మారని సినిమాలు, ఆలోచనలు - ఒక సద్విమర్శ

మారని సినిమాలు, ఆలోచనలు - ఒక సద్విమర్శ
మారని సినిమాలు, ఆలోచనలు - ఒక సద్విమర్శ

ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు, కొత్త కథలతో సినిమాలు తీస్తున్నారని, సాంకేతిక విలువలతో తెలుగు సినిమాలను భారత చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో నిలుపుతున్నారనే మాటలు తరచుగా వింటున్నాము. భారీ బడ్జెట్ తో సినిమాలు తీయటంతోపాటు ముఖ్యంగా భాషా పరిధులు దాటి సినిమాలను నాలుగైదు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తూ, హీరోలు తమ మార్కెట్టును పెంచుకుంటున్నారు. ఓటిటిలలో విడుదల చేస్తూ, అధిక సంఖ్యలో ప్రేక్షకులకు చేరువవుతున్నారు. అయితే ఈ సినిమాల్లో నిజంగా సరుకెంతుంది అని ఆలోచిస్తే, మన మెదడుని ఖర్చుపెట్టాల్సిన పనిలేదనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు ఒక సందేహం కలుగుతుంటుంది. ప్రేక్షకుల అభిరుచి దిగజారిందా లేక నేను తెలుగు సినిమాల నుంచి కొంచెం ఎక్కువ ఆశిస్తున్నానా? ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్నలను, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రెండు, మూడు సినిమాల గురించి, ముఖ్యంగా ఈ మూడు సినిమాల్లోనూ కథానాయికల పాత్రలను మలచిన తీరు, కథాంశాలను ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఈ సినిమాలు ఎందుకు అంత ప్రేక్షకాదరణ పొందాయి? నిజంగా దర్శకులు కొంత పుంతలు తొక్కారా లేక ప్రేక్షకులు అలాంటి భ్రమలో బతికేస్తున్నారా?

పుష్ప- ది రైజ్: అల్లు అర్జున్ మార్కెట్టును, క్రేజ్ ని మరింత పెంచిన చిత్రం. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సినిమాకు డబ్బే ప్రధానమైతే, ఈ సినిమా తప్పకుండా గొప్ప సినిమా. సినిమాకు మరే ఇతర ప్రయోజనమేదైనా ఉంటే, ఈ సినిమా అంత చెత్త సినిమా మరొకటి లేదని చెప్పొచ్చు. ఈ సినిమా కథను పరికిస్తే, చెప్పుకొవడానికి ఏమీ లేదు. ఒక కూలీ, స్మగ్లర్ గా ఎలా మారాడు. ఆ మారడంలో కూడా ఎటువంటి భావోద్వేగాలు, డ్రామాలు లేవు. ఊళ్లోవాళ్లంతా వెర్రి వెధవలైతే మన తెలివితేటలకి లోటేంటన్నట్టు. హీరోకి హీరోయిజం ఆపాదించాలని దర్శకుడు అనుకున్నాక, వెర్రి ప్రేక్షకులు ఏ చెత్తైనా చూడటానికి సిద్ధపడ్డాక ఇక తగ్గేదేలే! గంధం చెక్కల స్మగ్లర్ అనగానే వీరప్పన్ గుర్తుకొచ్చి ఇదేదో మొదలియార్ జీవితాన్ని తెరకెక్కించిన మణిరత్నం చిత్రం నాయకన్ లాగా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. అలాగని హిందీ సినిమా దీవార్ తో పొల్చుకుంటే అంతకంటే తప్పిందం ఇంకొకటి లేదు. మరి పుష్ప ఎందుకు ఈ రేంజీలో హిట్ట అయ్యింది? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. పైగా ఈ సినిమాకు రెండో భాగం కూడా తీస్తున్నారు. బాహుబలి తర్వాత రెండో భాగం తీయడం పరిశ్రమలో ఒక ఆనవాయితీగా మారుతోందేమో. పుష్ప రెండో భాగం గురించి తర్వాత ఆలోచిద్దాం. మొదటి భాగమే నిడివే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఇక రెండో భాగాన్ని ఏ కట్టప్ప రక్షిస్తాడో చూడాలి. ఇందులో రెండు, మూడు అంశాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇవి మహిళ పట్ల సమాజంలో దిగజారుతున్న విలువలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మొదటిది, సమంత ఐటమ్ సాంగ్. ఒకప్పుడు ఇలాంటి సాంగ్స్ చేయడానికి జయమాలిని, జ్యోతిచిత్ర, సిల్క్ స్మిత ఇలా కొందరు నాట్యగత్తెలుండేవారు. వీరిపై చిత్రీకరించే పాటలకు కూడా ఒక ఉద్దేశ్యం ఉండేది. ఉదాహరణకు, ముత్యాల ముగ్గు సినిమాలో ‘ఎంతటి రసికుడవో తెలుసునా’ అనే పాటను హలం మీద చిత్రీకరించారు. ఈ పాట రసికతను చాటుతుంది గానీ, జుగుప్స కల్గించదు. ఒకరకంగా అది ఐటమ్ సాంగే అని చెప్పాలి. అక్కడి నుంచి ‘నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్లు సింగారంగాను’ లాంటి పాటలు వచ్చాయి. అయితే పుష్ప పాటలో కొన్ని స్టెప్స్ ముఖ్యంగా అల్లు అర్జన్ తొడపై సమంత కూర్చొనే స్టెప్ గురించి ఇంటర్వ్యూలలో గొప్పగా చెప్పడం ఆలోచించాల్సిన విషయం. దుర్యోధనుడు, ద్రౌపదిని తొడ చూపి కూర్చోమన్నందుకు ఒక కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. కానీ నేటి సమాజంలో ఇది తప్పుకాకపోవడం శోచనీయం. సమంత లాంటి ఒక అగ్రనటి కేవలం డబ్బు కోసం ఇలాంటి సాంగ్ చేయటం హీనకరం. సిల్క్ స్మిత, డిస్కోశాంతి నృత్యాలలో కూడా మనం ఇంత దిగజారుడుతనం చూడం. ఇలాంటి స్టెప్స్ పై ప్రేక్షకులకు అభ్యంతరం లేకపోవటం అంతకంటే దురదృష్టకరం. మరో అంశం, కథానాయిక చేత పలికించిన ఒక డైలాగ్. తండ్రిని విడిపించుకోవడానికి తన శరీరాన్ని అర్పించాల్సి వచ్చిన సందర్భంలో హీరోయిన్, హీరో వద్దకు వెళ్లి, ఒక్క రాత్రి నీతో గడిపాక ఇంకెవరితో గడిపినా పర్వాలేదని చెప్పటం. ఇది ప్రేమకు నిర్వచనమని దర్శకుడు సుకుమార్ అనుకుంటే అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించటం తప్ప చేయగలిగేది లేదు. ఇంతకంటే స్త్రీలని అగౌరవపర్చే అంశం ఇంకొకటి ఉండదు. ఈ ఒక్క సీన్ చాలు స్త్రీ అంటే కేవలం శయనేషు రంభ అని మన దర్శకులు, హీరోలు, ప్రేక్షకులు భావిస్తున్నారని చెప్పటానికి. ఈ దృశ్యం ఎలా ఉందంటే, ఎర్ర బస్సులో సీటుపై కండువా వేసి నేను రిజర్వ చేసుకున్న సీటులో నువ్వు ఎవరివి కూర్చోడానికి అని అడిగినట్టుంది. ఇక్కడ ఎర్ర బస్సు ఎవరో చెప్పక్కర్లేదు. దీంతో హీరోగారికి మరోసారి తన హీరోయిజాన్ని, సోకాల్డ్ మగతనాన్ని చూపించుకునే అవకాశం దొరికింది. వందరూపాయలిస్తే నవ్వడానికి, ఐదువేలిస్తే ముద్దు పెట్టడానికి అమ్మాయిలు సిద్దపడిపోతారా? హీరో సిద్ధార్ధ మీద ధ్వజమెత్తిన మహిళా సంఘాలెక్కడున్నాయి, మాట్లాడవే? దయ చేసి ఆలోచించండి, ఒక అమ్మాయి ఒక లోఫర్ని, స్మగ్లర్ని, క్రిమినల్ని, హంతకుడిని ప్రేమిస్తుందా? నేటి ఆడపిల్లలు తాము ఇలాంటి వారిని కోరుకుంటున్నారా? రక్తంతో తడిసిన చేతులతో, పసుపు బట్టలకు బదులు రక్తం ఓడుతున్న మధుపర్కాలను ధరించి పీటల మీద కూర్చొన్న ఏ పెళ్లికొడుకుతో ఒక మగువ తాళి కట్టించుకుంటుంది? సినిమా తీసేవారికి, చూసేవారికి ఆ మాత్రం విక్షణ కూడా ఉండదా, ఇలాంటి సినిమాలను ఆదరించడానికి? నలుగురు గూండాలను చంపిన వాడూ మరింత పెద్ద గూండా అవుతాడేమో గాని హీరో మాత్రం కాడు. ఇంత చిన్న లాజిక్ మన ప్రేక్షకులకి ఎందుకు అర్ధం కాదు. పుష్ప అంటే ఫ్లవరే … అది దర్శకుడు ప్రేక్షకుల చెవిలో పెట్టాడు.

శ్యామ్ సింగరాయ్: నాని సినిమాలంటే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కుటుంబమంతా కూర్చుని కాలక్షేపం చేసేవిగా ఉంటాయి. ఇక సాయిపల్లవితో కాంబినేషన్, దేవదాసీల ఇతివృత్తం అనేగానే సహజంగానే అంచనాలు పెరిగాయి. ‘మాతంగకన్యాం మనసా స్మరామి’ అని కాళిదాసు కీర్తించిన మాతంగికి, ఆ తర్వాత కాలక్రమేణా మార్పులు చెందుతూ ఒక సాంఘిక దురాచారంగా మారిన దేవదాసి వ్యవస్థకి ఎంతో వ్యత్యాసం ఉంది. స్వాతంత్య్రానికి ముందే దేవదాసీ వ్యవస్థను నిర్మూలిస్తూ చట్టాలు ఏర్పడ్డాయి. హిందూ వారసత్వ చట్టం 1956 జోగిని, దేవదాసీలకు తండ్రి ఆస్తిపై సమాన హక్కు కల్పించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1988లో దేవదాసీ వ్యవస్థను నిర్మూలిస్తూ చట్టాన్ని తెచ్చింది. సమాజంలో పాతుకుపోయిన ఈ దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ప్రేమ చిత్రం మలిచేటప్పుడు దర్శకుడిపై బాధ్యత ఎక్కువవుతుంది. ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఇందులో విఫలమయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మొదటి భాగమంతా సాగతీత, కథ ఎటుపోతోందో తెలియని గందరగోళం. సాయిపల్లవి క్యారెక్టర్ వచ్చాక ఏమైనా కథ ఉందా అంటే ఏమీలేదు. పోనీ దేవదాసీ వ్యవస్థను లోతుగా చూపించి, పరిశీలించారా అంటే అదీ లేదు. శ్యామ్ సింగరాయ్ ని రాజారామోహన్ రాయ్ అంత గొప్ప సంఘసంస్కర్తగా చూపించడానికి చూపిన రెండు, మూడు సీన్లు పేలవంగా ఉన్నాయి. ఇంతకి శ్యామ్ గారు చేసిన దేంటి? దేవాలయంలో నాట్యం చేస్తున్న ఒక అమ్మాయిని చూడటం, ప్రేమించటం, లేపుకుపోవటం. ఈ ప్రయత్నంలో ఒక దురాహంకారైన మహంతని కొట్టి చంపటం. మన సంఘసంస్కర్తలు ఎవరూ ఇలాంటి పనులు చేయలేదు, నాకు తెలిసి. ఇది సరిపోనట్టు పునర్జన్మ ఒకటి. వినోదం తప్పితే సినిమాకు మరో ప్రయోజనం లేదనుకున్నప్పుడు దేవదాసీ లాంటి ఇతివృత్తాన్ని ఎత్తుకోకూడదు. ఇందులో సాయిపల్లవి పోషించిన మైత్రి పాత్ర, ఒక ముక్కుమొకం తెలియని వ్యక్తి నీకోసం చూస్తుంటాను రా అని పిలిస్తే గుడి దాటి వస్తుందా? ఎందుకంటే, ఈ సినిమా నేటి సమాజాన్ని చూపలేదు. 1969 పశ్చిమ బెంగాల్ సామాజిక వ్యవస్థ ఈ చిత్రానికి ఆలంబన. అటు తిప్పి, ఇటు తప్పి ఏ వ్యవస్థ అయినా హీరో పిలిస్తే హీరోయిన్ లగెత్తుకుంటూ వచ్చేయటమేనా కొత్తదనం అంటే. 1971లో ఇదే దేవదాసీ వ్యవస్థ ఇతివృత్తంగా వి. మధుసూదన్ రావుగారు కళ్యాణ మంటపం అనే సినిమా తీసారు. ఇందులో కథానాయిక తల్లి దేవదాసీ. కానీ తన కుమార్తె ఈ సాంప్రదాయానికి తనలాగా బలికాకూడదని కాలేజీకి పంపి చదివిస్తుంది. చివరికి మారని సామాజిక పరిస్థితులను ప్రశ్నించి కథానాయిక చనిపోతుందే కానీ, దేవదాసీ వ్యవస్థలో భాగస్వామి కాదు. కనీసం ఈ సినిమా ఈ సమస్యకు ఒక సమాధానాన్ని చూపలేకపోయినా, సమాజంలో మనుష్యుల ఆలోచనా తీరుని, ద్వంద్వ నీతిని చూపటంలో సఫలమయింది. కానీ, శ్యామ్ సింగ్ రాయ్ ఏం చేసింది? గుడి బ్యాక్ డ్రాప్ లో సాయిపల్లవికి నాట్యంలో ఉన్న ప్రావీణ్యాన్ని, తన స్టార్ ప్రెంజన్స్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించిందే తప్ప సమస్యని కూలంకుషంగా చర్చించలేదు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మిగారు కూడా దేవదాసీ కుటుంబం నుండి వచ్చారని చెప్పటంతో సరిపెట్టకుండా, మైత్రి పాత్ర ద్వారా మారుతున్న కాలాన్ని, మారాల్సిన అవసరాన్ని చూపినా చిత్రానికి ఒక అర్ధముండేంది. ఇప్పటికీ మన సమాజంలో అక్కడక్కడ కన్పించే ఈ వ్యవస్థ రూపుమాపాలంటే దీనిని గురించిన అవగాహన ప్రజలలో, ప్రేక్షకులలో కల్గించాలే తప్ప, తొమ్మిది రాత్రుల్లో దేవదాసీని పడేయటం ఎలా అన్నట్ట కాస్ట్లీగా ప్రణావలయ పాటను చిత్రీకరించటం కాదు. ఈ సినిమాలో సబ్జెక్ట్ దేవదాసీ గురించి కాదు కేవలం కథానాయిక పాత్ర కోసం తీసుకున్నదే అని దర్శకుడు చెప్పటం, సమాజం పట్ల నాకెటువంటి బాధ్యతా లేదని చెప్పటమే. ఒక దురాచారాన్ని సినిమా వంటి మాధ్యమంలో ప్రస్తావించేటప్పుడు దాని పట్ల కొంచెమైనా బాధ్యత కలిగి ఉండాలి. సాయిపల్లవి చేత సాంప్రదాయ నృత్యం చేయించదలుచుకుంటే, శంకరాభరణంలో మంజుభార్గవి పాత్రలాగా లేక ఆనందభైరవిలో కథానాయిక పాత్రలా కూడా మల్చవచ్చు. అంతేగాని దేవదాసీ అంటూ పెద్దమాటలెందుకు? ఎందుకంటే ప్రేక్షకులు మైత్రి పాత్రను దేవదాసీగానే చూస్తారు. సినిమా హీరో చుట్టూ తిరగాలి కనుక, శ్యామ్ సింగరాయ్ మరణం తర్వాత మైత్రి పాత్రను పొడిగించలేదు. భర్త ఒళ్లోనే భార్యకు మోక్షమని చెప్పడానికన్నట్టు, హీరోగారు జన్మజన్మాంతరాలలో కూడా తన మాట నిలుపుకుంటాడన్నట్టు పునర్జన్మ అనే వృత్తాంతాన్ని ఇరికించారు. కనీసం నాలుగైదు సీన్లయినా దేవదాసీలుగా మారే మహిళల మానసిక ఆందోళనను, వ్యవస్థలో ఉంటే కఠిన నియమాలు, దురాచారాలకు కేటాయించి ఉండే ఈ వ్యవస్థను గురించి, అందులోని లోపాల గురించి ఈ నాటి ప్రేక్షకుడికి ఒక అవగాహన కలిగేది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 80వేల మంది జోగినులున్నారని అంచనా. జోగినీ నిషేధ చట్ట అమలులోకి వచ్చి దాదాపు 30ఏళ్లు అవుతున్నా ఇంకా ఇంతమంది ఈ వ్యవస్థలో మగ్గిపోతున్నారంటే మన సమాజం సిగ్గుపడాలి. ఇలాంటి సినిమాలు, దర్శకులు కేవలం హీరోయిన్ నాట్య ప్రతిభను వాడుకోవడానికి ఇటువంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నాం అని చెప్పడానికి మరింత సిగ్గుపడాలి. సమాజంలోని దురాచారాలని వినోదం పేరిట కీర్తించటం (Glorify) సబబుకాదు.

లవ్ స్టోరీ: ఫీల్ గుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో సినిమా ఇది. శేఖర్ సినిమాల్లో కథానాయికలు ఆత్మాభిమానం, ఆత్మ నిర్భరత గలిగిన వారిగా ఉంటారు. ఇందులో కథానాయిక కూడా అందుకు విరుద్ధం కాదు. కాకపోతే, ఇందులో కథానాయిక బాల్యం నుంచి తన బాబాయి చేతిలో లైంగిక వేధింపులకు గురైన పాత్ర. మళ్లీ అదే ఆడపిల్ల అత్యాచారానికి గురవడం హీరో వచ్చి కాపాడటం కథ. ఇంకో కొసమెరుపు కథానాయకుడు తక్కువ కులానికి చెందినవాడు కావటం. వీరి మధ్య ప్రేమాయణమే -లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు వచ్చాయా అంటే, వచ్చాయి. ఇక మీదట వస్తాయా? తప్పకుండా వస్తాయి. సాయిపల్లవి నాట్య ప్రతిభను శేఖర్ కమ్ముల కూడా క్యాష్ చేసుకున్నాడు. ఇంతవరకు శేఖర్ కమ్ముల సినిమాల్లో నాయికా, నాయకులుగా వేసిన వారంతా పెద్దగా స్టార్ డమ్ లేనివారనే చెప్పచ్చు. అందువల్ల కథనం విషయంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి అక్కినేని నాగచైతన్య హీరో. మరి అక్కినేని స్టార్ డమ్ నిలబెట్టాలి కదా! అందుకు దర్శకుడు తాపత్రయపడ్డాడనే చెప్పాలి. బాబాయి, పెద్దనాన్న, మామయ్య, బావ ఇలా బంధువులలో వాళ్లే బాలికలపై అత్యాచారం చేయటమనేది మన సమాజంలో వినిపిస్తున్న దురదృష్టకరమైన విషయం. ఇంతటి సున్నితమైన సబ్జెక్ట్ ను ఎత్తుకున్నాక దానిని తెరపైకి పూర్తిగా రానీయకుండా, కులాంతర వివాహానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం సినిమాను అటువైపే నడిపించటం శోచనీయం. ఎందుకంటే ఇదివరకే ఇలాంటి సినిమాలు అనేకం వచ్చాయి. ఇందులో దర్శకుడు కొత్తగా చెప్పినదేమీ లేదు. కులం విషయాన్ని పక్కకు పెట్టి, పూర్తిగా పిల్లలపై లైంగిక దాడులు, వారు పడే మానసిక వేదనను మరింత లోతుగా పరిశీలించి ఉంటే బావుండేది. అలా చేస్తే, హీరోయిజానికి పెద్ద పీట వేయలేరు. అందుకనే కాబోలు కుల ప్రస్తావన తీసుకొచ్చారు. హింస, కొట్టుకోవడాలు లాంటి అంశాలు లేకుండా హీరోయిజం రాబట్టలేరనుకున్నారేమో, క్లైమాక్స్ లో చిన్న ఫైట్. కులాంతర వివాహాలకి, సప్తపది సినిమాలో కళాతపస్వి విశ్వనాథ్ చూపించిన మార్గం కంటే మరో మంచి మార్గం ఎవరూ చూపించ లేరేమో. కులం, మతం, ధనంవంతులు. పేదవారు వారి మధ్య ప్రేమ ఈ కథలన్నింటికి ఇంచుమించు ఒకే ముగింపు. సమాజంలో ప్రబలుతున్నఒక రుగ్మత గురించి ప్రస్తావించినపుడు దానికి పూర్తి న్యాయం చేకూర్చకుండా కులాన్ని పట్టుకొని ప్రాకులాడటం శేఖర్ కమ్ముల నుంచి ఆశించం. అలాగని ఈ విషయం గురించి బహిరంగంగా చర్చిస్తే, ఆదరించే పరిపక్వత ఇంకా తెలుగు ప్రేక్షకులకి వచ్చిందని ఖచ్ఛితంగా చెప్పనూలేం. అందుకే శేఖర్ కమ్ముల చూచాయగా ఈ విషయాన్ని స్పృశించి వదిలేసి ఉండవచ్చు. అలాగని క్లైమాక్స్ లో బాబాయి పాత్రను కొట్టి చంపడం వల్ల ఏం ప్రయోజనం? కథానాయిక పడ్డ ఆవేదన చావుతో పరిసమాప్తమా? ఇలాంటి వేధింపులకు గురైన మహిళలు అనుభవించే మానసిక క్షోభ, కుటుంబ సభ్యులలో రావాల్సిన మార్పు ఇదేమీ స్పష్టంగా చెప్పకుండా, కనీసం ప్రేక్షకుల ఆలోచనా సరళిని మార్చే ప్రయత్నంగానీ జరగలేదు. సినిమాకు ముందు సారంగ దరియా పాట మీద జరిగిన రచ్చలో సగ భాగమైనా ఈ సమస్య పట్ల చర్చ జరిగివుంటే బావుండేది. కానీ లవ్ స్టోరీ అంటే సారంగ దరియా పాట మాత్రమే!

కమర్షియల్ సినిమా దర్శకులకు సక్సస్ ప్రధానం అందుకే కొత్త ఆలోచనలు లేకుండా అదే పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసి నానుస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా, ఇంకా మనం అదే కులం, మతం అంటు ప్రాకులాడుతుంటే, స్వాత్రంత్యం ఎక్కడ నుంచి వస్తుంది? ఎప్పటికి వస్తుంది? భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడే మనకి వెలుగు రేఖలు ఎక్కడ కన్పిస్తాయి. సినిమా సక్సెస్ కు కొలమానం అది రాబట్టే కలక్షన్లు అయితే, ఇక ఇలాంటి ఊకదంపుడు సినిమాలే వస్తాయి గానీ, సమాజానికి అద్దం పట్టే సినిమాలు ఎక్కడ నుంచి వస్తాయి. ఒక పాట బావుంటే సినిమా హిట్. ఒక ఐటమ్ సాంగ్ బావుంటే సినిమా హిట్. ఒక పంచ్ డైలాగ్ ఉంటే సినిమా హిట్. అదే మూడు ఫైట్లు, ఆరు క్యాచీ పాటలుంటే చాలు సినిమా హిట్. ప్రేక్షకుడు ఏ సినిమా ఎందుకు చూస్తున్నాడో కూడా తెలియని ఈ పరిస్థితుల్లో కొత్త ధోరణులకు, కొత్త ఆలోచనలకు తావు లేదు.

సౌమ్యశ్రీ రాళ్లభండి