
తెలుగు పద్యము నింటింట త్రిప్పువిద్య తెలుగు సంస్కృతి ఇన్నేళ్లు నిలుపు విద్య ఎట్టి విశ్వ భాషలనైనా లేని విద్య ధ్యానయోగమ్ము మా అవధాన విద్య
అని మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు తెలుగువారికి మాత్రమే సొంతమైన అవధాన విద్య గురించి చెప్పిన మాటలివి. అవధానమంటే, ఏకాగ్రత, ధీవ్యగ్రత. ధారధారణ శక్తుల విలక్షణ సంగమం అన్నారు సినారె. అరవై నాలుగు కళలలో చెప్పబడిన సమస్యాపూరణం, పుస్తక పఠనం, పద్యపాదపూరణంలకు ఆశు కవిత వర్ణన, అలంకారాలై విరబూసిన కవిత్వపు రెమ్మ ‘అవధానం. ’
అవధాన శబ్ధానికి ఎచ్చరిక, చిత్రైకాగ్రత అని అర్థాలు. కాగా, పూర్వం వేద పఠనంలో ఆరితేరిన వారిని అవధాని అని వ్యవహరించేవారు. వైదిక పరిభాషలో ఒక నిర్థిష్టార్థంలో ప్రయోగించే అవధాన శబ్థం, సాహిత్యవిద్యకు పారిభాషిక పదంగా నేడు వ్యవహారంలోకి వచ్చింది. అయితే సభారంగంలో నిర్భయంగా ఎవ్వరు ఏమి అడిగినా ఆశువుగా పద్యము చెప్పువాడు సభాకవి. అట్టి వందమంది సభాకవులలలో తొంభైతొమ్మిది మంది ధారగా పద్యము చెప్పగలిగేవారే, కానీ, ఎవ్వరు ఏ పద్యం అడిగారో వారి పేరు చెప్పి తిరిగి వారికి పద్యం అప్పచెప్పగలిగే సభాకవే అవధాని. ఇదే విషయన్ని తెలుపుతూ, తిరుపతి వెంకటేశ్వరులు – ‘చదివినవారు లక్షలు గల్గినను నందు పండితుండొక్కడు బయలు దేరు, అట్టి పండితులలో నరయ వేయికి నొక్కరుండు కవీశ్వరుండుండునేమో, అట్టి కవీశ్వరులందు నూటికి నొక్కరుండవధానియై యుండునేమో,’ అన్నారు. వస్తు, కోశ, ద్రవ్య, లక్షణ, హేతువులయిదు ధారణకు మూలం. ఉదాహరణకు వస్తువు – రామాయణ, భారతాదులు, లౌకిక వృత్తాంతాలు ఏవైనా కావచ్చు, కోశము – శబ్ధార్థ కోశము, ద్రవ్యము – ప్రాకరణిక విషయము, లక్షణము – ఇది ఛందస్సు కావచ్చు, రీతి కావచ్చు, హేతువు – కారణము, వీటి యందు పట్టుగలవాడే అవధాని అని చెప్పవచ్చు.
కవిత్రయం కాలంనాటికి ఈ అవధాన ప్రక్రియ ఉన్నట్టుగా కన్పించదు. కాలానుగుణంగా మార్పులు చెందిన సాహిత్య ప్రక్రియలో శ్రీనాథుని కాలం నాటికి అష్ట భాషలలో అవధానము గల వారు అష్టావధానులుగా చెప్పబడ్డారు. బ్రౌన్ శబ్థకోశంలో కూడా అవధానమంటే వేదమని అవధాని అంటే వేదంలో దిట్టని పేర్కొంది. ప్రాచీన కాలాన అష్టభాషావధానమే అష్టావదానము. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అవధానాలు మూడు రకాలుగా పేర్కొన్నారు. 1. వేదసంబంధ అవధానాలు – స్వరావధానం, అక్షరావధానం, 2. సాహిత్యావధానం – అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, మహా సహస్రావధానం 3. సాహిత్యేతర అవధానాలు – ఇవి మూడు రకాలు: సాంకేతిక అవధానాలు (నేత్రావధానం, అంగుష్టావధానం, పుష్పావధానం, ఘంటావధానం), శాస్త్రసంబంధ అవధానాలు (గణితావధానం, జ్యోతిషా వధానం, అక్షర గణితావధానం, వైద్యావధానం), కళాసంబంధ అవధానాలు (నాట్యావధానం, చిత్రకళావధానం, సంగీతాష్టావధానం, ధ్వన్యావధానం, చతురంగావధానం, నవరసావధానం, సంగీతావధానం).
అలాగే, అవధాన అంశాలను కూడా నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు. 1. ధారణా సహిత సాహిత్య అంశం: సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, నిషేధాక్షరి, చిత్రాక్షరి, వ్యస్తాక్షరి, నిర్ధిష్టాక్షరి లేదా న్యస్తాక్షరి, వృత్తమాలిక, ఏకసంథా గ్రహణం, లిఖితాక్షరి, శ్లోకాంధ్రీ కరణం, నిర్దిష్టభావానువాదం. 2. ధారణా రహిత సాహిత్య అంశం: ఆశువు, పురాణం, అప్రస్తుత ప్రసంగం, కావ్యానుకరణ, కావ్యోక్తి, కీర్తన, గేయం, చిత్రకథ, వచన కవిత, మినీ కవిత, అంత్యాక్షరి, అక్షర విన్యాసం. 3. ధారణా సహిత సాహిత్యేతర అంశం: ఘంటా గణనం, పుష్ప గణనం, నామ సమీకరణం, యాంత్రిక గణనం. 4. ధారణారహిత సాహిత్యేతర అంశం: సంగీతం, చదరంగం, వార గణనం, పేకాట.
అవధాన ప్రక్రియకు ఆద్యులు, మణిహారాలనదగ్గ తిరుపతి వేంకటకవులననుసరించి అష్టావధాన లక్షణాలు: కావ్యపాఠము, కవిత్వము, శాస్త్రార్థము, పురాణము, లౌకికి ప్రసంగము, వ్యస్తాక్షరి, చతురంగము, పుష్ఫగణనము. అవధానులు సమయానుకూలంగా అవధాన అంశాలను ఎంచుకొని అవధానము చేసేవారు. నేడు బహుళ పాచుర్యంలో ఉన్న అష్టావధాన అంశాలు:
సమస్యా పూరణం: ‘సమస్యా తు సమాసార్థా; సమస్యతే సంక్షిప్యతే అనయేతి సమస్యా’ అని అమరసింహుని నిర్వచనం. పూర్వం శివరాత్రి జాగరణలు నవరాత్రి మహోత్సవాలు సమస్యాపూరణ కాలక్షేపంతో శోభిల్లితుండేవి. పురాణేతిహాసాలనే కాక సామాజిక విషయాలను కూడా కథావస్తువుల చేసుకొని ఆశువుగా సమస్యా పూరణం చేయటం అవధాని ప్రతిభకు కొలమానం. ‘కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్’, ఈ సమస్య తెలియని తెలుగువాడుండంటే అతిశయోక్తి కాదు. అలాంటివే మచ్చుకకి – కొప్పరపు సోదరకవులు పూరించిన ఈ సమస్యను గమనించండి. ‘తల్లి తల్లిమగఁడు తల్లియయ్యె.’
మోహినీస్వరూపమున నొప్పు హరితోడ భవుఁడు కలయఁ బుట్టె భైరవుండు దాన భైరవునకుఁ దండ్రియయ్యె శివుండు తల్లి తల్లిమగఁడు తల్లియయ్యె.
మరొక సమస్య: తలలోపలనున్న కల్లుఁద్రావిరనేకుల్
బలువేసవి దినములలోఁ గలిగిన తాపంబు దీఱఁగా నుత్సాహం బొలయంగఁ గడుఁజల్లని ముం తల లోపలనున్న కల్లుఁ ద్రావి రనేకుల్
మరొక సమస్య:
భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు బంధులందరున్.
గ్రీష్మములోన లగ్న మరిగెన్ సమకూర్చుదనన్న భార్గవా ర్చిష్మ దనూనకోప మతిశీలమయ్యె, బ్రతిజ్ఞ చూడగా భీష్మముగాగ, మాఱె, తలపెట్టని వన్నియు దాపురించె నా భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు బంధులందరున్.
నిషేధాక్షరి: నిషేధాక్షరి పద్య నిర్మాణం జమ్మియాకుతో విస్తరి కుట్టునట్టని పెద్దల అభిప్రాయం. ఇందు పృచ్ఛకుడు, అవధానితో నేరుగా తలపడును. పృచ్ఛకుడు ఒక వృత్తమునొక విషయము వర్ణింపమని కోరును. అవధాని ఆ వృత్తమున వర్ణన మొదలు పెట్టగానే, పృచ్ఛకుడు అవధాని పద్యంలో రానున్న అక్షరాలను గ్రహించి, అక్షరాన్ని నిషేదిస్తాడు. అవధాని ఆ అక్షరాన్ని వదలి మరొక అక్షరంతో పద్య నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అందుకే ‘నిషేధాక్షరి యొకటి ప్రేవులు తెంచు’ అన్నారు మధునాపంతులవారు. నిషేధాక్షరి పద్య రచన చేయాలంటే కవికి భాషలో, పదాలలో, శబ్ధాలలో ఎంతో ప్రావీణ్యం ఉంటే గాని సాధ్యంకాదు. ఈ పద్యరచన చేయాలనుకునేవారికి ఏకాక్షర నిఘంటువు, ద్విరూపకోశము, పదసంధి, అన్యార్థభ్రాంతికృత్పదములు, శబ్ధ చమత్కారము వంటివి ఉపయుక్తంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక్క ‘అ’ కారానికి పదమూడర్ధాలున్నాయి. అలాగే పదసంధి కూడా ‘స్వ’ అన్న అక్షరమనగానే పృచ్ఛకుడు, ఆ అక్షరంతో వచ్చే సంధి పదాలను అవలోకనం చేసుకొని తదుపరి అక్షరాన్ని నిషేదిస్తాడు. కానీ సత్+ఛ, సత్+శ, స+ఛ ఇలా వేర్వేరు పదసంధలుతో అవధాని పృచ్ఛకుని తప్పుదారి పట్టిస్తాడు. ఇక తల్లి, తాత, పూత, చేత, కల, జడ, ఊరు, పేరు, ముద్ద, పిల్ల వంటి పదాలు తత్సమ శబ్ధాలు, కాని తెలుగనే భ్రాంతిని కల్గిస్తాయి. ఊరు శబ్ధానికి తొడ అనే అర్థము కంటే ముందు గ్రామము అనే అర్థమే ముందు స్ఫురణకు వస్తుంది. ఈ శబ్ధ ప్రయోగాలతో అవధాని విజయవంతంగా నిషేధాక్షరిని పూరిస్తాడు. అందుకే నిషేధాక్షరికి ఛందోలక్షణజ్ఞు, శబ్థవేత్త, నానాపురాణకథానిష్ణాతుడు అయిన పండితుడు పృచ్ఛకుడిగా కూర్చుని అవధాని ప్రతిభకు సానపడతాడు.
నిషిధాక్షరి: పైన చెప్పిన నిషేధాక్షరి వంటిందే. కాకపోతే, పృచ్ఛకుడు ముందుగానే పదాలలో ఏ ఏ అక్షరాలు వాడకూడదో చెపుతారు. ఆ అక్షరాలను విసర్జించి అవధాని పద్యాన్ని అల్లవలసి ఉంటుంది. మేడసాని మోహన్ గారికి క, చ, ట, త, ప లు రాకుండా సీతా కళ్యాణాన్ని వర్ణించమని కోరగా, అవధాని గారు అల్లిన పద్యం –
సరస నిధి రామభద్రుడు ధరణిజ ఎదలోన మధుర ధారనుడయ్యెన్ సురలెల్ల హర్షమందిరి విరాజమాన సువిలాస విభవమెసగన్
దత్తపది: దీనినే దత్తాక్షరి అని కూడా అంటారు. పద్యములోని పాదమునకొక పదము చొప్పున నాలుగు పదాలను పృచ్ఛకుడు ఇచ్చి, వాటిని పద్యములో ఉపయోగించి, తాను కోరిన అంశంపై పద్యము చెప్పమనును. ఈ దత్తపదాలు ప్రాసను కలిగి చెవులకు వినసొంపుగా ఉండును. పదాలతో పొసగని సందర్భాలలో అవధాని ప్రతిభ బయటపడుతుంది. ‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే, పెళ్లికూతురు ముండ ఎక్కడుంది అన్నాడుట’ ఇది మొరటు సామెత. అయితే దత్తపదులలో అలాంటి అశ్లీలామంగళపదములతో వర్ణనలు కద్దు. అలాంటి ఒక పద్యము చూడండి. పదాలు: రండ, ముండ, బండ, కుండ అనే పదాలతో సీతాకళ్యాణ వర్ణన.
రండని స్వాగతాంజలి సురర్షుల బిల్చుచు, బెండ్లియాడు రా ముండని సీత జూచి కడు బొంగుచు జుట్టల బల్కరించుచున్ బండగు జ్ఞానవృద్ధుడు సభన్ జనకుండు రవంత లోటు రా కుండ నొనర్చె బంక్తిరథు డుత్సవమంద వివాహకార్యమున్. (శతావధాన ప్రబంధము)
అలాగే, కుక్క, నక్క, తిక్క, బొక్క లతో రామాయణార్థము వచ్చేటట్టుగా అవధాని చంద్రశేఖర శర్మగారు చెప్పిన పద్యాని అవలోకించండి.
కుక్కయును బోలె వెఱపున నక్కమలాసనుని పౌత్రుడటె వలపు మదిన్ దిక్క గొలుపన్ గుటీరం బొక్కడు గనకుండె దూరె నుక్కివుడయ్యెన్.
దత్తపదాలలోని వివిధ స్వరూప భేదాలు: పౌనరుక్త్యపదాలు అంటే పదిపదిపదిపది, రంగరంగరంగరంగ, మీసముమీసముమీసముమీసము వంటి పదాలతో అర్థభేదములతో పద్యాన్ని పొసగడమనడం, విపరీత పదములనిచ్చి, దుర్యోదన, దుశ్శాసన, కర్ణ, శకుని పదాలతో రామాయణాన్ని వర్ణించమనడం, అన్యభాషా పదాలు, ఉదాహరణకు, సన్, రన్, గన్, బన్ వంటి ఇంగ్లీషు పదాలతో కీచక వధను వర్ణించమనడం, లేదా హాకు, బేకు, సాకు, మేకు అను కన్నడ పదాలతో రామయణ గాథలోని వృత్తాంతాన్ని కోరడం, ఇక సంస్కృత క్రియలతో అనగా కరోమి, కవయామి, వయామి, యామి వంటి పదాలతో విష్ణురూపాన్ని తెలుగుపద్యంలో ఇమడ్చడం, పురగ్రామ, ప్రసిద్ధవ్యక్తుల నామాధేయాలతో పద్యాలు అల్లటం, నునునూ, నెనెనే, నినినీ, నననా వంటి అర్థరహిత పదాలతో వర్ణనలు, ధ్వన్యనుకరణ పదాలు – గర్రని, తుర్రని, బుర్రని, సర్రని లేదా లొటలొట, పటపట, చటచట, పుటపుట పదాలు దత్తములగును. రామ, సోమ, గామ, భీమ, లేదా ఆడెను, పాడెను, వేడెను, కూడును వంటి సుకరపదములు, ఉష్ట్రము, భ్రాష్ట్రము, రాష్ట్రము, లోష్ట్రము వంటి దుష్కర పదమలు, కావేవి కవితకనర్హమన్నట్టు పృచ్ఛకుడి పుర్రెలో పుట్టే ప్రతిపదము అవధాని మెదడుకు మేత పెడతాయి.
వర్ణనము: ‘లోకోత్తర వర్ణనానిపుణః కవిః.’ వర్ణన కృషిచేస్తే ఎరైనా చేయగలరు కానీ, లోకులు మెచ్చేవిధంగా చేయగలిగిన వాడే కవి. చంధోనిబద్ధతతో పద్యము వ్రాయగలిగే కవే అవధాని కాగలడు. ఏ వృత్తబంధము, ఏ రసము వర్ణిస్తే రక్తిగట్టగలదో తెలుసుకొని వర్ణించటం సులభము. కానీ అవధానములో కవికి ఆ స్వాతంత్రము తక్కువ. అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా జనానురంజకంగా పద్యం చెప్పగలిగే అవధానే శ్లాఘపాత్రుడగును. కవికి, కంసాలికి సీసము తేలిక అన్నారు పెద్దలు. ఒడుపు తెలిసినవాడికి కందము తేలిక. చంపక, ఉత్పలమాలలు, మత్తేభశార్ధూలాలు, ఆటవెలది, తేటగీతలు అవధానములందు సర్వసాధారణములు. వృత్తమును ఎన్నుకొనే అవకాశం కవికి ఇచ్చినప్పుడు పద్యము రసభావానుగుణశిల్ప రమ్యముగా తీర్చిదిద్దడం అవధాని బాధ్యత.
అవధాన వర్ణన పద్యాలను దాదాపు 12 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి వరుసగా – దైవస్తుతి పద్యములు, పురాణకథా ప్రబంధసంబంధి పద్యములు, చిత్రకవిత్వ పద్యములు, భాషాంతరీరణ పద్యములు, అన్యాపదేశ పద్యములు, ప్రతి పద్యములు, అల్పవిషయ బృహత్పద్యములు, అచ్చతెనుగు పద్యములు, తత్కాల రాజకీయ విషయ పద్యములు, శాస్త్రీయ పద్యములు, ఆశీర్వాద పద్యములు, చివరగా సంకీర్ణ పద్యములు.
అవధానులు చేసిన కొన్ని వర్ణనలు పరికించండి: ముందుగా, లక్ష్మీపార్వతుల అన్యోన్యపరిహాస వచనములు.
సీ. గంగాధరుడు నీమంగడని నవ్వంగ వేషధరుండు నీపెన్మింటనియె, నెద్దునెక్కును నీదు నెమ్మకాడని నవ్వ గ్రద్దనెక్కును నీ మగం డటనియె వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ నడిసంద్ర మిల్లు నీనాథున కనె నాట్యంబు సేయ నీనాయకుండన నంగు గావించు వెన్క నీ కాంతు డనియె ముష్టి కెక్కడి కేగె నీ యిష్టు డనిన బలి మఖంబున కేగె నో లలన యనియె నిట్టు లన్యోన్య మర్మంబు లెంచుకొనెడు పర్వతాంభోదికన్యల బ్రస్తుతింతు. (శతావధాన సారము)
రామాయణము యొక్క ఆత్మార్థమును కొప్పరపు సోదర కవులు వర్ణించిన తీరు గమనించడండి.
చం. ప్రకృతియె సీతయై తనర రాముడె యీశ్వరడై రహింపఁగా వికృతి యొకింతలేక సుకవిప్రవరుల్ తమకావ్యరాశిలో సుకృతి పొసంగ వ్రాయుదురు సుస్థిరమైన తగు జ్ఞానలబ్ధికై ప్రకృత మెఱుంగువారికిది పథ్యముగాఁ దనరార కుండనే?
ఈ కంప్యూటర్ యుగంలో తెలుగు భాషా పరిణామము గురించి గరికపాటివారు చేసిన వర్ణన.
క. సున్నయె మూలంబౌనిక అన్నా! ఆతెలుఁగుమాట లన్యాయముగా వెన్నిచ్చెడు నంకెలకున్ నాన్నకు మమ్మీని వెదుక నాకది గతియౌ.
అవధాని పితామహుడు శ్రీ మాడభాషి వేంకటార్యులవారు మత్తకోకిల వృత్తములో వర్ణించిన గౌతమీ నదీ ఆవిర్భావమును తెలిపే వరాహ పురాణకథా సంబంధ పద్యం.
గౌతమాహృయై సమస్తజగత్ర్పసిద్ధ చరిత్ర సం స్పీతయై యవగాహ నిష్కలుషీకృతాఖిల పాప సం ఘాతయై పరమేష్టిపుత్ర ముఖర్షిరాజ మహాశ్రమో పేతయైతగి గౌతమీనది పేరుగాంచె ఘనంబుగాన్.
ఇక సుబ్బన్నావధాని గారు ‘గంగగోవుపాలు గరిటడైనను చాలు’ అన్న వేమన పద్యానికి ప్రతిగా శార్దూలములో చెప్పిన ఈ పద్యం చూడండి.
ఏలా గాడిదపాలు దుత్తెడయినన్ హేయంబగున్ గంటెడే చాలున్ సద్గుణసేవ్యమైన కపిలాస్తన్యంబు భావింపగా జాలున్ బట్టెడు భక్తితో నొసగు భిస్సాపిండ మో విశ్వద శ్రీలోలా! యభిరామ! ప్రేమ! వినరా! చిత్సార! సన్మందిరా!
అప్రస్తుత ప్రసంగము: పానకములో పుడకవలె అవధానికి, అవధానానికి అడ్డు తగులుతూ సందర్భంలేని చొప్పదంటూ ప్రశ్రలు వేస్తూ, అవధాని ఏకాగ్రతకు భంగం వాటిల్లించడానికి ప్రయత్నించే అప్రస్తుత ప్రసంగి విదూషకుడు, హాస్యకారుడు. అవధాని ఆలోచనలో ఉండగా, సభాసదులకు కొంత వినోదాన్ని పంచి అవధానాన్ని రక్తి కట్టించడమే అప్రస్తుత ప్రసంగ ఉద్దేశము. ఇందు పురాణేతిహాస, శాస్త్ర చర్చలకు తావులేదు. ఇది కేవలం హాస్య ప్రధానంగా సాగే సామాన్యచర్చాగోష్టి. వ్యంగ్య దోరణితో సభ్యసమాజం గురించి, రాజకీయాల గురించి, అవధాని పూర్వపరాల గురించి వేసే ప్రశ్నలకు ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకువాడు ధన్యుడు సుమతీ’ అన్నట్టుగా అవధాని సమాధానిమివ్వవల్సి ఉంటుంది.
వ్యస్తాక్షరి: ఇందు పృచ్ఛకుడు ఒక పద్యంలోని పాదంలోని అక్షరాలను అవధాన ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఒక్కో అక్షరాన్ని ఇచ్చి, అది పాదంలో ఎన్నో అక్షరమో చెపుతుంటాడు. అవధాని అక్షరక్రమాన్ని గుర్తుపెట్టుకొని చివరలో ఆ పాదాన్ని సక్రమంగా చెప్పవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను న్యస్తాక్షరి అని కూడా వ్యవహరిస్తుంటారు. కొన్నిసార్లు అర్థంలేని వాక్యాలను, అన్య భాషా వాక్యాలను కూడా ఇస్తుంటారు. శ్రీ తిరుపతి వేంటేశ్వరులు గారికి ఒకసారి జర్మన్ భాషా పదబంధమును, ద్రావిడ భాషాబంధనమున రచించిన శ్లోకాన్ని ఇచ్చారట. వారికి శ్రీ ముత్తు అయ్యగారు ఇచ్చిన శ్లోకము,
ఆశువు: ఏదైన ఒక అంశాన్ని ఇచ్చి అప్పటికప్పడు అవధానిని పద్య నిర్మాణం చేయమని కోరడమే ఆశువు. కొప్పరపు సోదర కవులు గడ్డిపోచ మీద చెప్పిన ఆశు కవిత్వం ముక్కుమీద వేలేసుకునేటట్టు చేయకమానదు.
తెలియక గడ్డిపోఁచ యని తేలికగాఁ బలుకంగవచ్చునే యిలపయి నట్టి గడ్డిఁదినియేగద యావులు పాలొసంగుఁ బ ఱ్ఱెలుమఱిగొఱ్ఱెలున్ బ్రతికి ప్రీతినొసంగెడు నిండ్లఁగప్పనౌ గలిమిని దాననైన నుపకారములిన్నియు నిట్టులుండఁగాన్.
చివరగా, గోంగూర పచ్చడి గురించి గరికపాటి నరసింహరావు గారు చెప్పిన ఈ ఆశువును చూస్తే, మనకు కూడా నోట్లో నీరురుక మానదు.
సీ. ఆకు కూరను తెచ్చి పీకి పాకము పెట్టి దోరగా వేయించి నోర చూపు రోట రుబ్బెడువేళ నోటి నూరగఁజేసి లోట్ట వేయించెడి గుట్టు రూపు గుంటూరు కారమ్ము గుమ్మరించి గరిటె పోపు పెట్టెడి వేళ టాపు లేపు ఉల్పిపాయము చేర్చి యొక్కొక్క ముద్దనే మ్రింగు చుండెడి వేళ నింగి చూపు
గీ. తెలుఁగు వారికి నిలువెల్ల తెలివినిచ్చు తెలుఁగు కవులకు పద్యాలు వెలుఁగు నిచ్చు తెలుఁగు తల్లుల వంటింటి కలల పంట తినుఁడు గోంగూర పచ్చడి తినుఁడు మీరు.
సౌమ్యశ్రీ రాళ్లభండి