తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు 6 సింగరాజు లింగరాజు

తెలుగు నాటక సాహిత్యంలో సింగరాజు లింగరాజు ఒక విలక్షణమైన పాత్ర. భారతీయ సాహిత్యంలోనే ఒక అపూర్వ సృష్టి. స్వార్ధం, లౌక్యం, పిసినిగొట్టుతనం కలబోసుకుని పుట్టిన పాత్ర. ‘ధనం మూలం మిదమ్ జగత్తు’ అనే సూత్రానికి భాష్యకారుడు అతనే! లింగరాజుకు డబ్బే సర్వస్వం! ఈ చరాచర ప్రపంచంలో ప్రతి వస్తువునూ డబ్బు అనే కళ్లద్దాల ద్వారానే చూస్తాడు ఆ మహానుభావుడు. అతడు దేవుణ్ని ప్రార్ధించేది తనకు సుఖశాంతులు ప్రసాదించమని కాదు, తన ఇంట్లో ధనరాసులు కుమ్మరించమని. కట్నంతో మూటలు కట్టుకోవచ్చని అతడు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. కుర్నవాణ్ణి కాలేజీకి పంపిస్తున్నాడే డబ్బు ఖర్చుపెట్టి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! కాలేజీ విజ్ఞాభివృధ్ధికోసం కాదు, కట్నం ‘రేటు’ పెరగటం కోసం. లింగరాజు చేసే ప్రతీ పనికీ, వెనుక పద్మవ్యూహంలాంటి తిరకాసు ‘కాసే’.

అందుకే ప్రొద్దునే నిద్రలేచి లింగరాజు, ‘‘భగవతీ! భాగ్యలక్ష్మీ, ప్రణామంబు, నీదాసానుదాసుండ, నీ పాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు నీ దివ్యనామెంబే నిక్కంబుగా నిద్రలో గూడా జపింతు, నాదిక్కు, నా మొక్కు, నాయండ, నా దండ నీవే సూమా! భార్యయుం, గీర్యయుం, బిడ్డలుం, గిడ్డలు, దేవుడుం, గీవుడున్, మోక్షముం, గీక్షమున్, సర్వమున్నీవే! సత్యంబు, నీకై నిరాహారినై యుందు, నీకై నిశలు నిద్రమాన్కోందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యతస్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీ యాన! ఈ పెట్టెయే నీ పవిత్రాలయం, నేనే నీయర్చకుండన్, యదార్ధంబుగా నాదు ప్రాణంబులె నీదు పూజాసుమంబుల్ శరీరంబే నైవేద్య కుంభంబు, నా ఇంటనే యుండి, నీ పూజం గొంచునే ఇంటికి నంపింనం బోయి, యా ఇల్లుమట్టంబు గావించి, నా ఇంటికిందెచ్చి నాకిచ్చు దుండంగదే కన్నతల్లీ! నమస్తే, నమస్తే నమః’’ అంటూ లక్ష్మీదండకం ముమ్మారు పఠించి, సర్వే జనః దుఃఖినోభవంతు అని శాంతి వచనాలు పలుకుతాడు.

లింగరాజు జననం 1922లో జరిగినప్పటికీ, నేటికీ మన సమాజంలో లింగరాజులకు కొదవలేదు. ధన రాకాసి, కట్న పిశాచి నేటి సమాజంలో కూడా ప్రబలంగానే ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు సృష్టించిన లింగరాజు మీద ఈ భూమండంలో ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. మనిషన్నవాడెవడూ లింగరాజును గౌరవించిన ఆనవాళ్ళు లేవు. ఎవరేమనుకున్నా లింగరాజుకి కలిగే నష్టంలేదు. అతనికి సంఘంతో పనిలేదు. పరువు, మర్యాద, ఆత్మాభిమానం వంటి భేషజాలకు అతను బహుదూరం. లోభత్వానికి లింగరాజు నిలువుటద్దమే కాదు. పొదుపును గురించి అనర్ఘళంగా ఉపన్యసించ గలిగే ఘనాపాఠి. వంటమనిషికి ప్రతిపూట వంట సామాను వంట కట్టెలు, పిడకలు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, చివరికి నిప్పు పుల్ల కూడా గీచి, గీచి లెక్కలడిగి మరీ యిస్తాడు. పొయ్యిలో కట్టెలు కావల్సివస్తే, కరివేపాకు చెట్టుమీది కాకి గూడు పడద్రోసి ఆ పూట వంట చేయ్యమని సలహా యివ్వటం అతనిలోని పినాసితనానికి పరాకాష్ట. ‘‘పక్షిగూడు పడగొట్టడం పాపం కదండీ’ అని అంటే, ‘పాపమేమిటి నీ బొంద! ఖర సంవత్సరంలో మా యింటి వంటంతా కాకి గూళ్లతోనే వెళ్ళిపోయిందని గత చరిత్రను చెప్పుకొని మురిసిపోతాడు.

అంతేకాక, లోకం పోకడ గురించి లింగరాజు అభిప్రాయం, అవగాహన నేటి సమాజ తీరుతెన్నులు చూస్తే తప్పుకాదేమో అన్నట్టుగా ఉంటాయి. ఈ కింది గేయంలో పరికించండి:

ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు

అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?

ధనమునే ప్రధానంగా కొలిచే ప్రబుధ్దులకు తలమాణికం లింగరాజు సింగరాజు అనడానికి ఈ కింది పద్యమే మచ్చుతునక.

సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో

లింగరాజు ఎంతటి పినాసీ అయినా అతనిలో ప్రత్యేకత అతని చమత్కార ధోరణి. నిత్య సంభాషణల్లో కురిసే హాస్యరసం నయగారా జలపాతాన్ని గుర్తుకి తెస్తుంది. లింగరాజులాంటి స్వార్ధచింతుడిలో హాస్యమేమిటా అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి లింగరాజు హాస్యచతురుడు కాడు. అతని లోభితనం నుంచి, పేరాశ నుంచి, సంకుచిత మనస్తత్వం నుంచి, డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే అతని నైచ్య ప్రవృత్తి నుంచి స్వభావసిద్ధంగా హాస్యం పెల్లుబుకుతుంది. ఎదుటి మనిషిని నవ్వించాలనే ధృక్ఫథం అతనిలో ఏ కోశానా లేని హాస్యపాత్ర. నాటక కర్త కాళ్ళకూరి గారి కలం కన్ను గప్పి ఎదిగిన సింగరాజు లింగరాజు పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారి లోగిళ్ళలో నవ్వుల చిరుజల్లులు వెదజల్లూతూ నిత్యనూతనంగా భాసిస్తూనే ఉంటుంది.


సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *