
వాలి సుగ్రీవులకు మేనల్లుడను నేను
వల్లభుల బంటునమ్మ
ఆ వాయుసుతుడను, హనుమంతుడు నా పేరు
సీతమ్మ నమ్మవమ్మ
అంటూ ఎంతో ఆర్తితో హనుమంతుని ద్వారా సీతమ్మవారిని, జానపదులు భావుకతతో అర్ధించిన తీరు ఆ సీతమ్మవారినే కాదు మనందరిని కూడా అలరించకమానదు. వాల్మీకి రామాయణం కిష్కిందకాండలో ప్రవేశించే హనుమత్ స్వరూపం భగవత్ సౌందర్యాన్ని ప్రతిపాదించి, పరబ్రహ్మ ఉపాసనను బోధించే సుందరాకాండతో పరాకాష్ఠకు చేరుకుంటుంది. చిరంజీవై వెలుగొందుతున్న ఆ హనుమంతుడు అంజనాద్రిగా కలియుగదైవమైన ఆ వేంకటేశ్వరుని కొలువులో నేటికీ రామగాన సంకీర్తనను గావిస్తునే ఉన్నాడు. అందుకేనేమో అన్నమయ్యవారు కూడా శ్రీమద్రామాయణ గాథ ఆధారంగా హనుమత్ చరిత్రను అనేక కీర్తనలలో వర్ణించి మనందరిని తరింపచేశారు.
అన్నిటా నేరుపరి హనుమంతుడు
పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు
ముట్టినప్రతాపపు రాముని సేనలలోన
అట్టె బిరుదు బంటు శ్రీహనుమంతుడు
చుట్టి రా నుండిన యట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైన లావరి చొక్కపు హనుమంతుడు
వదలక కూడగట్టిన వనచర బలములో
నదె యేకంగ వీరుడు హనుమంతుడు
చెదరక కుంభకర్ణు చేతి శూలమందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుడు
త్రిజగములలోపల దేవతా సంఘముల లోన
అజుని పట్టాన నిల్చె హనుమంతుడు
విజయనగరాన శ్రీవేంకటేశు సేవకుడై
భుజబలుడై యున్నాడిప్పుడు హనుమంతుడు
వామనమూర్తి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ఏ విధంగానైతే నభోవీధినంతా ఆక్రమిస్తున్నప్పుడు సూర్యుడు కుంకుమ బొట్టునుంచి కాలిపీఠందాకా ఆ జగద్రక్షకునికి అలంకారమయ్యాడో, అదే విధంగా చిన్ననాడే సూర్యబింబాన్ని తన గుప్పెట పట్టబోయిన హనుమంతుని ప్రతాపమును, ఆకాశమంతయు నిండి, పాతాళాన పాదాలు మోపి, దశదిక్కులను కరళములో బంధించి, రవిచంద్రులను కర్ణకుండలములుగా, ధరణంతా వ్యాపించిన హనుమంతుని విశ్వరూపాన్ని అన్నమయ్య తన కీర్తనలలో వేనోళ్లు కొనియాడాడు.
అరుదీ కపీంద్రుని అధిక ప్రతాపము
సురలకు నరులకీసుద్దులెందు కలవా
ఉదయాచలము మీదినొక్కజంగ చాచుకొని
ఉదుటున నపరాద్రి నొక్కజంగ చాచుకొని
తుద సూర్యమండాలము తోడ మోము దిప్పుకుంటా
పెదవు లెత్తి చదివె పెద్దహనుమంతుడు
వొక్కమొలగంట చంద్రు డొక్కమొలగంట రవి
చుక్కలు మొలపూసలై చూపట్టగా
నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము
పిక్కటిల్ల పెరిగెను పెద్దహనుమంతుడు
పిడికిలించిన చేత బిరుదులపండ్లగొల
తడయక కుడిచేత దశదిక్కుల
జడియక శ్రీవేంకటేశ్వరుని మన్ననబంటు
బెడిదపు మహిమల పెద్దహనుమంతుడు||
‘పుట్టిననాడే భువనములెరగగ, పట్టితి సూర్యుని పండనుచు, కలశాపురముకాడ, కదలీవనాల నీడ, అలవాడె వున్నవాడు హనుమంతుడు’ అని సంక్షిప్తంగా బాలహనుమంతుని అన్నమయ్య వర్ణించాడు. తన భక్తిప్రపత్తులతో, బలపరాక్రమాలతో రామకార్యం సాధించి రామబంటన్న సార్ధకనామాన్ని పొందిన హనుమంతుని బంటురీతిని అన్నమయ్య సవిస్తారంగా తెలిపాడు.
అఱిముఱి హనుమంతుడట్టిబంటు
వెఱపు లేని రఘువీరునికి బంటు
యేలికను దైవముగా నెంచి కొల్చేవాడేబంటు
తాలిమిగలిగినయాతడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాడేబంటు
వేళ గాచుకవుండేటి వెరవరే బంటు
తను మనోవంచనలెంతటా లేనివాడే బంటు
ధనముపట్టున శుద్ధాత్మకుడే బంటు
అనిశము నెదురు మాటాడనివాడే బంటు
అనిమొన దిరుగనియతడే బంటు
చెప్పినట్లనే నడచియాతడేబంటు
తప్పులేక హితుడైనాతడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు
యెప్పుడును ద్రోహిగానిహితుడే బంటు
అక్కర గలిగి కడు నాప్తుడైనవాడే బంటు
యెక్కడా విడిచిపోనియిష్టుడే బంటు
తక్కక రహస్యములు దాచినవాడే బంటు
కక్కసీడుగాక బత్తిగలవాడే బంటు
కానిపనులకు లోనుగానివాడే బంటు
ఆనాజ్ఞ మీరనియాడతే బంటు
నానాగతి శ్రీవేంకటోన్నతుడైనయతనికి
తా నిన్నిటా దాసుడైనధన్యుడే బంటు
అన్నమయ్య వాల్మీకి రామాయణాధారంగా హనుమత్సంబంధ అనేక ఇతివృత్తాలను, సన్నివేశాలను తన కీర్తనలలో జొప్పించి మనకందించాడు. సముద్రలంఘనం, లంకిణిపై విజయం, అంగుళీయక ప్రదానం, లంకాదహనం, అక్షయకుమార సంహారం, అశోకవనంలో సీతమ్మ వారికి శిరోమణి అందించటం, సంజీవినీ పర్వతం తేవటం, ఇలా అనేక సుందరకాండ విశేషాలను ఎన్నో కీర్తనలలో అతిమధురంగా వర్ణించాడు.
పదియారువన్నెల బంగారు కాంతులతోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు ||
ఎడమ చేతబట్టె నిదివో పండ్లగొల
కుడిచేత రాకాసిగుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు ||
తొక్కె అక్షకుమారుని తుంచి యడగాళ్ళా సంది
నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను
చుక్కలు మోవపెరిగి సుతువద్ద వేదాలు
పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు ||
గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశు బంటు తానయె
అట్టె వాయువునకు అంజనిదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుడు ||
అందరికి నెక్కుడైన హనుమంతుడు, చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి, ఆకసాన దాటివచ్చి, హల్లకల్లోలము చేసె హనుమంతుడని చెపుతూ, ‘వొల్లనె రాములముద్దుటుంగరము సీతకిచ్చె అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు’ ఏమీ ఎరగనట్టు అంటూ చమత్కరించాడు అన్నమయ్య.
అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి
అంబోధి లంఘించితివి హనుమంతుడ
కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి
అంజనీదేవ కుమార హనుమంతుడ
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడ
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుఁడవైతివి
అట లంకసాధించిన హనుమంతుడ
చటుల సత్వసమేత జయహనుమంతుడ
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ
దటుకన బంటవై ధరణి నిల్చితివి
అంటూ మరో కీర్తనలో కొనియాడాడు. సంజీవినీ కొండ తెచ్చి సౌమిత్రిని బతికించితివి, దిక్కులు గెలిచితివి ధీరత బూజ గొంటివి, అక్కజపు మహిమల హనుమంత రాయ, పాతాళములోపలి మైరావణు నాతల జంపిన హనుమంత, తేరిమీద నీరుపు దెచ్చిపెట్టి యర్జునుడు చటులార్జున సఖుడు, కౌరవుల గెలిచె సంగర భూమిని అంటూ హనుమత్ వృత్తాంతాన్ని, వైభవాన్ని అన్నమయ్యవారు వర్ణించారు.
హనుమత్ స్వరూపం సర్వదేవతా సమాహార స్వరూపం. భవిష్యద్ర్బహ్మ పట్టంతో బ్రహ్మ, దైత్యసంహారంతో హరిత్వం, రుద్రవీర్యజుడు కావడంతో హరత్వం సంచరించుకున్న బాలహనుమంతుడు సూర్యభగవానుని చేతబట్టబోయినపుడు ఇంద్రుడు నివారించే వృత్తాంతంలో వివిధ దేవతలు మారుతికందించిన ఆశీస్సులు ఆయన ద్వారా భక్తకోటికందరికి రక్షారేఖగా మారించదన్న భావనను ఈ కీర్తనలో అన్నమయ్య వ్యక్తీకరించారు.
ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే
నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష
మొదల నింద్రుఁడు నీ మోమునకెల్లా రక్ష
యిదె నీ శిరసునకు నినుఁడు రక్ష
కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష
చెదరని మేనికెల్ల శ్రీ రామరక్ష
పిరుఁదు వాలమునకు బెడిదపు శక్తి రక్ష
గరుడఁడు నీకరయుగముల రక్ష
గరిమ నీకుక్షికి కరివరదుఁడు రక్ష
సిరుల నీ మహిమకు శ్రీ రామ రక్ష
వడి నీ పాదములకు వాయుదేవుఁడు రక్ష
తొడలకు వరుణుఁడు తొడగు రక్ష
విడువని మతికిని వేద రాసులే రక్ష
చెడని నీ యాయువుకు శ్రీరామరక్ష
నలువ నీగళ రక్ష నాలుక కుర్వర రక్ష
అలర నీసంధులకు హరుఁడు రక్ష
పలు నీరోమములకు బహుదేవతలు రక్ష
చెలఁగు నీచేఁతలకు శ్రీ రామరక్ష
అంగపు నీతేజమున కగ్నిదేవుఁడు రక్ష
శృంగారమున కెల్లా శ్రీ సతి రక్ష
మంగాంబునిధి హనుమంత నీ కేకాలము
చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీ రామరక్ష
వాల్మీకి రామాయణంలో అనేక పర్యాయాలు హనుమంతుని విరాట్స్వరూపాన్ని ప్రస్తావించాడు. వివరించి సీతకు విశ్వరూపము చపుతూ, ధ్రువమండలము మోచె పెద్ద హనుమంతుడు. అలాగే భారతంలో కూడా హనుమంతుని విశ్వరూప సందర్శన వైనం మనకు గోచరిస్తుంది. భగవత్, భాగవత లక్ష్యణాలను తనదైన రీతిలో త్రివిక్రమ మూర్తియైన దేవుని వలె నున్న భక్తుని రూపాన్ని, భగవంతునికి భక్తునికి ఉన్న సామీప్యాన్ని అన్నమయ్య తన కీర్తనలో అత్యద్భుతంగా సాక్షాత్కరింప చేశాడు.
విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు
ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని
దేవహితార్థము సేసె ద్రి విక్రముఁడు అట్టె
దేవహితార్థమే జలధి లంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు
కొలిచిన వారికి గొమ్మని వరము లిచ్చే అంజనా తనయుని తలచరో జనులు యీతని పుణ్యనామములు సులభమునే సర్వశుభములు గలుగునంటూ — పెద్దహనుమంతుడు, పెనుహనుమంతుడు, దొడ్డ హనుమంతుడు, దివ్యహనుమంతుడు, ఘన హనుమంతుడు, గురు హనుమంతుడు, మేటి హనుమంతుడు, భీషణ హనుమంతుడు, దిట్ట హనుమంతుడు, చొక్కపు హనుమంతుడు, సొబగు హనుమంతుడు, దేవహనుమంతుడు, హిత హనుమంతుడు, ఉగ్రహనుమంతుడు — హనుమంతుని గుణగణాలను అనేక పేర్లతో కొనియాడడమేకాక, మంగాంబుధి హనుమంతుడు, కలశాపుర హనుమంతుడు, విజయనగర హనుమంతుడు, దిగువ పట్టణ హనుమంతుడు, మతంగాద్రి హనుమంతుడు అంటూ హనుమ క్షేత్రాల దర్శన భాగ్యం కూడా తన కీర్తనల ద్వారా అన్నమయ్య మనకందించాడు.
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమైనాడు
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలే పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరి పేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందు నీ హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు దానైనాడు
చిక్కుబాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి బుటమెగసి చంద్రుడు దానైనాడు
చెలగి మేరుపు పొంత సింహమైనాడు
బలిమి శ్రీ వేంకటేశు బంటై మంగాంబుధి
నిల ఈ హనుమంతుని కెదురా లోకము
శరణు కపీశ్వర, శరణం బనిలజ, పరవి నెంచ నీసరి యిక నేరీ, శరణు శరణు వేదశాస్త్ర నిపుణ నీకు, ఘనవాయుసుత దివ్యకామరూప, వదలక నీ కృపవాడనైతి నిదే అని దాదాపు యాభై కీర్తనలలో శరణువేడాడు అన్నమయ్య.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్
సౌమ్యశ్రీ రాళ్లభండి