తెలుగు తేజానికి భారతరత్న

తెలుగు తేజానికి భారతరత్న
తెలుగు తేజానికి భారతరత్న

మాజీ ప్రధాని, తెలుగు వాడైన శ్రీ పాములపర్తి వెంకట నరసింహా రావును ‘భారత్ రత్న’తో గౌరవించనున్నట్టు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం ద్వారా తెలియజేశారు.

16 భాషలలో ప్రావీణ్యం గల పండితుడిగాను,రాజనీతిజ్ఞుడిగాను శ్రీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు కొనియాడదగినవని ప్రధాని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానేకాక, కేంద్రమంత్రిగాను ఆయన పని చేశారు. ఆయన ప్రధానిగా తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, దేశ పురోగమనానికి తోడ్పడ్డాయి. భారతదేశం వాణిజ్య ద్వారాలను ప్రపంచ విపణికి తెరవడం, బంగారం నిల్వలను తాకట్టు పెట్టటం ద్వారా ఆర్థికాభివృద్ధికి మార్గాన్ని సుగమం చేశారు. ఆయనే విదేశీ, భాషా, విద్యారంగాలలో చేపట్టిన్న అనేక విధానాలు నేడు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాయి.

చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న

మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ లను కూడా మరణానంతరం కేంద్రప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇంతకు మునుపే అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. దీంతో ఈ సంవత్సరం మొత్తం ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్నలను ప్రకటించింది.

స్వామినాథన్

భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చి, ఆహార కొరత లేకుండా స్వయంసమృద్ధిని సాధించేటట్టుగా పాల్పడిన హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ ను భారత రత్నతో సత్కరించనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశం ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చిందని మోదీ కొనియాడారు.ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ వంగడాలను వృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి దేశ వ్యాప్తంగా తక్కువ ఆదాయం పొందుతున్న ఎంతో మంది రైతుల జీవితాలలో వెలుగునింపింది.

చరణ్ సింగ్

భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా పనిచేసిన, రైతు బాంధవుడిగా పేరుగాంచిన చరణ్ సింగ్ కు కూడా కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. దయానంద సరస్వతి సిద్ధాంతాలతో ప్రభావింతం చెందిన చరణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగాచ మొరార్జీ దేశాయ్ హయాంలో డిప్యూటీ ప్రధానిగా సేవలను అందించారు.