
తెలుగునాట పదకవితలు గేయ వాఙ్మయంగా ప్రసిద్ధి చెందాయి. త్యాగయ్య కృతులు సంగీతానికి పెద్దపీటవేసి, సంగీతభావమే సాహిత్యానికి జీవం పోసాయి. ‘రామ ఇక నన్ను బ్రోవ రాదా దయలేదా’ అన్నప్పుడు ఇందు సాహిత్యం ఎటువంటి రసోత్సత్తిని కల్గించదు. అదే ఈ సాహిత్యానికి సంగీతం జోడైతే పదాలు జీవం పోసుకొని శ్రోతల హృదయాన్ని తాకుతాయి. అదేవిధంగా రామదాసు కీర్తనలను పరిశీలించినపుడు, ‘ఏ తీరుగ నను దయజూచెదవో – ఇనవంశోత్తమ రామా, నా తరమా భవసాగరమీదను – నళినదళేక్షణ రామా, కారుణ్యాలయ భక్త వరద నను – కన్నది కానుపు రామా’ అనే కీర్తనలో సాహిత్యం రసానుభూతిని కల్గిస్తుంది, సంగీతం కాదు. అదే పదరచన సంగీత, సాహిత్యాలను సమన్వయపర్చి ప్రత్యేక స్వరూపంతో భాసిల్లుతుంది. ఇందుకు క్షేత్రయ్య పదాలే ఉదాహరణ.
ఆంధ్రభాషలో పదరచనకు ఆద్యుడు అన్నమాచార్యుడు. క్షేత్రయ్య నాటికి పదం శృంగారంతో మిళితమైన మధురభక్తికి తార్కాణాలుగా రూపుదిద్దుకుంది. అన్నమయ్య పదాలలో శృంగారంతోపాటు ఆథ్యాత్మికత ఉట్టిపడుతుంది. అన్నమయ్య తదనంతరం వచ్చిన తాళ్ళపాక కవుల పదాలలో సాంప్రదాయకంగా వచ్చే అష్టవిధ నాయికలేగాక, చెంచెతలు, బోయ స్త్రీలు, భోగకాంతలు వేంకటేశ్వరుని నాయికలై తమ మనోభావాలను వెలిబుచ్చుతారు. మన దేశంలో చిరకాలంగా మధురభక్తితో ఈశ్వరుని ఆరాధించటం తెలిసిందే. నారద భక్తి సూత్రాలలో ‘యథావ్రజ గోపికా నాం’ అనే సూత్రంలో గోపికా భక్తి మధురభక్తికి తార్కాణంగా ఉదహరించబడింది. జయదేవుని అష్టపదులు రాధాకృష్ణుని ప్రణయ భావాన్ని మధురభక్తితో రంగరించి తెలిపినవే. మీరాబాయి, కబీరు వంటి భక్తులు కూడా ఈ మార్గాన్నే అనుసరించారు.
ఇక క్షేత్రయ్య పదాలకు వస్తే, ఇవి సంగీతం సాహిత్యాన్నిగాని, సాహిత్యం సంగీతాన్నిగాని అధిగమించకుండా, పరస్పరం తోడ్పడుతూ పదరచన గానాభినయన రూపమై శ్రోతలను ఆకర్షిస్థాయి. అన్నమయ్యతో ప్రారంభమైన పదరచన సంగీత,సాహిత్య సమ్మేళనంలో, పదరచనాశిల్పంలో పరిణితి పొంది క్షేత్రయ్య పదాలతో ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. తెలుగుతనాన్ని సంగీతంతో మేళవించి పదాలనందించిన క్షేత్రయ్య పదసంగీత పితామహుడు.
పల్లవి: ఎంత చక్కని వాడే నా సామి వీడెంత చక్కని వాడే
అనుపల్లవి: ఇంతి మువ్వ గోపాలుడు సంతతము నా మదికి సంతోషము చేసునే
మొలక నవ్వుల వాడె ముద్దు మాటలవాడె
తళుకారు చెక్కుటద్దముల వాడె
తలిరాకు జిగి దెగడదగు మోవి గలవాడె
తెలిదమ్మి రేకు కన్నుల నమరు వాడె
చిరుత ప్రాయము వాడే చెలువొందు విదియ చం
దురు గేరు నొసలచే మెరయు వాడే
చెఱకు విల్తుని గన్న దొరవలె నున్నాడే
మెరుగు చామన చాయ మే నమరు వాడే
పొదలు కెందామరల పెంపొదవు పదముల వాడే
కొదమ సింగపు నడుము కొమ రమరు వాడే
మదకరి కరముల మరువు చేతుల వాడే
సుదతి| మువ్వగోపాలుడెంత సొగసు గలవాడే
శృంగార రస ప్రాధాన్యంగా రచించిన సుమారు 4,500 క్షేత్రయ్య పదాలలో చమత్కారం, వ్యంగ్యం, శబ్ధ సముచ్ఛయం ప్రత్యేకత. భావుకతతో నిండిన భావ చిత్రాలను క్షేత్రయ్య తన పదాలలో పలికించడానికి కారణం క్షేత్రయ్య తానే నాయికగా ఆ మువ్వగోపాలుని మధుర భక్తితో ఆరాధించటమే కావచ్చు. తెలుగు భాషలోని పలుకుబళ్లు, నుడికారాలు, సామెతలు క్షేత్రయ్య పదాలలో మనకు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. ‘అరటాకు ముల్లు సామ్యమైనందుకు’, ‘తోటకూర దొంగవలె తొలగిపోయే వాడవు’, ‘బావిలోని నీరు వెల్లువపోయీనటవె’, ‘చేత కాసులేదుకాని చేసైగలె చిందిమీనైమిట్టిపడెను’ వంటి జాతీయాలు, ఈనిన పులివంటి కోపమెందుపోయేనో, కలిమిలేములనగా కావెడికుండలు, తలవ్రాలెవరికి తప్పించ వశమే, మేకవన్నె పులులంటి చెలులు వంటి సామెతలనేకం అతని రచనలలో మనకు విరివిగా కన్పిస్తాయి.
చదువుకున్నప్పటి కంటే పాడునప్పుడును, పాడునప్పటి కంటే అభినయించినప్పుడు క్షేత్రయ్య పదముల సౌందర్యమధికమగును. ‘సాహిత్య సంగీతాభినయ సర్యస్వములనదగిన యట్టి పదములను సహస్రములుగా సృజించి క్షేత్రయ్య పద వాఙ్మయ లక్ష్మికి చేకూర్చిన ప్రత్యగ్రశోభయింతింతనరానిదని’, డా. దివాకర్ల వేంకటావధానిగారు పేర్కోన్నారు.
పల్లవి: చాలు చాలు ఈ చిన్నెలతో నాదు సరసకు జేరకుర
అను: ఈ చిన్నెలు సాగవు నా వద్ద మువ్వగోపాల
కన్నుల వీడెముతో కాటుక మోవితో
వెన్నున కీల్జడ వేటుతోను
కన్నియకెంపుల గాజుల నొక్కులతోను
వన్నెకాడ నుదుటను నున్నలత్తుతోను
నిదుర మబ్బుతోను నిండు బడలిక తోను
ముద్దియ కలసిన ముదముతోను
నిద్దంపు చెక్కిళ్ల నెలవంకలతోను
వద్దురా పద్దులు వగకాడ నాతోను
అలదాని కుచములు నలదిన జవ్వాది
కల యురస్థలమును నంటి నన్నంటరాకు
బలిమిచేసేదేల బాల మువ్వగోపాల
అలనాడె గూడిన చెలిమి పదివేలు
ఈ పదంలోని భావాన్ని ఏ చిత్రకారుడు చిత్రీకరించలేడు, ఏ శిల్పాచార్యుడు చెక్కలేడు. మనోహరమైన, మంజులమైన భావం నాయికా, నాయకుల శృంగార భావోద్వేగాలను ప్రకటిస్తాయి. సునిశితమైన బావ ప్రకటన క్షేత్రయ్య పదాల ప్రత్యేకత. ‘తలపువాని మీద నాయె, తల వాకిలి ఇల్లాయె,’ ‘ఇంతలో నీవీడకు రాకుంటే కన్నీరు కావేరికాలువ సుమీ,’ అంటే అల్పాక్షరాలతో అనంతార్ధాలను ప్రకటించటంలో క్షేత్రయ్య సాటి.
పల్లవి: ఏమి సేతునే? కొమ్మా ఓ యమ్మా
అను: ఏమి సేతునే? వెన్నెలకాకలకు ఎట్లోర్తునమ్మా నే
కల కల రవముల చిలకల పలుగులు
సొలపులు నామీద ఝలు ఝల్లుమనే
అళులచే నళుకుచు సొలపుల వలచితి
తెల తెల్లవారదే చిలుకలకొలికి నే
మింట చందురు నన్నంటి గాయుగాక
యొంటి నుంటే రాదు కంటికి నిదుర
తుంట విల్తుడు నన్ను కంటగించి నాడు
వింటివటే కలకంఠిరో నేడు
అందమైన మా మువ్వగోపాలు డైన రంగేశు
మందలించి వాని యిందు తోడితెచ్చి
పొందుసేయగదవే చందన గంధి నే
జయదేవుని మొదలు పెద్దన వరకు అనేక మంది కవులు స్త్రీ ప్రణయం, విరహం, వియోగం, కన్నీరు వర్ణించారు. కానీ పురుషుని విరహాన్ని, ప్రణయావేశాన్ని వర్ణించిన ఘనత మాత్రం క్షేత్రయ్యకే దక్కింది.
ఏమి సేయుదు మోహ మెటువలెదీరును
భామిని మణినియెవ్వరు తోడితెచ్చేరు
వెలయనీరు ముఖార విదంబు లిఖియించి
యలరు వాసనలు వ్రాయగ నేరనైతి
కళలొల్కు నీమోవి గదసివ్రాసితిగాని
నెలత తేనియలుంచ నేనేరనైతి
కలికి సొగసైన నీ కనులు వ్రాసితిగాని
బెళకు చూపులు వ్రాయు విత మెరుగనైతి
గళమురేఖల తెలియగాను వ్రాసితిగాని
చెలగుకోకిల వంటి పలుకు వ్రాయగనైతి
తరుణిరో నాగ బంధమురీతి గలయుటలు
గరిమవ్రాసితి గాని పరవశము చేత
పరగమా మువ్వగోపాల రాయని
తిరుగ రతులకు బిలుచు తెలివి వ్రాయగనైతి.
తెలుగులో లోతైన భావలను పలికించే పదకేళికకు నిర్వచనాలు క్షేత్రయ్య పదాలు. రాగంతోపాటు సాహిత్య భావనలను వ్యక్తపర్చే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం అటు సాహిత్యకారులను, నాట్యకోవిదులను, ఇటు సంగీతజ్ఞులను అలరించే దృశ్య కావ్యాలు.
సౌమ్యశ్రీ రాళ్లభండి