ఉగాది

ఉగాది
ఉగాది

ప్రథమ సంవత్సరాది యెపుడోప్రథమ చైత్రరథము పైని
ప్రథమ వత్సరాదిని గని
వచ్చిన అతిథికి మానవుడిచ్చె నెట్లు స్వాగతము!

మధురాశా మస్సణ కిసల
మాలిక లల్లేనా?
మహిత మనోరథ మంగళ
రంగవల్లు లుంచేనా?
దోహలమున ఊహల సుమ
తోరణములు కూర్చేనా?
ప్రథమ చైత్ర రథముపైని
ప్రథమ సంవత్సరాదిని
గని వచ్చిన అతిథికి మానవు
డిచ్చె నెట్లు స్వాగతము!

మత్తమరు ద్గరుద్వీథి
కొత్త ఉత్తరీయ మెగర
అరుదెంచిన తొలి హాయన
మరసి బ్రతుకు హాయి అనెన?
ప్రథమ వత్సరాది నాటి
నవజీవన పల్లవములు
నవ్యవాసనాలవములు
వేణువులూ వివిధపుష్ప
రేణువులూ తొయామని
రాణువ గని బ్రతుకంతా
హాయె యనుకొనెనా?

తన గళమే కోయిలగా
తన మనసే ఊయెలగా
మనుగడ ఎర్రని చివురల
మావి కొమ్మ అనుకొనెనా?
క్షుకాండ మనుకొనెనా?
ఆ యుగాదినాడె మనకి
హాయియె యనుకొనెనా – లేక
మాయయె యనుకొనెనా?

ఉగ్ర నిదా ఘాగ్రహము
వర్షాకరుణా శ్రుజలము
జడ హిమర్తు నైరాశ్యము
పడి వచ్చేనని తెలియక
ఏమనుకొనెనో?
వత్సర వత్సర మట్లే
వచ్చినట్లే పోయేనట్లు
అశ్రవుతో హసముతో
అమృత హాలాహలములతో
అంతకంత కతిశయించి
అంసముపై వ్రేగులతో!

కాని, యెట్టి వీరవరుడో
మానవుడు!
నడు ఆనందోత్సవ
మీనరుడు!
ఆశలు కళ్ళేలు లేని
గుర్రా లీతనికి!
మన్ను మన్ను కలియువరకు
తెన్ను వీనికి!

ఊరే కోర్కెలపైని
స వారి చేయుచు
లోకమెల్ల క్రమెన్మిషిత
నాకముగా మారు వరకు!
ఏ యుగాదికా యుగాది
కెప్పటి కపుడె యెదురై
ద్వారముకడ చిరునవ్వుల
హారతు లెత్తునో మానవుడు!
కనుక జయా స్వాగతమ్ము!!
మరిమరి స్వాగతమ్ము!
భావియంత బంగారపు
పంట యగును గాక!
రాగల కాలము శాంతికి
తావల మగుగాక!
గుండెలెల్ల కలిపి ఒక్క
దండగాగ కూరిచికొని,
ముందు ముందు ఈ మానవు
లందరు ఉందురు గాక!

కడచన్న యేడు రాగాల యేడొకేరూపు
జీవితమధ వింకిపోవు వాని-
కి యేడు వెనుకటి యేడుకన్నను పాడు
వయ సస్తగిరివైపు వాలువాని-
కేయేటి కాయేడె యేడు పే తొలి ప్రొద్దు
శోభ చూడని గూబచూపు వాని-
కసలు రానున్న దెప్పటి కపుడు మంచి
సిసలు కా వేపు చెడి ముదిసినె పోవు-
ఈ నిజము నెంచి నిలబడుం డిచట, ఈ జ
యాంగణన అనుంగ తెనుంగులార!

సేకరణ: దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పద్యాల సంపుటి పల్లకీ నుంచి