కథానిక -3 చందమామ - పొట్టి పిచిక కథ

చందమామ! వినీల ఆకాశంలో ఎక్కడో ఉన్న చందమామను చూపి పిల్లలకు గోరుముద్దలు తిన్పించే తల్లులు నేడు కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నారు. చల్లని జాబిలిని చూస్తూ గోరుముద్దలు తినని వారు మనలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో! అలాగే చదవడం నేర్చిన నాటినుండి ఒక్కసారైనా చందమామ బాలల పత్రికను చదవని వారూ ఉండరు. బాలల సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న ఏకైక పత్రిక చందమామ. హాన్నా, బార్బరా వారి టామ్ అండ్ జెర్రి కార్టూన్ ఏ విధంగానైతే వయోభేధం లేకుండా మనసుకు ఉల్లాసం కల్గిస్తుందో, చందమామ కూడా అంతే. పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, భట్టి విక్రమార్కుని కథలు, మన పురాణాలు, నీతి కథలు, నీతి శతకాలు నేటికీ మన ఆంధ్రనాట మిగులున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం చందమామ పత్రికే.

కంప్యూటర్లూ, సెల్‌ఫోన్లూ, ఐప్యాడ్‌లూ వంటి ఆధునిక సాంకేతిక, వినోద ఉపకరణాలు ఎన్ని ఉనికిలోకి వచ్చినా, తాతయ్య కబుర్లు, బామ్మ కథలు, బాబాయి కొంటె ప్రశ్నలు ఒక్క చందమామలోనే మనకు లభ్యమవుతాయి. 1947 జూలైలో తొలి సంచికతో మొదలైన కాలం నుండి ఈ ఆరు దశాబ్ధాలలో ఏ మాత్రం వన్నె తగ్గకుండా పిన్నలను, పెద్దలను అలరిస్తూ ఇలాంటి బాలల పత్రిక మరొకటి లేదు, రాదని అందరూ ముక్త కంఠంతో ఘోషించే పత్రిక చందమామ. పిల్లల, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. తెలుగు భాష, నుడికారం, జాతీయాలు, నానుడులు, సామెతలు వీటన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భాషాపరంగా కూడా ప్రతీ తెలుగువాడు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకంగా చందమామను మల్చటంలో ఎందరో మహానుభావులు కృషి చేశారు. ముఖ్యంగా కొడవటిగంటి కుటుంబరావుగారు 30ఏళ్లపాటు చందమామకు అనధికార సంపాదాకులుగా ఉండి పత్రికను తీర్చిదిద్దారు.

ఆరోగ్యకరమైన బాలల సాహిత్యాన్ని అందించటంతోపాటు పిల్లలో ధైర్యసాహసాలు, నిజాయితీ, స్నేహశీలత, త్యాగబుద్ది, కార్యదక్షత వంటి మంచి బుద్ధులు పెంపొందించేందుకు చందమామ తోడ్పడుతోంది. అంతర్లీనంగా ప్రతి కథలోను, ఒక నీతి సూత్రం, సంభాషణల్లో తర్కం, మూఢనమ్మకాలను మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం వంటివి చందమామ చదువుతూ పెరిగిన పిల్లలకు దొరికిన పెన్నిధి.

అరవైనాలుగు సంవత్సరాలుగా సాహితీ రంగలో తనకంటూ ఒక విశిష్టస్థాన్ని సంపాదించుకున్న చందమామ నేడు 12 భాషల్లో ప్రచురితమవుతోంది. తెలుగు, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, అస్సామీస్, సంస్కృతం, సంతాలీ.. ఇలా 12 బాషలతోపాటు అదనంగా ఇంగ్లీషు చందమామ, జూనియర్ చందమామ -తొమ్మిదేళ్ల వయసు లోపు పిల్లలకు ఇంగ్లీషులో ప్రచురితమవుతున్నాయి. ఒక పత్రిక 12 భాషలలో తొలి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ఫార్మాట్‌లో రూపొందుతున్న చరిత్ర నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క ‘చందమామ’కు మాత్రమే దక్కిందనుకుంటాను.

ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా తెలుగువారిని అలరిస్తున్న చందమామ ప్రథమ సంచికలోని ‘పొట్టి పిచిక కథ’ ఇక్కడ మీకోసం. ఈ కథను రాసిన శ్రీ అవసరాల రామకృష్ణగారు ఇటీవలే నవంబరు, 2011న మరణించారు. 64వ వార్షిక సందర్భంగా జూలై 2011 సంచికలో తొలి చందమామ కథకులు రామకృష్ణగారి తొలికథతోపాటు మరో మూడింటిని జతచేసి చందమామ ప్రచురించి, ఆయన పట్ల తమ గౌరవాన్ని చాటుకుంది.

‘పొట్టి పిచిక కథ’

అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టేవరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై. అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టిపిచిక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది.

ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది. ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది. కోపం వచ్చింది. ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు.

పాపం పొట్టిపిచ్చిక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా? చంకలో కూచునే పాట ఎత్తకుంది!

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!
కంచమంత జొన్నచేను గూ, గూ, గూ!
రెండు భమిడిలేళ్లు గూ, గూ, గూ!
రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ!
చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ!
నేను కూడా తినబోతే గూ, గూ, గూ!
పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ!
పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ!
నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ!

ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ? ఊళ్లోకిపోతే దీనిపాటవిని అంతా నవ్వుతారు! అందుకని ఊరిబయట ఉన్న శెట్టిగారి అరుగుమీద కూచున్నాడు.

మన పిచ్చిక నోరుమూస్తేగా! పాడుతూనే ఉంది.

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ! అని. దీనిపాటవిని శెట్టి బయటకి వచ్చి “ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెండతండీ?” అన్నాడు. బ్రాహ్మడు దోసిట చూపి “ఇంత!” అన్నాడు. “ఇంతేనా?” అన్నాడు శెట్టి. “కాదు!” అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి “ఇంత!” అన్నాడు.

“ఓసి ఇంతేనా!” అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి “ఇంత!” అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని “కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ!” అని పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *