
1. బ్రహ్మపురాణం
‘ఆద్యం సర్వపురాణానాం, పురాణం బ్రహ్మముచ్యతే
అష్టాదశ పురాణాని పురాణాజ్ఞాః ప్రచక్ష్యతే
అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణంగా విష్ణుపురాణం పేర్కొంది. అలాగే ‘రాజ సేషుచ మాహత్మ్య మధికం బ్రహ్మణోవిదుః’ అని మత్స్యపురాణం బ్రహ్మపురాణాన్ని రాజసపురాణంగా చెప్పింది. ‘బ్రహ్మం మూర్దా హరేరేవ’ అనే శ్లోకానుసారం మహావిష్ణువు యొక్క శిరస్సుతో ఈ పురాణాన్ని పోలుస్తారు. బ్రహ్మ పురాణం రెండు భాగాలుగా – పూర్వభాగం, ఉత్తర భాగం – విభజింపబడింది. ఇందు మొత్తం 246 అధ్యాయాలలో పదివేల శ్లోకాలున్నాయి. ఈ బ్రహ్మపురాణాన్ని బ్రహ్మకల్పంలో మొట్టమొదటసారి బ్రహ్మ మరీచి మహామునికి బోధించాడు.
ఈ బ్రహ్మపురాణం పేరులో బ్రహ్మ ఉన్నప్పటికి మహావిష్ణువు విశేషగాథలను ఇది ప్రతిపాదిస్తుంది. సృష్టికథనం, మన్వంతరాల కీర్తనం, ఆదిత్య, సోమ జననాలు, క్షీరసాగర మథనం, శ్రీకృష్ణజననం, శ్యమంతకోపాఖ్యానం, గోవర్థనోద్ధారణ, రుక్మిణీ కల్యాణం, నరకాసుర వధ, శ్రీ కృష్ణ నిర్యాణం, ఉమామహేశ్వరుల కల్యాణం, దక్షయజ్ఞం, నృసింహ మహత్మ్యం, పూరీజగన్నాథ క్షేత్ర వర్ణన, ద్వాదశయాత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, యోగాభ్యాసం ఇలా అనేక విషయాలు ఇందు వర్ణించబడ్డాయి.
2. పద్మపురాణం
‘ హృదయం పద్మ సంజ్ఞితమ్’, శ్రీ విష్ణువు హృదయంతో పద్మపురాణాన్ని పోలుస్తారు. శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి ప్రారంభమైన సృష్టిక్రియ ఆధారంగా రూపోందిన పురాణం కనుక దీనికి పద్మపురాణమన్న పేరు వచ్చింది. పద్మకల్పంలో మొట్టమొదటిసారిగా స్వాయంభువుమనువు బ్రహ్మకు ఈ పురాణాన్ని బోధించాడు.
యధా పంచేంద్రియ సర్వ శరీరగతి నిగద్యతే
తదేదం పంచభి ఖండైరుదితం పాపనాశనమ్
మానవునికి పంచేంద్రియాలున్నట్టే, సృష్టి ఖండం, భూ ఖండం, స్వర్గ ఖండం, పాతాళ ఖండం, ఉత్తర ఖండం అని ఐదు ఖండాలున్న ఈ పురాణంలో 641 అధ్యాయాలలో మొత్తం 55వేల శ్లోకాలున్నాయి. మానవుని మనసులో కల్గే సంకల్పం, ఇంద్రియాలతో చూసే వస్తువు, బుద్ధితో తెలుసుకునే విషయాలు అన్నీ శ్రీమహావిష్ణువు స్వరూపాలేనని పద్మపురాణం మనకు తెలుపుతుంది. అంతేకాక, శివకేశవ అభేదత్వాన్ని కూడా ఈ కింది శ్లోకంలో ప్రతిపాదించింది.
శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే
శివశ్చహృదయే విష్ణు: విష్ణోశ్చహృదయే శివః
గంగా మహాత్మ్యం, సూర్య మహాత్మ్యం, పాంచభౌతిక శరీర వర్ణన, ఆత్మసర్వరూపం, భారతదేశ నదుల, పర్వతాల వర్ణన, కార్తీకమాస ప్రాశస్త్యం, ఉసరి-తులసి మొక్కల ప్రాశస్త్యం, శనిపీడనివారణ, విష్ణుసహస్రనామ మహిమ, యుగధర్మాలు ఇలా 34 అంశాల గురించి పద్మపురాణం వివరిస్తుంది.
3. విష్ణు పురాణం
‘వైష్టవం దక్షిణో బాహుః’ అనే వచనానుసారం మహావిష్ణువు యొక్క కుడిభుజంతో పోల్చే విష్ణుపురాణం అష్టాదశ పురాణాలలో మూడవది. దీనిని వరాహకల్పంలో పరాశరుడు బ్రహ్మకు బోధించాడు. ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలు ఆరు అంశాలలో, 126 అధ్యాయాలలో చెప్పబడ్డాయి.
ప్రకృతి-పురుషుడు మొదలైన 24 తత్త్వాలు, కాలస్వరూపం, సృష్టిక్రమ వర్ణన, జంబూద్వీప వర్ణన, నవగ్రహాది జ్యోతిర్మండల విశేషాలు, అద్వైత ప్రవచనం, పద్నాలుగు మన్వంతరాలు, కృష్ణలీలలు, వేదవ్యాసుడు చేసిన వేదాల విభజన, విష్ణు ఆరాధాన సత్ఫలితాలు, భగవత్సంకీర్తనా మహాత్మ్యం ఇలా అనేక అంశాలు పద్మపురాణంలో మనకు గోచరిస్తాయి.
భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః
వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం
మహాభారతంలోని భగవద్గీత, ధర్మశాస్త్రాలలో మనుస్మృతి, వేదాలలో పురష సూక్తం, పురాణాలలో విష్ణు పురాణాలను శ్రీవైష్ణవులు ప్రామాణికంగా పరిగణిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యము, ఆత్మనివేదనము అనే నవవిధభక్తి సూత్రాల గురించి విపులంగా విష్ణుపురాణం మనకు తెలుపుతుంది. శ్రీ రామానుజాచార్యులు, మధ్వాచార్యలు కూడా తమ భాష్యాలలో విష్ణుపురాణాన్ని ఊటంకించారు. అయితే అష్టాదశ పురాణాలను వ్యాసభగవానుని విరచితమైనప్పటికి, పద్మ పురాణం ఒక్కటి మాత్రం వ్యాసుని తండ్రి పరాశర మహర్షి రాసినట్టు పండితుల అభిప్రాయం. విష్ణు పురాణమంతా శ్రీపరాశర ఉవాచ అని ఉండటమే ఇందుకు కారణం. ఏది ఏమైనప్పటికి,
సర్గ స్థితి వినాశానాం జగతో యో జగన్మయః
మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే
సృష్టికి పూర్వం పగలూ లేదు, రాత్రీ లేదు, నింగీలేదు, నేలా లేదు, చీకటీ లేదు, వెలుతురూ లేదు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే విష్ణువు. అట్టి హరినామ సంకీర్తన ద్వారా కృతయుగంలో గొప్పతపస్సును చేస్తే గాని పొందలేని పుణ్యరాశిని కేవలం మానవులు ఈ కలియుగంలో పొందవచ్చని విష్ణు పురాణం మనకు తెలియచేస్తుంది.
తేటగీతి