నవాడే లేకపోవడమన్నమాటకి) అసలు పొంతన కుదరదు. కనుక “మ” అన్న అక్షరం “ఓం నమః శివాయ” మంత్రంలో ఒక ప్రధానమైన అక్షరం. పంచాక్షరీ మంత్రం చదువుకున్నప్పుడు, మొత్తం మంత్రం మీద, విశేషించి “మ” అక్షరంమీద, శ్రద్ధ వహించాలి.

అలాగే, “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “రా” అన్న అక్షరం చాలా ప్రధానమైనది. ‘నారాయణ’ అనే అక్షరాలు పంచేంద్రియాలను తెలుపుతుంది. ‘న’అను అక్షరాన్ని ఉచ్చరించటం వల్ల ఇంద్ర భోగాలు లభిస్తాయి. ‘ర’ అక్షరం రామరాజ్యంలోనున్న భోగాలను కల్గిస్తుంది. ‘య’ అక్షర ఉచ్చరణ వల్ల కుబేరుని వలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. ఇక “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.

పంచాక్షరిలోని ‘మ’, అష్టాక్షరిలోని ‘ర’ ఈ రెండు అక్షరాలూ నేరుగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ రెండక్షరాల నామంలో మనకి పరబ్రహ్మ స్వరూపమూ, పురాణేతిహాసాలు ప్రతిపాదించే అద్వైతమూ, భగవంతుని అనేక రూపాలలో, అవతారాలలో మనకి కనిపించని ఏకత్వమూ గోచరిస్తాయి.

అందుకే

‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో’

అంటూ పార్వతీదేవీ ఆ మహాశివుని విష్ణుసహస్రనామ స్తోత్రంలో లఘువుగా చదువుకోవడానికి ఉపాయం అడగగా, ఆ మహేశ్వరుడు హరిహర తత్త్వాన్ని, పరబ్రహ్మతత్త్వాన్ని, అద్వైత సారాన్ని ప్రతిపాదించే,

“శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే”

అనే శ్రీరామ నామాన్ని ఉపదేశించాడు.

ఈ నామాన్ని జపించే కిరాతకుడు మహర్షి వాల్మీకి అయ్యాడు. ‘శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే పదమూడు అక్షరాల నామ మంత్రాన్ని 13కోట్లు జపించి రామదాసు శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందినట్లు కథనం. ఇక స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో,‘చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం | ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’ అంటే రామనామాన్ని కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరం మహాపాతాకాలను నశింపచేస్తుందని తెలిపాడు. విష్ణురూపమే శివుడు. శివరూపమే విష్ణువు. అందుకే శివభక్తుడైన రావణాసురుని వధించిన పాపం తొలగడానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్టను చేశాడు.

‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే
శివస్య హృదయ విష్ణుః విష్చోశ్చ హృదయం శివః’

ప్రసాద్ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *