
శాక్తేయులానుసారం సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘ఆస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. శివశక్తి ద్వయమే కాని ఒక్కటికాదు. ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరించగా, ఒకటి ‘పుం’ రూపము, మరియొకటి స్త్రీ రూపమయినది. శివశక్తి రూపములు ఒకే తత్త్వమును స్వభావమును, రూపమును, నామము కలవి. ఆయన సదాశివుడు ఆమె శక్తి. ‘నమశ్శివాభ్యం నవయౌవనాభ్యం’ అని శంకరుల స్తుతి. వారు నిత్య యవ్వనులు.
పరమాత్మ అంశములు – ఆస్తి, భాతి, ప్రియం, నామరూపం, మిత్యంశ పంచకములు. అనగా మొదటి మూడు పరమాత్మ యొక్క అవ్యక్తమైన స్థితి. నామమన్నది వాగర్ధ రూపము. వాక్కు శక్తి రూపం – అర్ధం శివరూపము. ఇది అక్షరము, సకలము, వ్యక్తము, మూర్తము కనుకనే శివశక్తులను గురించి మనము అనగలము, వినగలము, మాట్లాడగలము. ‘నశవేన వినాశక్తిర్న శక్తి రహితః శివః’, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు లేనిదే శక్తి లేదు.
ప్రకృతి అంతా శివునిచే చైతన్యవంతమైనది. ప్రకృతిలో లీనమైన పరమాత్మ వలన ప్రకృతి ప్రకాశించుచున్నది. అది అజడ ప్రకృతి. జడ ప్రకృతి జీవము లేనిది కనుక ప్రకృతికి శివుడే దీపము. రూపము కాలమును బట్టి, స్థలమును బట్టి ఏర్పడును. ఈ రూపము శక్తి భాగము. ఈ రూపమును చైతన్యము చేయువాడు శివుడు. ఇతి స్థూలంగా శివశక్తిమయమైన అంశపంచకము యొక్క లక్షణము.
న శివేన వినా దేవీ దేవ్యాచన సదాశివః
నైత యోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివ
అను ఆగమ సిద్ధాంతము వలన శివశక్తులకు అన్యోన్యబేధము లేదని తెలుస్తోంది. ప్రకాశబిందువు శివ స్వరూపము, చంద్ర మండలము. ‘అ’కారముగా గ్రహింపవలెను. విమర్శ బిందువు శక్తి స్వరూపము. అగ్ని మండలము. ‘హ’ కారముగా గ్రహింపవలెను. ఈ ప్రకాశ, విమర్శ బిందువుల సంయోగము వల్ల మిశ్రమ (సూర్య)బిందువు జనించుచున్నది. అకార స్వరూపమగు పరమశివుడు, హకార స్వరూప పరాశక్తిని వీక్షించినపుడు, ఈ వీక్షణ సంయోగము వల్ల జనించిన మూడవ ప్రతిబింబము ‘అహం.’ ఇది పరశక్తి అద్దము వంటింది.
స్ఫుట శివశక్తి సమాగమ బీజాంకుర రూపిణీ పరాశక్తిః
అణుతర రూపానుత్తర విమర్శ లిపి లక్ష్య విగ్రహ భూతి
బీజాంకుర రూపమయిన ప్రకాశ విమర్శనాత్మక శివశక్తి స్వరూప తేజోమయమయిన ‘అహ’ మనే బీజద్వయము శరీరముగా కలిగి పరాశక్తి ప్రకాశించుచున్నది. అందువలన పదములు, వాక్యములు, వేదాది సకల శాస్త్రములు, గాయత్రీ మొదలగు మంత్రములు సృష్టింపబడినవి. కావున అన్ని వర్ణములు శివశక్తిమయములే. మనయందుగల అజ్ఞానమనే చీకటిని ప్రారదోలి జ్ఞానమనే వెలుగును ప్రకాశింపచేయునవి సదాశివశక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి పార్వతి, సరస్వతి, లక్ష్మి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్న ఏకత్వ లక్షణముల గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్ని శాకరః’ – ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెపుతోంది.
ఈ అథోముఖముగా ఉన్న త్రికోణంలోగల త్రిరేఖల యందు సమానముగా 16 అక్షరాలు కలవు. ఒక రేఖ యందు అ నుండి అః వరకు 16 అక్షరములు, మరియొక రేఖ యందు క నుండి త వరకు 16 అక్షరములు, మరో రేఖ యందు థ నుండి స వరకు 16 అక్షరములు కలవు. పంచదశాక్షరి మంత్రమైన ‘కఏఈల హ్రీం హాసకహాల హ్రీం సకల హ్రీం’ నకు ‘శ్రీం’ బీజము కలిపినచో షోడాక్షరి మంత్రమగుచున్నది. ఈ అక్షరములన్నియు సదాశివశక్త్యాత్మకము నుండి ఉద్భవించినవి.
(శివరాత్రి పర్వదినం సందర్భంగా సేకరించిన వ్యాసం)