
పిల్లలకు పేరుపెట్టడం అంటే, అదో మహాయుద్ధం. ఫ్యాషన్ గా పేర్లుపెట్టడం, బారసాలనాడు ఒక పేరు రాసి, తర్వాత వాడకానికి మరో పేరు పెట్టుకోవడం, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, సర్టిఫికెట్టుల్లో ఒకటి, పెళ్ళికార్డులో మరోకటి, ఇంక ముద్దుపేర్లు, అమ్మమ్మ, తాతయ్య పేర్లు, ఇలవేల్పుల పేర్లు, జ్యోతిష్యానికి అనువైన పేర్లు, పలకలేక కుదించేసుకున్న పేర్లు ఇలా బారసాలనాటి పేరుకి తర్వాత పేరుకి పొంతన లేకుండా అర్ధరహిత పేర్లు అనేకం. అలాంటి ఒకానొక ప్రహసనమే మునిమాణిక్యం నరసింహరావుగారి ‘నామకరణం’ కథ. సాంతం చదివి ఆనందించండి.
పసిపిల్లలను పక్కలో పడుకో పెట్టుకొని పురిటిగదిలో నులకమంచంలో పడుకుంది కాంతం. పండబారిన తమలపాకులాంటి చెక్కిళ్లపై లేత గులాబి రేకుల పసిచేతులు నిమురుకుంటుంటే కెంపులతో కాంతం తన మాతృత్వాన్ని పూజించుకుంటున్నట్టున్నది.
పురిటిగది ప్రక్కన నేను మంచంపైన పడుకొన్నాను. కొంతదూరాన మా బావమరిది పడుకొని ఏదో చదువుకొంటున్నాడు. కాంతం విప్పారిన నేత్రాంచలములనంటి కనీనికలదాకా ప్రవహించే తన చూపును సవరించుకొంటూ ‘‘మరి – పేరేమి పెడతాము’’ అన్నది.
‘‘ఏమండోయి మిమ్మలనే.’’
‘‘ఏమిటి?’’
‘‘ఈ చిట్టితల్లికి పేరేం పెడదాము?’’
‘‘ఏదో ఒకటి పెడద్దాంలేద్దూ.’’
‘‘అదిగాదండీ, రేపేగదా బారసాల. అప్పకప్పటికి ఏమి తోచకపోవటం ఏదో ఒకటి హడావుడిగా వ్రాయటం’’ అన్నది కాంతం గుంటలు పడ్డ చెక్కిళ్ళలో వెలుగులు చక్కలిగిలి పెట్టుకున్నవి.
‘‘సరే, అయితే ఏమి పేరుపెడదాం.’’
‘‘అదే మిమ్ములను అడగటం.’’
‘‘నాకేం తోటచంలేదు. ఇదివరలో అంటే పేర్లు సిద్ధంగా ఉండేవి, మొదటిపిల్లకు మా అమ్మపేరూ, రెండోదానికి మీ అమ్మపేరూ, మూడో బిడ్డకు మా తాతపేరు పెట్టాము. తరువాత పుట్టినవాడికి నీ ఇష్టదైవం యొక్క పేరు పెట్టుకున్నావు. ఇక దీనికి పేరు కుదరటం కష్టమే’’ అన్నాను నేను.
‘‘ఈ దఫా మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి’’ అన్నది కాంతం నా వంకనైన చూడదు. పుట్టుగుడ్డ తెలిమొగములో పుణ్యలోకాలు వెదుకుతుందా!
‘‘పూర్తిగా నా యిష్టమేనా? అంత దయా!’’
బాగుందండోయి! మీ కుతురుకు మీ కిష్టమైన పేరు పెట్టుకుంటానుకి ఒకరి ఆజ్ఞ ఏమిటి?’’
‘‘కూతురైతే నీకు కూతురేగా?’’
‘‘అయితేనేం మీ కిష్టమైన పేరు చెప్పండి.’’
‘‘సరే అయితే, జానకి పెడదాం.’’
‘‘జానకా?’’
‘‘అవును.’’
‘‘బాగానే ఉంది కాని…..’’
‘‘ఆ కానీ ఏమిటో చెప్పు? ఏదో ఉంది.’’
‘‘అది కాదండీ, ఏదైనా పేరు పెడితే ముద్దుగా ఉండాలె, మంచి సంగతులు జ్ఞాపకానికి రావలె.’’
‘‘ఇపుడుమటుకేం జానకి జగత్ మాత మహాసాధ్వి, అంతకంటె మంచి పేరేముంది.’’
‘‘మంచిపేరే కాని, సీత కష్టాలు జ్ఞాపకానికి వస్తవి. అదీగాక నీళ్లాడక మునుపు మీరు నాకు ఉత్తర రామాయణం నాటకము చదవి విన్పించారు జ్ఞాపకం ఉందా ? సీత కష్టాలు చూచి ఏడ్చాను, అప్పటి నుంచి ఆమెపేరు తల్చుకుంటే భయం వేస్తుందండీ?’’
‘‘సరే పోనీ మానేద్దాం. ఇంకేదైనా పేరు పెడదాం.’’
‘‘సుగుణ అని పెడదాం.’’
‘‘సుగుణా? ఆ సుగుణ, ఎందుకండీ? సుగుణ వివేకం అవన్నీ కిరస్తాని పేర్లు.’’
‘‘ఓహో ఆ మాటా నిజమే, అదీగాక నీ మోస్తరుగా పెంకెతనం, మొగుడ్ని లక్ష్యం చేయకపోవటం మొదలుగా గల సుగుణాలు గలదైతే నేతిబీరకాయవంటి వ్యర్ధమైన పేరు అవుతుంది, మరేమంటావు?’’
‘‘శేషగిరి అని పెడితే? ఆ పేరు మా నాన్నకెంతో ఇష్టం’’
‘‘మీ నాన్నకు ఇష్టమైతే నీకు పెట్టాలిసింది. కొండలపేర్లు, నదుల పేర్లునా, పిల్లలకు పెట్టుకోటం. మా మాష్టరుగారు ఒకాయన ఉండేవాడులే. ఆయన శేషాచలం, వింధ్యాచలం, హిమాచలం అని పేర్లు మొగపిల్లలకూ, గంగ, యమునా, కృష్ణా, గోదావరీ అని ఆడపిల్లలకు పేర్లు పెట్టాడు. అట్లా చేయమంటావా? ఉండు, ఉండు నాకో పేరు తోచింది. మనకు ఇక పిల్లలు వద్దే. ఇదే ఆఖరు కాన్పు అనుకో, అంటే కోరుకో ఆ అర్ధాన్ని సూచించేటట్లు, ఆ సంగతి ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చేటట్లు, సంపూర్ణం అని పేరు పెడదాం. నీవు అడ్డు చెప్పక. అంతే అదే నిశ్చయం.’’
‘‘అయితే బావా, ఒకవేళ ఇంకోపిల్ల పుడితే ఏం చేస్తావు’’ అన్నాడు మా బావమరిది.
‘‘అయ్యో, మన నిశ్చయాలు, మనం ….. అన్నది’’ కాంతం, ఎత్తిపొడుస్తూ.
‘‘పుడితే ఎట్లా చెపుదూ’’ అన్నాడు మా బావమరిది.
‘‘ అంతగా పుడితే మంగళహారతి అని పెడదాం. మంగళహారతితో ప్రతిపనీ పూర్తిచేస్తారు. భజనలు, పురాణ కాలక్షేపాలు, పూర్తి అయిన తరువాత మంగళహారతి ఇస్తారు.’’
‘‘ముందు సంపూర్ణం అయిన తరువాతగా మంగళహారతి కాబట్టి దీనికి సంపూర్ణం’’ అని పేరు పెడదాం. ‘‘అమ్మ! ఏదో ఒకటి తేలింది’’ అన్నాను నేను.
‘‘బాగానే ఉంది?’’
‘‘ముక్కు విరిస్తేగాదు. ఆ పేరు పెడితేనేం?’’
‘‘చాల్లేండి, పాండిత్యము మా బంగారుతల్లికి మంచి పేరు పెట్టరూ?’’ అని పిల్లను తన మృదుహస్తాలతో నిమిరింది కాంతం.
‘‘సరే పోనిలేవే నీకంత కష్టమెందుకూ, ఊర్వశి అని పెడదాం పోనీ, ఊర్వశి చక్కనిదని ప్రసిద్ధం.’’
‘‘చాల్లెండి వేళాకోళం. రంభ, ఊర్వశీ, తిలోత్తమా ఇవా మనం పెట్టుకునే పేర్లు ? అయినా ఆ భోగంముండల పేర్లేమిటి?’’
‘‘మరి ఎట్లాగే, ఒకాయన ఇట్లాగే పేరు దొరకొక పేరు పెట్టన్ అని నామకరణం చేశాడట. ఇక నాకు తోచడంలేదు నీ ఇష్టం.’’
‘‘నా ఇష్టమెందుకు? మీ చిత్త మొచ్చిన పేరు పెట్టుకోండి. నేనొద్దంటే అప్పుడనండి. ఏదో ఆడదాన్ని కాబట్టి చెప్పవలసినది చెపుతున్నా, శుక్రవారం పుట్టింది, కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది.’’
‘‘లక్ష్మి? లక్ష్మి – బావుంది. లక్ష్మి, నీ నామమెంత లలిత మహహ – అని ఒక కవి వ్రాశాడు. బాగుంది. సరే ఇంకేం! అదే పేరు’’ అన్నాను.
‘‘బావా! ఏమైనా కొత్తపేరు పెట్టరాదూ? ఉత్తర హిందుస్థానంలో వాళ్ల పేర్లు చూడూ, ఎంత చక్కగా ఉంటవో! కమలాబాయి నెహ్రూ, ఇందుబాల, జటాజూట శిరోమణి, శిరీషకుసుమకోమలి, ఇట్లాంటి పేరు పెడితే ముందు పేరు వినటానికి ఎంతో poetic గాను శ్రావ్యంగా ఉంటుంది! పేరు మనోహరంగా వుండాలి. ఒక పేరు ఒక భావగర్భితమైన ఖండకావ్యంగా ఉంటుంది. The name itself is a beautiful Poem అన్నాడు మా బావమరిది.
‘‘నాకూ మంచి పేరంటే సరదా. వాడు చెప్పిన పేర్లలో జటాజూట శిరోమణి అంటే చంద్రునికి చెందుతుంది. చంద్రుడు చల్లనివాడు. బాగుంది ఆ పేరు చదువుకోనివాళ్లు చంద్రమ్మ అని పెట్టుకుంటారు. జటాజూట శిరోమణి అని పేరు పెడితే పండిత కుటుంబములోనిదని ముందు తెలుస్తుంది, రెండోది చంద్రుడు కావ్యానికి వస్తువ. వెన్నలనూ చంద్రుడ్నీ కవులు ఊ, మెచ్చుకొంటారు కాబట్టి ఆ పేరు పెడదాం’’ అన్నాను కాంతంతో సరదాపడుతూ.
‘‘ఆ పేరు పెడితే అందరూ తిట్టరూ?’’
‘‘ఏమి’’
‘‘చంద్రదూషణ అన్ని కావ్యాలలో ఉండదూ?’’
‘‘అదీగాక అమ్మాయి పెద్దదైన తర్వాత దాన్ని అంత పెద్దపేరుతో ఎవరు పిలుస్తారు అయినా మన పేర్లు కావు అవి ఎవరో బెంగాలీవాళ్లు పెట్టుకునే పేర్లు మనకెందుకు. మనకు తగిన పేరు మనం పెట్టుకుందాం’’ అన్నది కాంతం.
సరే, పోనీ లక్ష్మి అని పెడదాం అన్నాను.
లక్ష్మి నిశ్చయమైపోయింది. మర్నాడు ఇల్లంతా అలంకరించారు. నలుగురు బంధువులూ వచ్చారు. ఇల్లు కళకళలాడుతున్నది. పీటలమీద కూర్చున్నాం పేరు వ్రాయటానికి. పళ్ళెంలో ముత్యాలలాంటి సన్నబియ్యంపోసి నా ముందు పెట్టారు. కళ్లుమూసుకుని నిద్రపోతున్న బిడ్డకేసి గర్వంగాను సంతోషంగాను చూస్తున్నది కాంతం.
‘‘సరే ఏం పేరు వ్రాయమంటారు?’’ అన్నాను.
‘‘సుబ్బలక్ష్మి’’ అన్నది కాంతం.
ఈ ‘‘సుబ్బేమిటి’’ అన్నాను.
‘‘మా నాయనమ్మ వచ్చి తన పేరుకూడా కలపమని అడిగింది పాపం. ముసలమ్మగారి మాట తీసివేయటం ఎందుకు? ఆమె మనస్సు సంతోషిస్తేనే మనకు క్షేమం’’ అన్నది కాంతం.
‘‘వ్రాయమంటావా?’’
‘‘మీ ఇష్టం’’
‘‘ఇంకా నా యిష్టమేమిటి? వ్రాస్తున్నానని బంగారపు ఉంగరం తీసుకొన్నాను. ఇంతలో మా నాన్న వచ్చి అబ్బాయీ, మనకు వేంకటేశ్వర్లు ఇంటి ఇలవేల్పు ప్రతి పేరు ముందరా ‘వెంకట’ చేరుస్తున్నాము. నీ పేరు అందుకనే వెంకట్రావు అని పెట్టాము. కాబట్టి వెంకట సుబ్బలక్ష్మి అని వ్రాయమన్నాడు. కాంతం నా వంక ఓరకంటితో చూసి నవ్వుకొని మామిడి చిగుళ్లలాగున్న పిల్లదాని చేతులు చెక్కిళ్లకేసి అదుముకొంటున్నది.’’
‘‘సరే, వ్రాసేదీ కాంతం?’’
‘‘నా దేముంది మీ ఇష్టం’’
‘‘అంతా నా యిష్టమే?’’ అని ఇంకా ఆలస్యం చేస్తే పేరుకు ఆద్యాంతాలలో ఏం జేరుతువో అని వెంటే వ్రాశాను. మా చిట్టితల్లికి నామకరణం అయింది. వెంకటసుబ్బలక్ష్మి అని పేరు వ్రాస్తేనేం? లక్ష్మి అని పిలుచుకుంటాను. లక్ష్మి అన్న పేరు బాగానే ఉంది అనుకున్నాను.
పిల్లకు ఎనిమిదో నెలలో మా బావమరిది చూడటానికి వచ్చి అవీఇవీ మాట్లాడుతూ ‘‘వెంకటసుబ్బలక్ష్మి ఏమంటున్నది?’’ అన్నాడు.
‘‘ఎవరు?’’ అన్నది కాంతం ఆ పేరు ఎప్పుడు విననట్లు.
‘‘ఎవరేమిటి? మొన్న పుట్టినదాని పేరు వెంకట సుబ్బలక్ష్మి కాదుటే?’’ అన్నాడు మా బావమరిది వాళ్ల అక్కయ్యతో.
అదా! మా ‘‘పద్మ’’ సంగతా? అదుగో ‘‘పద్మతల్లి తప్పటడుగులు వేస్తున్నది’’ అన్నది కాంతం.
‘‘పద్మావతి అని మార్చామురా చిట్టితల్లి పేరు ‘‘పద్మావతి’’ బాగందా?’’
‘‘బాగుండ కేం! బాగుంది బావేడి?’’
‘‘వసారగదిలో వ్రాసుకుంటున్నారు.’’ అన్నది కాంతం. మా బావమరిది నా గదిలోకి వచ్చాడు నవ్వుతూ, నేనూ సంతోషించి, ఏవో అవీ ఇవీ మాట్లాడుకొన్న తరువాత ‘‘బావా’’ పద్మావతి చేతులకు బంగారపు వత్తులు తెచ్చాను ఇవిగో’’ అన్నాడు.
‘‘పద్మావతి ఎవరు?’’ అన్నాను నేను.
మా బావమరిది తెల్లపోయి ‘కలలో ఉన్నానా, లేక పోతే మీ అందిరికి పిచ్చిఎత్తిందా?’’ అన్నాడు.
‘‘ఏమిటి’’ అన్నాను నేను.
‘‘మొన్న పుట్టిన దానికి పేరుమార్చి పద్మావతి అని పెట్టారని అక్కయ్య చెప్పిందే, నీవు పద్మావతి ఎవరు అంటావేం?’’ అన్నాడు.
‘‘ఓహో మా ‘సరోజని’ సంగతా, దాన్ని నేను సరోజని అని పిలుస్తాలే’’ అన్నాను.
‘‘మా అక్కయ్య?’’
‘‘ఆవిడ ఇష్టం ఆవిడిది, ఆ విషయంలో మేము ఇద్దరం పోట్లాడుకొన్నాము.’’
అల్లాగా, అయితే పోనిలే. నీవు పెద్దవాడివి నీ ఇష్ట ప్రకారం సరోజని అని పిలుద్దాము. ఈ భాగ్యానికి పోట్లాట ఎందుకూ అన్నాడు. నేను సంతోషించాను, మా పోట్లాటను మా బావమరిది సద్దేసినందులకు కాసేపుండి నేను లోపలికి పోయినాను. పసిబిడ్డ చేతులకు బంగారపు వత్తులు తొడిగినారు. పాలమిసమిసలతో మెరుస్తున్న ఆ ముద్దొచ్చే చేతులకు ఆ పచ్చని బంగారపు వత్తులెంతో అందంగా ఉన్నవి.
‘‘మా తల్లి – మా పద్మకు, ఈ వత్తులు ఎంత అందంగా ఉన్నవిరా, నాన్నా’’ అంటూ కాంతం పిల్లను ఎత్తుకొని ఆడిస్తున్నది.
పద్మావతి, పద్మతల్లీ అని అంటూ పిల్లను తన చేతులలోకి తీసుకొని గులాబీరేకుల వంటి దాని బుగ్గలు ఎరుపెక్కిన కొద్దీ ముద్దాడుతున్నాడు మా బామవరిది. నేను తెల్లపోయినాను. అక్కా తమ్ముడూ మహా సంతోషంతో ఉన్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందం పొంగిపొరలిపోతూ ఉన్నది. నన్ను జూచిన వాళ్లులేరు.
నేను బయటికి వచ్చాను. అప్పుడే అస్తమయం అవుతున్నది. రంగు రంగుల చీరలు కట్టుకొన్నవాళ్లు ఎవరో పశ్చిమదిక్పతి ఒళ్లో ఉన్న సూర్యుని ముద్దాడుతున్నారు. ఆ దిక్కు మహా ఆనందంలో పొంగిపోతున్నది. ఇటు ప్రక్కను ఉన్న శుద్ధాష్టమి చంద్రుడు తెల్లపోయి ఆ ఆనందాన్ని చూస్తూ, నిలబడి ఉన్నాడు.