

తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండగలలో సంక్రాంతి ఒకటి. పుడిమి తల్లి పచ్చగా, పైరులు నిండుగా, ఇంటి నిండా ధాన్యం మెండుగా ఉండే ఈ సమయంలో కొత్త అల్లుళ్లు అత్త, మామల ఇళ్లకి రావటంతో సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చింది తుమ్మెద అంటూ సందడిగా సంబారాలు జరుపుకుంటారు.
సంక్రాంతి లేదా సంక్రమణం. సూర్యుడు ధనుస్సురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే సమయం. సంక్రాంతి నుండి దక్షిణాయనం పూర్తయి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి ప్రముఖంగా రైతుల పండుగగా మన తెలుగునాట ప్రసిద్ధి చెంది, పెద్దపండుగ అని పిలవబడే సంక్రాంతికి సంబంధించి ఒక పురాణగాథ కూడా లేకపోలేదు. వామనావతారమెత్తి బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు పాతాళానికి పంపించివేశాడాన్న ఆగ్రహంతో బలి సూర్యుని సంవత్సరంలో ఆరుమాసాలు బంధించి ఉంచుతాడని, బలి చక్రవర్తి నుంచి విముక్తుడై వచ్చిన సూర్యుని ఆగమనాన్ని వేడుకగా సంక్రాంతి పండుగ రూపంలో జరుపుకుంటారని కథనం. అలాగే, అజ్ఞానంతో చేసిన తప్పును మన్నించమని బలి చక్రవర్తి కోరగా, విష్ణుమూర్తి సంవత్సరంలో మూడు రోజులు భూమి మీద తిరిగి నాలుగో రోజు పాతాళానికి వెళ్లమని చెపుతాడు. సంక్రాంతి మూడు రోజులు బలి ఈ భూప్రపంచాన్ని ఏలుతాడని మరో కథనం.
సంక్రాంతి నుండి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్న నమ్మకంతో పితృదేవతలకు తర్పణాలు వదులుతుంటారు. నువ్వులు, బెల్లము, గుమ్మడికాయ వంటి పదార్థాలను దానాలుగా ఇస్తారు.
రైతులు ఇంటికి కొత్తగా వచ్చిన బియ్యం, కాయగూరలు, పాలు పోసి పులగాన్ని వండి ధాన్యలక్ష్మికి నైవేద్యం పెడతారు. సంక్రాంతి రోజు దేవాలయాలలో పొంగలి నైవేద్యంగా పెట్టి, ప్రసాదాలుగా పంచటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. పొంగలిలో వేసిన నెయ్యి శీతాకాలం వల్ల వచ్చే వాత దోషాలను నివారిస్తుంది అని ఆయుర్వేదం మనకు చెప్పే మాట. అలాగే సంక్రాంతినాడు తప్పక చేసే మరో పదార్థం అరిశెలు. నువ్వులు, బెల్లం వేసి చేసే ఈ అరిశెలలో శరీరానికి కావాల్సిన ఐరన్, జింక్, క్యాల్షియం వంటి విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మన పూర్వీకులు ఆచారాల పేరుతో ఆరోగ్యాన్ని పరిరక్షించే అనేక అంశాలను మన జీవనంలో ఒక భాగంగా చేశారు.
గొబ్బిళ్లు: సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి గొబ్బిళ్లు. ‘గొబ్బి’ అంటే అర్ధం ‘నమస్కారం.’ ‘గోపి’ అనే పదం నుంచి గొబ్బిళ్లు అనే పదం పుట్టిందని కూడా పెద్దలు చెపుతుంటారు. తెలుగునాట ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఒకటి కృష్ణునికి, రెండోవది గోమాతకు, మూడొవది గోవర్ధనగిరికి సంకేతాలుగా – ఆవుపేడతో చేసిన మూడు గొబ్బిళ్లను ఇంటి ముంగిట ముగ్గులలో ఉంచి, పసుపు, కుంకుమ, బంతి, చేమంతి, గుమ్మడి వంటి రకరకాల పూలతో అలంకరించి పూజిస్తారు. బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడి నట్టే, గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ,
సుబ్బి గొబ్బమ్మా సుబ్బణ్ణివ్వరే,
చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వరే,
తామరపూవ్వంటి తమ్ముణ్ణివ్వరే,
మొగలిపూవ్వంటి మొగుణ్ణివ్వరే
గుమ్మడి పువ్వంటి కొడుకుణ్ణివ్వరే
అంటూ పాటలు పాడటం, నృత్యాలు చేయటం మన తెలుగునాట ఆనవాయితీ. కృష్ణుని కొలుస్తూ, ‘గోపియలో’ అంటూ గోపికలు చేసే నాటి నృత్యాలే కాలక్రమేణా నేటి గొబ్బి నృత్యాలుగా ప్రాచుర్యం చెందాయి. అందుకే అన్నమయ్య కూడా ఆ యదుకుల స్వామిని కొనియాడుతూ, ‘కొలనుదోపరికి గొబ్బిళ్లో, యదుకులస్వామికి గొబ్బిళ్లో’ అంటూ గొబ్బిపాటలతో స్వామివారి కీర్తించి, స్మరించి నమస్కారాలు సమర్పించాడు.
ధనుర్మాస ప్రారంభం నుంచి మకరసంక్రమణ వరకు నెలరోజులపాటు పెట్టిన గోబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి పండుగ రోజు భోగిమంటలో వేసి యజ్ఞ పురుషునికి సమర్పిస్తారు. ఉత్తరాదిన ఈ పండుగను ‘లోడి’ అని పిలుస్తారు.
ముగ్గులు: ఇక సంక్రాంతి అనగానే తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది, తెలుగు లోగిళ్లకు వన్నె తెచ్చేవి, ముత్యాల ముగ్గులు, రత్నాల రంగవల్లులు. ఇంటి ఆవరణలో ప్రతిరోజు కన్పించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంటుంది. ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెపుతుంటాయి. ధనుర్మాసంలో గుచ్ఛ బంధం ముగ్గును, దానికి ఇరువైపులా పాములను వేస్తారు. గుచ్ఛబంధం సూర్యుని రథచక్రాన్ని సూచిస్తుంది. సర్పాలు సూర్యునితోపాటు సంచరించే గణాలు మహాపద్ముడు, కర్కోటకుడుకి సంకేతాలు. ఇవి కాక, రథం ముగ్గు, నాగబంధం, గుమ్మడిపండ్లు, చేపలు, కలువలు, పద్మాలు, తులసికోటలు, చెరుకు గడల రూపాల్లో ప్రత్యేకమైన ముగ్గులు వేసి, మనలోని సత్త్వ, రజ, స్తమోగుణాలకు ప్రతీకలుగా వాటిని తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో తీర్చిదిద్దుతారు. పూర్వం ముగ్గులను బియ్యపు పిండితో పెట్టేవారు. ఆ పిండి నేలమీద తిరిగే అనేక క్రిమి, కీటకాదులకు ఆహారంగా కూడా ఉపయోగపడేది. అదీకాక, తెల్లవారుజామున లేచి ఇంటిముంగిట ముగ్గులు వేస్తే, పొద్దస్తమాను వంటింటికే పరిమితమయ్యే మహిళలకు తగిన సూర్యరశ్మి అంటే డి విటమిన్ లభించడానికి మన పూర్వీకులు ఈ ఏర్పటును చేసుంటారన్నది శాస్త్రీయ దృక్పథం.
బొమ్మల కొలువు: తెలుగునాట అనాది వస్తున్న మరో ఆనవాయితీ బొమ్మలకొలువులు పెట్టడం. అలాగే, ప్రతీ సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా సంక్రమణ సమయంలో భూలోకానికి వస్తాడని నమ్మకం. ఆ సంక్రాంతి పురుషుడినే సంకురమయ్య అని కూడా పిలుస్తుంటారు. మనమంతా ఆ కాలపురుషుని చేతిలో బొమ్మలమనే సందేశాన్ని ఇవ్వడానికి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారని పెద్దలు చెపుతారు. అందుకే కొన్ని ప్రాంతాలలో మట్టితో సంకురమయ్యనే బొమ్మను చేసి పూజిస్తారు కూడా.
బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ముందు పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేయటంతోపాటు, పసుపు సంకురమయ్యను చేసి బొమ్మలతోపాటు కొలువు తీరుస్తారు. బొమ్మలను బల్లలతో మెట్లగా చేసి వాటి మీద పేరుస్తారు. ఈ మెట్లు ఎప్పుడు బేసి సంఖ్యలో అంటే 3,5,7 ఉండేలా చూసుకోవాలి. ఈ బొమ్మల కొలువులో దేవతామూర్తుల బొమ్మలే ఎక్కువగా పెడుతుంటారు. వీటిలో ముఖ్యంగా శివపార్వతులు, వారి పరివారం తప్పనిసరి. ఇవికాక, కొండపల్లి బొమ్మలు, జంతువుల, పక్షుల బొమ్మలు, పంచాంగ బ్రాహ్మణుడు, పెద్ద ముత్తయిదువ, ఆవు, దూడ, పల్లె జీవనాన్ని ఇనుమడింప చేసే బొమ్మలు, గోపురం ఇలా తమ శక్తి కొలది పండుగ వాతావరణాన్ని పెంచే అనేక బొమ్మలు కొలువుతీరుతాయి. ఈ బొమ్మలకి హారతి, నైవేద్యాలివ్వటం, రాత్రిపూట ఒక బొమ్మను పడుకోబెట్టి, మళ్లీ ఉదయమే నిద్రలేపడం వంటి సాంప్రదాయాలను కూడా చాలామంది పాటిస్తుంటారు. అలాగే, భోగినాడు పెట్టిన బొమ్మల కొలువుని కనుమనాడు ఎత్తివేస్తారు.
ఈ బొమ్మల కొలువు, సంక్రాంతి వైశిష్ట్యాన్ని గురించి పింగళి-కాటూరి కవులు తొలకరి అనే ఖండకావ్యంలో ఇలా వివరించారు.
వచ్చునీదారి బలిచక్రవర్తి నేడు
వరముల నొసంగ మీకు నవ్వారిగాగ
రండు మా యింటి కీరు పేరంటమునకు
బొమ్మలెత్తును మా పిల్ల యమ్మలారా
ముద్దచేమంతిపూలు ముడిచినట్టి
జడలతోఁ గ్రొత్త వల్లెతో నడుగులఁబడి
చిందులంద్రొక్కు పరికిణీ చెలువుతోడఁ
గాళ్ల పారాణి, కాటుక గన్నుగనను
దిద్దకొని మురిపెమ్మును ముద్దుఁదొలక
నగుమొగమ్మలతోడ కన్యకలు నీకు
నర్చలొసగఁగ నిలచి రీవరుగునపుడు
వచ్చిపోవమ్మ మాయింటిపజ్జ కీవు
పరమకళ్యాణి మాతల్లి పౌష్యలక్ష్మి
ఆచార, సాంప్రదాయాల మాట ఎలా ఉన్నా, సంక్రాంతిని కేవలం తెలుగు నాటే కాకుండా, తమిళనాడులో పొంగల్ అని, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లలో సంక్రాంత్ లేదా సక్రాత్ అని, పంజాబ్ లో మాఘి, అస్సాంలో మాఘి బిహూ, హిమాచల్ ప్రదేశ్ లో మాఘాసాజీ, ఉత్తర ప్రదేశ్ లో కిచేరి, ఒడిస్సాలో మకర చౌలా, పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి, కర్ణాటకలో సుగ్గీ లేదా పంటల పండుగ అంటూ ఇలా దేశమంతటా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు.
తేటగీతి