2020 సమీక్ష

2020 సమీక్ష
2020 సమీక్ష

ప్రపంచంలో ఏ మూల చూసిన ఏ మున్నది చెప్పుకోవడానికి, వైరస్ విలయతాండవం, మరణాలు, మారణ హోమాలు, వరద భీభత్సాలు, అగ్నిజ్వాలల విధ్వంసం, రాజకీయ కుమ్ములాటలు. మరో సంవత్సరం వచ్చినంత తొందరగానే వెళ్లిపోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, కొన్ని చేదు జ్ఞాపకలను మిగులుస్తూ, రేపు మీద ఆశను రేపుతూ నెమ్మదిగా జారుకుంటోంది.

ఈ సంవత్సరం ప్రపంచమంతా విస్తుపోయి చూసిన వార్తలు అంటే ముందుగా చెప్పుకోవల్సింది, ఆస్ట్రేలియాలో నింగికెగిసిన కార్చిచ్చులు. 4లక్షల హెక్టార్ల మేరకు అటవీ ప్రాంతం దావాగ్నికి దహించుకుపోయింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగటతోంపాటు దాదాపు బిలియన్ వన్యప్రాణులు ఈ దావాగ్నిలో సమిధల్లా కాలి బూడిదైయ్యాయి. ఎట్టకేలకు యుకె ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించింది. ఇక యుకె ఐరోపాలోని ఇతర దేశాలతో నేరుగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే వీలు ఈ నిష్క్రమణతో సాధ్యమవుతుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనదైన రీతిలో వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయనపై అధికార దుర్నియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆయనను పదవిలోంచి తప్పించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభిశంసన ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. కాగా, 243 ఏళ్ల అమెరికా చరిత్రలో అభిశంసన ద్వారా ఇంత వరకు ఏ అధ్యక్షుడూ తన పదవి నుంచి తప్పుకోలేదు. అయితే ఈ సంవత్సరాంతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయారు. జో బైడిన్ అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలలో పోస్టల్ ఒట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, తానే అధ్యక్షునిగా ఎన్నికయ్యాయనని ట్రంప్ పదే, పదే చెప్పటంతోపాటు కోర్టులో కేసులు వేసి ఎన్నికల ఫలితాలకు ఆనకట్టలు వేసే ప్రయత్నం చేశారు. చివరికి, దిక్కులేక, పరాజయం అంగీకరించకపోయినా, అధికార మార్పిడికి మాత్రం తలవూపారు.

కరోనా వైరస్ పుణ్యమా అని, ఈ సంవత్సరం జరగవల్సిన ఒలింపిక్ గేమ్స్ తాత్కాలికం వాయిదా పడ్డాయి. వీటితోపాటు అనేక సాలీనా జరిగే క్రీడా కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. వీటిలో ముఖ్యంగా వింబుల్డన్, యుఎస్  టెన్నిస్ పోటీలు, యూరో ఫుట్ బాల్ పోటీలున్నాయి. కరోనా ప్రభావం వల్ల ముడిఆయిల్ ధరలు పాతాళానికి చేరుకున్నాయి. ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం వజ్రోత్సవాన్ని జరుపుకుంది. మరోసారి ప్రపంచ శాంతిభ్రదతలకు, పర్యావరణ సంరక్షణకు, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాలన్ని ఒప్పందం కుదుర్చకున్నాయి.

జాతి వివక్షత మరోసారి తన పడగ విప్పింది. పోలీసు అధికారి బూటుకింద నలిగి ప్రాణాలు కోల్పోతూ జార్జ్ ఫ్లాయిడ్ ‘నాకు ఊపిరి ఆడటలేదు’ అన్న చివరి మాటలు సాంఘిక ప్రసార మాధ్యమాల ద్వారా విశ్వమంతా వ్యాపించి అందరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. 21వ శతాబ్ధంలో కూడా కుల, మత, జాతి వైషమ్యాలు మానవజాతిని, మానవతను కూకటివేళ్లతో పెకలించి మానవ మనుగడకే ప్రశ్నార్ధకంగా నిలిచాయి. మానవతకు పట్టం కట్టలేకపోయినా, టెక్నాలజీ అభివృద్ధిలో మాత్రం మానవజాతి మరో అడుగు ముందుకు వేసింది. అంతరిక్షయానాన్ని ప్రైయివేటీకరణ చేసింది. నాసా కేంద్రం ప్రయివేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారి అంతరిక్షనౌకలో పంపింది.

చివరగా, కరోనా వైరస్ ప్రకృతికి మాత్రం ఔషదంగా పనిచేసింది. పరిశ్రమలు మూతపడటం, రోడ్లపై వాహన రాకపోకల తగ్గింపు వల్ల జల, శబ్ధ, వాయు కాలుష్యాలు తగ్గి పుడమితల్లి కొత్త ఊపిరి పోసుకుంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు నోచుకోని అనేక నగరాలు పురివిప్పిన నెమళ్లలా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాయి.

ఇక భారతదేశానికి వస్తే…..

కరోనా వైరస్: మనదేశాన్నే కాదు యావత్తు ప్రప్రంచాన్ని తన కబంధ హస్తాలలో కోవిడ్-19 బంధించి వేసింది. కరోనా వ్యాప్తి ఎవ్వరికీ ఊపిరి సలపకుండా చేసి, జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. లాక్ డైన్, సామాజిక దూరాల పాటింపుల మధ్య భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి దాటింది. అయితే రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కొంత ఊరట కల్గిస్తోంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ -19 టీకాలు వేయడానికి ప్రభుత్వం యత్నాలు మొదలు పెట్టింది. ఇదిలాఉండగా, యుకె లో బయటపడ్డ కొత్త తరహా కోవిడై వైరస్ మన దేశంలో కూడా అడుగుపెట్టింది. మన దేశంలో కోవిడ్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో విస్త్రృతంగా వ్యాపించింది. కాగా, లక్షద్వీప్ లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

ఇండో-చైనా వివాదం: భారత చైనాల మధ్య లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో వివాదం మరోసారి తలెత్తింది. భారత భూభాగంలోకి చైనా సైన్యం చొచ్చుకొని వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భార‌త్‌, చైనాల మధ్య 3,400 కి.మీ పొడ‌వైన స‌రిహ‌ద్దు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల గుండా ఉంది. దీని వెంబ‌డి చాలా ప్రాంతాల‌పై స‌రిహ‌ద్దు వివాదాలున్నాయి. రెండు దేశాల మ‌ధ్య ఉండే వాస్తవాధీన రేఖ పొడుగున ఇరుదేశాల సైన్యం మధ్య అనేకమార్లు ఘర్షణలకు దిగినా నాలుగు ద‌శాబ్దాల నుంచి ఇక్కడ ఒక్క తూటా కూడా పేల్చలేద‌ని రెండు దేశాలు నొక్కి చెబుతున్నాయి. 1961 నుంచి భార్త, చైనాల మధ్య రెండు యుద్దాలతోపాటు అనేకమారు సైనిక ఘర్షణలు, జరుగుతూనే వస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, నేతల రాకపోకలు జరిగినప్పటికి సరిహద్దుల వద్ద ప్రతిష్ఠంభన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 600 సార్లు నియంత్రణ రేఖ వద్ద చైనా అతిక్రమణలకు పాల్పడింది. ఈ ఏడాది జూన్ లో తాజాగా మరోసారి ఇరుసైన్యాలు గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ త్సో ప్రాంతాలలో ఘర్షణలకు దిగాయి. ఈ కొట్లాటలలో  20 మంది భారతీయ సైనికులు మరణించగా, దాదాపు 43మంది చైనా సైనికలు మృతి చెందటంగాని, గాయపడడంగాని జరిగిందని అనధికార వార్తలు. చైనా, భారత దేశాలు మౌలిక సదుపాయాలను పెంచుకోవడం కోసం సరిహద్దు రేఖకు ఇరువైపులా సాగిస్తున్న రహదారి నిర్మాణాలే ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం. సరిహద్దుల్లో ఉన్న దాదాపు లక్షా 30 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రెండు దేశాలూ మాదంటే మాదని వివాదానికి దిగుతున్నాయి. ఈ వివాదం అనంతరం భారత్లో చైనా వస్తువులపై నిరసన భావం వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం చైనా వస్తువులపై, అనేక టెక్ కంపెనీలపై, దాదాపు 150పై చిలుకు చైనా యాప్ లపై నిషేధాలను విధించింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఇరువైపు సైనికాధికారులు చర్చలకు సంసిద్ధమవుతున్నారు. ఇవి ఎంతవరకు సజావుగా సాగుతాయి, ఈ వివాదం ఎలా పరిష్కారమవు కాలంమే చెప్పాలి.

వివిధ బిల్లుల – వివాదాలు: ఈ సంవత్సరం మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని బిల్లులు దేశవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించాయి. ఇందులో ముఖ్యమైనవి – వ్యవసాయ బిల్లు, గత సంవత్సరం డిసెంబర్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం సవరణ బిల్లు. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా పౌరసత్వ చట్టం సవరణలు అవకాశం కల్పిస్తాయని ప్రభుత్వ వాదన. పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను భారత పౌరులను చేయడం ఈ బిల్లులో అత్యంత ప్రధానమైన అంశం. ఇప్పటివరకున్న పౌరసత్వ చట్టం 1955 ప్రకారం- ‘న్యాచురలైజేషన్’ విధానంతో పౌరసత్వం లభించాలంటే 12 ఏళ్ల వ్యవధిలో చివరి 12 నెలలు మొత్తంగా 11 ఏళ్లు భారత్‌లో నివసించి ఉండాలి. బిల్లులో పేర్కొన్న మతాలు పాటించేవారికి, దేశాలకు చెందినవారికి ఈ 11 ఏళ్ల కాలాన్ని ఆరేళ్లకు కుదిస్తారు. ఈ బిల్లు ఈశాన్య ప్రాంతాలలో త్రీవ అలజడిని రేకెత్తించింది. ముఖ్యంగా అస్సాం ఒప్పందాన్ని ఈ బిల్లు నీరుకారుస్తుందనే అభిప్రాయం, బెంగాలీ హిందువులకు ప్రాబల్యం పెరుగుతుందన్న ఆలోచన, బంగ్లాదేశ్ నుంచి మరింతమంది వలసదారులు ఈశాన్య ప్రాంతాలకు వచ్చి చేరుతారన్న భయాందోళనలు వ్యక్తమయ్యయి. ముఖ్యంగా ఈ బిల్లును ముస్లీంలను దృష్టిలో ఉంచుకొని చేసిన చట్టమని పలు అపోహలు, ఆరోపణల మధ్య ఈ చట్టం జనవరిలో అమలులోకి వచ్చింది. ఇక సంవత్సరాంతంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై కూడా ఆందోళనలు మిన్నుముట్టాయి. ఇవి వరసగా నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020. ఈ బిల్లులపై హరియాణా, పంజాబులలో త్రీవ నిరసన రేకెత్తింది. ఈ బిల్లులు చిన్న, సన్నకారు రైతులకు వ్యతిరేకంగా ఉందన్న వాదన బలంగా విన్పిస్తోంది. మార్కెట్ యార్డ్ గుత్తాధిపత్యం తగ్గించడం, ధర ఉంటే మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడం లేదంటే, ఎక్కడ ధర ఉంటే అక్కడకు తీసుకెళ్లి విక్రయించుకునే వెసులుబాటు ఈ బిల్లు కల్గిస్తుంది. బియ్యం, గోధుమలకే కాక ఇతర పంటలకు కూడా ప్రాముఖ్యం ఈ బిల్లు కల్పించకపోయినా, సవరణలు కొంత వరకు ఉపయోగపడగలవని ఒక వర్గం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చట్టం అమలులోకి వస్తే వినియోగదారుల మార్కెట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లుతుందని మరో వర్గం గట్టి వాదన. ఈ వాద, ప్రతివాదాల మధ్య రైతుల ఆందోళన దేశరాజధానిని కట్టికుదుపుతోంది.

వరద భీభత్సం: ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కురిసిన వర్షలు, వరదలై దేశాన్ని ముంచెత్తాయి. దక్షిణాది రాష్ట్రాలోపాటు మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై నగరం, హైద్రాబాదు, బీహార్, అస్సాం, ఉత్తర ప్రదేశ్ లో 38వేల హెక్టార్ల సాగుభూమి ముంపుకు గురైంది. ఎప్పుడులేని విధంగా మూసీనది హైద్రాబాద్ నగరాన్ని ముంపుకు గురిచేసింది. 1908 తర్వాత ఈ స్థాయిలో నగరం జలదిగ్భంధంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి. 5వేల కోట్లదాకా నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబాయి నగరంలో గత 44 ఏళ్లలో కనీవినీ ఎరగనంత వర్షపాతం నమోదైంది. జనాభా పెరుగుదలకనుగుణంగా ఇళ్ల నిర్మాణం, షాపింగ్ మాల్స్, ఇతర కట్టడాలు, భవనాల నిర్మాణంతో ముంబాయి, బెంగుళూరు, చెన్నై, హైద్రాబాద్ వంటి నగరాలలో వర్షం వస్తే నీరు నిలిచిపోయి నగరాలు నీట మునుగుతున్నాయి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం: దశాబ్దాల వివాదానికి తెరదించుతూ, ఎట్టకేలకు రాముని జన్మస్థానమైన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. స్వాతంత్రం నాటి ముందు వివరాలు ఎలా ఉన్న, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ స్థలం వివాదానికి కేంద్రంగా, మత కలహాలకు మూలంగా తయారైంది. 1992 డిసెంబర్ లో బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం ఈ వివాద స్థలం కోర్టుకేసులో చిక్కుకుంది. ఇటీవల సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి సానుకూలంగా తీర్పు నివ్వటంతో ఒక్కసారిగా ఈ ప్రదేశంలో మళ్లీ హడావుడి మొదలైంది. శ్రీరామజన్మభూమి క్షేత్రటస్టు ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కోర్టు అప్పచెప్పిన 2.77 ఎకరాల స్థలంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమితో కలిపి మొత్తం 67.703 ఎకరాల స్థలంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దాదాపు 130 దేవాలయాలకు వాస్తుశిల్పిగా వ్యవరించిన చంద్రకాంత్ సోంపురా ఈ మందిరానికి రూపకల్పన చేస్తారు.

సౌమ్యశ్రీ రాళ్లభండి