
పంచమవేదంగా పిలవబడే మహాభారతం మనకు నిత్యం పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం (అనుశాసనిక పర్వం), శ్రీమద్భగవద్గీత (భీష్మపర్వం 25వఅధ్యాయం నుంచి 42వ అధ్యాయంవరకు)లను అందించింది. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను, యోగ సాధనాలను విశదీకరించాడు.
భగవద్గీతకు ఎందరో అర్ధాలు, తాత్పర్యాలు చెప్పారు. అయితే అందరికి మార్గదర్శకం జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం. తదనంతరం వ్యాప్తిలోకి వచ్చినవి రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతం, మధ్వాచార్యులవారి ద్వైత సిద్ధాంతం. మధ్వాచార్య విరిచిత భగవద్గీత సారం బహుళ ప్రచారం పొందింది. మరెందరికో మార్గదర్శకమైంది. మధ్వాచార్యులు గీతాభాష్యం, గీతా తాత్పర్యం అనే రెండు మీమాంసాలను రచించారు. వీటి రెండింటిని కూర్చి ‘గీతాప్రస్ధానం’ అని పిలుస్తారు.
మధ్వాచార్యలవారు భగవద్గీత శ్లోకాలకు టీకా తాత్పర్యాలను ఇవ్వలేదు. గీతలో నిక్షిప్తమైన వేదాల, ఉపనిషత్తుల సారాన్ని వ్యాఖ్యానాలుగా అందించారు. రెండవ యోగంలోని 11వ శ్లోకం నుంచి మొదలుపెట్టి దాదాపు 250 నుంచి 300 శ్లోకాలకు ఆయన భాష్యం చెప్పారు. ఆయన తన భాష్యంలో, తాత్పర్యంలో ఇతరులకు అర్థంకాని, అర్ధంచేసుకోలేని శ్లోకాలకు అవగాహనాత్మకమైన, తుల్యమైన సిద్ధాంతాలను, తత్త్వజ్ఞానాన్ని ప్రతిపాదించారు. వేదాలలో, పంచరత్ర సంహితాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో నిక్షిప్తమైన సిద్ధాంతాలను, బ్రహ్మసూత్రాలను, సంస్కృతిని భగవద్గీతకు అన్వయించి నిరూపించారు.
మధ్వాచార్యులు ముఖ్యంగా ప్రతిపాదించిన సిద్ధాంతం ఒక్కటే! పరబ్రహ్మ ఒక్కడే, అతను విష్ణువు. ఆ పరబ్రహ్మాన్ని విశ్వసించి, తన కర్మలను భక్తిభావంతో ఆచరించాలి. పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతం, జీవులన్ని ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవాల్సిందే. అందుకు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలే మూలం! కర్మకు ఎవరూ అతీతంకాదు. భక్తితో ఆచరించే కర్మయే ఉత్తమం. నిష్కామ్యకర్మ సిద్ధాంతాన్ని మధ్వులు ప్రతిపాదించారు. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఫలితాలకు వెరవకుండా, ఆశించకుండా నిర్వర్తించే కర్మయే భగవంతుని పట్ల భక్తిని నిరూపిస్తుందన్నది ఇందు ఉద్దేశం!
శ్రీమద్భగవద్గీత ఉద్దేశమంతా మనకు పదవ అధ్యాయం విభూతియోగంలోని 8 నుంచి 10వరకు గల నాలుగు శ్లోకాలలోను ప్రస్ఫుటమవుతుంది.
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10
తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా || 11
సర్వజగత్తుకు మూలం ఆ పరబ్రహ్మస్వరూపం. ఈ విషయాన్ని గ్రహించి ఆ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి తనను తాను భక్తిమార్గాన భగవంతునికి సమర్పించుకున్నవారికి బుద్ధి, జ్ఞాన, తత్త్వ యోగాలను ఆ పరమాత్మ ప్రసాదించి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడన్నది పై శ్లోకాల భావం. ఈ వేద వాఙ్మయ సారాన్ని మధ్వులు క్లుప్తంగా ‘‘హరిపాద వినమ్ర విదియా సతతం‘‘, ‘‘తత్కర్మ హరితేషాం యతు’’ అంటూ రెండే, రెండు సూత్రాలలో నిగూఢపరిచారు. దానర్థం, నిష్కామ్య కర్మాచరణ ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకున్న భక్తుడు తత్వ జ్ఞానాన్ని పొంది ఉత్కృష్ట స్థితికి చేరుకుంటాడు.
భగవంతుడు ఈ సృష్టి, స్థితి, లయలకు తానే కారణమన్న సత్యాన్ని గ్రహించమని తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం 17వ శ్లోకంలో విస్తారంగా తెలిపాడు. ఈ సమస్త జగత్తుకు దాతను నేనే. ఈ జగత్తుకు తల్లి, తండ్రి, తాతను (అపరాపకృతి – తల్లి, పరాపకృతి –తండ్రి, వీటికి మూలమగు పరమాత్మ –తాత) నేనే. ఓంకారము, ఋక్సమయజుర్వేదములను నేనే.
పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17
ఇంకా “ద్రవ్యం కరీచ కాలశ్చస్వభావో జీవ ఏవ చ, యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా” అనగా, నా అనుగ్రహంతోనే ఈ సృష్టిలో ఉన్న ద్రవ్యం, కర్మలు, కాలము, జీవులు, మొదలైనవి మనగలుగుతున్నాయి. నేను ఉపేక్షించిన అవి మనజాలవని భగవంతుడు స్పష్టం చేశాడు. ఈ చరాచర విశ్వం, పరబ్రహ్మం పరస్పర ఆధారాలని, ఒకటి సత్యమైతే మరోకటి కూడా అంతే సత్యమనే ఈ ప్రమాణాన్ని మధ్వులు అంగీకరించరు. పరమాత్మ, జీవాత్మల మధ్య సంబంధం బింబ-ప్రతిబింబాల సంబంధంగా మధ్వులు పేర్కోంటారు. మధ్వుల సిద్ధాంతం ముఖ్యంగా కీలకమైన ఐదు అంశాలను ఆధారం చేసుకుని ఏర్పడింది — 1. పరమాత్మ, జీవాత్మల మధ్య భేదం, 2. పరమాత్మ, పదార్ధాల మధ్య భేదం, 3. జీవాత్మ, పదార్ధాల మధ్య భేదం, 4. రెండు విభిన్న జీవాత్మల మధ్య భేదం, 5. భౌతిక పదార్ధాల మధ్య భేదం.
భగవంతుడు సర్వస్వతంత్రుడు, సర్వాంతర్యామి, సర్వప్రకాశకుడు, సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వసంభూతుడు అని మధ్వుల అభిప్రాయం. ఇదే భావనను భీష్మాచార్యుడు విష్ణుసహస్రనామంలో, ‘‘భూతకృద్ భూత భ్రుద్బావో భూతాత్మా, భూత భావనః, అప్రమేయో హృషికేశః పద్మనాభోమరప్రభుః’’ అని పేర్కోన్నాడు. ప్రమేయమైన ఈ జగత్తు అప్రమేయమైన పరబ్రహ్మంపై ఆధారపడి ఉండడం ద్వైత భావన. అంతమాత్రాన శాశ్వతమైన ఈ జగత్తు స్వతంత్రత కలిగి ఉందని కాదు. సృష్టి, స్థితి, లయ, జ్ఞానం, బంధనం, మోక్షం, సుఖం, దుఃఖం అనే ఎనిమిది అంశాలు జగత్తు యొక్క శాశ్వత పరాధీనతను, పరబ్రహ్మము యొక్క స్వతంత్రతను నిరూపిస్తున్నాయి.
జీవుని ఉనికి, కర్మ, చైతన్య స్థితి భగవంతునిపై ఆధారపడి ఉంటాయని, శాశ్వతమైన ఈ జీవాత్మ, పరమాత్మతో తనకు గల సంబంధాన్ని కేవలం ముక్త స్థితిలో మాత్రమే జ్ఞప్తికి వస్తుందని మధ్వులు తెలియచేశారు. ఇదే విషయాన్ని భగవంతుడు, అర్జుననికి భగవద్గీతలోని ద్వితీయోధ్యాయమైన సాంఖ్యయోగంలో 12వ శ్లోకంలో ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలాలందు ఉండునని తెలుపాడు.
న త్వే వాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయ మతఃపరమ్ ||12||
ఈ జ్ఞానం ద్వారా ముక్తి స్థితిని పొందిన జీవి బింబ-ప్రతిబింబ సంబంధాన్ని తెలుసుకొని, తన స్వరూపం ఒక అభాస కాదని, సత్యమని తెలుసుకుంటాడని మధ్వుల అభిప్రాయం. ఒక అద్దం నాశనమైతే అందులో కనిపించే బింబం కూడా నాశనమవుతుంది. కానీ ఈ సత్యం ఆత్మకు వర్తించదు. పరబ్రహ్మంతో మమేకమై ఉండే ఆత్మకు నాశనం లేదని మధ్వులు పేర్కొంటారు. ఆధారంలేని బింబం నాశనమవుతుంది. ఈ జ్ఞాన్ని అర్ధంచేసుకోవలేక పోవడానికి కారణం జీవిలోని సంసారమనే లౌకిక బంధం. ‘రూపం రూపం ప్రతిరూప బభూవ, తదస్య రూపం ప్రతిచక్షణాయ’ అని ఋగ్వేదం తెలుపుతోంది. ప్రతిజీవి యొక్క రూపానికి మూల రూపం భగవంతునిది. అటువంటి మూల రూపాన్ని గ్రహించిన జీవిని సుఖైక స్థితిని పొందుతాడని మధ్వులు తెలిపారు.
ఇక్కడ జీవి, భౌతిక రూపానికి, ఆత్మకు గల మధ్య బంధం పుట్టుక, మరణాలతో ముడిపడి ఉంటుంది. ఈ భేదాన్ని గ్రహించలేని జీవి అశాశ్వతమైన దేహానికి గలిగే శీతోష్ణ స్పర్శ జ్ఞానాలు, మనస్సుపై కలిగే సుఖదుఃఖాలకు లొంగి ముక్తి స్థితికి చేరుకోలేకపోతాడు. కాలాతీత, గుణాతీతాలకు అతీతమైనది ఆత్మ, అది శాశ్వతం. ఆత్మలేని దేహం అశాశ్వతం. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరు భావవికారముల లేనిది ఆత్మ. ఇది ఆనాదిగా నూతనమైనది, శాశ్వతమైనది.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః
ఉభయోరపి దృష్ట్యోన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ||16||
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భయః
అజో నిత్య శ్శాశ్వతో యం పురాణో న హస్యతే హన్యమానే శరీర ||20||
మరిన్ని విషయాలు త్వరలో….
సౌమ్యశ్రీ రాళ్లభండి
(విన్నపం: ఒక స్నేహితుని కోరిక మేరకు మధ్వాచార్యలు ప్రతిపాదించిన గీతాతత్త్వాన్ని గురించి రాసే చిన్ని ప్రయత్నాన్ని చేశాను. తెలుగులో మధ్వుల తత్త్వ జ్ఞానానికి సంబంధించి అతి కొద్దిగా మాత్రమే సమాచారం దొరకుతోందని, తెలుగులో ఈ విషయం గురించి రాస్తే బావుంటుందన్న వారి సూచన మేరకు ఈ విషయమందు పరిజ్ఞానం, అవగాహన, రాసే వయసు, పరిణితి లేకపోయిన, తద్వారా విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చన్న కుతూహలంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అనుభవరాహిత్యంతో, అజ్ఞానంతో నేను చేసిన తప్పులను పెద్ద మనసుతో క్షమించి, తగిన నిర్ణయాత్మక, తుల్యనాత్మక సూచనలు చేయగలరని ఆశిస్తున్నాను.)