చెదరని చరిత్ర, ఆగని విమర్శలు

చెదరని చరిత్ర, ఆగని విమర్శలు
చెదరని చరిత్ర, ఆగని విమర్శలు

అది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. డిసెంబర్ 13, 1947, కొన్నివేల మైళ్ళ దూరంలో ఉన్న ఆస్ట్రేలియా సిడ్నీక్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాతో మన భారత క్రికెటర్లు తలపడుతున్నారు. తమ మొదటి ఇన్నింగ్స్ లో 188 పరుగులు చేసిన భారత జట్టు నిరాశగా బౌలింగ్ మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు బ్రౌన్ మరియు మార్సి 25 పరుగులు చేశారు. నెమ్మదిగా విను మన్కడ్ బంతిని తన ఎడమ చేతిలోకి తీసుకుని బౌలింగ్ చేయడానికి ఉపక్రమించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ బ్రౌన్ నాన్ స్ట్రైకర్. అందరి దృష్టి మన్కడ్ చేతిపై, మార్సి పై ఉంది. మన్కడ్ బంతి వేసే లోపల బ్రౌన్ తన క్రీజ్ దాటి రెండు అడుగులు ముందుకు వచ్చాడు. అది ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా, మన్కడ్ నాన్ స్ట్రైకర్ వికెట్లపై నున్న బేల్స్ ని బంతితో నేలరాల్చి అవుట్ కి అపీలు చేశాడు. అంపైర్ వేలు నెమ్మదిగా గాలిలోకి లేచింది. అంతే భూమి బద్ధలైంది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. క్రీడా ప్రపంచం రెప్ప వేయటం మర్చిపోయి, నోట మాటరాక నిలబడిపోయింది. క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరగని ప్రళయం ఏర్పడింది. మన్కడ్ చేసిన పని సబబు కాదని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైందని అందరూ గగ్గోలు పెట్టారు. ఇంగ్లాండ్ మహారాణి ఎలిజిబత్ ప్రత్యేకంగా మన్కడ్ ఎవరో అడిగి తెలుసుకుని కరచాలనం చేసిన ఆటగాడు, మొత్తం 233 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో11,591 పరుగులు చేసి 782 వికెట్లు సాధించిన ప్రతిభావంతుడు చరిత్ర పుటలలో ఒక తప్పిదంగా గుర్తుండి పోవడం, గుర్తుకు రావటం విచారకరం. క్రికెట్ నియమాలను అనుసరించి చేసిన అవుట్ ఎందుకు సమస్యగా మారింది?

మన్కడ్ ఈ పని చేయటం అది మొదటిసారి కాదు. అదే మైదానంపై అంతకు కొన్ని రోజుల ముందు కూడా ఆస్ట్రేలియా IX తో జరిగిన ఆటలో బ్రౌన్ అదేవిధంగా బౌలర్ బంతి వేసే లోపల క్రీజ్ దాటి రెండడుగులు ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా మన్కడే బౌలర్. మొదటిసారి బౌలర్ బంతి వేయటం ఆపి బ్రౌన్ని హెచ్చరించాడు. అయినా పట్టించుకోకుండా బ్రౌన్ మళ్లీ అదేవిధంగా క్రీజ్ వదలి రావటంతో అతనిని మన్కడే రన్ అవుట్ చేశాడు. అదే ఇతివృత్తం మళ్లీ టెస్ట్ మ్యాచ్లో పునరావృత్తమైంది. బ్రౌన్ తన తప్పిదం నుంచి ఏం నేర్చుకున్నాడని గాని, అతని నిర్లక్ష్య వైఖరిని గాని ఎవరూ ప్రశ్నించలేదు. అవుట్ చేయటాన్ని మాత్రమే తప్పుగా పేర్కొన్నారు. కారణాలు ఏమిటని ఇప్పుడు అడగటంలో అర్థం లేకపోవచ్చు. కాని క్రికెట్ చరిత్రలో ఆ అవుట్ ‘మన్కాడింగ్’ గా శాశ్వతంగా నిలిచిపోయింది, మన్కడ్ ప్రతిభ తెరమరుగైంది.

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దీప్తి శర్మ, క్రీజ్ దాటి వచ్చిన చార్లీ డీన్ ను రన్ అవుట్ చేయటంతో మరోసారి వివాదం తలెత్తింది. ఈ రకమైన అవుట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని గత 75 ఏళ్లగా చేస్తున్న విమర్శలు మరోసారి తాటాకు జువ్వలుగా ఆకాశాన్నంటాయి. చాలాకాలం క్రితం మన్కాడింగ్ మ్యాచ్ కు కెప్టన్ గా వ్యవహరించిన ఆస్ట్రేలియా కెప్టన్ డాన్ బ్రాడ్ మాన్ తాను రాసిన ‘ఫేర్వెల్ టు క్రికెట్’ అనే పుస్తకంలో మన్కడ్ ను సమర్థిస్తూ, ‘పత్రికా రంగం మన్కడ్ ను ఎందుకు విమర్శిస్తున్నారు? క్రికెట్ నియమాలననుసరించి, బౌలర్ బంతి వేసే వరకు నాన్ స్టైకర్ క్రీజ్ లోపలే ఉండాలి. అలాకాకపోతే, ఆ రన్ అవుట్ నియమాల్లో ఉండి ఏం లాభం’ అని ఘాటుగానే ప్రశ్నించటంతోపాటు, మన్కడ్ చర్య సబబైనదని, మద్దతు పలికాడు. అలాగే అనేకమంది గతంలో కూడా బ్యాట్స్ మెన్ చేసిన తప్పిదానికి బౌలర్ ను తప్పుబట్టడాన్ని విమర్శించారు. అయినా, ప్రతిసారి ఈ విధంగా ఒక బ్యాట్స్ మెన్ అవుటయినపుడు కొత్తగా వివాదం రేకెత్తుతూనే ఉంది. బౌలర్ విమర్శలకు గురవుతూనే ఉన్నాడు.

గత చరిత్ర

1947లో మొట్టమొదటిసారి మన్కాడింగ్ వెలుగు చూసినప్పటి నుంచి నేటి డీన్ వరకు అనేక మంది క్రీడాకారులు పలుమార్లు ఈ విధంగా అవుటయ్యారు. మన్కడ్ కంటే దాదాపు వంద సంవత్సరాల కంటే ముందు 1835లో ఇంగ్లాండ్ లో జరిగిన ఒక కౌంటీ మ్యాచ్ లో థామస్ బార్కర్, జార్జ్ బైజెంట్ ను ఇదే విధంగా అవుట్ చేశాడు. అయితే సామాజిక మాధ్యమాలు ఇంత విస్తృతంగా లేకపోవటం చేత బార్కర్ బతికిపోయాడు, మన్కడ్ చరిత్రలో మిగిలిపోయాడు. 1947లో బిల్ బ్రౌన్ అవుటవడానికి ముందు కనీసం 16 మంది ఈ విధంగా రన్ అవుట్ అయ్యారు. రెండు, మూడు సంఘటనలు మినహాయించి, మిగిలిన అవుట్లన్నీ ఇంగ్లాండ్ కౌంటీలలో జరగటం విశేషం. ఇప్పటి వరకూ వివిధ దేశాల దేశవాళీ మ్యాచ్ ల్లో 36 మంది మన్కాడింగ్ అయ్యారు. మన్కాడింగ్ క్రికెట్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అయినా తమకు అనువైనప్పుడు మాత్రం విమర్శలను గుప్పిస్తుంటారు. ఈ మధ్య కాలంలో రవి అశ్విన్ చేసిన రెండు మన్కాడింగ్ లు వివాదాన్ని సృష్టించాయి. మొదటిది శ్రీలంకకు విరుద్ధంగా జరిగింది. కానీ కెప్టన్ సెహ్వాగ్ రన్ అవుట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. రెండోసారి 2019లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో అశ్విన్ రన్ అవుట్ చేసి దుమారం రేపాడు. అయితే అది ఐపిఎల్ కావటం వల్ల విజయం, వినోదం, ధనం ప్రాబల్యం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. అదే 2021 ఐసిసి మహిళా టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడానికి జరిగే టోర్నీలో కామెరూన్, ఉగాండాల మధ్య జరిగిన పోటీలో కామెరూన్ కు చెందిన మేవా డోవా ఏకంగా నలుగురు బ్యాటర్లను ఒకే మ్యాచ్ లో మన్కాడింగ్ చేసింది. అయినా ఎవరూ నోరు మెదిపిన పాపాన పోలేదు, గుర్తించనైనా గుర్తించలేదు. ఇదే అశ్విన్ మరో ఐపిఎల్ మ్యాచ్ లో ఆరన్ ఫించ్ ను మన్కడ్ చేయకుండా వదిలేసాడు. అందుకు అశ్విన్ నెత్తిన కిరీటమూ పెట్టలేదు. దానాదీనా మన్కాడింగ్ వివాదం మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతోంది, ఆ సమయానికి విజయావకాశాలు ఇరు జట్లకు ఎలా ఉన్నాయి అన్నదానిపై ఆధారపడి ఉంటుందనిపిస్తోంది.

క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా?

మన్కాడింగ్ చేయటం కంటే, చేసే ముందు బ్యాట్స్ మెన్ ను హెచ్చరించాలి, అదే క్రీడా స్ఫూర్తిని తెలియ చేస్తుందని, అలా చేయకుండా అవుట్ చేయటం తప్పన్నది చాలామంది వాదం. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకి ఆట నియమ, నిబంధనలు తెలియవా? హెచ్చరించాల్సిన అవసరం ఉందా? తాము తప్పు చేస్తున్నామని తెలిసి బ్యాట్స్ మెన్ తప్పు చేస్తే, ఎందుకు హెచ్చరించాలి? దీప్తి శర్మ, చార్లీ డీన్ విషయాన్నే తేసుకుందాం. దీప్తి శర్మ డీన్ ను అవుటు చేయడానికి ముందు కనీసం 71సార్లు బౌలర్ బంతి వేసేటప్పటికే క్రీజ్ బయటకు వచ్చినట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. టీవి ఫుటేజ్ ఇందుకు నిదర్శనం. అయినా ఎవరూ చార్లీ డీన్ ను అలా ఎందుకు చేశావనిగాని, ఆట నియమాలు నీకు తెలియదా అని గాని ప్రశ్నించట్లేదు. ఇంకా లోతుగా వెళ్లి విశ్లేషిస్తే, డీన్, జోన్స్, క్రాస్ లతో బ్యాటింగ్ చేసినపుడు క్రీజ్ దాటి కేవలం ఒక అడుగు మాత్రమే ముందుకు వచ్చింది. అదే ఆట చివర్లో, చివరి బ్యాటర్ డేవీస్ ఉన్నప్పుడు కనీసం అడుగున్నర నుంచి రెండడుగల వరకు క్రీజ్ బయటకు వచ్చింది. అంటే చార్లీ డీన్ ఉద్దేశపూర్వకంగానే క్రీజ్ వదలి ముందుకు వచ్చిందని అనుకోవచ్చా? ఆట రసపట్టులో ఉన్నప్పుడు బ్యాటర్ తన బ్యాట్ ఎక్కడ ఉందో గమనించలేదని అనుకుందామన్నా, 71 సార్లు క్రీజ్ దాటి ముందుకు రావటాన్ని విస్మరించలేము. దీప్తి శర్మ చేసింది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైతే, డీన్ చేసిన పని ఏ కేటగిరిలోకి వస్తుందో విమర్శకులే తెలపాలి. వ్యక్తిగతంగా, దీప్తి శర్మ చర్యను నేను సమర్థించలేక పోయినా, ఆట నియమాలననుసరించి తాను చేసినది తప్పుకాదని ఒప్పుకోవాల్సిందే. ఆట నియమాల్లో బౌలర్ బ్యాటర్ని హెచ్చరించాలని కూడా ఎక్కడా రాసి లేదు. అలా చూసినా దీప్తి శర్మ, డీన్ ను వారించనవసరం లేదు. అయితే, ఇదివర్లో క్రిస్ గేయల్, కార్ట్ని వాల్ష్, కపిల్ దేవ్ లాంటి పలువురు క్రీడాకార్లు నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ని క్రీజ్ దాటవద్దని వారించారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమే కాని, క్రీడా నియమాలలో లేదు. ఒక బ్యాట్స్ మన్ పరుగులు సాధించడానికి క్రీజ్ వదలి రావటం ఆమోదయోగ్యమైతే, బౌలర్ చేసిన పని కూడా విమర్శలకు గురికాకూడదు. కాకపోతే క్రికెట్ మొత్తం బ్యాట్స్ మెన్ల చుట్టూ తిరుగుతుండటంతో బౌలర్ చేసే పనులు విమర్శలకు గురవుతున్నాయి.

ఇకపోతే, ఇటీవలే మాన్కాండిగ్ ను ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమైన రన్ అవుట్ కేటగిరీ నుంచి తప్పించి ‘రన్ అవుట్’ కేటగిరీలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేర్చింది. అంటే ఇక మన్కాడింగ్ అనే అవుట్ క్రికెట్ నియమాలలో లేదు. కేవలం విమర్శకుల మస్తిష్కంలో మాత్రమే మిగిలుటుంది. మారిన నియమాలను ఆటగాళ్లందరూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ఇలాంటి విమర్శలకు తావుండకపోవచ్చు. ఇక్కడ నియమాలు తెలవటం, తెలవకపోవడం సమస్య కాదు. అసలు ఆట ఆడేటప్పుడు క్రీడాకారుల ప్రవర్తన ఎలా ఉండాలి? క్రీడా స్ఫూర్తికి నిర్వచనం ఏమిటి?

1981 సీరిస్ లో చివరి బంతికి ఆరు పరుగులు చేస్తే న్యూజీలాండ్ మ్యాచ్ ను టై చేయగలిగే అవకాశం ఉండేది. కానీ అప్పటి ఆస్ట్రేలియా కెప్టన్ గ్రెగ్ ఛాపల్ తన బౌలర్ని అండర్ ఆర్మ్ (బంతిని నేల మీద దొర్లించమని) బౌలింగ్ చేయమని ఆదేశించాడు. తద్వారా న్యూజిలాండ్ మ్యాచ్ ని టై చేసే అవకాశం కోల్పోయింది. ఛాపల్ ఆనాడు ఆ పని చేసే సమయానికి ఆ విధమైన బౌలింగ్ నియమానికి విరుద్ధం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా అవతలి జట్టు విజయావకాశాలను నేలకూల్చిన ఆ చర్య మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే. ఈ సంఘటన తర్వాత ఐసిసి అలాంటి బౌలింగ్ చేయటం నియమ విరుద్ధమని ప్రకటించి వివాదాలకు తెరదింపింది. అలాగే, కీలకమైన సమయంలో బ్యాటర్ కు బంతి అందకుండా పదే, పదే వికెట్లకు దూరంగా బంతిని వేయటం ద్వారా జట్టు విజయావకాశాలను దెబ్బతీయటం నియమాలకు, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాకపోవడం విచిత్రం.

ఇక 1930లో ఇంగ్లాండ్ అవలంబించిన బాడీ లైన్ బౌలింగ్ నాడు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం, నియమ విరుద్ధం కాదు. కానీ నేడు బంతిని బ్యాటర్ ఛాతీపైకి, తలపైకి విసరటం తప్పుకాదు. అలా బౌన్సర్లు వేయ గలిగే ఆటగాడికి బ్రహ్మరథం పడుతుంది క్రికెట్ ప్రపంచం. అలాంటి బంతులు ఆటగాడి ప్రాణాలు తీసినా ఆశ్చర్యకరంగా అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదు. ఒక ఆటగాడు 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతి ముందు నిలబడడానికి జంకుతుంటే, అతని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి పదే, పదే అతని ఛాతీని, తలని లక్ష్యంగా చేసుకుని బంతిని విసరటం క్రీడా నైపుణ్యమే కాని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాకపోవడం విచారకరం. ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ హ్యూజ్స్ అలాంటి ఒక బంతికి ప్రాణాలు వీడి, ఇంగ్లాండ్ కు చెందని జోనథన్ ట్రాట్ ఇలాంటి బంతులను ఎదుర్కోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై క్రికెట్ నుంచి విరమించి ఎంతో కాలం కాలేదు. ఒక ఓవర్లో ఒక బ్యాటర్ కి రెండుకు మించి బౌన్సర్లు వేయకూడదన్నది నియమం. ఒక క్రీడాకారుని ప్రాణం తీయడానికి ఒక్క బంతి చాలన్నది నిరూపించబడిన నిజం. అయినా ఈ బంతులని ఎవరూ వ్యతిరేకించరు. కేవలం మన్కాడింగ్ ని మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చూడటం హాస్యాస్పదం.

మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, జాత్యాహంకార వైఖరి, చెక్క బ్యాట్ కు బదులుగా అల్యూమినియం బ్యాట్ తీసుకు వచ్చి 1979లో డెన్నిస్ లిల్లీ ఆడటం నియమాలకు విరుద్ధం కాదు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆ తర్వాత నియమాలను సవరించి ఎలాంటి బ్యాట్లను ఉపయోగించాలో ఐసిసి నిర్దేశించింది. ఒక ఆట ఆడినప్పుడు విజయం సాధించాలను కోవటం తప్పుకాదు. కానీ, అందు కోసం ఉద్దేశపూర్వకంగా బంతి రూపు రేఖలు మార్చి ప్రత్యర్థి జట్టుల విజయావకాశాలు నీరుకార్చాలను కోవడం క్రీడా స్ఫూర్తికే కాదు, నైతిక విలువలకు కూడా విరుద్ధం. ఆస్ట్రేలియా క్రికెటర్లు డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బ్యాంక్ క్రాఫ్ట్ లు అలా బంతి రూపురేఖలను మార్చటం ద్వారా మ్యాచ్ నెగ్గాలని ప్రయత్నించినా వారు కొద్దిపాటి శిక్షలతో బయటకు వచ్చారు. ఇలాంటి వివాదంలో చిక్కుకున్న క్రీడాకారుల జాబితాలో మైక్ ఆర్థటన్, వకార్ యూనిస్, జేమ్స్ ఆండ్రసన్ తోపాటు అనేకమంది ఉన్నారు. అయినా, ప్రజలు ఈనాటికి వారందరిని గొప్ప క్రీడాకారులుగా గౌరవిస్తూనే ఉన్నారు. వీరుందరూ చేసిన దాని ముందు దీప్తి శర్మ చేసింది ఏపాటి.

ఆటగాళ్లలో, ప్రేక్షకులలో, విమర్శకులలో ఈ ద్వంద్వనీతి ఉన్నంతవరకు క్రీడలు ఇలాంటి వివాదాలలో మళ్లీ, మళ్లీ చిక్కుకుంటూనే ఉంటాయి. అలాకాకుండా ఉండాలంటే, మన్కాడ్ అవుట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా కాదా అన్న చర్చమాని, ఈ విషయంలో కొత్త నియమాలను రూపొందించటం సర్వదా శ్రేయస్కరం.

సౌమ్యశ్రీ రాళ్లభండి