
సంస్కృతంలో భవభూతి రచించిన ‘ఉత్తర రామచరితం’ అనే నాటికను తెలుగులో తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ గా, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామయణం’గా అనువదించారు. ఉత్తర రామాయణాన్ని తిక్కన నిర్వచన కావ్యంగా మల్చగా, కంకంటి పాపరాజు చంపు కావ్యంగా రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రాముడు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తుండగా, 24000 శ్లోకాలు, 500 సర్గలు ఉత్తర కాండతో కలిపి 7 కాండలుగా రచించాడు.
ఇక నిర్వచనోత్తర రామయణం వచనం లేకుండా రాయబడిన పద్యకావ్యం. మొదటి ఏడు ఆశ్వాసాల్లో రావణాదుల కథ, 8,9,10 ఆశ్వాసాల్లో సీతారాముల కథ ఉంటుంది. సీతారాముల పట్టాభిషేకంతో ప్రారంభించి, భద్రుడు అనే గూఢచారి సీతపై వచ్చిన అపవాదును గురించి రామునితో చెప్పటం, గర్భవతియైన సీతను వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుని పంపటం, అక్కడ సీత కుశలవులకు జన్మనివ్వటం, తర్వాత అశ్వమేధ యాగం, కుశలవుల రామాయణ గానం, రాముడు కుశలవులను, సీతను కలుసుకోవడం, సీత రసాతలానికి వెళ్ళిపోయి, తన మహత్త్వాన్ని నిరూపించుకోవటంతో కథను ముగించాడు తిక్కన.
ఎనిమిది ఆశ్వాసాలలో రచించిన పాపరాజు ఉత్తర రామాయణంలో, వాల్మీకి సీత గొప్పతనాన్ని అయోధ్య పురవాసులకు తెలపటం, సీత రసాతలానికి వెళ్లిపోవటం దగ్గర ఆగకుండా, కుశలవుల పట్టాభిషేకం, రాముడు పరమపదాన్ని చేరుకోవటం కూడా వర్ణించబడింది.
అయితే, ఉత్తర రామాయణానికి సంబంధించిన అనేక కథలు ప్రచారాంలో ఉన్నాయి. అసలు ఉత్తర రామయణం జరగలేదని, ఇది కల్పిత గాథ అన్నవారు లేకపోలేదు. అందరిలో ఉన్న మరో సందేహం ఉత్తర రామాయణాన్ని వాల్మీకి రాశాడా? లేదా? వాల్మీకి ఉత్తర కాండను 120 సర్గాలలో మొత్తం 3432శ్లోకాలలో విస్తృతంగా రచించాడు. జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కొన్ని ఉత్తర రామాయణ గాథలు వాల్మీకి రచించినవి కావు. కాకపోతే వాటికి ప్రేరణ వాల్మీకి రచించిన ఉత్తర కాండ కావచ్చు. అందువల్లనే, సీతా పరిత్యాగం, లవకుశల జన్మవృత్తాంతాల కథనాలలో అనేక తేడాలు, సందేహాలున్నాయి. ఇక ఈ గాథ జానపదుల నోట చేరాక మరికొన్ని మార్పులు, చేర్పులు చేరాయి.
వాల్మీకి ఉత్తర కాండలో వివరించిన దాని ప్రకారం, ఋష్యాశ్రమాలను తిలకించాలన్న సీతాదేవి కోరికను రాముడు మన్నించి, మరుసటి ఉదాయన పంపిస్తానని మాట ఇస్తాడు. ఆ రాత్రి రాముని ముఖ్య వేగులలో ఒకరైన భద్రుని, తన గురించి, తన పాలన గురించి ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలపమని కోరుతాడు. అప్పుడు భద్రుడు, ‘తోటలలో, బాటలలో, అంగళ్లలో, గృహములలో, ఏ ప్రదేశంలైనా, సముద్రం మీద సేతువును కట్టి, రావణుని వధించిన రాముడు మహాత్ముడు. అట్టి రామభద్రుడు, దుష్టుడైన రావణుడు బలత్కారముగా తీసుకొని పొయి లంకలోని అశోకవనంలో సీత నుంచెను. అక్కడ ఒక గడియ కాదు, ఒక నాడు కాడు, ఒక నెలకాదు, దీర్ఘకాలము పదినెలలు అక్కడే ఉన్న సీతను తెచ్చి ఇంటిలో ఉంచుకున్నాడు. ‘మన్మథుడు అంధుడు’ అన్న సామెత వినలేదా. రాజేది సమ్మతించిన అదే మనకు ధర్మము. పూర్వ రాజులు పరుడెత్తుకెళ్లిన ఆడుదానిని మరల గ్రహించలేదు. కావున మనమూ గ్రహింపలేదు. ఇప్పుడీ రాజు గ్రహించెను, కావున మనమూ సహించి గ్రహించవలెను. అని ప్రజలు పల్లెలలో, పట్టణాలలో అనుకుంటున్నారని విన్నవిస్తాడు. కానీ జన బాహుళ్యంలో ఉన్నట్టుగా చాకలాడు సీతాదేవి మీద నిందమోపాడని వాల్మీకి రాయలేదు. అంత రాముడు తన తమ్ములను పిలిచి, సూర్యచంద్రాదులు, వాయువు సీత పవిత్రురాలిని చెప్పారు. సీత అగ్నిపునీత అయినది. కానీ నేడు ఈ అపవాదు నగరములో ప్రబలినది. కావును రేపు ఉదయమున సుమంత్రుడు సారథిగా గంగానది ఆవలి గట్టున, తమసానదీ తీర ప్రాంతములోని వాల్మీకి ఆశ్రమములో జనులు లేని చోట సీతను విడిచి రమ్మని లక్ష్మణుని ఆదేశిస్తాడు. అన్నగారి ఆజ్ఞానుసారం సీతాదేవిని, వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి తీసుకువెళ్లి, రామాజ్ఞను సీతమ్మవారికి విన్నవిస్తాడు లక్ష్మణుడు. ఇక్కడ కంకంపాటి పాపరాజు గారు రచించిన ఉత్తర రామయణంలోని ఈ కింది పద్యం తెలుగునాట ప్రఖ్యాతి గాంచింది.
ఇంతకుఁబూని వచ్చి వచియింపక పోదునే విన్ము తల్లి దు
శ్చింతులు దైత్యుచేఁ బడినసీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంతవిమోహి రాముఁడని యెగ్గులు పల్కిన నాలకించి భూ
కాంతుఁడు నిందఁ జెంది నిను గానలలోపల దించి రమ్మనెన్.
లక్ష్మణుడు వెళ్లిపోగా దుఃఖంతో సొమ్మసిల్లిన సీతను చూసి మునిబాలురు ఆశ్రమానికి వెళ్లి, వాల్మీకితో ఏ మహాత్ముని ఇల్లాలో, శ్రీ మహాసతి, ఏటి ఒడ్డున ఉన్నదని చెపుతారు. సీతాదేవిని తీసుకువచ్చి మునిపత్నులకు వాల్మీకి అప్పగిస్తాడు. ఇంతవరకు కథలో పెద్దగా మార్పులు మనకు కన్పించవు. కానీ లవ,కుశుల జన్మవృత్తాంతము, తదుపరి కథలోనే అనేక మార్పులు మనకు గోచరిస్తాయి. సీతా పరిత్యాగానంతరం, ఒకసారి లవణ సంహారం చేయడానికి వెడుతూ, శత్రుఘ్నుడు ఒక రాత్రి వాల్మీకి ఆశ్రమంలో ఉంటాడు. అదే సమయంలో సీతాదేవి, ఇద్దరు కుమారులకు జన్మనిస్తుంది. మునిబాలకులు వాల్మీకి వద్దకు వెళ్లి రామచంద్రుని భార్య ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిందని, వచ్చి వారికి రక్షరేఖ కట్టమని ప్రార్థిస్తారు. వాల్మీకి మంత్రించిన దర్భలను మునిపత్నులకిచ్చి, కొనలతో ఒకనిని, మొదళ్లతో మరొకనిని మార్జనము చేయమని, దర్భ కొనలచే మార్జనము చేయబడినవాడు కుశుడని, మొదళ్లచే మార్జనము చేయబడినవాడు లవుడనియు, వారికదే నామకరణమని వాల్మీకి చెపుతాడు. వారి మాటలను ఆలకించిన శత్రుఘ్నుడు సీతాదేవి కవలలను గన్నదని పరమానందమును పొందుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు రాజసూయ యాగం చేయ సంకల్పించి, తమ్ములను పిలిచి వారి అభిప్రాయాన్ని అడుగుతాడు. రామరాజ్యంలో దుష్టులు, పాపులు లేరు, సుభిక్షంగా రాజ్యం ఉన్నప్పుడు రాజసూయం తగదని భరతుడంటాడు. లక్ష్మణుడు అశ్వమేథయాగం చేయమని సూచిస్తాడు. ఆమేరకు రాముడు నైమిశారణ్యంలో గోమతీ నదీతీరాన యాగం ప్రారంభిస్తాడు. ఆ యాగాన్ని చూడటానికి వాల్మీకి కుశలవులతో గూడి వెడతాడు. అలాగే తాను నేర్పించిన రామయణాన్ని ప్రతిదినం 20 సర్గల చొప్పున రాజమార్గాల్లో, యజ్ఞవాటికలో, రాముని మందిరం వద్ద మునివాసాల్లో శ్రుతిలయ బద్ధంగా ఆలపించమని, తాము ఎవరు అని అడిగితే వాల్మీకి శిష్యులమని చెప్పమని, ఎవరి వద్ద ధనాన్ని తీసుకోవద్దని వాల్మీకి లవకుశులను పంపుతాడు.
రాముడు వారి గానం మొదటి 20 సర్గాలు విని, వారి ద్వారా వాల్మీకి రామాయణ కావ్య కర్త అని తెలుసుకుని వారి చేత రోజు రామాయణ గాథను పాడించుకుని విని, వారు సీతా పుత్రులే అని గ్రహించి, సీత పావనచరిత, కళంకిత రహిత అయితే, మర్నాడు సభాముఖంగా నిరూపించుకోవల్సిందిగా వాల్మీకికి వర్తమానం పంపుతాడు. వాల్మీకి అందుకు అంగీకారం తెలపటంతో, ప్రజలందరిని, పురప్రముఖులను, మునిపుంగవులను మర్నాడు సభకు వచ్చేసి సీతా శపథాన్ని చూడటానికి రమ్మని ఆహ్వానించాడు రాముడు.
మర్నాటి ఉదయం యజ్ఞ వాటిక ప్రాంగణానికి వసిష్టుడు, వామదేవుడు, జాబాలిని, కాశ్యపుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, గర్గుడు, జ్యవనుడు, పర్వతుడు, నారదుడు, భార్గవుడు, శక్తి, వామనుడు, భరద్వాజముని, గౌతముడు, మార్కండేయముని, పులస్త్యుడు, కాత్యాయవర్షిని, అగస్త్యముని, సుప్రభ, సుయజ్ఞ, మౌద్గల్యుడు మొదలగువారితోపాటు అన్ని కులాలకు చెందినవారు, రాక్షసులు, వానరులు, రాజులు, దేశదేశాలకు చెందిన బ్రాహ్మణులు, జ్ఞాననిష్ఠులు, కర్మనిష్ఠులు, యోగనిష్ఠులు వచ్చిచేరిరి.
అంతలో బ్రహ్మవెంట వచ్చు వేదములవలే ముఖళితహస్తములతో వాల్మీకి వెంట జానకీదేవి సభాప్రాంగణమునకు వచ్చెను. అప్పుడు వాల్మీకి రామునుద్దేశించి మాట్లాడుతూ, ‘రామచంద్రా, నేను ప్రచేతసుని పదవ కుమారుడను. మనసునందైనా అసత్యము పల్కనివాడను. వీరిరువురు నీకుమారులు. మనస్సు, వాక్కు, దేహము చేతను నేను పాపము చేయలేదు. సీతాదేవి పవిత్రురాలు. అట్లుకాకున్న, అనేక సంవత్సరాలుగా నేను చేసిన తపస్సు వ్యర్థమవుతుందని’ అంటాడు. ఇంకా నా దివ్య దృష్టితో ఈమె పుణ్యాత్మురాలని నేను తెలుసుకొన్నాను. ఇలాంటి పతివ్రత నిష్కారణముగా లోకపనిందలు పొందవల్సివచ్చెను. ఈమె మహిమ తెలుపటకే నేను రామాయణ రాశానని వివరిస్తాడు. వాల్మీకి మీ మాటలను నేను నమ్మితిని, లోకమంతా కూడా నమ్మితే సంతోషిస్తానని రాముడు అంటాడు. అంత, సీతాదేవీ ముందుకు వచ్చి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే విధంగా పలుకుతుంది. ఈ సందర్భంగా పాపిరాజుగారి ఉత్తర రామాయణంలోని మరో పద్యం జనలలో బాగా చొచ్చుకుపోయింది. అది –
రామస్వామిపదాంబుజంబు లెద నారాధింతునేనిన్ సదా
రామాజ్ఞను జరియింతునేనిఁ దగుజాగ్రత్స్వప్నసుప్త్యాదులన్
రామున్ దప్పనిదాన నౌటయు యథార్థం బేని నా తల్లి యో
భూమి యీయెడఁ ద్రోవఁ జూపి ననుఁ గొంపోవమ్మ నీలోనికిన్.
అంత భూదేవి సీతాదేవిని తన చేతులలోకి తీసుకుని సింహాసనంపై కూర్చోబెట్టుకుని రసాతలానికి తీసుకు వెళ్లిపోతుంది.
తదుపరి భాగంలో జానపద సాహిత్యంలో ఉత్తర రామాయణ చరితను పరిశీలిద్దాం….
పాఠకులు కుశలాయకము గురించి వివరించమని కోరారు. దీనిని గురించి వివరించే ప్రయత్నంలో ఉత్తర రామయణం మీద ఉన్న సందేహాలను చర్చించకుండా ముందుకు వెళ్లడం అసంజసమని తోచింది. అందుకే ఉత్తరామాయణం గురించి ప్రస్తావించాను. ఈ అంశానికి సంబంధించి నాకున్న జ్ఞానం చాలా తక్కువ. అందువల్ల తప్పులు ఏమైనా రాసి ఉండవచ్చు. పెద్దలు మన్నించి, కామెంట్ రూపంలో వివరణలు ఇవ్వగలరు.
సౌమ్యశ్రీ రాళ్లభండి