వార్తారంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం

వార్తారంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం
వార్తారంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం

సాంకేతిక విజ్ఞానం అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా సమాచార రంగంలో, సమాచార వికేంద్రణలో, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార పంపిణీలో ఊహించని విధంగా సాంకేతిక విప్లవం ప్రభావాన్ని చూపిస్తోంది. సాంప్రదాయ పత్రిక నుంచి అంతర్జాల పత్రికలకు నేడు పాఠకుడు చూపు మరల్చాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, గూగుల్, ఇన్ స్టాగ్రామ్ వంటి అనేక సామాజిక మాధ్యమాలు నేడు ప్రజలకు సమాచార వేదికలయ్యాయి. పత్రికలలో, సాంకేతిక మాధ్యమాలలో వచ్చే సమాచారంలో నిజం ఎంతో, అబద్దం ఎంతో తెలియకుండా పోతోంది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుని ఎన్నికలు, కోవిడ్ మహమ్మారి సమయంలో వాస్తవం కంటే అవాస్తవమైన సమాచారం సామాజిక మాధ్యమాలలో కారుచిచ్చులా వ్యాపించాయి.

వార్తల పంపిణిలో సామాజిక మాధ్యమాల ప్రభావం: మొబైల్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కువమంది పత్రికలను చదవటం కంటే, మొబైల్ లోనే వార్తలను చదవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్యూ రీసెర్చి సెంటర్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 2015 నాటికి దాదాపు 90లక్షలమంది ఫేస్ బుక్ ద్వారాను, 20 లక్షలమంది ట్విట్టర్ ద్వారా దాదాపు వెయ్యికిపైగా పదాలున్న వ్యాసాలను చదువుతున్నారు. ఇక స్వల్పకాలం ఈ మాధ్యామాలను ఉపయోగించి వార్తలను పొందుతున్నవారిలో ఫేస్ బుక్ నుంచి 3.20కోట్లమంది, ట్విట్టర్ ద్వారా 50 లక్షలమంది ఉన్నారు. మరో అధ్యయనం ప్రకారం 63శాతం మంది ఫేస్ బుక్, ట్విట్టర్ వినియోగదారులు ఈ మాధ్యమాలపై వార్తల కోసం ఆధారపడుతున్నారని తేలింది.

ఇక గూగుల్ శోధన ద్వారా ప్రతినెల 24బిలియన్ మంది వివిధ అంతర్జాల పత్రికలను దర్శించి, సమాచారాన్ని పొందుతున్నారు. ఇప్పుడు గూగుల్ బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ న్యూస్ షోకేస్ అనే కొత్త యాప్ ద్వారా అంతర్జాల పత్రికారంగంలో పెనుమార్పులు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ఆ సంస్థ ఇప్పటికే జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, యుకె, మరియు ఆస్ట్రేలియాలోని దాదాపు 200పైచిలుకు పత్రికా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. ఒక్క ఆస్ట్రేలియాలోనే 70 పత్రికలతో గూగుల్ ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిలో ది కాన్బరా టైమ్స్, ది వెస్ట్రన్ అస్ట్రేలియా, ది న్యూ డైలీ, ది కాల్ గుర్లీ మైనర్ తదితర పత్రికలున్నాయి. గూగుల్ షోకేస్ లో వార్తలను ప్రచురించినందుకుగాను గూగుల్ ఈ పత్రికలకు కొంత సొమ్మును రాయితీ రూపంలో అందిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా తీసుకువచ్చిన మీడియా కోడ్ ఎన్నో ప్రశ్నలకు తావిచ్చింది. వాణిజ్య ఒప్పందాల ద్వారా గూగుల్, ఫేస్ బుక్ పొందుతున్న లాభాలతో పోలిస్తే, ఈ సంస్థలు సమాచార సంస్థలకు వెదజల్లుతున్నది చిల్లర నాణాలే అని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ వాదన (ఎసిసిసి).

ఆస్ట్రేలియాలోని ఐదు స్థానిక పత్రికాసంస్థల ఉమ్మడి వాణిజ్య ప్రకటనల ఆదాయంతో పొలిస్తే గూగుల్, ఫేస్ బుక్ల సంయుక్త ఆదాయం దాదాపు 400మిలియన్ డాలర్లు ఎక్కువ. 2019 సంవత్సరానికి గాను వాణిజ్య ప్రకటనల ద్వారా ఆస్ట్రేలియాలో గూగుల్ ఆదాయం 4.3బియలన్ డాలర్లు కాగా, ఫేస్ బుక్ ఆదాయం 674 మిలియన్ డాలర్లు. అదే ఆస్ట్రేలియాలో అతి పెద్ద పత్రికా సంస్థ సెవెన్ వెస్ట్ మీడియా ఆదాయం 1.1బిలియన్ డాలర్లు, కాగా న్యూస్ కార్ప్ ఆదాయం 1.2బియన్ డాలర్లు, నైన్ ఎంటర్టైన్మెంట్ ఆదాయం1.48బిలియన్ డాలర్లు. కేవలం తమన సైట్లకు వస్తున్న వినియోగదారులకు ఇతర పత్రికల వార్తలను అందించటం ద్వారా ఈ సంస్థలు రెండు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతుండగా, ఈ వార్తలను సేకరించి, ప్రచురిస్తున్న పత్రికా సంస్థలకు మాత్రం చుక్కెదురు కావటం ప్రశ్నార్ధకంగా తయారయింది. అందుకే ఎసిసిసి కొత్తగా మీడియా కోడ్ తీసుకువచ్చింది.

సంవత్సరంఫేస్ బుక్ ఆదాయం (మిలియన్ డాలర్ల)గూగుల్ ఆదాయం
(మిలియన్ డాలర్ల)

2019$69,655$134,811
2018$55,013$116,461
2017$39,942$95,577
2016$26,885$79,383
2015$26,885$67,390

ఈ మీడియా కోడ్ ప్రకారం సామాజిక మాధ్యమాల ద్వారా, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఏ సంస్థ అయినా ఆస్ట్రేలియా పత్రికల వార్తలను ప్రచురిస్తే అందుకుగాను స్థానిక పత్రికలను రాయితీలను ఇవ్వాలి. ఇందుకుగాను గూగుల్, ఫేస్ బుక్ పత్రికా సంస్థలతో వేరు, వేరుగా ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఈ ప్రతిపాదన వలన స్థానిక పత్రికలు వాణిజ్య సంబంధమైన ఆదాయాన్ని కోల్పోవని ప్రభుత్వం అభిప్రాయం. సహజంగానే గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు అభ్యంతరాలు తెలిపాయి. ఫేస్ బుక్ ఒక అడుగు ముందుకు వెళ్లి అస్ట్రేలియా వార్తలను, వార్తాపత్రికలను నిషేధించాయి. అలాగే చిన్న పత్రికలు కూడా ఈ కోడ్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేవు. దీనివల్ల పెద్ద కంపెనీలు లాభపడతాయేకాని, చిన్న పత్రికలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్నది వారి వాదన.

దానాదీనా తగదా వచ్చి ఆర్ధిక వనరుల భాగస్వామ్యం దగ్గర ఆగింది. మౌళికమైన సమాచారం, దాని పంపిణీ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. మారుతున్న సమాజం, సాంకేతిక విజ్ఞానం మనిషికి అనేక రూపాల్లో కావాల్సిన సమాచారాన్ని పొందే అవకాశం కల్పించింది. అయితే వారు ఎంతవరకు సమాచారాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి సమాచారాన్ని కొరుకుంటున్నారన్నదే ప్రశ్న. గూగుల్ కి, ఫేస్ బుక్కి ఎందుకు అంత డిమాండ్ ఏర్పడింది? నేడు ప్రజలు వార్తలను సంపూర్ణంగా చదవడానికి ఇష్టత కనపర్చట్లేదు. అలాగని పూర్తిగా దూరమూ అవట్లేదు. కేవలం ముఖ్యాంశాలు చదవుతున్నారు, మరీ ఆస్తకి కల్గిస్తే, మరో అడుగు ముందుకు వెళ్లి సారాంశం చదువుతున్నారు. వేగంగా సమాచారాన్ని పొందడానికి సామాజిక మాధ్యమాల మీద ఆధారపడుతున్నారు. వార్తారంగం కూడా పాఠకులను చేరడానికి సామాజిక మాధ్యమాలను ఆసరిస్తున్నాయనడంలో సందేహం లేదు.

అయితే సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే వార్తలపై పాఠకుని నమ్మకం తక్కువే అని చెప్పాలి. టూసైడ్స్ అనే సంస్థ జరిపిన ఒక అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 24 శాతంమంది సామాజిక మాధ్యమాల ద్వారా అందే వార్తలను విశ్వసించలేమనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. అమెరికాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా 35శాతం మంది అమెరికన్లు సామాజిక మాధ్యమాల పట్ల విశ్వాసం వ్యక్తపర్చారు. డిజిటల్ మాధ్యమం ద్వారా వార్తలలోతుకి అర్ధం చేసుకోవడం వెళ్లి సాధ్యం కాదని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నా, 50శాతం మంది ఆన్ లైన్ ద్వారా వార్తలను చదవడానికి ఇష్టపడుతున్నారు.

పాఠకుల అభిరుచులకనుగుణంగా సామాజిక మాధ్యామాలు వార్తలను, వాణిజ్య ప్రకటలను వారికి అందేటట్టుగా సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తూ, తద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి. తమ వార్తలను వినియోగించుకుని పాఠకులు, వాణిజ్య ప్రకటనదారులను ఆకట్టుకుని లబ్దిపొందుతున్నాయి కావున, తమర వాటా ఇవ్వాల్సిందిగా వార్తారంగం డిమాండ్ చేస్తోంది. ఏ వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో భాగం కావాలని వార్తా రంగం, సామాజిక మాధ్యమాలతో వివాదానికి దిగుతోందో, ఆ వాణిజ్య ప్రకటనల పట్ల తామకు ఎటువంటి ఆసక్తి లేదని 68శాతం మంది తెలిపారు. కాగా, సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటలనతో పోలిస్తే, పత్రికలలో వచ్చే ప్రకటలను తాము గమనిస్తామని 46 శాతంమంది తెలిపారు.

మారుతున్న సమాజం, దానికనుగుణంగా మారుతున్న పాఠకుల ఇష్టాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం వల్ల ముందు, ముందు మరిన్ని ప్రశ్నలు తలెత్తకమానవు. ఈ జరుగుతున్న మార్పులని గమనిస్తే, శరవేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కట్టలు తెంచుకున్న ప్రవాహంలా అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోందని అర్థమవుతోంది. ఒక మాధ్యమాన్ని మించి మరొకటి వినూత్న పంథాలో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీదేశం తమ,తమ మీడియా చట్టాలను సవరించక తప్పదు.

సౌమ్యశ్రీ రాళ్లభండి