

పచ్చదనం పరుచుకున్నవేళ...
పెను తుఫాను, సునామీ వంటి పదాలకు అర్థాలు పూర్తిగా మార్చిన ఆంధ్రా ప్రజానీకం. ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, నిరంకుశ పాలకులను కూకటివేళ్లతో పెగిలించి రుషికొండ సాక్షిగా బంగాళాఖాతంలో కలిపేసారు. తమ ఉక్కుపాదాలతో అన్నివర్గాల ప్రజలను తొక్కుకుంటూ విధ్వంసం సృష్టించిన పాలకులను సామాన్య ప్రజానీకం వామనావతారమెత్తి అధఃపాతాళానికి తొక్కేసారు. ఆంధ్రప్రదేశ్ లో నేటి ఎన్నికలు ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలు జరిపిన సమరం. ఇందులో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిది.
చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా పోటీ చేసిన ప్రతి చోట గెలుపు శంఖాలను తెలుగుదేశం కూటమి సభ్యులు పూరించారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలలో గెలుపొందగా, తెలుగు దేశం పోటీ చేసిన 144 స్థానాలకు 135 స్థానాలు గెలుచుకొని విజయకేతనాన్ని ఎగరవేసింది. ఇక బిజెపి పోటీచేసిన 10 స్థానాలలో 8 గెలిచి కూటమికి బాసటగా నిలిచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకోడదన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బిజెపి గళాలు కలిపి అధికార పార్టీని ఊచకోత కోయడంతో ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరింది. ఏ అధికార పార్టీ ఎదురుచూడని ఫలితాలను వైఎస్సార్ కాంగ్రెసు చవిచూసింది. ఇలా జరిగిందేమిటి అని తల పట్టుకు కూర్చోవటం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంతైంది.
గత ఎన్నికలలో 151 స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ చేసిన దాష్టీకాలకు ప్రజలిచ్చిన తీర్పు. ఎనిమిది ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోవడం, ప్రకాశం, విశాఖ, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో కేవలం రెండేసి సీట్లు దక్కించుకోవడం, ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో కూడ కేవలం మూడు సీట్లలలో విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నాయకులకు మింగుడుపడని విషయం. తెలుగులో చిక్కని, చక్కని పదాలకంటే బూతులే ఎక్కువున్నట్టు విచ్ఛలవిడిగా, అమ్మ, అక్క, చెల్లి అనే బేధం లేకుండా అసెంబ్లీ సాక్షిగా, నిర్లజ్జగా, జుగుప్సాకరంగా పేట్రేగిపోయి తెలుగు తల్లి తల వంచుకునే విధంగా భాషకి, భావజాలానికి బూజు పట్టించి, విచక్షణారహితంగా బూతులతో రెచ్చిపోయిన కోడాలి నాని, పేర్ని నాని, ఆర్కె రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అప్పలరాజు, ఇలా అనేకానేక వైకాపా నాయకుల మూతులకు ప్రజలు తాళాలు బిగించారు. అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలతో, నియంతృత్వ పోకడలతో పెత్తందారి వ్యవస్థను ప్రజలపై రుద్దిన నాయకులు ప్రజల ఆగ్రహానికి మాడి మసయ్యారు. ఈ నరకాసురులను అసెంబ్లీకి దూరంగా ఉంచి, తెలుగుతల్లికి ‘చంద్ర’కాంతులతో ప్రజలు నీరాజనాలు పలికారు.
బజారు రౌడీల్లా, సామాన్య ప్రజలపై, ప్రజాప్రతినిధులపై దాడులకు దిగటం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఎంపీ రఘురామారెడ్డిని, ఎమ్మెల్యే అచ్చం నాయుడిని తదితరులను అరెస్టు చేసి వారిని పోలీసులతో చితకబాదించడం, లోకేష్ తోపాటు అనేక ప్రతిపక్ష నాయకులపై అడ్డదిడ్డంగా కేసులు పెట్టి వేధించటం, అతిముఖ్యంగా అన్యాయంగా చంద్రబాబు అరెస్టు, ఓటరు సుధాకర్ ని చెంబదెబ్బకొట్టడం, ఈవిఎంలను పగలగొట్టడం, ఇలా శిశుపాలుని వంద తప్పులను ప్రజలు చూస్తు ఊరుకుని ఉండవచ్చుగాని, వాటిని విస్మరించలేదనడానిక నేటి ఎన్నికల ఫలితాలే తర్కాణం. పాపుల తప్పులు దండంతో సరి అన్నట్టు, నాయకుల దారుణ, మారణకాండపై ఓటరు తన లాఠీని ఝాడించాడు.
తెలుగు దేశంపార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కనీవినీ ఎరుగని విజయాన్ని ఆ పార్టీ చవిచూసింది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 292 స్థానాలకు గాను 202 స్థానాలను పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలలోనే నాడు ఎన్టీఆర్ సాధించారు. ఆ చరిత్రను తిరగరాస్తూ నేడు పోటీచేసిన 144 స్థానాలలో 135 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. 37 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం మంగళగిరి స్థానాన్ని చేతచిక్కించుకుంది. ఈ ప్రభంజనం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాలేదు. లోక్ సభలో కూడా తెలుగుదేశం పార్టీ 16 సీట్లను గెలుచుకుని తన విజయకేతనాన్ని ఎగరవేసింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ ప్రజావేదికనైతే జగన్మోహన్ రెడ్డి నిర్ధాక్ష్యంగా కూలదోసి, పగలకు, ప్రతికారాలకు, ముఠా రాజకీయాలకు, వర్గపోరాటాలకు తెరలేపాడో, ప్రజలును కులాల పేరిట విడదీశాడో, అదే వేదిక సాక్షిగా ప్రజలు నేడు ఆ నాయకుడిని, పార్టీని కూలదోశారు. ‘వైనాట్ 175’ అన్న జగన్ పిలుపుకు ‘వై నాట్ గెటౌట్’ అని ప్రజలు ప్రతి పిలుపును ఇచ్చారు. ‘ఒక్కసారి గెలిపించి’న పాపానికి పరిహారంగా ఈసారి ‘ఆ ఒక్కటి అడగకు’ అంటూ ప్రజలు మొహం చాటేసారు.
తన నవరత్నాల సంక్షేమ పథకాలు, బటన్ నొక్కడు కార్యక్రమాలు, వ్యవస్థలను మేనేజ్ చేయటం, కొద్దిమంది ప్రముఖలతో, విద్యావంతులతో, భజనపరులతో సొంత పత్రికలో చేసుకునే దుష్ప్రాచారం తనకు పట్టం కడతాయని కలలు కన్న జగన్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయినా తన తప్పిదాల నుంచి జగన్ ఏమీ నేర్చుకోకపోవడం విచారకరం. ‘నేను ఎలా ఓడిపాయానో ఆ దేవుడికే తెలియాలి,’ ‘నా అక్కలు, చెల్లెళ్లు, అవ్వలు, తాతలు నన్ను మోసం చేశారు’ అనడం తెలివితక్కువ తనం. అమరావతి రూపకల్పన విధ్వంసం, ఇసుక దోపిడి, తుంగలో తొక్కిన మద్యం నిషేధం, అయినవారికి కాంటాక్టులు, లంచగొండితనం, వెళ్లగొట్టిన పరిశ్రమలు, పాతిబెట్టిన పోలవరం ప్రాజెక్టు, నీరుగార్చిన నీరుపారుదల కార్యక్రమాలు, పెంచిపోషించిన నిరుద్యోగం, భూకబ్జాలు, ఇలా అవినీతి, అరాచకత్వమనే వేయి పడగలతో ఆంధ్రా ప్రజానీకాన్ని కాటువేసిన జగన్, నేను ప్రజలకు ఎంతో చేసాననడం హాస్యాస్పదం.
ఏదిఏమైనప్పటికీ, ప్రజలు తీర్పునిచ్చారు. 2019లలో తాము చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. అనుభవానికి పెద్ద పీఠ వేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కీలకమని తెలుసుకున్నారు. ప్రగతి పథానికి బాటవేశారు. ప్రజలను పట్టించుకోని ప్రజాప్రతినిధులను శంకరగి మాన్యాలు పట్టించారు. క్లుప్తంగా చెప్పాలంటే, గత ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం నేర్పిందన్నది మాత్రం నిర్వివాదాంశం!
సౌమ్యశ్రీ రాళ్లభండి