
5. శ్రీమద్భాగవత పురాణం
‘భాగవతః ఇదమ్ భాగవతమ్’ – భగవంతుని కథలు చెప్పేది భాగవతం. ‘భా’ అంటే భక్తి, ‘గ’ అంటే జ్ఞానం, ‘వ’ అంటే వైరాగ్యం, ‘తం’ అంటే తత్త్వం అనే అర్థాలతో భక్తి, జ్ఞాన, వైరాగ్యములను పెంపొందించే పురాణంగా శ్రీమద్భాగవతం సార్థకమైనది. అష్టాదశ మహాపురాణాలలో అయిదవదైన శ్రీమద్భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క ఊరః (తొడలు) గా అభివర్ణిస్తారు. ఈ పురాణాన్ని సారస్వత కల్పంలో మొట్టమొదటసారిగా విష్ణువు బ్రహ్మకు బోధించాడు. వేద కల్పతరువుగా బాసిల్లిన భాగవతంలో పన్నెండు స్కంధాలు, పదునెనిమిది వేల శ్లోకాలున్నాయి. ఇందు –
ప్రథమ స్కంధంలో – భగవద్భక్తి మహాత్మ్యము, భగవత్కధల శ్రవణ – కీర్తనల ఫలితం, నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం, భగవంతుని ఏకవింశత్యవతారాలు మొదలైన అంశాలున్నాయి.
ద్వితీయ స్కంధంలో – శ్రీమన్నారయణుని విరాటస్వరూప వర్ణన, బ్రహ్మాండ నిర్మాణం, భగవదవతారాల వర్ణన, పురాణ లక్షణాలు వర్ణించబడ్డాయి.
తృతీయ స్కంధంలో – బ్రహ్మ విష్ణు నాభి నుంచి ఉద్భవించడం, మాతృగర్భంలో జీవోత్పత్తి, మోక్షసాధన, విష్ణుపురాణం మొదలగు అంశాలున్నాయి.
చతుర్థ స్కంధంలో – దక్షయాగ వర్ణన, ధ్రువ చరితం మొదలైన విషయాలున్నాయి.
పంచవ స్కంధంలో – భరత వంశ చరిత్ర, భూగోళ, ఖగోళ వర్ణన, ఋషభావతార వర్ణన కనబడతాయి.
షష్ఠమ స్కంధంలో – అజామిళోపాఖ్యానం, దధీచి వృత్తాంతం
సప్తమ స్కంధంలో – శ్రీనృసింహావతార వర్ణన, ప్రహ్లాద చరిత్ర, మానవ ధర్మాలు అగుపిస్తాయి.
అష్టమ స్కంధంలో – గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, శ్రీకూర్మ, వామన, మత్స్యావతార వర్ణనలు మొదలైన అంశాలు పొందుపర్చబడ్డాయి.
నవమ స్కంధంలో – అంబరీషోపాఖ్యానం, హరిశ్చంద్ర, భగీరథ వృత్తాంతాలు, యదువంశ వర్ణన, శ్రీరామ, పరశురామావతారాలున్నాయి.
దశమ స్కంధంలో – శ్రీకృష్ణావతార వర్ణన, బాలకృష్ణుని లీలావైభవం ప్రముఖంగా కన్పిస్తుంది.
ఏకాదశ స్కంధంలో – అష్టాదశ సిద్ధులు, యమనియమాది అష్టాంగ నియమాలు మొదలగు విషయాలు కన్పిస్తాయి.
ద్వాదశ స్కంధంలో – కల్క్యావతార వర్ణన, కలియుగ ధర్మాలు, వేద విభజన, మార్కండేయ చరిత్ర మొదలగు అంశాలున్నాయి.
‘మోక్షసాధన సామగ్ర్యాం భక్తి దేవ గరీయసీ’
మోక్షమార్గాలెన్నో ఉన్నా, వాటిలో శ్రేష్టమైనది భక్తి మార్గం మాత్రమే. ఈ భక్తి తత్త్వాన్ని ఉపదేశించడం ద్వారా శ్రీమద్భాగవత పురాణం విశేష ప్రశస్తిని పొందింది. అందుకే ‘ఏకం భాగవతశాస్త్రం ముక్తిదానేన గర్జితి’, ముక్తినివ్వగల శాస్త్రాలలో భాగవతం ప్రధానమైనదని పౌరాణికులు అభిప్రాయపడ్డారు. భాగవతం కేవలం పురాణ కథా స్రవంతే గాదు, ఆథ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం.
6. నారద పురాణం
‘నాభిఃస్యాన్నారదీయకమ్’, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి స్థానంతో పోల్చబడింది, అష్టాదశ పురాణాలలో ఆరవది నారద పురాణం. మొత్తం ఇరవై ఐదువేల శ్లోకాలు గల ఈ పురాణం పూర్వఖండం, ఉత్తర ఖండమని రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వఖండంలో 125, ఉత్తర ఖండంలో 82 అధ్యాయాలున్నాయి. శివకేశవుల అభేదతత్త్వాన్ని ప్రబోధించే ఈ పురాణాన్ని బృహత్ కల్పంలో మొట్టమొదటిసారిగా పూర్వ భాగాన్ని సనకాదులు నారదునకు, ఉత్తర భాగాన్ని వశిష్టుడు మాంధాతకు బోధించారు. ఈ పురాణానికి నారదీయ పురాణమని, బృహన్నారదీయ పురాణమని పేర్లు కూడా ఉన్నాయి.
అంతేగాక పూర్వభాగమున 64వ అధ్యాయము నుండి 91వ అధ్యాయము వరకు 28 అధ్యాయములలో మహామంత్ర శాస్త్రము పేర్కొనబడినది. అందుకే దీనికి ‘ మంత్రసారసంగ్రహమని’ కూడా వ్యవహారమున్నది. ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, అను పంచాయతనము, నవగ్రహమంత్రములు, కార్తవీర్యమంత్రము, కవచము హయగ్రీవ మంత్రోపాసన మొదలైనవి ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
నారదపురాణంలోని పూర్వభాగంలో నారదుడు చేసిన విష్ణుస్తుతి, వర్ణాశ్రమ ధర్మాలు, నక్షత్రవేద సంహితా కల్పం, వ్యాకరణ నిరూపణ, జ్యోతిషంలో గణిత, జాతక విభాగవిచారణం, హనుమచ్చరిత్ర, శ్రీ లలితా స్త్రోతకవచం, సహస్రనామస్త్రోత కథనం మొదలగునవి పేర్కొనబడ్డాయి. ఇక ఉత్తర భాగంలో ద్వాదశీ మహాత్మ్యం, గంగ, గయా, కాశీ మహాత్మ్యాలు, తీర్థ యాత్ర వర్ణన, పురాణ లక్షణాలు, పురాణ శ్రవణాది ఫలాలు మొదలగునవి వివరించబడ్డాయి. అలాగే, అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచీనగరం, అవంతికా, ద్వారవతి ఈ ఏడు నగరాలు మోక్షదాయకాలని నారదపురాణం తెలుపుతోంది.
ద్వాదశీ వ్రతాలు:
శ్రీమన్నారయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ద్వాదశి. ప్రతీమాసంలో శుక్లపక్షద్వాదశినాడు శ్రీహరి వత్రాన్ని ఆచరిస్తే శుభఫలాలు లభిస్తాయని ఈ పురాణం మనకు తెలుపుతోంది. మార్గశీర్ష శుక్లద్వాదశి – ఓం కేశవాయ నమః, పుష్యశుద్ద ద్వాదశి -ఓం నమో నారాయణాయ, మాఘశుద్దద్వాదశి -మాధవాయ స్వాహ, ఫాల్గుణశుద్ధద్వాదశి – గోవిందాయ నమస్తుభ్యం, చైత్రశుద్ధద్వాదశి -నమోస్తు విష్ణువేతుభ్యం, వైశాఖశుద్ధద్వాదశి -నమస్తే మధుహంత్రే, జ్యేష్ఠశుద్ధద్వాదశి – నమః త్రివిక్రమాయ, ఆషాడ శుద్ధద్వాదశి – నమస్తే వామనాయ, శ్రావణ శుద్ధద్వాదశి – నమోస్తు శ్రీధరాయ, భాద్రపద శుద్ధద్వాదశి – హృషికేశ నమస్తుభ్యం, ఆశ్వయుజ శుద్ధద్వాదశి – నమస్తే పద్మనాభాయ, కార్తీక శుద్ధద్వాదశి – నమో దామోదరాయ అనే మంత్రాన్ని పఠిస్తూ, ఉపవాస దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే, గోమేధ, అశ్వమేధ, ఎనిమిది నరమేధ, అగ్నిష్టోమ, బ్రహ్మమేథ యాగాల ఫలితాలు లభిస్తాయని నారద పురాణం తెలుపుతోంది.
దశహరా (దసరా):
దౌర్జన్యంతో పరుల వస్తువులను అపహరించటం, పరులను హింసిచటం, పరస్త్రీలను చెరబట్టడం, అసత్యం పలకడం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసంబద్ధ, వ్యర్థ ప్రేలాపాలు చేయటం, పరుల వస్తువులను కాజేయాలన్న కోరిక, ఇతరులకు హానికలగాలని కోరుకోవడం, ప్రయోజనంలేని విషయాలందు పట్టుదల పెంచుకోవడం వంటి పది కార్యాలు దశవిధ పాపాలు.
ఈ పది పాపాలు నశించాంలంటే (దశహరా) జ్యేష్ఠశుద్ధ దశమినాడు భగవంతుని సేవించాలి. అందుకే హర్యానా ప్రాంతంలో జ్యేష్ఠ శుద్ధ పంచమినాడు దసరా పండుగ ఆచరిస్తారు. తెలుగువారు ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు దసరా పండుగ జరుపుకుంటాము.
దాన ఫలితాలు:
అన్నతోయ సమందానం నభూతం నభవిష్యతి
అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశ్చాపి సర్వదః
నతస్య పునరావృత్తిరితి శాస్త్రేషు నిశ్చితమ్
సద్యస్తుష్టికరం జ్ఞేయం జనదానంయతోథికమ్
లోకంలో అన్నదానం, జనదానంతో సమానమైన దానం మరొకటి లేదు. అన్నదానం ప్రాణదానంతో సమానం కాబట్టి అన్నదానం చేసిన వాడు సకల దానాల ఫలితాలు పొందుతాడు. జలదానం అన్నదానం కంటే గొప్పది. ఎందుకంటే అది వెంటే తృప్తిని కలుగచేస్తుంది. జలదానం చేసినవాడు అన్ని మహా, ఉపపాతకాల నుంచి విముక్తి పొందుతాడు. ఇక ఇంటికి వచ్చివ అతిథికి ప్రాదప్రక్షాళన చేసినవాడు గంగానదితోపాటు అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు. యోగ్యులకి వస్త్రదానం చేసిన వారికి రుద్రలోకం, కన్యాదానం, చెఱుకు, గంధం దానం చేసినవారికి బ్రహ్మలోకం, బంగారం దానం చేసినవారికి విష్ణులోకం ప్రాప్తిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి దానం చేసిన వారు పదివేల దివ్య సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. విద్యాదానం, భూదానం, గోదానం చేసిన వారికి శ్రీహరి సాయుజ్యం లభిస్తుంది.
ఇలా అనేక దానాల ఫలితాలతోపాటు, వివిధ రకాల నరకాలు, పాపాలు, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు నారద పురాణం విశదీకరిస్తుంది.
నారద సుభాషితాలు:
శ్లోః యత్రస్తనః ప్రవర్తనే, తత్రదుఃఖంన బాధతే
వర్తే, యత్ర మార్తాండం, కధంతత్ర తమో భవేత్
సత్పురుషులు నివసించే చోట కష్టాలుండవు, సూర్యుడన్న చోట చీకటి ఉండదు.
శ్లోః అపకీర్తి సమో మృత్యుర్లోకేష్వన్యోనవిద్యతే – అపకీర్తిని మించిన మృత్యువు వేరొకటుండదు
శ్లోః సర్వలోక హితాసక్తాః సాధవః పరికీర్తితా – సర్వజనుల హితం కోరే వారు సాధువలనబడుతారు.
శ్లోః దాస భావంచ శత్రూణాం, వారస్త్రీణాంచ సౌహృదమ్
సాధుభావం చ సర్పాణాం, శ్రేయోస్కామో నవిశ్వసేత్
శత్రువుల వినయ ప్రదర్శన, వేశ్యల సహృదయత, సర్వ సాధుభావం వీటినెప్పుడు నమ్మరాదు. ఇవెప్పటికైనా నష్టం కలిగించకమానవు. అలాగే, నిస్సందేహి సదాసుఖంగా ఉంటాడు, నిత్యశంకితుడు సదా కష్టాలపాలవుతాడు. యౌవనం, పుష్కలమైన ధనం, అధికారం, అవివేకమనే నాల్గింటిలో ఏ ఒక్కటి ఉన్నా అనర్థదాయకం. ఇలా సత్ప్రవర్తనకు సంబంధించిన అనేక సుభాషితాలు నారద పురాణం మనకు బోధిస్తుంది.
యఃశృణోతి నరోభక్త్య, శ్రావయే ద్వాసమాహితః
సయాతి బ్రాహ్మణో ధామః నాత్ర కార్య విచారణా
వ్రతాలలో ఏకాదశి, నదులలో గంగా, అరణ్యాలలో బృందావనం, క్షేత్రాలలో కురుక్షేత్రం, పురాలలో కాశీపురం, తీర్థాలలో మథురతీర్థం, సరస్సులలో పుష్కర సరోవరం, పురాణాలలో నారదీయ పురాణం సర్వశ్రేష్టమైనవి.
తేటగీతి