కథానిక 10 – అక్షయ పాత్ర

కథ మన జీవన శైలిలో ఒక భాగం. అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెపుతుంటే, వారి చుట్టూ చేరి ‘ఊ’ కొడుతూ నిద్రలోకి జారుకునే బాల్యం నేడు దాదాపు అంతరించిపోతేందనే చెప్పాలి. అయినా, ఎక్కడోక్కడ ఒక బామ్మ, తన మనవళ్లని, మనవారళ్లని వెన్నల్లో పక్కన కూర్చోపెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోనో, జో కొడుతూనే వారు తమ బాల్యంలో విన్న కథలను ఇంకా కథలుగా చెపుతూనే ఉన్నారు. ఈ కథలు మనకు ఏ పుస్తకాలలోనూ కన్పించవు. కథ ఒక వినోదం, కథ ఒక అనుభవసారం. కథ ఒక విజ్ఞాన దీపిక. కథ ఒక జీవితం. కథ అనే పదానికి నిఘంటువు చెప్పే అర్థమేదైనా, జనపథంలో జానపదులు సృష్టించిన అసాధారాణ, కల్పిత గాథలే నిజమైన కథలు. తాము విన్నవి, కన్నవి చదువురాని జానపదుల మస్తిష్కంలో రూపుదిద్దుకున్న చిత్రరూపాలకు ధ్వనిస్వరూపమే జానపథ కథలు. వీటిలో పురాణాలు, ఇతిహాసాలు, నీతి కథలు ఏవైనా ఉండవచ్చు. అవి జానపదుల నోటిలో నాని, మట్టివాసనతో, మనసులకు హత్తుకునే విధంగా వారి మాటగా వెలుపలకి వస్తాయి. వీటి స్వరూప, సారుప్యాలను విశ్లేషించడం కంటే, వారి మనోభావాలను, ఆర్తిని అర్థం చేసుకుంటే, కథల ప్రయోజనం మనకు విగతమవుతుంది. జంతువులు, పక్షలు, మనష్యులు అన్నీ, అందరూ వారి కథలలో పాత్రలే. హాస్యం, అద్భుతాలు, అభూత కల్పనలతో జనరంజకంగా సాగుతాయి జానపద కథలు. ఈ జానపద కథలను సేకరించి, పుస్తకరూపంలో తీసుకురాకపోవడం వల్ల అనేక కథలు కాలగర్భంలో కలిసి పోయాయి. తద్వారా భాష, పదాలు, పలుకుబళ్లు, సామాజిక పద్దతలు కనుమరుగవుతున్నాయి. జానపద కథలకు అక్షరరూపం ఇచ్చి ముందుతరాల వారికి అందించాలన్న సదుద్దేశంతో రాయలసీమ, సర్కారు ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఆంధ్రారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోని కథలను పలువురి సహకారంతో సేకరించి డాక్టర్ జి.ఎన్. మోహన్ గారు యువభారతి వారి సహకారంతో అచ్చువేయించారు. ఆ తెలుగు జానపద కథల సంకలనం నుంచి మీ కోసం ‘అక్షయ పాత్ర’ కథ. ఈ కథను పశ్చిమ గోదావరి జిల్లకు చెందిన పోలవరం తాలుకా కన్నాపురం వాసస్థురాలైన వరాలమ్మ గారి ద్వారా విని సంకలనం చేశారు.

అక్షయ పాత్ర:

అనగనగా ఒక ఊళ్లో, ఒక పేదోడున్నాడు. ఆళ్ల సంసారం గడవటం చాలా ఇబ్బందిగా ఉంటే అతని పెళ్లాం ఒక రోజున మినపరొట్లు చేసి మొగుడికిచ్చి దార్లో ఆకలేసినప్పుడు తింటూ పొరుగూరు కెళ్లి పని సంపాదించి డబ్బు పొగుచేసుకొని రమ్మని పంపింది. ఆ పేదోడు రొట్టల్నిమూటగట్టుకొని అడువులెమ్మట పడి పోతున్నాడు. దార్లో నిదరొచ్చి ఒక చెట్టు కింద పడుకున్నాడు. రాత్రి దేవ కన్యకలు సరదాగా షికారుకు వచ్చారు. ఆళ్లకి పేదొడి మినపరొట్లు గుమ,గుమ వాసనొచ్చాయి. ఆళ్లు వాసన వచ్చిన దారంట వచ్చి పేదోడి పక్కలో ఉన్న రొట్టెల్ని పూర్తిగా తినేశారు. ఆడికి మెలకువ వచ్చి చూస్తే రొట్టెల్లేవు. ఆడు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు దేవకన్నికలు నాయనా ఏడవకు నీకేం కావాలో కొరుకో ఇత్తాం అన్నారు. ఆడు తిండికి లేక బాధపడుతూ పనికోసం ఎడుతున్నానని చెప్పాడు. దేవకన్నెకలు జాలిపడి ఆడికి ఒక అక్షయ పాత్ర ఇచ్చారు. ఆకలేసినప్పుడు కావాల్సిన పిండి వంటలు తలుచుకుని, బోర్లిస్తే అవన్నీ వత్తాయని చెప్పారు. ఆ పేదోడు బోర్లించి చూశాడు. పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి. పేదోడు ఆనందంగా ఆగిన్ని ఇంటికి పట్టుకెల్లి పెళ్లానికి చూపించాడు. ఆళ్లకి తిండికి లోటులేదుకదాని ఊళ్లో వాళ్లకి విందుచేద్దాం అనిపించి ఊరందర్ని బోయినాలకి పిలిచారు. అందరూ ఎల్లాగూ పెడతాడో చూద్దామని వచ్చారు. అందరికీ ఇస్తళ్లు ఏసి గిన్ని బోర్లించుకుంటూ ఎల్లుతుంటే పంచభక్ష్య పరమాన్నాలతో అన్నం పడింది. అందరూ ఆనందంగా తిన్నారు. చివర్న అది ఎల్లాగొచ్చింది అడిగారు. అప్పుడు పేదోడు జరిగినదంతా చెప్పాడు.

ఆళ్ల పక్కింటి రాజమ్మకి ఆశ పుట్టింది. మొగుణ్ణి పిల్చి రొట్టెలు మూటకట్టి పంపింది. ఆడుకూడ పేదోడు పడుకున్న చెట్టుకింద నిద్దర రాకపోయినా పడుకున్నాడు. మామూలుగా దేవకన్నెకలు షికారుకు వచ్చారు. ఆళ్లకి రొట్టిలు గుమాయించలేదు. అంచేత ఆళ్లు తీసుకోలేదు. కాసేపు చూసి దేవకన్నెకల్లారా రొట్లు తెచ్చాను తినండి అని పెట్టాడు. ఆళ్లు తినేశారు బాగోపోయినా. ఆళ్లు తినేయ్యగానే నారొట్లు నాకివ్వండని ఏడుపు లంకించుకున్నాడు. ఆళ్లకి కోపం వచ్చింది. తినమన్నది నువ్వేకదా అన్నారు. అయితే నాకొక అక్షయపాత్ర ఇవ్వండి పోతానన్నాడు. దేవకన్నెకలిచ్చారు. ఈడు కంగారుగా బోర్లించి చూసాడు. ఇద్దర మంగలోళ్లు పుట్టారు. ఒకడు మెడవంచి పట్టుకున్నాడు. రెండోవోడు నున్నగా గుండుగీసాడు. ఈడు ఏడ్చుకుంటూ ఇంటికిపోయాడు. పెళ్లాం కూడా ఏడ్చింది. ఆళ్లకి జరిగిన పరాబవం అందరికి జరగాలని ఊళ్లోవాళ్లని బోయినాలకు పిల్చారు. అందర్నీ కూచోపెట్టి ఇస్తళ్లు ఏసి గిన్ని బోర్లించుకుంటూ పోయారు. అందరి ముందలా ఇద్దరేసి మంగలోళ్లు పుట్టి మెడవంచి అందరికీ గుండుగీసి మాయం అయిపోయారు. ఈడు చేసిన పనికి అందరూ తిట్టుకుంటూ పోయారు. కత కంచికి మనం ఇంటికి.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *