రథ సప్తమి


మాఘ శుద్ధ సప్తమినాడు మనం రథ సప్తమి జరుపుకుంటాం. ఈ రోజు సూర్య జయంతి. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసిన ఈ రోజుకి విశిష్టత ఉంది. ఈ రోజు నుంచే సూర్యుడు తన సంచార గతిని మార్చుకుని ఉత్తర దిశవపైపు పయనం ఈరోజే ప్రారంభస్తాడు. భూమి, సూర్యునికి దగ్గరవటం ఆరంభిస్తుంది. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) అని సూర్యోపనిషత్తు తెలిపింది.

ఇంటి ముందు రథం ముగ్గు వేయటం, చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేయటం, ప్రత్యక్ష దైవమైన సూర్యుని ఎదుట పిడకల మీద పరమాన్నం వండి సూర్యభగవానునికి చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టటం మన సాంప్రదాయం. రథ సప్తమినాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగిపండు లను తలమీద ఉంచుకుని యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు, తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ అనే శ్లోకం పఠిస్తే ఏడు జన్మలనుంచి వెన్నంటి ఉన్న పాపాలు నశిస్తాయని మనవారి నమ్మకం.

సూర్య శ్లోకం: జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.

కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. రవి, భాను, దినకరుడు, భాస్కరుడు, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్య అనునవి సూర్యభగవానునికి గల మరికొన్ని పేర్లు. సూర్యనికి ఇద్దరు భార్యలు. ఛాయాదేవి, సంజ్ఙాదేవి. శనీశ్వరుడు, యముడు, యమున, వైవస్వతుడు సూర్య సంతానం.

ఆదిత్య హృదయం: రథ సప్తమినాడు ఆదిత్య హృదయాన్ని కానీ, సూర్యాష్టకాన్ని గాని తొమ్మదిమారు పఠిస్తే విశేష ఫలితం కల్గుతుందని ప్రతీతి. రామ,రావణ సంగ్రామ సమయంలో శక్తి క్షీణించి, నిరాశ, నిస్పృహల మధ్య శ్రీరాముడు ఉన్న సందర్భంలో అగస్త్య మహార్షి శ్రీ రామునికి ఆయన వంశ మూలపూరుషుడైన సూర్య శక్తిని తెలిపి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించినట్టు రామాయణ కావ్యం తెలుపుతోంది. ఈ శ్లోక ప్రభావంతో రాముడు శక్తిని పుంజుకుని రావణ వధ చేసినట్టు పురాణాలు తెలుపుతున్నాయి.

సూర్య దేవాలయాలు: మన దేశంలో ఉన్న మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో రెండు మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ఒరిస్సా లోని కోణార్క, శ్రీకాకుళంలోని అరసవిల్లి, నల్గోండ జిల్లాలోని అకరం ప్రసిద్ధ సూర్య దేవాలయాలు. ఇవికాక జమ్ములో మార్తండ్ లో, గుజరాత్ లోని మోఢేరా లో కూడా సూర్య దేవాలయాలున్నాయి.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *