
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా
గీత శ్రీపద్మనాభుడైన విష్ణుభగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణిస్తూ తెలిపాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో భోధించాడని అందరికి తెలుసు. కానీ భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం పదకొండవనాడు అనగా మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు జరిగింది. ఇది భగవంతుడు కేవలం అర్జునునికి మనోవేదన తీర్చడానికి చెప్పినది కాదు. మనిషిలోని అంతర్మధనాన్ని దూరం చేసి అతనిని కర్తవ్యముఖుడుని చేయడానికి చెప్పిన ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత.
గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి. అవి వరుసగా: 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 13. బవఘ్ని 14. భ్రాన్తినాశని 15. వేదత్రయి 16. పర 17. అనంత మరియు 18. తత్యార్ధజ్ఙానమంజరి.
మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాగా మహాభారతం భీష్మపర్వంలోని 43వ అధ్యాయం నాలుగవ శ్లోకంలో వేదవ్యాసుడు గీతలో శ్లోకాల సంఖ్య 745గా చెప్పాడు. ఇందు శ్రీ కృష్ణుడు 574, అర్జునుడు 85, సంజయుడు 41 మరియు ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు.
భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర “శ్రీ మద్భగవద్గీతా నూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే” అన్న పంక్తులుంటాయి. ఉపనిషత్తుల, బ్రహ్మవిద్య, యోగశాస్త్రాల సమిష్టి రూపమే గీత. ‘గీతాబోధన’ ద్వాపర యుగాంతంలో, కలియుగ ప్రారంభానికి ముందు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు జరిగింది. ఇది జరిగి సుమారు ఆరువేల సంవత్సరాలు కావస్తోంది. ఈ గీతా మహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. కాగా, శ్రీ కృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా ప్రత్యక్షంగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు ఇంకా రథం ధ్వజంపైనున్న ఆంజనేయస్వామి. అయితే, పరంపరాగతంగా గీతా యోగం ఒకర్నించి మరొకరికి అందతూ వచ్చిందని స్వయంగా భగవంతుడే భగవద్గీతలోని 4వ అధ్యాయంలో మొదటి 3శ్లోకాలలో తెలిపాడు.
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వే బ్రవీత్||
ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః
సకాలే నేహ మహతా యోగో నష్టః పరన్తప||
స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తో సిమే సఖా చేతి రహస్యం హ్యే తదుత్తమం||
యోగవిధానమైన లేక యోగరూపమైన భగవద్గీత మొదట సూర్యదేవునికి చెప్పబడింది. సూర్యుడు దానిని మహర్షి మనువుకు వివరించగా, దానిని అతడు ఇక్ష్వాకునికి అందజేసాడని పై శ్లోకం తెలుపుతోంది. తర్వాత కాలక్రమంలో భగవద్గీత లుప్తమైపోగా, భగవానుడే స్వయంగా దానిని పునఃరుద్ధరించి, కురక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునునికి ఉపదేశించాడు .
భగవద్గీత విశిష్టతను భగవానుడే స్వయంగా 18వ అధ్యాయము 68వ శ్లోకం నుండి 71 వరకు తెలిపాడు. పరమసిద్ధిప్రాప్తికై రెండు ముఖ్య మార్గాలైన సాంఖ్య యోగము, కర్మ యోగములను భగవంతుడు గీతలో ఉపదేశించాడు.
భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము అంటారు. 1 నుండి 6 వ అధ్యాయాలను కలిపి ‘కర్మషట్కము’, 7 నుండి 12 వరకు ‘భక్తి షట్కము’ మరియు 13నుండి 18 వరకు ‘జ్ఞాన షట్కము’ అంటారు. ఈ 18 యోగాలు వాటిలోని ముఖ్యాంశాలు:
అర్జునవిషాద యోగము (42శ్లోకాలు): ఇందు ఉభయసేనలయందలి ప్రధాన వీరుల పరిగణము, వారి సామర్ధ్యముల, శంఖధ్వనుల వర్ణన, మోహవ్యాకులుడైన అర్జునుని విషాద వర్ణన కలదు.
సాంఖ్య యోగము (72శ్లోకాలు): అర్జనుని యుద్ధ వైముఖ్యం, సాంఖ్యయోగ వివరణ, క్షాత్రధర్మము, యుద్ధాచరన ఆవశ్యకత, నిష్కామ కర్మయోగ వివరణ, స్థితప్రజ్ఞుని లక్షణాలు ఇందు ముఖ్యాంశాలు.
కర్మ యోగము (43శ్లోకాలు): యజ్ఞాది కర్మాచరణముల ఆవశ్యకత, అజ్ఞానుల, జ్ఞానుల లక్షణాలు, రాగద్వేషరహితులై కర్మలనాచరించుటకు ప్రేరేపించుట.
జ్ఞాన యోగము (42శ్లోకాలు): నిష్కామ కర్మయోగ విశేషము, వేర్వేరు యజ్ఞఫలములు.
కర్మ సన్యాస యోగము (29శ్లోకాలు): సాంఖ్యయోగి, నిష్కామ కర్మయోగుల లక్షణాలు, భక్తి సహిత ధ్యానయోగ వర్ణము
ఆత్మ సంయమ యోగము (36శ్లోకాలు): ధ్యానయోగమును గురించి విపులంగా వివరణ. మనోనిగ్రహ విశేషము, యోగభ్రష్టుని గతి, ధ్యానయోగి మహిమ
జ్ఞానవిజ్ఞాన యోగము (30శ్లోకాలు): సమస్త పదార్ధములయందు కారణరూపుడైన భగవంతుని వ్యాపకత్వ వివరణ, భగవద్భకుల ప్రశంస, అసురీ స్వభావుల నింద, అన్యదేవతోపాసన గూర్చిన వివరణ.
అక్షర పరబ్రహ్మ యోగము (28శ్లోకాలు): బ్రహ్మ, ఆధ్యాత్మ, కర్మ మొదలగు విషయాల గురించి అర్జునుని సందేహాలు, సమాధానాలు, శుక్ల, కృష్ణమార్గాల వివరణ
రాజవిద్యరాజగుహ్య యోగము (34శ్లోకాలు): జగదుత్పత్తి వివరణ, సర్వాత్మ స్వరూపుడైన భగవత్స్వరూప ప్రభావ వర్ణన, సకామనిష్కామ ఉపాసనల ఫలము
విభూతి యోగము (42శ్లోకాలు): భగవంతుని విభూతి యోగశక్తుల వివరణ, వాటి ఫలం. ఫలప్రభావ సహిత భక్తియోగ ప్రస్తావన.
విశ్వరూప సందర్శన యోగము (55శ్లోకాలు): భగవంతుడు తన విశ్వరూపాన్ని వర్ణించుట, విశ్వరూప దర్శనం, విశ్వరూప దర్శన మహిమల వివరణ, భగవతుండు తన చతుర్భుజ, సౌమ్యరూపాలను చూపుట, అనన్యభక్తి వర్ణన.
భక్తి యోగము (20శ్లోకాలు): సాకారనిరాకార ఉపాసకుల శ్రేష్టత, భగవత్ప్రాప్తికి ఉపాయాములు
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము (34శ్లోకాలు): జ్ఞానసహిత క్షేత్రక్షేత్రజ్ఞుల వర్ణన, జ్ఞానసహిత ప్రకృతిపురుషుల వర్ణన.
గుణత్రయవిభాగ యోగము (27శ్లోకాలు): ప్రకృతిపురుషుల నుండి జగదుత్పత్తి వివరణ, సత్త్వరజస్తమోగుణముల ప్రస్తావన.
పురుషోత్తమప్రాప్తి యోగము (20శ్లోకాలు): సంసార వృక్ష కథనం, జీవాత్మ విషయం, పరమేశ్వరుని ప్రభావస్వరూప వర్ణన, క్షర, అక్షర పురుషోత్తముల ప్రస్తావన.
దైవాసురసంపద్విభాగ యోగము (24శ్లోకాలు): శాస్త్రవిరుద్ధాచరణములను త్యజించుటకు, శాస్త్రోక్తవిధులను ఆచరించుటకు ప్రేరణ
శ్రద్ధాత్రయవిభాగ యోగము (28శ్లోకాలు): ఆహారము, యజ్ఞము, తపస్సు, దానముల భేదాలు, ఓం, తత్, సత్ ల ప్రయోగాములపై వ్యాఖ్య.
మోక్షసన్యాస యోగము (78శ్లోకాలు): త్రిగుణముల ప్రకారం జ్ఞాన, కర్మ, కర్త, బుద్ధి, వర్ణ ధర్మముల విషయం, జ్ఞాననిష్ఠ విషయం, భక్తి సహిత నిష్కామ కర్మయోగ విషయాలు, శ్రీ గీతామాహాత్మ్యం.
సౌమ్యశ్రీ రాళ్లభండి