అన్నమయ్య పదాలలో గీతామృతం

‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్ధసార సంగ్రహమ్,’ వేదాంతసారమంతా భగవద్గీతలో నిక్షిప్తమయుంది. అటువంటి ఉపనిషత్తులసారాన్ని,

సర్వోపనిషదో గావో
దోగ్దా గోపాలనన్ధనః
పార్ధో వత్సః సుధీర్భోక్తా
దుగ్దమ్ గీతామృతం మహత్

శ్రీకృష్ణభగవానుడు ఉపనిషత్తులనే గోవుల నుంచి అర్జునుడనే దూడ కోసం గీత అనే అమృతాన్ని పితికి అందించాడు. ఈ అమృతం భగవద్గీత పఠించిన వారందరికి దక్కుతుంది. ప్రకృతిలోని సమస్త జీవరాశులు సత్వరజోస్తమోగుణాలను కల్గి ఉంటాయి. వీటి నుంచి విముక్తిని పొంది మోక్షపథాన్ని చేరడానికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలనే మూడు మార్గాలలో పయనించి భగవంతుని తత్త్వసందర్శన చేయగలరని భగవద్గీత మనకు ఉపదేశిస్తోంది. భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయాలు జీవతత్త్వాన్ని (కర్మయోగం), తదుపరి ఆరు అధ్యాయాలు ఈశ్వరతత్త్వాన్ని (భక్తియోగం), చివరి ఆరు అధ్యాయాలు జీవేశ్వరుల (జ్ఞానయోగం) సంబంధాన్ని బోధిస్తుంది. శరణాగతిని తన ఆధ్యాత్మ సంకీర్తనలలో పదేపదే బోధించిన అన్నమయ్య భగవద్గీత తెలిపిన వేదాంతసారాన్నంతటిని తేటతెనుగు పదాలతో తన పదకవితల్లో మనకందించాడు.

మూడేమాటలు మూడు మూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంత రహస్యము

జీవ స్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపద యిది యెరుగటే
వేవేలు విధముల వేదాంత రహస్యము

తనలోని జ్ఞానము తప్పకుండా దలపోసి
పనితోడనందువల్ల భక్తి నిలిపి
మనికిగా వైరాగ్యము మరువకుండుటే
వినవలసినయట్టి వేదాంత రహస్యము

వేడుకతో నాచార్య విశ్వసముగలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశ్వరు గెలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము

శరణాగతి విశిష్టాద్వైతంలో ముఖ్యాంశం. భగవద్గీతలో గీతాచారుడు శరణాగతి అంటే ఏమిటో సవిస్తారంగా వివరించాడు.

సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ,
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః

భగవద్రామానుజులు బోధించిన శరణాగతి ప్రపత్తి మార్గాన్నే అన్నమయ్య కూడా ఆచరించి, ఏ మూర్తిలోకాలనెల్ల నేలెడివాడో, ఏ మూర్తిని బ్రహ్మాదులెల్ల వెదుకుదురో, ఏ మూర్తి నిజమోక్షమియ్యజాలడో, ఏమూర్తి లోకైకహితుడో, ఏ మూర్తి త్రైమూర్తులేకమైనట్టివాడో, ఏ మూర్తి సత్యాత్ముడో, ఏ మూర్తి సర్వాత్ముడో అట్టి నిత్యాత్ముడిని శరణుగోరమని తన సంకీర్తనల ద్వారా ప్రబోధించాడు.

ఒక్కడే మోక్షకర్త వొక్కటే శరణాగతి
దిక్కని హరిఁగొల్చి బదికిరి తొంటివారు

నానాదేవతలున్నారు నానాలోకములున్నవి
నానావ్రతాలున్నవి నడచేటివి
జ్ఞానికిఁ గామ్యకర్మాలు జరపి పొందేదేమి
అనుకున్న వేదోక్తాలైనా నాయఁగాక

వొక్కఁడు దప్పికిఁ ద్రావు వొక్కఁడు కడవ నించు
నొక్కఁడీఁదులాడు మడుగొక్కటి యందే
చక్కటి జ్ఞానియైనవాఁడు సారార్ధము వేదమందు
తక్కక చేకొనుఁగాక తలకెత్తుకొనునా

యిది భగవద్గీతార్ధ మిది యర్జునునితోను
యెదుటనే వుపదేశమిచ్చెఁ గృష్ణుఁడు
వెదకి వినరో శ్రీవేంకటేశుదాసులాల
బ్రదుకుఁద్రోవ మనకు పాటించి చేకొనరో

‘నీయందే బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు, నీయందే సచరాచరమును నీయందే యీ జగము,’ ‘కనుదెరచినంతనే కలుగు నీ జగము, కనుమూసినంతనే కడుశూన్యమౌను’ సర్వం విష్ణుమయం ఇది సత్యం అని తన కీర్తనల ద్వారా ‘జీవరాసులగు సృష్టియింతయును శ్రీవేంకటాపతి చిత్తంబే, కైవల్యమే లోకపుటిహము, పరమని’ సర్వభూతులందు భగవంతుడు సముడని భగవద్గీతార్ధాన్ని తన పదకవితల్లో ద్వారా ఉద్భోదించాడు అన్నమయ్య.

ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు

దేహం బొసంగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె
దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను
దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును
దేహి కోరినట్టే కమ్మర దేవుఁడనుమతి ఇచ్చీఁగాన

చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడాయంటేను
కాయపుసుఖములు గోరఁగఁ గర్తట కడగనుటకుఁ గర్తగాఁడా
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే
దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁగాన

ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము
సదయుఁడు మన శ్రీవేంకటగిరి సర్వేశ్వరుడు సత్యుఁడు
ముదలనే యీయర్ధము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు
అదే ‘‘సమూహం సర్వభూతేషు’’ అని గీతలలో నున్నది

దేహం మీద వ్యామోహంతో దేహిని జీవుడు పూర్తిగా విస్మరించి, దేహాత్మల తత్త్వాన్ని అర్థంచేసుకోలేక దుఃఖానికి లోనవుతున్నాడు. దేహి (ఆత్మ) నిత్యం దేహం అనిత్యం. ప్రాణి మలినపడిన దుస్తులను విడిచి మరో దుస్తులు ధరించినట్టే దేహి మరో దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఆత్మకు చ్యుతిలేదు. అది అగ్నిలో దహింపజాలదు, నీటిలో నానదు, గాలిలో ఎండదని గీతలో భగవంతుడు బోధించాడు.

వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి
తథాశరీరాణి విహాయ జీర్ణా, న్యన్యాని సంయాతి నవాని దేహీ

నైనం ఛిన్ధన్తి శస్త్రాణి, నైనం దహతి పావకః
న చైనం క్లేదయన్త్యాపో, న శోషయతి మారుతః

దేహి నిత్యుడు, దేహాలనిత్యాలన్న ఈ భావనను ‘దేహంబొకటే దేహియు నొకఁడే, దాహంబెంతటఁ దనియునో తలఁపు’ అంటూ అన్నమయ్య తన కీర్తనలలో ఎంతో సరళంగా పొందుపర్చాడు.

దేహి నిత్యుఁడు దేహము లనిత్యాలు
యీహల నా మనసా యిది మరవకుమీ

గుదిఁ బాతచీర మాని కొత్తచీర గట్టినట్టు
ముదిమేను మాని దేహి మొగిఁగొత్తమేను మోచు
అదనఁ జంపఁగలేవు ఆయుధము లీతనిఁ
గదిసి యగ్నియు నీరు గాలియుఁ జంపగలేవు

యీతఁడు నరకువడఁ డీతఁ డగ్నిఁ గాలఁడు
యీతఁడు నీట మునుఁగఁ డీతఁడు గాలిఁ బోఁడు
చేతనుఁడై సర్వగతుండౌ చెలియించఁ డేమిటను
యీతల ననాది యీతఁడిరువు గదలఁడు

చేరి కానరానివాఁడు చితించరానివాఁడు
భారపువికారాలఁ బాసినవాఁ డీయాత్మ
ఆరయ శ్రీవేంకటేశునాధీన మీతఁడని
సారము తియుటే సత్యం జ్ఞానము

అదే విధంగా,

అహమాత్మా గూడాకేశ, సర్వభూతశయ స్థితః
అహమాదిశ్చ మధ్యం చ, భూతనామన్త ఏవచ

అహం వైశ్వనరో భూత్వా, ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః, పచామ్యన్నం చతుర్విధమ్

ఆదిమధ్యాంతరహితుడైన సర్వప్రాణుల హృదాయంతరాళాలలో తానే అంతరాత్మగా నిగూఢమైయున్నానని గీతాచారుడు తెలిపాడు. జీవరాశులందు జఠాగ్ని, చంద్రుడు, సూర్యుడు, వాయువు, మేథ, అన్నిటా తానే, అంతటా తానైన వేదవేద్యుడను నేనే, వేదాంత కర్తను, వేదాంతార్ధము తానేనని భగవంతుడు గీతలో ఉపదేశించాడు. ఈ ఉపదేశసారానంతటిని తన సంకీర్తనలలో జొప్పించి మనకందించాడు అన్నమయ్య.

అని యానతినిచ్చె గృష్ణుఁడర్జునునితో
విని యాతని భజించే వివేకమా

భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాననే మోచేటిదేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటి దేవుఁడ నేను

దీపనాగ్నినై జీవదేహములయున్నములు
తీపుల నరగించేటి దేవుఁడ నేను
యేపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతుఁ దలఁపుమరపై దేవుఁడ నేను

వేదములన్నిటి చేతా వేదాంవేత్తలచేతా
ఆది నేనరఁగఁదగినయా దేవుఁడను
శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుఁడను భావించ నేను

‘పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం,’ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. జనన, మరణాల మధ్య జరిగే చక్రభ్రమణం జీవితం. ఈ విషయాన్ని గ్రహించి మోక్షపథంవైపు దృష్టిసారించాలని భగవద్గీత మనకు ఉపదేశిస్తోంది.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితు మర్హసి

ఈ గీతాసారాన్ని తన పదాలలో ఎంతో సునిశితంగా అన్నమయ్య తెలియపర్చాడు.

ఇదివో శ్రుతిమూల మెదుటనే ఉన్నది
సదరముగా హరి చాటీ నదివో

యోనసి పుణ్యముసేని యే లోకమెక్కిన
మనికై భూమియందు మగుడఁబొడముటే
పెనిగి ‘యా బ్రహ్మభువనా లోకాః
పునరావృత్తి’ యనెఁ బురుషోత్తముఁడు

తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన
పటుగతితో మోక్షపదము సులభమనే
ఘటన ‘మాముపేత్యతు కౌంతేయ’ మహిని
నటన ‘బునర్జన్మ న విద్యతే’

యిన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవె
పన్నినగతి నిహపరసాధన మదే
మన్నించి యాతఁడే ‘మన్మనా భయ’ యని
అన్నిటా నందరి కానతిచ్చెఁగాన

‘ఆధార నిలయో ధాతా పుఫ్పహాస ప్రజాగరః’, పరమాత్మయందే  సర్వభూతములు ఆధారపడి ఉన్నాయని విష్ణుసహస్రనామస్త్రోతం తెలుపుతోంది. ఇదే విషయాన్ని ’మత్థ్సాని సర్వభూతాని’ అని భగవద్గీత బలపరుస్తోంది. ‘నాంతం న మధ్యం న, పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప’ అంటూ శ్రీకృష్ణుడు అర్జునునికి చూపిన విశ్వరూపాన్ని, ‘అణురేణు పరిపూర్ణమైనరూపా’న్ని, ‘వేదాంత వేత్తలెల్ల వెదికేటి రూపా’న్ని ‘బ్రహ్మాదులకు మూలమైన రూపా’న్ని పరబ్రహ్మమై మననేలిన రూపాన్ని అన్నమయ్య తన సంకీర్తనలలో బంధించి భక్తులకందించాడు.

నీ వొక్కఁడవే సర్వాధారము నిన్నే యెరిగిన నన్నియు నెఱగుట
భావించి యింతయు దెలియఁగ వలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు

నీయందె బ్రహ్మయు రుద్రుడు, నింద్రుడు నీయందె దిక్పాలకులు
నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వఖ్యదేవతలు
నీయందె వురుగులు యక్షరాక్షసులు నీయందె గరుడ గంధర్వులు
నీయందె పితరులు సిద్ధ సాధ్యులు నీయందె ద్వాదశాదిత్యలు

నీవలననె కిన్నెర కింపురుషులు నీ వలననె విద్యాధరులు
నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు
నీవలననె గ్రహములు చంద్రుడును నీవలననె నభోంరిక్షములు
నీవలననె జలధులు పవమానుడు నీవలననె గిరులును భూమియును

నీలోననె నదులును నగ్నియును నీవలననె సచరాచరములును
నీలోననె వేదశాస్త్రము మొదలుగనిఖిలశబ్ధముయము
నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిదె మతము.

ఇలా చెప్పుకుంటూపోతే, అన్నమయ్య భగవద్గీతను ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పృశిస్తూ, ప్రస్తావిస్తూ, పాండవ రక్షణపరుడై, భగవంతుడు పార్థునికుపదేశించిన గీతాసారాన్ని అనేక కీర్తనలలో రంగరించి మనకిందించాడు.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ
పార్ధాయ ప్రతిబోధితాం – భగవతే నారాయణేన స్వయమ్
వ్యాసేన గ్రథితాం – పురాణమునినా మద్యేమహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ
మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *