కాలమానము- ఎలా తెలుసు కుంటాము ?

తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది అని మీకు కుతూహలం కలగచ్చు. లేదా మీ గడుగ్గాయిలు తప్పకుండా ఎప్పుడో అప్పుడు అడగకమానరు. అక్కర్లేని చొప్పదంటు ప్రశ్నలడగకుండా పోయి చదువుకోండి అని వారి మీద విసుక్కోవడం కంటే, మనం కూడా తెలుసుకుంటే తప్పేంటి?

ఉగాది అనగా సంవత్సరాది అనగా కొత్త సంవత్సర ప్రారంభం. మనము ప్రస్తుతము ఈ ఉగాది పండుగను చైత్ర మాస శుద్ధ పాఢ్యమి నాడు జరుపుకుంటున్నాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి అనేది ఎట్లా వచ్చింది?

మన పూర్వీకులు తమ జీవితగమనములో కొంత సమయము వెలుగులోను కొంత సమయము చీకటిలోను వుండటం, అదే పరిస్ధితి మరల మరల జరుగుటం గమనించానరు. వెలుగులో ఆకాశమదు తీక్షణమైన కాంతితో ఒక పెద్ద బింబమును, చీకటి సమయంలో అదే ఆకాశంలో ఏవో మిళుకు మిళుకు మనునవి అనేకములు, తెల్లని కాంతితో ఒక బింబము కొన్ని సమయములలో పెరుగుతూనూ, ఇదే విషయము మరల మరల జరుగుటం గమనించారు.

ఈ విధమైన గమనములో వెలుగు సమయమును పగలు అని, చీకటి సమయమును రాత్రి అని, పగలు కనపడిన బింబమును సూర్యుడు అని, రాత్రి బింబమును చంద్రుడు అని, మిళుకు మిళుకు మను వాటిని నక్షత్రములని కాలక్రమేణా గుర్తించి, పిలవనారంభిచారు. మరికొంత కాలానికి ఈ కాలాన్ని లెక్క కట్టుట నేర్చారు. ఆ విధంగా

1. ఒక పగలు.. ఒక రాత్రి కలిసి ఒక రోజు అని…

2. చంద్రుని కాంతి తరుగుదల 15 రోజులని, పెరుగుదల మరో 15 రోజులని మొత్తంగా 30 రోజులు ఈ విధంగా జరిగి మరల యిదే జరుగుతున్నదని… కావున ఈ 30 రోజుల సమయానికి నెల లేక మాసము అని పేరు పెట్టారు.

ఆ తరువాత పరిశీలనలో 12 మాసములు. చంద్రునికి దగ్గరగా ఉండే ప్రధాన నక్షత్రాలను, చంద్రుడు ఆ నక్షత్రములను సమీపించుటతో ప్రకృతిలో కలుగుతున్న మార్పులను పరిశీలించి, పరిశోధించటంతోపాటు తాము కనుగొన్న కొన్ని నక్షత్ర మండలాలకు, పేర్లు పెట్ఠి, ఆ మండలములో చంద్రుడు ప్రవేశించినపుడు ఆయా నెలలకు ఆయా నక్షత్రముల పేర్లతో వచ్చు పేర్లను పెట్టారు. ఉదాహరణకు పూర్ణ చంద్రుడు ఉన్న నక్షత్రం పేరుతో అనగా పూర్ణ చంద్రుడు చిత్త నక్షత్రముతో వున్నపుడు చైత్ర మాసమని, ఆ విధంగా…

1. చిత్త తో వున్న……..చైత్రమాసము

2. విశాఖ తో వున్న……..వైశాఖ మాసము

3. జ్యేష్ట తో వున్న……..జ్యేష్ట మాసము

4. పూర్వాషాడ లేక ఉత్తరాషాడ……..ఆషాడ మాసము

5. శ్రవణం తో వున్న……..శ్రావణ మాసము

6. పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర తో వున్న……..భాద్ర పద మాసము

7. అశ్వని తో వున్న……..ఆశ్వయుజ మాసము

8. కృత్తిక తో వున్న……..కార్తీక మాసము

9. మృగశిర తో వున్న……..మార్గశిర మాసము

10. పుష్యమి తో వున్న……..పుష్యమాసము

11. మఘ తో వున్న……..మాఘ మాసము

12. పూర్వఫల్గుణి లేక ఉత్తర ఫల్గుణి తో వున్న……..ఫాల్గుణ మాసము.

ఇలా చాంద్రమానంలోని 12 మాసములకు పేర్లు వచ్చాయి. అట్లాగే చంద్రుని తరుగుదల, పెరుగుదల రోజులకు కూడా వరుసగా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ (వృద్ధి చంద్రుడు) / అమావాస్య ( క్షీణ చంద్రుడు) అని పేర్లు పెట్టారు. వీటినే తిధులు అంటారు. ఈ 15 తిధులు కలసి ఒక పక్షము అవుతుంది.

1. వృద్ధి చంద్రుడు……..శుక్ల/శుద్ధ పక్షము

2. క్షీణ చంద్రుడు……..కృష్ణ / బహుళ పక్షము (కృష్ణ శబ్దమునకు నల్లనిది అని అర్ధం).

ప్రకృతి లోని ఎండలు, వానలు, చలిగాలులు మొదలగు మార్పుల కనుగుణంగా 12 నెలలకు 6 ఋతువులను ఏర్పరిచారు. ఆ ఆరు ఋతువులు వరసగా వసంత, గ్రీష్మ ,వర్ష, శరద్,హేమంత మరియు శిశిర ఋతువులు.

ఈ ఆరు ఋతువులకాలము ఒక సంవత్సరము. వసంత ఋతువు నుండి శిశిర ఋతువు అయి పోయి మరల వసంత ఋతువు ప్రారంభం కాగానే క్రొత్త సంవత్సరము ప్రారంభమైనట్లు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి – క్రొత్త సంవత్సరం ఆరంభం. దాన్నే ఉగాది అని జరుపుకుంటాము.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *