
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి. మరొక అర్ధం క్రీడించునది దేవి (దివ్యతే క్రీడితి ఇతి).
లీలగా ప్రపంచాన్ని నిర్వహించడమ క్రీడ. అత్యంత సమర్ధంగా సర్వజ్ఞురాలైన ఆ తల్లి నడుపుతున్నదే ఈ విశ్వం. ప్రతివారిలోనున్న చైతన్యమే దేవి. ఈ నామానికి ప్రాధాన్యం వేదాలలో స్పష్టంగా కన్పిస్తుంది.
‘‘ఫ్రణో దేవీ సరస్వతి’’, ‘‘దుర్గాం దేవీ శరణం మహప్రపద్యే’’, ‘‘సర్వే వై దేవా దేవీముప్రతస్థుః’’, ‘‘దేవీ హ్యేకాగ్రఏవాసీత్’’, ‘‘దేవీ వాచమజనయంతదేవాః’’ – ఇలా ఎన్నో వేదమంత్రాలు జగదంబను దేవీ నామంతో కీర్తించాయి.
దేవ్యుపనిషత్తు, దేవ్యథర్వశీర్షం అనే వేదభాగాలు కూడా ప్రసిద్ధి. పురాణాలు కూడా దేవీభాగవతం, దేవీ పురాణం, దేవీ మహత్మ్యం అంటూ దేవీ నామాన్ని పేర్కోన్నాయి. లక్ష్మీదేవీ, దుర్గాదేవీ ఇలా అన్ని మూర్తులకు దేవీనామం వ్యవహారం. ఒకే దేవీ ఇలా అనేక నామాలతో, రూపాలతో ఆరాధింపడటంలో తత్త్వసంకేతాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్కొక్క నామంలో అనంతర్ధాలు ఇమిడి ఉండటంచేత అవి మంత్రాలుగా జపించబడుతున్నాయి.
ముఖ్యంగా శరన్నవరాత్రులలో దేవీ పరాక్రమ స్వరూపాన్ని సంభావిస్తారు. మహిషాసురాది దుష్టశక్తులను దనుమాడిన దుర్గగా అమ్మను అర్చిస్తారు. అందు ‘దుర్గ’ నామమం ఒక మహామంత్రం –
1. దుర్గమమైనది దుర్గ: మనసుకీ, మాటకీ అందని పరతత్త్వమే దుర్గమం. ఎంతో సాధనతో, ఎంతో యోగంతో పొందవల్సిన తత్త్వమది. అందుకే ‘దుర్గ’ అంటే ‘పరతత్త్వం’ (పరబ్రహ్మం) అని ప్రధానార్ధం.
యస్యాం పరతరం నాస్తి, స్చైషా దుర్గా ప్రకీర్తితా|| ‘దేన్నీ మించి మరోతత్త్వం లేదే అదే దుర్గ’ అని వైదిక నిర్వచనం.
2. ‘దుః’ శబ్ధానికి వీలుకానిది, భరించలేనిది అని అర్ధం. దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుఃస్థితి… ఇవన్నీ ‘దుః’ శబ్ధంతో కూడిన పదాలు. వీటన్నింటినీ సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గ.
‘‘రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి’’ అని శాస్త్రం వివరించింది.
3. వేద ధర్మానికి విఘాతం కల్గించి, దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత ‘దుర్గా’ నామం వచ్చినట్టు దేవీ భాగవతం చెబుతోంది.
దుర్గమాసురహంత్రీ త్వాత్, దుర్గేతి మమ నామయః||
4. దుర్గము అంటే కోట అని అర్ధం. పరుల బాధలేకుండా, మనలను రక్షించే ఆశ్రయం దుర్గం. అదేవిధంగా ఆశ్రయించిన భక్తులను అన్నివిధాల ఆదుకునే తల్లి దుర్గ.
త్వామాశ్రితానాం న విపన్నరాణాం, త్వామాశ్రితహ్యాశ్రయతాం ప్రయాంతి||
నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు. నిన్ను ఆశ్రయించినవాడే, సరియైన దాన్ని ఆశ్రయించినవాడు (దేవీమహత్మ్యం – మార్కండేయపురాణం). ఈ భావనలో దుర్గా అంటే ‘ఆశ్రయశక్తి’ అని అర్ధం.
5. వేదం దుర్గను ‘తారణీశక్తి’గా పేర్కొంది. దాటించే శక్తి దుర్గ. కష్టాల కడలినుండి తన భక్తులను దాటించి, ఒడ్డున చేర్చే నావగా వేదం దేవిని వర్ణించింది.
‘నా వేవ సింధుం దురితాత్యగ్నిః’, ‘దుర్గాం దేవీం శరణంమహం ప్రపద్యే సుతరసి తరసే నమః’ వంటి వేదమంత్రాలు ఈ భావనను చెబుతున్నాయి.
తాం దుర్గాం దుర్గమాం దేవీ, దురాచార విఘతినీ
నమామి భవభీతోహం, సంసారార్ణవతారిణీం||
‘‘అంతుపట్టని తత్త్వంగల దుర్గాదేవి, దురాచారాలను నశింపచేసే తల్లి. సంసార సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవతీతుడైన (సంసారం వల్ల భయపడే) నేను నమస్కరిస్తున్నాను. అని దేవథర్వశీర్షం ‘దుర్గ’ నామానికి నిర్వచనాలిచ్చింది.
అసురీశక్తులను నశింపజేసి, క్షేమకరైన సాత్విక శక్తులను పరిరక్షించే శాంతిని ప్రసాదించే జగదంబకు సుమనోంజలి.
(సామవేదం షణ్మఖశర్మగారి ‘ఏష ధర్మః సనాతనః’లో దుర్గానామ వివరణ)