డైట్ తో డేటింగ్

డైట్ తో డేటింగ్
డైట్ తో డేటింగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1.9బిలియన్ జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ శత విధాల ప్రయత్నిస్తుంటారు. మనిషికో జిహ్వ, పుర్రెకో బుద్ధి అన్నట్టుగా, ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా, మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సైజ్ జీరోపై మోజో, నిజంగానే తమ శరీరాలపై శ్రద్ధో, లేక వ్యామోహమో చెప్పటం కష్టంగాని, శరీరాన్ని శుష్కించుకునే అనేక ఆహార పద్దతులను అవలంబించి, తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవటం మాట అటుంచి, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. స్థూలకాయం సమస్యే. కానీ దాన్ని తగ్గించుకోవడానికి అనారోగ్యం పాలవ్వక్కర్లేదు. కొంచెం ఒళ్లు వస్తే చాలు, ఆ పక్కింటి వెంకాయమ్మ, ఈ పొరింగింటి పుల్లాయమ్మ చెప్పే ఉచిత సలహాలను పాటించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లూ లేకపోలేదు. యువత కూడా శారీరిక ధారుడ్యాన్ని పెంచుకోవడానికి, సన్నగా, నాజూకుగా కన్పించడానికి మార్కెట్లో ఉన్న పలు డైట్ల ను పాటిస్తున్నారు. ఏ మనిషికైనా కావల్సింది సమతూల్య ఆహారం. దాని విషయానికి తర్వాత వద్దాం. ముందు అసలు మార్కెట్లో ఉన్న డైట్లను పరిశీలిద్దాం.

1. ఎటికిన్స్ డైట్ (atkins diet): ఇది పిండిపదార్థాలను (carbohydrates) తక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్సిలిన్ పరిమితులను తగ్గించే ఆహార విధానం. శరీరంలో ఇన్సిలిన్ శాతం ఎక్కువైతే శరీరం ఆహారం నుంచి వచ్చే శక్తిని వినియోగించుకొని మిగిలిన శక్తిని భద్రపర్చుకుంటుంది. అంటే శరీరంలోని కొవ్వును కరిగించదు. అందుకుని ఈ డైట్ ను అవలంబించే వారు కొవ్వుపదార్థాలను, ప్రోటీన్లను ఎక్కువగా తీసుకుంటారు.

2. ది జోన్ డైట్ (the zone diet): ఈ పద్దతి ప్రకారం మనం తీసుకునే ఆహారంలో 40 శాతం పిండిపదార్థాలు, 30 శాతం కొవ్వు పదార్థాలు మరియు 30 శాతం ప్రోటీన్లు ఉండేటట్టు చూసుకోవడం. ఈ డైట్లో ఇన్సిలిన్ నియంత్రించడానికి పిండిపదార్దాల మీద ఆధారపడతారు.

3. కీటోజెనిక్ డైట్ (ketogenic diet): మూర్ఛరోగాన్ని తగ్గించడానికి ఈ డైట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పద్దతి ద్వారా మనం తీసుకునే ఆహారంలో కొవ్వుపదార్థాల శాతాన్ని పెంచి పిండిపదార్థాల శాతాన్ని తగ్గిస్తారు.

4. వేగన్ డైట్ (vegan diet): దీనిని ఆహార విధానం అనడం కంటే ఆహార నియమం అంటే సబబుగా ఉంటుందేమో. ఇది కూడా ఒక రకమైన శాఖాహార భోజనమే. శాఖాహారాలు ముఖ్యంగా ఆకుకూరలు, కాయకూరలు, పప్పుదినుసులతో పాటు పాలు తమ ఆహారంలో తీసుకుంటారు. వీరిలో మళ్లీ కొందరు కోడిగ్రుడ్లులు తింటారు కానీ చికెన్, చేపలు, మాంసం తినరు. వీరిని లాక్టో-ఓవో శాఖాహారులంటారు. మరికొందరుంటారు వీరు శాఖహారంతోపాటు చేపలని తింటారు, కానీ చికెన్, మాంసం వంటివి తినరు. వీరిని పెస్కో శాఖాహారులంటారు. ఇక వేగన్ల విషయానికి వస్తే, వీరు పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు. అందుకని వీరు జంతు సంబంధిత ఆహారాలు ఏవి ముట్టరు. అంటే పాలు, పెరుగు, గ్రుడ్లు వంటివి కూడా తమ ఆహారంలో చేరనీయరు.

5. రాఫుడ్ డైట్ (raw food diet): ఈ డైట్లో భాగంగా ఉడికి, ఉడకని పదార్ధాలను తీసుకుంటారు. అలాగే రైస్ మిల్లులో సానపట్టిన తెల్ల, సన్న బియ్యంకు బదులు దంపుడు బియ్యం వినియోగిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే, ఆహార పదార్ధాలని వాటి సహజసిద్ధ రూపంలో తినడమే ఈ డైట్ యొక్క లక్ష్యం. చెట్ల నుండి నేరుగా వచ్చే కాయగూరలు, పండ్లు, సేంద్రీయ ఆహారం తప్ప జంతు సంబంధ ఇతర ఏ ఆహారం డైట్ ను తీసుకునేవారు ముట్టరు.

6. పాలియో డైట్ (paleo diet): ఈ డైట్ మనం నాగరికత నేర్చుకుని, వ్యవసాయ పద్దతులను అవలంబించక ముందు మన పూర్వీకులు ఎటువంటి ఆహారాన్నితీసేకునేవారో, ఆ ఆహారాన్ని, నియమాలని ప్రతిపాదిస్తుంది. ఇందులో భాగంగా, కాయగూరలు, పళ్ళు, గింజలు, పప్పుదినుసులని తీసుకోవచ్చు. ఈ డైట్ను అవలంబించేవారికి పాలు, ఇతర పాల ఉత్పత్తులు, చక్కెర పదార్థాలు, ప్రాసెస్డ్ పదార్థాలు నిషేధం. క్లుప్తంగా చెప్పాలంటే, తక్కువ పిండిపదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవాలి.

7. లోకార్బ్ డైట్ (low-carb diet): రోజుకి 20 నుంచి 150 గ్రాముల పిండిపదార్థాలను మాత్రమే ఈ డైట్ ప్రకారం తీసుకోవాలి. దాని వల్ల శరీరానికి పిండిపదార్థాలు అందక శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుపదార్థాన్ని శరీరం శక్తి కోసం వినియోగిస్తుంది. తక్కువ పిండి పదార్ధాలను తీసుకోవడం వల్ల ఆకలి కూడా తక్కువ వేస్తుంది.

8. డ్యూకన్ డైట్ (ducan diet): ఈ విధానంలో ప్రోటీన్లు ఎక్కువగా తీసుకొని, పిండిపదార్ధాలను, కొవ్వుపదార్ధాలను తక్కువగా తీసుకుంటారు. ఈ డైట్ గురించిన శాస్త్రీయ అధ్యయనాలు అంతగా జరగలేదు. ఈ డైట్ ను రెండు, రెండు నాలుగు దశలుగా చేస్తారు. మొదటి రెండు దశలు శరీర బరువుని తగ్గించడానికి, తదుపరి రెండు దశలు తగ్గిన బరువుని నియంత్రించడానికి. ఈ డైట్ వల్ల జీవక్రియ (మెటబాలిజం) తగ్గి, ఒంట్లో కొవ్వుకు బదులు, కండరాలు క్షీణించే అవకాశం ఉంది.

9. ఇంటర్మిట్నెట్ డైట్ (intermittent diet): ఈ విధానం ప్రకారం మన తినే ఆహారాన్ని నియంత్రించడానికి బదులు, తినే సమయాలను నియంత్రిస్తారు. అడ్డు, అదుపు లేకుండా తినే బదులు అడపా, దడపా తినడం అన్నమాట. మన తినే ఆహారానికి మధ్య వ్యవధిని అనేక విధాలుగా విభజించటం దీని పరమార్థం. ఉదాహరణకి, ప్రొద్దున ఉపాహారాన్ని తీసుకోకపోవడం. తద్వారా రాత్రి, మధ్యాహ్న భోజనాల మధ్య 16 గంటల వ్యవధి ఉండేటట్టు చూడటం. లేదా వారానికి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉండటం. లేదా వారంలో ఒకటి, రెండు రోజులు వరుసగా కేవలం 500 నుంచి 600 క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం. లేదా రోజంతా పచ్చి కూరగాయలు, పళ్లు మాత్రమే తీసుకుని రాత్రి మాత్రం కడుపునిండా భుజించడం.

ఈ వివిధ ఆహార పద్దతులతోపాటుగా నేడు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించే ఆహారా పదార్ధాలపై, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేసే పదార్ధాలపై కూడా అందరూ మక్కువ చూపిస్తున్నారు. పర్యవసానం, మార్కెట్లో వీటికి విపరీతమైన క్రేజీ పెరగటం. బరువును తగ్గించే వివిధ వస్తువుల, సేవల మార్కెట్ విలువ 2021లో 254.9బిలియన్ డాలర్లు. కాగా, ఈ మార్కెట్ విలువ ఏటా 8.2శాతం పెరుగుతూ 2026నాటికి 377.3బిలియన్ డాలర్ల కు చేరుకుంటుందని, రీసెర్చ్ అండ్ మార్కెట్స్ ఒక నివేదికలో తెలిపింది. ఇక, మన జీవన ప్రమాణాలను మార్చి ఆరోగ్యాన్ని అందిస్తాయనుకునే పైన ఉదహరించిన డైట్ల వినియోగం ఢిసెంబర్ 2020 నాటికి దాదాపు 13శాతం పెరిగిందని ఐరాఐ ఇన్నోవేషన్స్ నివేదక పేర్కొంది.

వేలంవెర్రిగా మార్కెట్ లో లభ్యమయ్యే ప్రతీ వస్తువుని వాడి అలసిపోవడం కంటే, బరువు గురించి శాస్త్రీయ దృక్ఫదంతో ఆలోచించి మన ఆహారపు అలవాట్లో తగిన మార్పులు చేసుకుంటే అప్రయత్నంగానే బరువును నియత్రించుకోవచ్చు. మన ఆహారంలో పిండిపదార్ధాలను తగ్గించటం వల్ల ఆకలి తగ్గుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆకలి తగ్గి, శరీర జీవక్రియ పెరుగుతుంది కానీ ఇవేవి బరువుని తగ్గించడానికి శాశ్వత పరిష్కారాలు మాత్రం కాదు. పైన ఉదహరించిన డైట్లను పాటించటం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గుతారేమో కానీ, ఎప్పటికీ అలానే ఉండాలంటే మాత్రం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొని, తగిన శారీరక శ్రమ అలవర్చుకోక తప్పదు. చాలామంది మనలో బరువు తగ్గించుకోవాలనుకునే వారు సహజసిద్ధ ఆహార పదార్ధాలను విస్మరించి, ప్రత్యామ్నాయాల వైపు పరుగులెడతారు. తీపి పదార్థాలు, కొవ్వు పదర్ధాలకు దూరంగా ఉండాలని, పంచదారలకు బదులుగా కేలరీలు తక్కువగా ఉండే తీపిని కలిగించే ముఖ్యంగా స్టీవియా, ఆస్పర్ టేమ్ వంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తుంటారు. వీటి వినియోగాం సాలీనా 10.2శాతం పెరుగుతోందంటే, వీటిపై మన మక్కువ ఎంటో అర్థమవుతుంది. ఇక బరువు తగ్గాలనేకునే వారు ఉపయోగించే మరో సాధనం, మీల్ రిప్లేస్మెంట్ షేక్స్. 2021లో 11.9బిలియన్ అమెరికన్ డాలర్లున్న ఈ మార్కెట్ పరిమాణం, సాలీనా 5.4శాతం పెరుగుతూ, 2026 నాటికి 15.5బిలియన్ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అధ్యయనం తెలుపుతోంది. శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలను సమపాళ్లలో కలిపి అందించే షేక్స్, ఉరుకులు, పరుగులతో సాగే నేటి జీవనశైలికి వరప్రసాదినిగా రూపు దాల్చింది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. మార్కెట్లో ఈ వస్తువులను తయారు చేసే కొన్ని వందల కంపెనీలున్నాయి. ఏది మంచిదని నిర్థారించటం ఎలా? ఇలా భోజనానికి బదులుగా షేక్స్ తీసుకునే వారు అందులో కనీసం 15గ్రాముల ప్రోటీన్లు, 3గ్రాముల పీచు పదార్థాలు, 10గ్రాముల కంటే తక్కువగా పంచదార, 33శాతం విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేట్టు చూసుకోవాలి. వీటితో పాటు తీపిని కలిగించడానికి కార్న్ సిరప్, అలాగే వెజిటబుల్ నూనెలు కలపలేదని నిర్థారించుకోవాలి.

సమతుల్య ఆహారం: మనలో నిరోధక శక్తిని పెంచి, జీవక్రియ సక్రమంగా ఉండేలా చూసి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చు కోవాలంటే, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల బరువు పెరగటాన్ని కూడా అదుపు చేసుకోవచ్చు. సమతుల్య ఆహారం అంటే, మన తీసుకునే ఆహారంలో 30శాతం కూరగాయలు, 30 శాతం తృణధాన్యాలు, 25శాతం ప్రోటీన్లు, 10శాతం పండ్లు, 5శాతం క్రొవ్వు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి.

ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే, తాను రోజు తీసుకునే ఆహార కేలరీలలో కొవ్వుపదార్థాలు 30శాతం మించకుండా చూసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. బరువును నియంత్రణలో పెట్టుకోవాలంటే, ప్రతిదినం సగటున ఒక స్త్రీ అయితే 1500 కేలరీలు, పురుషులైతే 2000 కేలరీలకు మించకుండా ఆహారాన్ని తీసుకోవాలి. మనలో చాలామంది బరువు తగ్గటం అనగానే ఆహారంపైనే శ్రద్ధ చూపిస్తారు కానీ, మనం శరీరానికి సరిపడ్డా నీరు తీసుకుంటున్నామో లేదో పరిశీలించరు. తగినంత నీరు తాగటం, ముఖ్యంగా భోజనానికి ముందు నీళ్లు తాగటం వల్ల మనం తీసుకునే ఆహారం కంటే 75కేలరీలు తక్కువ ఆహారం తీసుకోవటంతోపాటు, జీవక్రియ 30శాతం పెరుగుతుందని అధ్యయనాలలో తేలింది. బరువు తగ్గాలనుకునే వారు అర లీటరు నుంచి ఒక లీటరు నీరు తాగటం వల్ల వారు ఖర్చు చేసే శక్తి 25 నుంచి 30శాతం పెరిగిందని అధ్యయనాల్లో తెలుస్తోంది. అర లీటరు నీరు జీర్ణం చేయడానికి 23కేలరీలు ఖర్చవుతాయి. అంటే సంవత్సరానికి 17,000 కేలరీలు అంటే మన శరీరంలోని 2కేజీలు కొవ్వు కరుగుతుందన్నమాట. మనం నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేసే తాగునీరు చేసే మేలు అంత, ఇంత కాదు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి కనీసం 2లీటర్ల అంటే 4 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. శారీరక శ్రమ పడేవారు మరికొంత ఎక్కవ నీరు తాగాల్సి ఉంటుంది. నీటి వల్ల మరో ముఖ్య లాభం, అది శరీరంలోని మలిన పదార్థాలను తొలగించటంలో తోడ్పడుతుంది.

అలాగే తగినంత నిద్ర కూడా మనిషి బరువుని నియంత్రించడంలో దోహదపడుతుంది. కనీసం 7-8 గంటల నిద్ర ప్రతీ వారికి అవసరం. రోజుకి కనీసం 7గంటలు నిద్రపోని వారిలో బరువు పెరిగే అవకాశాలు పెద్దవారిలో 30శాతం, టీనేజ్ పిల్లలో 123శాతం, పసిపిల్లలో 40శాతం, చిన్నారులలో 57శాతం అధికమని పలు అధ్యయనాల్లో తేలింది. తగినంత నిద్ర పోవటం ఎంత అవసరమో, నిర్థారిత సమయంలో నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యం. నిద్రలేమితో బాధపడేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరగక, వారి జీవక్రియను దెబ్బ తీస్తుంది. దాని వల్ల బరువు పెరగటంతోపాటు తదితర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

బరువు తగ్గాలనుకునే వారు చేసే మరో పెద్ద పొరపాటు, భోజనం చేయక పోవటం. మనం రోజుకు మూడుసార్లు తప్పనిసరిగా భోజనం తీసుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి విందు. ఉదయం, మధ్యాహ్నం మనం తీసుకునే ఆహారంలో అధిక కేలరీలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో మాత్రం తక్కువ కాలరీలుండేట్టు చూసుకోవాలి. పగలంతా శారీరక శ్రమ చేయటం వల్ల మనం తీసుకున్న కేలరీలు ఖర్చవుతాయి. కానీ రాత్రి మనం విశ్రాంతి తీసుకునే సమయంలో అంత ఎక్కువగా కేలరీలు ఖర్చుకావు, కనుక, మన ఆహారంలో తక్కువ కాలరీలుండేటట్టు చూసుకోవాలి. బరువు వచ్చినంత తేలికగా పోదు. అందుకని రాత్రికి, రాత్రే మన శరీరంలోంచి 30, 40 కిలోలు కరిగిపోవాలంటే సాధ్యం కాదు. అందుకే ఐదు, పది కిలోలు ఒక్క వారంలో తగ్గితే అంతే వేగంగా అది మళ్లీ వచ్చి శరీరంలో చేరుతుందని గుర్తుంచుకోండి. దాని కంటే 1, 2 కిలోల బరువు ఒక వారంలో తగ్గితే, నిలకడగా బరువు తగ్గి ఒక స్థాయికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం శరీరానికి ఆహారం అందించకుండా చేస్తే, తాత్కాలికంగా బరువు తగ్గినా, కొన్ని రోజులకి మన శరీరం తక్కువ కేలరీలకు పనిచేయడానికి అలవాటు పడిపోతుంది. దాంతో మనం ఇంకొంచెం ఆహారాన్ని తగ్గించాల్సి వస్తుంది. శరీరం తనకు తగినంత శక్తి లభించనప్పుడు ఆకలిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది. దాంతో మనకు ఆకలి పెరిగి ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తద్వారా కేలరీలను తీసుకుంటాం. దీంతో మొదటికే మోసం వస్తుంది.

అందుకే బరువు తగ్గాలనుకునేవారు సమతుల్య ఆహారాన్ని, మనం పడే శ్రమకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడప్పుడు జిహ్వచాపల్యంతో మనకు నచ్చిన వంటకాలు తిన్నా పర్వాలేదు. మళ్లీ రెండోరోజు మన ఆహారపు అలవాట్లను పాటించాలి. తద్వారా మనం తినట్లేదన్న బాధ కలగదు. ఆహారంపై మోహం పెరగదు. రోజు, 25 నుంచి 35 నిమిషాలు వ్యాయామం చేయటం ద్వారా మన జీవక్రియను దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. అది మన చేతుల్లోనే ఉంది. ఇది గ్రహించి మసలుకుంటే బరువు ఒక సమస్య కాకుండా ఉంటుంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి