

ఆస్ట్రేలియా వచ్చి పది వసంతాలు దాటిందని తల్చుకుంటే, ఒళ్ళు గగుర్పోడుస్తుంది. మొట్టమొదటిసారి పెర్త్ విమానాశ్రయంలో కాలిడిన నాటి సంఘటనలు కళ్ల ముందు రింగులు తిరుగుతూ జ్ఞాపకాల ఒడిలోకి చేరుస్తున్నాయి. పుట్టినాటి నుంచి ఆంధ్రావని వాకిట ఆటలాడి ఒక్కసారిగా మరో దేశానికి వలస పక్షుల్లా చేరటం తలుచుకుంటే సాహసమే అనక తప్పదు. విమానాశ్రయం ముంగిట నిలబడి ఈ మహా ప్రపంచటంలో మనకి దిక్కెవరూ అన్న భయం కలగకపోలేదు. టాక్సీలో కూర్చుని రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న పెంకిటిళ్లు చూసి నోరు వెళ్లబెట్టి, అప్పుడే ఏమైంది, పోను, పోను పట్టణ విశేషాలు తెలుస్తాయిలే అని సర్ధి చెప్పుకున్న ఆ క్షణాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అపార్టమెంట్ బాల్కనీలో నుంచి చూస్తే కింగ్సపార్క్ కొండలలోకి జారుతున్న సూరీడు, స్వాన్ నదిపై దోబూచులాడుతున్న నెలరాజు, ముంగురులను తాకి వెళ్లే పిల్లగాలులు ప్రకృతి అందాల్ని దొసిట పట్టినంత ఆనందం, ఇక్కడికి వచ్చి తప్పు చేయలేదని వెన్నుతట్టినట్టన్పించింది.
అంతలోనే వసంత లక్ష్మి తలుపుతట్టింది. షడ్రుచుల పచ్చడేదని ప్రశ్నించింది. గబ,గబా పెరట్లోకి వెళ్లి చూస్తినా మామిడమ్మ వెలవెలబోతూ దర్శనమిచ్చింది. ధనుర్మాసంలో కన్పించని సలహా ఇచ్చింది. వేపపువ్వు కోసం వెర్రి చూపులు చూస్తుంటే, పులుపు, చేదు లేని జీవితమని మది వెన్నుతట్టి బెల్లం, చింతపండుతో సరిపెట్టమంది. తీరా చూస్తే నల్లబొగ్గులాగా చింతపండు, దానితో పోటీపడుతు బెల్లం నవవసంతుడికే బెంబేలు పుట్టించాయి. గత్యంతరం లేక ఉసూరుమనే ప్రాణంతో అదే భాగ్యమనుకొని సరిపెట్టుకున్న ఆ రోజుకి ఈ రోజుకి ఏమీ తేడాలేదు. కాకపోతే కొంచెం రాటుదేలి ఆవకాయబద్దని ఉగాది పిందెగా వాడుతున్నాం. కాలం గిర్రున తిరుగుతుంటే శ్రీరామనవమి, రథ సప్తమి, వసంత పంచమి, నాగుల చవితి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెడుతున్నాయో కూడా అర్థంకాని సందిగ్ధావస్థలోకి చేరుకున్నాం.
అయినా వర్షం వస్తే, వీథులన్నీ నీటితో నిండి, గుంటెక్కడో, రోడ్డెక్కడో అన్న భయంలేదు. ప్రొద్దునే కడిగిన వాకిటిలా శుభ్రమైన రోడ్లు, అటునుంచి ఆటోవాడు వచ్చి గుద్దుతాడో, ఇటునుంచి లారీవాడు రాసుకు పోతాడో అన్న భయంలేకుండా నింపాదైన రోడ్లు. రెండుచేతులూ జాపుకుని రోడ్డుమీద నడిచినా మరో మనిషికి తగలే అవకాశంలేని నిర్మానుష్య ప్రపంచం. ఆకాశం వైపు చూస్తే ముచ్చటగొలుపుతూ మూడువైపులా నిండి ఉండే ఇంద్రధనస్సు, నీలి ఆకాశం, తెల్లని మేఘాలు, స్వచ్ఛమైన గాలి, నీరు, కనుచూపు మేర దాటని పచ్చదనం, కాలుష్యంలేని వాతావరణం ఇంతకంటే ఏం కావాలి అన్పించినా ఎందుకో చెప్పలేని వెలితి.
పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించామన్న ప్రశ్న జేగంటలా చెవిలో మోగుతోంది. సమాధానమివ్వమని నిలదీస్తోంది. పండగా, పబ్బం పదిమందితో కల్సి పంచుకోలేము. పక్కింటి పిన్నిగారు పాయసంతోనో, ఎదురింటి బామ్మగారు బందరు లడ్డుతోనే మన తలుపు తట్టే భాగ్యం లేదు. స్నేహితుల ఇంటికైనా ఫోను చేయకుండా, పర్మిషన్ తీసుకోకుండా వెళ్లలేము. సామూహిక వినాయక చవితులు, శ్రీ రామ నవమి పూజలు, దసరా ఉత్సవాలు ఆంధ్రదేశం నుంచి తెచ్చుకున్న చీరలు ప్రదర్శించే ఫ్యాషన్ షోలే! రాజకీయాలు, క్రికెట్ చర్చించుకునే రచ్చబండలే! వినాయక చవితి వచ్చిందంటే పత్రికోసం, మట్టి విఘ్నేశ్వరుని కోసం బజారు కెళ్లక్కర్లేదు. గతం సంవత్సరం నిమజ్జనంకాని వినాయకుడు ఇంటనే రెడీ, పెరట్లో గంపలకొద్ది గరిక పత్రి కంటే శ్రేయష్కరం. వరలక్ష్మీ శుక్రవారం తాంబులాలు తట్టల్లో నింపి పెడితే, శనివారమో, ఆదివారమో తీరిక చేసుకొని, చూసుకొని తెచ్చుకోవచ్చు, ఇచ్చి రావచ్చు. ఇంటివాళ్లు లేకపోతే పోస్టుబాక్స్ ఉండనే ఉంది. దీపావళికి ప్రమిద దీపాలు శాస్త్రం కొరకే, ఇంటి చుట్టూ క్రిస్మస్ దీపాలే. కొంచెం అతిగా అన్పించినా దశాబ్ధకాలంలో మారిన జీవిత విధానమిదే అని అంగీకరించక తప్పదు.
శ్రీరామ నవమి పందిళ్లో వడపప్పు, పానకం, నవరాత్రి వ్రతాలు, సంక్రాంతి గొబ్బెమ్మలు, ముంగిట ముగ్గులు, ఆకాశ మంతా ఇంద్రధనస్సులా రెప, రెపలాడే గాలిపటాలు, చెవులు చిల్లులు పడేలా స్పీకర్ల హోరు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల సవ్వడులు పండగలకి తెచ్చే ఆనందమే వేరు. అలాంటి హడావుడి లేకుండా జరుపుకునే పండగలు ఉప్పులేని పప్పులాగా చప్పగా నీరసించి ఉత్సాహం నీరుకారి గార్డన్ లోకి చేరుకుంటోంది. ఆంధ్రదేశంలో ఇంతకంటే గొప్పగా జరుపుకుంటున్నారని కాదు. మార్పులు అక్కడా పరిపాటే. కాకపోతే, తెలుగుతనం, సంప్రదాయం అంటూ ప్రవాసాంధ్రల గింజులాటకి నవ్వువస్తుంది. హాలోవీన్, గుడ్ ఫ్రైడే, ఆంజాక్ డే, క్వీన్స్ బర్త్ డే, క్రిస్మస్ డే, లాంగ్ హాలీడే గుర్తుంటున్నాయి గాని, మన పండగల కోసం క్యాలెండర్లు తిప్పాల్సిందే.
ఈ అయోమయంలోనే, గతంలోకి తొంగిచూస్తే, కరెంట్ కోతతో చెమటలు ఏరులై పారుతుండగా ఆరుబయట నులక మంచం పర్చుకొని ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి. చేతినిండా గొరింటాకు పెట్టకుని కూర్చొంటే అమ్మ కొత్త ఆవకాయలో ఘుమ, ఘుమలాడే వేడి, వేడి నెయ్యివేసి గోరుముద్దలు తిన్పించే ఆ కమ్మటి రోజులే గుర్తుకొస్తున్నాయి. పండగొస్తే, సినిమా థియేటర్ల ముందు పడిగాపులు పడతూ టికెట్లు దొరుకుతాయా, లేదా అని అత్తమామ, పిన్ని, బాబయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ,నాన్నలతో కల్సి ఎదురు చూసిన ఆ మధుర క్షణాలే గుర్తుకొస్తున్నాయి. నిండు గర్భిణిలా ఇసకవేస్తే రాలనంత జనంతో నిక్కుతూ, నీల్గుతూ వచ్చే సిటీ బస్సులోకి పద్మవ్యూహంలోకి చొచ్చుకు వెళ్లే వీరాభిమన్యునిలా ప్రవేశించి, అప్పటికే బస్సులో ఉన్న స్నేహితురాలిని చూసి చిరునవ్వులు విసిరిన ఆ తీపి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. శనివారం సాయంత్రం దూరదర్శన్ లో శంకరాభరణం సినిమా చూస్తుంటే సడన్ గా కరెంటు పోయినప్పుడు దొరకునా ఇటువంటి సేవా అని పాడుకున్న అల్లరి క్షణాలు గుర్తుకొస్తున్నాయి. వినాయక చవితికి స్నేహితుల ఇళ్లల్లో గుంజీలు తీయడానికి పడ్డ ఆపసోపాలు, వాకిట్లో కూర్చుని పక్కింటి బామ్మగారితో ఆడిన అష్ఠాచెమ్మా, వైకుంఠపాళీ ఆటలు, ఇంటిముందు వేసిన భోగిమంటలు, గడపకి రాసిన పసుపు, గుమ్మానికి కట్టిన పచ్చని తోరణం, వీథి చివరన రామాలయంలో మ్రోగుతున్న గంట, ఒకటేంటి మనసు అట్టడుగున అదిమిపెట్టి ఉంచిన జ్ఞాపకాలన్నీ వినీలాకాశం నుంచి నేలరాలే తోక చుక్కలా మది అంతరాలలోంచి నేలరాలుతుంటే, ఆ జ్ఞాపకాలని దోసిట బంధించాలని ఆత్రుతతో మరో పదివసంతాల వైపు పరుగెడుతున్న నా అవివేకం గుర్తుకొస్తోంది.
సౌమ్యశ్రీ రాళ్లభండి