నా స్మృతి పథం – 3

నా స్మృతి పథం – 3
నా స్మృతి పథం – 3

నా మొదటి ముద్రిత రచన

ఇదివరలోనే చెప్పినట్టు జర్నలిజం కోర్సు ఎన్నో అనుభవాలను, అనుభూతులను మిగిల్చింది. జర్నలిజం చివరి సంవత్సరం కోర్సులో భాగంగా ఏదో ఒక పత్రికలోగానీ, మీడియా ఏజెన్సీలో గాని ఒక నెల్లాళ్లు పనిచేసి (ఇంటర్న్ షిప్) అనుభవం గడించాల్సి ఉంటుంది. నాకు ఇంగ్లీషు పట్ల ఉన్న భయం కావచ్చు, ఆ భాషలో అంత పట్టు లేకపోవడం కూడా కారణం కావచ్చు నేను ఇంగ్లీషు పత్రికలకు దూరంగా జరిగాను. ఇంకో ముఖ్య కారణం, ఇంగ్లీషు పత్రికలు విద్యార్ధుల పట్ల కొంచెం కటువుగా వ్యవహరించడం. అంటే, పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయులతో సమానంగా రాత్రి పొద్దుపోయేవరకు పనిచేయించడం, నైట్ డ్యూటీలు విధించడంలాంటివి. జీతాలు, భత్యాలు లేకుండా ట్రైనీలతో గొడ్డు చాకిరి చేయించడం, రేపు ఉద్యోగంలో చేరితే ఇలాగే ఉంటుంది కదా అనడం పత్రికా యాజమాన్యాలకి పరిపాటే. నా స్నేహితుల్లో 90 శాతం మంది న్యూస్ టైమ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికల్లో చేరి అనుభవం గడించారు. తెలుగుకు వచ్చేసరికి అవకాశాలు కొంచెం కష్టమే. ఈనాడు వారికి అప్పటికే సొంత జర్నలిజం స్కూలు ఉంది. కావున వారు బయట విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. కానీ ఆ పత్రిక ఇంగ్లీషు పేపరుకి మాత్రం యూనివర్సిటీ విద్యార్థులను తీసుకునేవారు.

ఆకాలంలో సినీ నిర్మాత, దర్శకుడు దాసరి నారాయణరావుగారు స్థాపించిన ఉదయం పత్రిక (నేడు ఆ పత్రిక మూతబడింది)లో నెలరోజులపాటు పనిచేసి పత్రికలంటే ఇలా ఉంటాయా అని, జర్నలిస్టుగా నన్ను నేను ఊహించుకుని మురిసిపోయాను. ఉదయం ఆఫీసు మా ఇంటికి బహు దగ్గరలో ఉండటం వల్ల కూడా నేను ఆ పత్రికనే ఎంచుకున్నాను. ఉదయంలో నెలరోజుల అనుభవం నల్లేరు మీద బండి నడకలా సాగిపోయింది. నాతోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా అక్కడ పని చేయటం వల్ల మరింత హుషారుగా ఉండేది. ఒక్కొక్క వారం ఒక్కొక్క డెస్క్ లో పని చేయటం ద్వారా వాటి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అన్న అవగాహన కొంతమేరకు కలిగింది. అయితే మేము ఇతర విద్యార్థులలాగా రాత్రిళ్లు పనిచేయాల్సిన అవసరం కలగలేదు.

ఉదయంలో నేను పనిచేసిన సమయంలో 10వ తరగతి ఫలితాలనుకుంటా వచ్చాయి. పత్రిక వీలైతే స్పెషల్ ఎడిషన్ తేవడానికి, లేదా మొదటి ఎడిషన్ లో ఫలితాలు ప్రచురించడానికి చేసిన హడావుడి మాకొక థ్రిల్లింగ్ అనుభవం. అయితే మాకు కూడా జిల్లాల నుంచి వచ్చిన ఫలితాల ఏజెన్సీ కాపీని (పిటిఐ, యూఎన్ఐ) తెలుగులోకి అనువాదించే అవకాశం కల్గింది. మర్నాడు పొద్దున 10వ తరగతి విద్యార్థులతోపాటు మేము కూడా మా అనువాదం ఉందా లేదా అని ఆత్రుతతో పత్రిక కొని చదువుకుని, ఉందని నిర్థారించుకొని సంబరపడ్డాం. కాకపోతే అలాంటి వార్తల్లో పాత్రికేయుల పేర్లుండవు కనుక ఎలాగో, అలాగ మా పేరుతో వ్యాసాలు ప్రచరించుకోవాలని ఆలోచిస్తుండగా, ఉదయం మహిళా పేజిలో పని చేసే అవకాశం దక్కింది. దాంతో, ఆ పేజి ఇన్ ఛార్జిని బ్రతిమాలుకుంటే, ఆయన ముందు నేను ఎలా రాయగలనో చూస్తానని ఒక ఇంగ్లీషు మ్యాగ్ జైన్ ఇచ్చి అందులో ఒక వ్యాసాన్ని స్వేచ్ఛానువాదం చేయమని చెప్పాడు. తీరా చూస్తే అదొక కుట్లు, అల్లికలకు సంబంధించిన వ్యాసం. నాకు భోరున ఏడ్వాలనిపించింది. ఎందుకంటే, కుట్లు, అల్లికలు అంటే నాకు చెత్త చిరాకు. ఇక్కడో విషయం చెప్పాలి. స్కూల్లో కుట్లు, అల్లికల క్లాసులో కూడా నా స్నేహితులిద్దరిని (కవలలు – జుబేదా, ఫరిదా) బ్రతిమాలి నా పని కూడా వారి చేత చేయించుకునే దాన్ని. అలాంటిది ఇప్పుడు వాటి గురించి రాయటం అంటే నా ఉత్సాహమంతా నీరుగారి పోయింది. అయినా తప్పదు కనుక, స్వేచ్ఛానువాదం చేసి ఆయనకిచ్చి నీరశంగా ఇంటికి వెళ్లిపోయాను. మర్నాడు ఆఫీసుకు వెడితే, ఇవాళ పత్రిక చేశావా అని అడిగాడు. లేదని అక్కడే ఉన్న దినపత్రికలో మహిళా పేజి తిరగేస్తినా, నేను అనువదించిన వ్యాసం నా పేరుతో సహా సాక్షాత్కరించింది. చూసుకున్నావా నీ పేరన్నట్టు ఆయన చూస్తుంటే, ఇది నేను రాసింది కాదు కదా అని అమాయకంగా ప్రశ్నించాను. దానికి ఆయన ఎవరికి తెలుసు? పైగా ఇది ఏదో విదేశీ పత్రిక నుంచి తీసుకున్నది, ఎవ్వరికి తెలవదని భరోసా ఇచ్చాడు.

మర్నాడు అందరూ కాలేజీలో భుజం తడుతుంటే, మింగలేక, కక్కలేక సతమతమయ్యాను. ఇది నా వ్యాసం కాదన్న ఏడుపు, నేను రాయలేనా అన్న పౌరుషంతో ఒక వ్యాసం రాసి మర్నాడు ఆ పేజి ఇంఛార్జి వద్దకు తీసుకువెళ్లి ఇది ఎలా ఉందో చెప్పమని, వీలైతే సినిమా పేజి వారికి కూడా చూపి ముద్రణకు వీలు కల్పించమని బ్రతిమాలాను. ఆయన నా బాధ భరించలేక సరే అన్నాడు. మర్నాడు ఆఫీసుకు వెళ్లి ఆత్రుతతో పత్రిక తిరగేసాను. నా వ్యాసం లేదు. నిరాశ, నిస్పృహల మధ్య మరో రెండు రోజులు ఎదురు చూసి చివరకు నా వ్యాసం గురించి అడిగాను. ఆయన ఇంకా చూడలేదని చెప్పటంతో ఐసియులో పేషెంట్ కి ఆక్సిజన్ ఇచ్చినట్టు నాకు కొంచెం ఊపిరాడింది. మా నెల్లాళ్ల పత్రికానుభవం సమయం పూర్తి కావస్తోంది. కానీ నా వ్యాసం సంగతి మాత్రం తేలలేదు. బాగలేదేమో, అందుకే ప్రచురించలేదు. నాకు చెపితే, బాధపడతానని చెప్పలేదనుకొని, నేను కూడా ఊరుకుండిపోయాను. ఇంకో రెండురోజుల్లో వెళ్లిపోతామనగా, ఆఫీసులో యధాలాపంగా పత్రిక తిరగేస్తూ, మహిళా పేజీలో వ్యాసం చదువుతుండగా, ఇదేదో తెలిసినట్టు అన్పించి, కింద చూస్తిని గదా నా పేరు. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అది నేను రాసిన వ్యాసం. నా స్వంత ఆలోచనలకు అక్షర రూపం. నా మెదడులోంచి పెన్నులోకి వెళ్లి సిరాగా మారిన నా భావావేశం. నా మొదటి ముద్రిత రచన. జూలై 19, 1993లో ఉదయం పత్రికలో నా ఆర్టికల్ ప్రచురితమైంది.

ఈ ఆర్టికల్ గురించి మరో చిన్న విశేషం ఇక్కడ చెప్పాలి. నా ఉద్యోగ పర్వంలో ఈ ఆర్టికల్ మళ్లీ నాకో పాఠం నేర్పింది. ఉద్యోగాల వేటలో ఒక చిన్నపాటి పత్రికకు ఇంటర్వ్యూకి వెళ్లాను. నేను రాసిన వ్యాసమని చూపించాను. ఎడిటర్ నన్ను ఒకసారి పై నుంచి కిందకు చూసి, వ్యాసాన్ని పరికించి, ‘స్నిగ్దత’ అంటే ఏమిటి అని అడిగాడు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియలేదు. ఆయన నా వ్యాసాన్ని చూపించి, ఇది నువ్వు రాసిందే కదా? అయితే అర్థం చెప్పు అన్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆ పదానికి నేను సరిగ్గా అర్థం చెప్పలేనేమో. కారణం, కొన్ని పద ప్రయోగాలు మనం అనాలోచితంగా చేస్తాం, వాటి అర్థాల జోలికి వెళ్లం. ఏదిఏమైనప్పటికీ, ఆ ఎడిటర్ గారు నేను ఆ వ్యాసాన్ని రాయలేదని నిర్థారణకు వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వనన్నాడు. అదీ నా మంచికే ఎందుకంటే, ఆ పత్రిక మరో నెల తర్వాత మూతబడింది. నాకు చేతకాని కుట్లు, అల్లికలు సాక్షిగా, నాడు ప్రచురితమైన ఆ వ్యాసం నేను రాసిందే. అదే వ్యాసాన్ని మీరు చదివి ఓ నిర్థారణకు రండి.

గ్లామర్ పేరుతో వి(వ)లువలు దిగజారు

నేటి సినిమాల్లో స్త్రీ పాత్ర

సినిమా దైనందిన జీవితంలో ఒక భాగమైంది. సామాన్యులకు, మధ్యతరగతి వారికి సినిమాని మించిన ఎంటర్టైన్మెంట్ లేదు. ఆరిస్టోక్రాట్స్ కు బోల్డన్ని వ్యాపకాలు. వారికి సినిమా చూసే తీరిక, ఓపిక ఉండవు. అంతగా చూడాలనుకుంటే క్యాసెట్ తెచ్చుకుని చూస్తారే తప్ప థియేటర్లలో చూడటం బహు అరుదైన విషయం.

సినిమా ఇంతగా సామాన్యుని జీవితంతో పెనవేసుకుని పోవటానికి కారణం ఇల్యూజన్. ఊహా ప్రపంచంలో రెండున్నర గంటలపాటు విహరింపజేస్తుంది. జీవితంలో తాము పొందలేని వాటని తమ హీరో లేదా హీరోయిన్ అవలీలగా గెలుచుకుంటూ పరిపూర్ణ జీవితాన్ని పొందుతుంటే దానిని తమకు అన్వయింపజేసుకుంటూ పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంటారు. దీని వల్ల సదరు హీరో, హీరోయిన్ల పట్ల వారికి గాఢాభిమానం ఏర్పడి పోతుంది. లోగడ సినిమాలు వాస్తవానికి దగ్గరా ఉంటూ చక్కని కుటుంబ కథా చిత్రాలను రూపొందించేవారు. వీటిల్లో స్త్రీ పాత్ర కూడా సందర్భోచితంగా కథలో ప్రధాన పాత్రగా కన్సిస్తూ కంటతడి పెట్టించేది. చలనచిత్రాలు ప్రారంభమైన తొలిదశలో అసలు స్త్రీ పాత్రను ధరించటానికి స్త్రీలు ముందుకు వచ్చేవారు కాదు. మగవారే స్త్రీ పాత్రను ధరించేవారు (అక్కినేని కూడా స్త్రీ పాత్రను ధరించటం తెలిసిందే). అయితే, కాలానుగుణంగా సినీ పరిశ్రమ మారుతూ వస్తోంది. చలనచిత్రాల్లో స్త్రీలే, స్త్రీ పాత్రలను పోషించటం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు స్త్రీ పాత్ర చిత్రీకరణలో పెనుమార్పలు వచ్చాయి. ఈ పాత్రలు కేవలం అలంకార ప్రాయంగా హీరో పక్కన నాలుగు పాటలు పాడటం వరకే పరిమితం అయిపోయింది. ఇవిద స్త్రీ పాత్రని దెబ్బతీస్తూ, పాత్ర ఔచిత్యాన్ని దిగజార్చే విధంగా ఉంటున్నాయి. ఇదివరకులా నేడు స్త్రీ పాత్రలకు గుర్తింపు, గౌరవం ఏమాత్రం లేదు. ఒక విధంగా కించపరిచేవిధంగా ఉంటున్నాయి. పౌరాణిక, చారిత్రాత్మక, జానపద సినిమాలు వచ్చినన్నాళ్లు, స్త్రీ పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉండి, గుర్తింపుని, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఉదాహరణకి ‘మాయాబజార్’ లో శశిరేఖ, ‘పాండవవనవాసం’లో పాంచాలి, ‘పల్నాటి యుద్ధం’లో నాగమ్మ నాయిక వంటి పాత్రల చిత్రీకరణ సహజత్వానికి దగ్గరగా ఉండి, ఒక అర్థాన్ని కలిగి ఉన్నాయి. సాంఘిక సినిమాల్లో కూడా 70, 80 దశకం వరకు స్త్రీ పాత్రలు ప్రజల మన్ననలను పొందాయి. ‘బాటసారి’, ‘మల్లీశ్వరి’, ‘రక్త సంబంధం’ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. అలాగే నాడు, హీరోయిన్ పాత్రకి, వాంప్ పాత్రకి వేర్వేరుగా నటులు ఉండి, తేడా ప్రస్ఫుటంగా కనిపించేది. వాంప్ పాత్ర కూడా సినిమాలో భాగంగా ప్రాముఖ్యతని కలిగి ఉండేవి. కానీ ఆధునిక ప్రజల జీవితంలోకి తొంగిచూడటం మొదలు పెట్టాక, సినిమా ప్రపంచం కూడా తదనుగుణంగా మారిపోయింది. నేడు హీరోయిన్నే వాంప్ అయిపోయింది. పాపం ఆ పాత్రలు ధరించే వారు తెరమరుగయ్యారు. నేడు గ్లామర్ నటులు, కళాత్మక చిత్రాల్లో నటులు వేరు, వేరు అన్నట్లు వర్గీకరణ వచ్చింది. హీరోయిన్ల పాత్ర పరిధి కుంచించుకుపోయి, హీరోతో, దర్శకుడు కోరినప్పుడల్లా డ్యాన్స్ లు చేయడం వరకే పరిమితమై పోయింది. పాటల్లో కూడా స్త్రీని అర్థనగ్నంగా అశ్లీలంగా చూపి డబ్బులు దండుకోవడం పరిపాటయ్యింది. నేటి జెట్ యుగంలో అర్థంకాని, ద్వందర్థ పదజాల పాటలు సిగ్గుతో తలదించుకునేటట్టు చేస్తున్నాయి. ద్వందార్థ పదజాలం నిప్పుకి గాలితోడైనట్లుగా, అశ్లీలతకు, అర్థరహిత పాటలకు తోడై, పాటను వినలేకుండా చేస్తున్నాయి. ఇంక రేప్ సీన్ల చిత్రీకరణలో హింస, అశ్లీలత ఎక్కువై స్త్రీ విలువలను మంటగలుపుతున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో, స్త్రీని పోలీస్ ఆఫీసర్ గానో, లేక కరాటే ఫైట్లు చేసే సూపర్ డూపర్ యాంగ్రీయంగ్ ఉమెన్ గానో చిత్రీకరిస్తున్నారేగాని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను స్త్రీ ఎంత ధైర్యంగా ఎదుర్కొనవచ్చో, ఎదుర్కొంటొందో యదాతథంగా వెండి తెరపైకి ఎక్కించే సాహసం ఎవరూ చేయట్లేదు. ఈ చిత్రం స్త్రీ సమస్యలకి అద్దం పట్టే విధంగా ఉంది అని చెప్పదగ్గ చిత్రం ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదేమో. కళాత్మక చిత్రాల్లో కూడా స్త్రీ పాత్ర చిత్రీకరణ తగిన స్థాయిలో లేదనే చెప్పొచ్చు. ‘దాసి’ వంటి ఆర్ట్ చిత్రంలో నిజాం కాలంలో దాసీల దైన్య పరిస్థితిని చిత్రీకరించటంలో కళాత్మకత కంటే అశ్లీలతే ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేస్తుంది. అలనాటి చిత్రాల్లో ఏ పాత్రనైనా నేడు చిత్రీకరించవలసి వస్తే అశ్లీలతని ఎంత బాగా జోడించి, చిత్రీకరిస్తారో ఊహించుకుంటే చాలు. ‘బాటసారి’ సినిమాలో భానుమతి (పెద్దక్క) పాత్రను నేడు చిత్రీకరిస్తే, ‘ఓ బాటసారి నను మరువకోయి’ అనే పాట స్థానంలో ఆ పాత్ర ఊహల్లోకి వెళ్లి కాశ్మీరులోనో, ఊటీలోనో నృత్యం పేర కుప్పిగంతులు వేస్తూ, ఏయ్ బాటసారి ఐయామ్ సోసారీ అంటూ, ‘నీక్కావల్సింది నా దగ్గర ఉంది,’ అని ద్వందార్థ పాటలు పాడుతుంది. అంతేకాని సహజత్వం, పాట చిత్రీకరణలో లాలిత్యం మనకు మచ్చుకైనా కనిపించవు. ఇది మన తెలుగు చిత్రిలాకే పరిమితం కాదు. ఏ భాషలోనైనా ఇంతే. వ్యాపారాత్మక చిత్రాల్లో స్త్రీ పాత్ర తన ఉనికిని ఎప్పుడో కోల్పోయింది. ఒక వేళ హీరోయిన్ పాత్రను సబలగా చూపించడానికి ప్రయత్నించినా ఎక్కువగా, పగని, ప్రతీకారాన్నీ తీర్చుకునే వ్యక్తిగా మాత్రమే చిత్రీకరిస్తున్నారు. అంతేగాని ‘అంకురం’ చిత్రంలో లాగా మానవత్వపు విలువలను కాపాడటానికి ఒక స్త్రీ ఒంటరిగా జరిపే పోరాటాన్ని చూపే చిత్రాలని వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. నేడు ఇలాంటి చిత్రాల సంఖ్య పెరగవలసి ఉంది.

దుస్తుల పేర గుడ్డ పీలికలు ధరించి, డిస్కో డాన్స్ అనబడే జుగుప్సను కలిగించే నృత్యాలు చేసే పాత్రల చిత్రీకరణకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. లేదా ఈ చిత్రాలు నేడి యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే సినిమాల ప్రభావం వల్ల యువత ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ తప్పుదార్లుపడుతున్నారు. మంచిని, చెడును బేరీజు వేసుకోలేక ఎండమావుల వెండ పరుగిలిడుతున్నారు. తాము చేసే పనులన్నీ సాహస కృత్యాలుగా భావిస్తూ, ఈస్టమన్ కలర్ ల్లో భవిష్యత్తుని చిత్రీకరించుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు, సినిమాల్లో హీరోయిన్లు ధరించే దుస్తులను పోలిన దుస్తులను ధరించటం, వారిలాగా మేకప్ చేసుకోవటం, కేశాలంకరణ చేసుకోవడం ఇలా తల నుంచి కాలి గోరు వరకు వారిని అనుకరిస్తూ, తమ ఉనికిని కోల్పోతున్నారు. వాస్తవాన్ని మరచి ఊహా లోకంలో విహరిస్తున్నారు. మార్కెట్ లో కూడా చాందినీ, గీతాంజలి డ్రెస్సులు, మైనే ప్యార్ కియా గాజలు ప్రవేశించి వీరి మోజును మరింత పెంచుతున్నాయి. వంద చెత్త సినిమాల మధ్య వచ్చే ఒక్క మంచి చిత్రం యువతపై ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. సమాజంలో ఇప్పటికే అక్రమాలని, అన్యాయాలని ఎదుర్కొంటున్న స్త్రీలకు మనోధైర్యం కలిగించే విధంగా స్త్రీ పాత్రలను మలచగలగాలి. కాని సినిమాల్లో స్త్రీ పాత్రల చేత పలికించే డైలాగ్ లు విని, నిజజీవితంలో స్త్రీ సిగ్గుతో చితికిపోతుంది. సినిమాల్లో హీరోయిన్ ‘లేచిపోదామా’ అని మాటిమాటికి ఎవరిని పడితే వాళ్లని అడగడం సహజత్వానికి చాలా దూరం. స్త్రీలలో సహజంగా ఉండే సిగ్గు, బిడియం, స్నిగ్దతలతో స్త్రీ పాత్రలను చిత్రీకరించటం లేదు. దీని ప్రభావం యువతులపై ఎంతో ఉంటుంది. ఇక సినిమా టైటిల్స్ లో ఉండే అశ్లీలత వల్ల స్త్రీలు తలెత్తుకుని తిరిగే అవకాశం కోల్పోతున్నారు.

కావున మంచి గ్రహించి, యువతులు తమని తాము తీర్చి దిద్దుకోవాలి. సినిమాని సినిమాగా చూసి ఆనందించాలే తప్ప, నిజ జీవితానికి అన్వయించుకుంటే ఘోరాలు జరిగిపోతాయి.

(ఉదయం, జూలై 19, 1993లో ప్రచురితమైన వ్యాసం)

సౌమ్యశ్రీ రాళ్లభండి