
‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని ఏనాడో శ్రీశ్రీగారు అన్నారు. ఆ నరజాతి ఘోషను, మహాప్రస్థానాన్ని వెయ్యి పద్యాలలో ఇనుమిండించుకున్న దృశ్య,శ్రవణ కావ్యం శ్రీ గరికపాటి నరసింహరావుగారు రచించిన ‘సాగరఘోష’ పద్యకావ్యం. ఆది శంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన దర్శనకావ్యమిది.
మొత్తం 1116 పద్యాలతో నిండిన ఈ కావ్యంలో అవతారికలో 36పద్యాలు, ఒక అశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని పారవేస్తామా? లేదే? దాచుకుని, దాచుకుని తింటాము. అలాగే వృత్తాలు పాతవే అయినా కొత్త ఇతివృతంతో కొత్త ఆవకాయలా నోరూరిస్తుంది ఈ కావ్యం.
ఉ|| వేదము కన్న ముందుగ వివేకము నేర్పును కన్నతల్లి, ఆ
పాదము నాకు సర్వ సమభావము. భావము నందు నిల్పె, ఓం
నాద శిఖాగ్ర సీమయగు నా జనయిత్రిని గొల్చినంత ఏ
భేదము లేమి నిల్చునిక! వేదములౌను సమస్త వేదముల్
అంటూ మాతృదేవతకు అంజలిఘటించి, భారతీయ తత్త్వానికి, ఆథ్యాత్మికతకు మూలస్తంభమైన, ఆ ఆదిశంకరునికే
కన్యాదానము జేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవితా
కన్యాదానము చేసెద, సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే
అంటూ తన కావ్యపుత్రికను అంకితమిచ్చే సాహసం చేశాడు కవి.
పాఠకుని ఊహలకతీతంగా ఈ కావ్యానికి కవి నాంది పలికాడు. ప్రౌఢవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చుని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉండగా, ఆవును చేరిన లేగదూడ వలే ఒక సుడికూన, ఆ కవి ఒళ్ళో చేరుతుంది. ఆ కూనను చూసి ఒడిలో చేరిన పసిపాపగా భావించి, కవి ప్రేమగా చేరదీసి, లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా తగులుతుంది. ‘పాల మీగడ వలె, దూదిపింజె వలె, స్వచ్ఛంగా ఉండవలసిన నీటి కెరటానివి, ఇలా ఉన్నావేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుండి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ సుడికూన వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే సేదతీరి పయనమవుతానని అర్ధిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే స్వాగత సత్కార్యాలు చేసి,
కం: జోజో తరంగ బాలా!
జోజో! డిండీర చేల! జో! ఘననీలా!
జోజో! మౌక్తిక డోలా!
జోజో! మృదుభావలీల! జో! జలకీలా!
అంటూ జోలపాడి సేదతీరుస్తాడు. తరంగం మేల్కొన్న తర్వాత అది తాకి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని కవి అర్ధిస్తాడు. కవి హృదయాన్ని ఎరిగిన ఆ తరంగబాల చెప్పిన మానవుని జీవితగాథే సాగర ఘోషై మానవాళిని ఉప్పెనలా ముంచెత్తింది.
ఇందులో ప్రతి పద్యము నేటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు నిదర్శనము. ప్రత్యక్ష సాక్ష్యము!
చూచెడి దెల్లమిథ్య, కనుచూపును మిథ్యయె, నిన్నునీవుగా
చూచెడి దాక ఈ జగతి జూచెడి దెల్ల వృథా వృథా వృథా!
చూచెడి చూపువెన్కగల చూపును శోధన చేయుమయ్యదే
చూచిన నింక లోకమును చూచెడిదేమి? సమస్తమయ్యదే!
మానవ జీవన స్రవంతిలో కొట్టుకొనిపోయిన వైశిష్ట్యాలకు, మరుగునపడిన మానవతకు మూగసాక్షి సాగరఘోష. ఆదిశంకరాచర్య, రామానుజాచార్య, మహ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు, రామకృష్ణ, వివేకానందుడు, రమణ మహర్షి వంటి ప్రవక్తలు, నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య, షేక్స్పయిర్, టాల్ స్టాయి, విశ్వకవి రవీంద్రుడు సాక్ష్యాలుగా నిలువగా నీటి పుట్టుకతో ప్రారంభమై, దశావతారాలు, ప్రాచీన నాగరికత, జైన-బుద్ద మార్గాలు, శైవ-వైష్ణవ తత్త్వాలు, గ్రీకుల నుంచి మొదలై గజనీ-ఘోరీ దండయాత్రలతోపాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఫ్రెంచి, రష్యా విప్లవాలు, కమ్యూనిజం, మార్క్సిజం, వైజ్ఞానికావిష్కరణలు, మందుపాతరలు, అణుబాంబులు, అందాలపోటీలు, కాలుష్యాలు, వసుధైక కుటుంబంలో మమేకమై సాగర గర్భంలో మౌనంగా మిళితమైపోయాయి.
మానవ పరిణామ క్రమానికేకాదు, కవి హృదయ ఘోష కూడా నిలువుటద్దం ఈ పద్యకావ్యం. పరిణామాలు కాలానుగుణమైనా మితిమీరిన మానవ దృక్ఫథాలను కవి అడుగడునా దుయ్యపట్టి, తనదైన రీతిలో వ్యంగ్య బాణాలు సంధించారు. సాగర ఘోషలోని కవి దార్శించిన జీవన పరిణామాలలో కొన్ని మచ్చుతునకలు.
ఆ.వె||వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొంద
వచ్చు, సుఖము పొందవచ్చు కాని
భూతదయయె లేని భోగమ్ము లందటే
కలియుగాంత మనుచు తెలియరేల?
తే.గీ|| గుండెలో దూరినట్టి గుండుకాదు
పుణ్యభూమికి ఒక రాచపుండుగాని
నేలకూలిన వాడొక్క నేతగాడు
జాతి కేతనమును నేయు నేతగాడు|| (గాంధీజీ గురించి)
చ||మగడు గతించినాడనిన మానిని దుఃఖము పట్టలేము, మీ
తెగువ విచిత్రమౌను, వెతతీర్చుటకై పతిపీఠమిచ్చి ఆ
మగువను మంత్రి చేయుదురు మానవతా గుణమన్న మీయదే!
తగదని పల్కువారెవరు తప్పును నొప్పగు సానుభూతిలో|| (భారతీయ రాజకీయాలపై చురక)
కం|| ధరలాకాశము నంటెను
సరకులు పాతాళమందు చక్కగ దా
ధరకింక భగీరథుడో
నరుడో దిగిరావలెగద! న్యాయము చేయన్
సీ|| పూటపూటకు పెక్కుపోటీల పరీక్షల
తలనొప్పిచే మను తల్లడిల్ల
బస్తాల బరువున్న పుస్తకాలను మోసి
బంగారుమైదీవ క్రుంగిపోవ
కాపీలు సాగించు కన్నబిడ్డలగాంచి
కాటుక మొగమొల్ల క్రమ్ముకొనగ
పాండిత్యమేలేని పంతులయ్యల చూచి
నెరివేణి సవరంపు నీడనిలువ. (విద్యారంగ దుస్థితి)
ఉ|| నాటికి నిప్పు విప్లవమె, నాటికి నాటికి వృద్ధిజెంద పై
నాటికి చక్రవిప్లవము, నవ్యయుగమ్మున దివ్యమైన కం
ప్యూటరు పూర్ణవిప్లవము, మూడును ముఖ్యములైన, వేల వే
మాటలు? మానవ ప్రగతి మార్గము నందున మైలురాళ్లివే! (శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి)
శా|| మూఢాగ్రేసర చక్రవర్తు లిటలీ ముస్సోలినీ హిట్లరుల్
గాఢద్వేషము చూపగా అమెరికా గత్యంతరాపేక్షతో
గూఢత్వంబున మిత్రరాజ్యములతో కూటమ్ముగావించి శం
భో! ఢాంఢాం ఢఢఢాం ఢఢాంఢ మణుబాంబుల్ పేల్చె పృథ్వీస్థలిన్||
ఉ|| గుండెకుగుండె చూపగల గుండెలులేక పరోక్షమందు బ్ర
హ్మాండము బుగ్గిచేయుటె మహాహవ ధర్మమటన్నచో జగ
ద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు? ఇంకనె
ట్లుండును చిత్తశాంతి? ఎటులండును గుండెలపైన చేతులున్. (అణుబాంబులపై వ్యథ)
ఇలా మొత్తం వెయ్యి పద్యాలు దేనికదే ధీటుగా ఉండిగా, ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నముద్ద ఇస్తే, ఎలా గబుక్కున అంతా నోటిలో పెట్టుకుని తబ్బిబ్బవుతాడో అలాగే సాగరఘోష పద్యాలన్నీ మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరగా, కొనమెరుపులా, పాల కొసరులా తెలుగు సంస్కృతిని గురించిన పద్యాలు-
చ|| కనగ విచిత్రమయ్యె! వడగట్టిన గంగను బోలు పంచెయున్
కనబడబోదు, పద్యములకట్టలు దాచిన రెండుజేబులన్
ఘనమగు లాల్చిలేదు, కనగా భరతావని కేతనమ్ము పో
లిన పొడవైన కండు వరింపదు కంఠము, వాణికన్నులం
దున తెలిమోదబిందువలు దూసినహారము కానరాదు, నే
ననుటయుకాదు కాని తగునా! కవిగారికి మ్లేచ్ఛవేషముల్.
ఉ|| భాషయు దూరమయ్యె, పరభాషయె మీప్రియభామయయ్యె, ఇం
గ్లీషును మాధ్యమంబుగ వరించిరి, అద్దియటుండనిండు, సం
భాషణకైన చెల్లదొకొ! పద్య మనోహరమైన భాష, స్వ
ర్భాషకు తుల్యభాష, పదబంధ సుగంధమయాంధ్ర భాషయే.
సీ|| భాషయా తెలుగన్న! భావనాంభోధిలో
బంగారు నోడలో పయనమౌను
భావమా తెలుగన్న! భాషావధూటికి
పాదార్చనము చేయు పద్మమగును
పద్యమా తెలుగన్న! పట్టాభిషిక్తులౌ
తెలుగు మారాజుల తేజమగును
వచనమా తెలుగున్న! బండరాళ్లనునైన
చెమ్మ పుట్టించెడి సేద్యమగును.
గీ|| అట్టిమీభాష హృదయమ్ము పట్టుకొనుడు
వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు
మమ్మిడాడీల మాటలు మానుడింక
అమ్మనాన్నల అనురాగమందు డింక||
సౌమ్యశ్రీ రాళ్లభండి
చాలా చక్కగా విశ్లేషించారు… ధన్యోస్మి