
నిర్ధిష్టమైన రూపం, రసం, భావం కల్గిన అద్భుతమైన, సమ్మోహనమైన, అందమైన, మోహనకరమైన రాగం ‘మోహన’. ప్రపంచంలోని అన్ని సంగీతరీతుల్లోనూ ఈ రాగం బహుళ ప్రసిద్ధిచెందింది. ఇది ఉపాంగ, వర్జ్య, ఔడవరాగం మరియు 28వ మేళకర్త హరికాంభోజి జన్యరాగం. అయితే మధ్యమం, నిషాదాలను గ్రహంచేస్తే మేచకళ్యాణి, ధీరశంకరాభరణ రాగాలు కూడా మోహనకు జన్యరాగాలుగా పేర్కోనవచ్చు. ముత్తుస్వామి దీక్షితార్ మనవడు బ్రహ్మశ్రీ సుబ్బరామ దీక్షితార్ రచించిన ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’లో మోహన మేచకళ్యాణి జన్యరాగంగా పేర్కొన్నారు.
ఈ రాగం స్వరస్థానాలు: షడ్జమం, చతుశృతి రిషభం, పంచమం, అంతరగాంధారం, చతుశృతి దైవతం (స,రి,గ,ప,నద,స / S R2 G3 P D2 S). ఇందు రిషభాన్ని గ్రహం చేస్తే మధ్యమావతి, గాంధారాన్ని గ్రహం చేస్తే హిందోళ, పంచమాన్ని గ్రహంచేస్తే శుద్ధసావేరి, చివరగా ధైవతాన్ని గ్రహం చేస్తే ఉదయరవిచంద్రిక రాగాలు వస్తాయి.
ఇది చాలా అవకాశంము కల్గిన రాగం. రాగాలాపన, నెరవు, స్వరకల్పన, తానం, పల్లవి పాడుటకు అనువైన రాగం. త్రిస్థాయి రాగం. విళంబ, మధ్య, ధృతలయలుగా గల రాగం. అన్నివేళలందు పాడుకొను రాగం. శృంగార, భక్తి, శాంత, వీరరస ప్రధానమైన రాగం. శ్రోతలకు సులభంగా అర్ధమగుటయేకాక, పాడుటకు, ఆస్వాధించుటకు సులభమైన రాగం. తక్కువ స్వరాలతో ఎక్కువ రక్తి కల్గించే రాగం. స్వరకల్పనకు కష్టమైన రాగమైనా పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు అద్భుతంగా పలికించే రాగం. జానపద, భజన కీర్తనలు ఈ రాగంలో విరివిగా కలవు.
హిందుస్థానీ సంగీతంలో మోహనకు దగ్గరగా గల రాగాలు భూప్, భూపాల్, దేశికార్. జయదేవుని అష్టపది ధీరసమీరే, మామియం చలితావిలోక్యవృతం భూప్ రాగంలో ఎంతో ప్రసిద్ధికెక్కింది. అలాగే హరేరామ, హరే కృష్ణలోని కాంఛీ రే కాంఛీరే, ఆరాధనలో చందాహై తు, సూరజ్హై తు, సిల్ సిలాలో దేఖ ఏక్ క్వాబ్ తో యే సిల్ సిలేహువే, రుడాలీలోని దిల్ హూ హూ కరే, లవ్ ఇన్ టోక్యోలోని సాయనారా, సాయనారాలు ఈ రాగంలో స్వరపర్చిన పాటలే. ఇక ఉమరో జావ్ లోని ఇన్ ఆంఖోంకి మస్తీమే, భాభీ కీ ఛూడియా సినిమాలోని జ్యోతికలశ్ ఛలకేలు ఎంత ప్రజాదరణ పొందాయో చెప్పనక్కర్లేదు.
ఈ రాగంలో అనేక పద్యాలు, లలిత సంగీత పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. వీటిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పాపాయి పద్యాలు, అద్వైతమూర్తి, కుంతీకుమారిలోని కన్నియలాగ వాలకము, ఆటపాటలలో మరచినావా రాజా, యెంకి ఊగెను కొమ్మ ఊయ్యాల, నీతోటే ఉంటాను నాయుడుబావ వంటి ఎంకిపాటలతోపాటు, భామాకలాపమనే యక్షగానంలోని శకునాలు మంచివాయే అనే గీతం , భారతీయుల కళాప్రభవమ్ము, ఆ మొఘల్ రణధీరులు వంటి పద్యాలు, చల్లగాలిలో యమునాతటిపై, మనసాయెరా మదనా, నినుజూడ వంటి లలితగీతాలున్నాయి.
ఈ రాగంలో ప్రఖ్యాతి చెందిన రచనలు :
1. వరవీణ మృదుపాణి (గీతం)
2. నిన్నకోరి (తాన వర్ణం)
3. ఎవరురా, ననుపాలింప, రామా నిన్నే నమ్మి, మోహనరామ, భవనుత నా హృదయము, రారా రాజీవ లోచన, వేద వాక్యమని -- త్యాగరాజ స్వామి
4. నాగలింగం – దీక్షితార్
5. నారాయణ దివ్యనామం – పాపనాశం శివన్
6. చేరియశోదకు శిశువితడు – అన్నమాచార్య
7. బాలగోపాల – నారాయణతీర్ధుల తరంగం
మోహన రాగం లో ప్రసిద్ధ సినీ పాటలు:
1. లాహిరి లాహిరి లాహిరిలో --మాయాబజార్
2. చందనచర్చిత నీలకళేభర --తెనాలి రామకృష్ణ
3. మాణిక్యవీణాం(శ్యామల దండకం) – మహాకవి కాళిదాసు
4. లేరు కుశలవులకు సాటి – లవకుశ
5. నెమలికి నేర్పిన నడకలివే – సప్తపది
6. ఆకాశంలో ఆశలహరివిల్లు – స్వర్ణ కమలం
7. మధురమే సుధాగానం -- బృందావనం
8. చెంగు చెంగునా గంతులు వేయండి --నమ్మిన బంటు
9. ఎచటనుండి వీచెనో --అప్పుచేసి పప్పుకూడు
10. మనసు పరిమళించెను --శ్రీ కృష్ణార్జున యుద్ధం
11. అయినదేమో అయినది ప్రియ --జగదేకవీరుని కధ
12. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే --సాగర సంగమం
13. పాడవేల రాధికా --ఇద్దరు మిత్రులు
14. ఘనా ఘన సుందరా –చక్రధారి
15. సిరిమల్లే నీవె విరిజల్లు కావే – పంతులమ్మ
16. మదిలో వీణలు మ్రోగె –ఆత్మీయులు
17. నిన్ను కోరి వర్ణం – ఘర్షణ
18. మధుర మధురమీ చల్లని రేయ – విప్రనారాయణ
19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి – చిరంజీవులు
20. మౌనముగా నీ మనసు పాడినా --గుండమ్మ కధ
21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె – మిస్సమ్మ
22. శివ శివ శంకరా --భక్త కన్నప్ప
23. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో --అమరశిల్పి జక్కన్న
24. పులకించని మది పులకించు – పెళ్ళికానుక
25. ఈనాటి ఈ హాయి, కలకాదోయి నిజమోయీ – జయసింహ
26. తూనీగ, తూనీగా – మనసంతా నువ్వే
27. మాటేరాని చిన్నదాని – ఓ పాపాలాలీ
28. ఆదిభిక్షువు వాడినేది కోరేది – సిరివెన్నల
సౌమ్యశ్రీ రాళ్లభండి
భాగవతపుదైవము భారతములో దైవము
సాగినపురాణ వేదశాస్త్రదైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము ||
వేదాంతవేత్తలెల్ల వెదకేటి, ఆదిఅంతములు లేని రూపము, వైకుంఠాన వెలసిన పరిపూర్ణమైన రూపము, శేషగిరివాసి రూపము. బ్రహ్మాదులకు మూలమైన రూపము, పరబ్రహ్మమై మనల్ని ఏలేటి రూపము, అట్టి శ్రీ వేంకటేశ్వరుని సాకారమును ‘వెదికిన నిదియే వేదాంతార్ధము, మొదలు తుదలు హరిమూలంబు’ అంటూ, మనోఫలకంపై దర్శించి మనోరంజకంగా వర్ణించాడు అన్నమయ్య. ఆ సుందర స్వరూపాన్ని చూచి మోహించని వారుండరు.
చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను ||
భాగీరథి పుట్టిన పాదపద్మములు
భోగపుమరుని జన్మభూమి నీ తోడలు
యోగపునవ బ్రహ్మలుండిన నీనాభి
సాగరకన్యకలక్ష్మి సతమైనవురము ||
అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురలఁజంపే గదాహస్తము
సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁజేయు శంఖహస్తము ||
సకల వేదముండే చక్కనినీమోము
వొకటై తులసిదేవివుండేటి శిరసు
ప్రకటపు మహిమలఁ బాయనినీరూపము
వెకలి శ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము ||
ఆనందనిలయంలో బ్రహ్మస్థాన మనబడే దివ్యస్థలంలో స్వయంవ్యక్తమూర్తిగా వెలసిన ఆ ఆర్చారూపాన్ని, ‘‘స్థానకమూర్తి’’ అంటారు. స్థిరంగా కదలకుండా ఉన్నందున ‘ధ్రువమూర్తి’ లేక ‘ధ్రువ బేరం’ అని కూడా పిలుస్తారు. దేవేరులు లేకుండా కేవలం వ్యూహాలక్ష్మిని వక్షస్థలంలో కలిగి దర్శనమివ్వడం వల్ల ‘స్థానక విరహమూర్తి’ అని కూడా పిలవపడతాడు. వ్యూహాలక్ష్మిని వక్షఃస్థలంలో నిలుపుకొని, కుడి,ఎడమ చేతుల్లో శంఖచక్రాలనుంచుకొని, మరో ఎడమచేతిని కటిపై ఉంచి, వరదహస్తంతో వరాలనొసిగే ఆ ఏడుకొండలవాడు విచిత్రభంగిమతో భక్తులను భవసాగరం దాటిస్తానని అభయమిస్తుంటాడు.
భవాభ్దితారం కటివర్తిహస్తం
స్వర్ణాంబరం రత్నకిరీటకుండలమ్
ఆలంబిసూత్రోత్తమ మాల్యభూషితం
నమామ్యహం వేంకటశైల నాయకమ్ ||
శ్రీమన్నారాయణునికి ఐదు రూపాలున్నాయని శాస్ర్తాలు చెపుతున్నాయి. ముక్తపురుషులచే ఆరాధించపడే ‘పరస్వరూపం’, సృష్టి, స్థితిలయలను నిర్వహించే ‘వ్యూహా స్వరూపం’, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్ధం ‘విభవ స్వరూపం’, యోగులు ధ్యానించే చైతన్య రూపం‘ అంతర్యామి స్వరూపం’, ఆలయ గృహాదులందు పూజలందుకునే ‘అర్చాస్వరూపం’. సాలగ్రామ శిలారూపంతో వెలసిన శ్రీవారి మూలవిరాట్టు స్వయంభువు. చతుర్భుజాలతో అర్చారూపాన్ని పొందిన ఈ స్వరూపం శ్రీనివాసుని ధ్రువబేరం. ఇందుకు తార్కాణం, ‘వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీచ నందకీ, శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు’ అనే విష్ణుసహస్రనామ వర్ణనే!
బంగారు పద్మపీఠంపై, గజ్జెలు, అందెలు ఘల్లు, ఘల్లుమన బంగారు పాదాలతో, ఘనపట్టు పీతాంబరాలపై జిలుగుమంటూ వేలాడుతున్న సహస్రనామాల మాలతో, నడుమున వజ్రాలుతాపిన సూర్యకఠారి అనబడే నందకఖడ్గం, ఒడ్డాణాలతో, వజ్రఖచిత వరద, కటి హస్తాలతో, ఉరముపై కౌస్తుభమణితో, నవరత్నహారాల నుడుమ వక్షఃస్థలంలో పొదువుకున్న సిరితో, పసిడి యజ్ఞోపవీతంతో, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలగ్రామ మాలలు, వజ్రకిరీటం, మకర తోరణంతో వెలుగొందుతన్న ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ‘సందడి సొమ్ములతోడి సాకరమిదె వీఁడె, యిందరు వర్ణించరే యీరూప’మంటూ, ఆపాదమస్తకం వర్ణించటం ఒక్క అన్నమయ్యకే సాధ్యం!
చేరి కొల్వరో యాతఁడు శ్రీ దేవుఁడు
యీరీతి శ్రేవేంకటాద్రి నిరవైన దేవుఁడు ||
అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుడు
చెలఁగి శంఖచక్రాలచేతి దేవుఁడు
కలవరదహస్తముఁ గటిహస్తపుదేవుఁడు
మలసీ శ్రీవత్సవనమాలికలదేవుఁడు ||
ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు
కనకపీతాంబర శృంగారదేవుఁడు
ననిచి బ్రహ్మాదుల నాభిఁగన్నదేవుఁడు
జనించెఁ బాదాల గంగ సంగతైనదేవుఁడు ||
కోటిమన్మథాకారాసంకులమైన దేవుఁడు
జాటపుఁగిరీటపుమించులదేవుఁడు
వాటపుసొమ్ములతోడి వసుధాపతి దేవుఁడు
యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు ||
‘చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి....కంటి గంటి ఘనమైన ముత్యాలు, కంటమాల లవె... పొడువైనట్టి మించు కిరీటం, జంటల వెలుగు శంఖచక్రా లవె...’ భుజకీర్తులును, మొలకఠారును, ముంగిటి నిధానమైన మూలభూతమదె, వేంకటాచలము మీద విశ్వరూపము, కందర్పు పుట్టించిన ఘన విశేషము, యోగీంద్రులెల్ల భావించిన వేదవేదాంతార్ధ విశేషము, అలమేలుమంగపతియైన దేవదేవుడితడే దివ్యమూరితి, ఎచ్చటజూచిన తానే యీరుపై ఉన్నాడంటూ, ఇహపరములన్నీ ఆ శ్రీనివాసుడేనని,
నీయందె బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు
నీయందే సచరాచరమును నీయందే యీజగము
చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక
యీయెడ నీయర్ధములో నితరంబిది యౌఁగాదన నెడమేదయ్య ||
అంటూ ఆ చిత్తజ గురుని, ఆ కొండల కోనలలోన కోనేటిరాయుని, నవ్వులమోముతో, సంకుజక్రముల సొంపుతో, బంగారుమేడలో వెలుగొందుతున్న ఆ శ్రీపతి, భూపతి రూపాన్ని మనోఫలకంపై ముద్రించాడు అన్నమయ్య.
వాడివో కంటిరటిరే వన్నెలవాడు
పైడి మోలముకటారుపరుజులవాడు ||
పెద్దకిరీటమువాడు పీతాంబరమువాడు
వొద్దిక కౌస్తుభమణిపురమువాడు
ముద్దులమొగమువాడు ముత్తేలనామమువాడు
అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు ||
అందిన కటిహస్తము నభయహస్తమువాడు
అందెల గజ్జల పాదాలమరువాడు
కుందణంపు యీ(?) మకరకుండలంబులవాడు
కందువ బాహుపురుల కడియాలవాడు ||
నగవుజూపులవాడు నాభికమలమువాడు
మొగవుల మొలనూళ్ళా మొలవాడు
చిగురుమోము (వి?)వాడు శ్రీవేంకటేశుడు (వాడు)
తగు నలమేలుమంగ తాళిమెడవాడు ||
సౌమ్యశ్రీ రాళ్లభండి
కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలలో విరివిగా ఉపయోగించే ఉపాంగ రాగం హంసధ్వని. ఇది 29వ మేళకర్త శంకరాభరణ జన్యరాగం. ఈ ఔడవ రాగం ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ సృష్టి. ఇది ప్రాచీన గ్రంధాల్లో మనకు కన్పించదు. ఈ రాగం అన్నివేళలా పాడుకోడానికి అనువైనది. ఈ రాగంలో గణపతిని ప్రార్ధిస్తూ అనేక కృతులు వాగ్గేయకారులు ఆలాపించారు. వీటిలో ‘వాతాపి గణపతిః’ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాదం (స,రి,గ,ప,ని,స / S R2 G3 P N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపనిస, సనిపగరిస. హిందుస్తానీ సంగీతంలో సరితూగే రాగం ఏదీ లేదు. అయితే బండిబజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమన్ ఆలీఖాన్ ఈ రాగాన్ని ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. సంగీత కచేరీల్లో హంసధ్వని రాగాన్ని సభారంభంలో ఆలపిస్తుంటారు. ఇందు హాస్య, వీర రసాలు రక్తికడతాయి.
చలనచిత్రాల్లో ప్రయోగాత్మకంగా భక్తి భావాన్ని వ్యక్తపర్చటానికి, జావళీలకు వినియోగించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి వాతాపి గణపతిః కీర్తనను యథాతధంగా అనువాదం చేసి ‘పరిహార్’ చిత్రంలో లతా, మన్నాడేల చేత పాడించారు.
ఈ రాగంలో వెలువడ్డ ప్రముఖ కృతులు:
రఘనాయకా నీపాదయుగ, శ్రీ రఘుకులమందు బుట్టి,– త్యాగరాజు
వాతాపి గణపతిః – ముత్తుస్వామి దీక్షితార్
వర్ణముఖ వా – కోటేశ్వర అయ్యర్
మూలాధార మూర్తి, కరుణై సేవై – పాపనాశం శివన్>
గజవదన బేడువే – పురందరదాసు
వరవల్లభ రమణ – జి ఎన్ బాలసుబ్రహ్మణియమ్
గమం గణపతే – ముత్తయ్య భాగవతార్
పాహి శ్రీపతే – స్వాతి తిరునాళ్
వందేహం జగద్వల్లభం -- అన్నమయ్య
వినాయక – వీణ కుప్పయ్య
మనసుకరుగదేమి, పగవారు (వర్ణం) – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
గాయియే గణపతి జగ్ వందన్ – తులసీదాస్
షోడశ కళా పరిపూర్ణ నమో – శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య)
ఈ రాగంలో సినీగీతాలు:
శ్రీ రఘురాం జయరఘురాం – శాంతినివాసం
తరలిరాదతనే వసంతం – రుద్రవీణ
ఈనాడే ఏదో అయ్యింది – ప్రేమ
నాయింటి ముందున్న పూదోటనడిగావో -- జెంటిల్మెన్
మౌనంగా గానం మధురం మధురాక్షరం – మయూరి
మనసు దోచే దొరవునీవే – యశోద కృష్ణ
స్వాగతం, సుస్వాగతం – శ్రీ కృష్ణపాండవీయం
గోపాలా ననుపాలింపరార – మనుష్యుల్లో దేవుడు
జాతో నహి బోలు కన్నయ్య – పరిహార్
ఓ చాంద్ జహాన్ వోహ్ జాయే, కరంకి గతిన్యారి -- శారద
బిలహరి:
ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ జన్యరాగం. ఇది ఔడవ – సంపూర్ణ భాషాంగ రాగం ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కాకలినిషాదం (స,రి,గ,మ,ప,ద,ని,స / S R2 M1 G3 P D2 N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపదస, సనిదపమగరిస. ఇందు కైశిక నిషాదం కూడా అప్పుడప్పుడు అన్యస్వరంగా వస్తుంది. ఇది ఉదయమున పాడదగిన రాగం. ఉత్సాహమును, వీరాన్ని కలుగచేసే ఈ రాగం గమక వరిక రక్తి రాగం. ఈ రాగము ప్రాణమునచ్చే సంజీవినీ రాగమని ప్రసిద్ధి. త్యాగరాజు ఈ రాగంలో ‘నీ జీవాధార’ అనే కృతిని ఆలపించి మృతిచెందిన బ్రాహ్మణుని సజీవుని చేశారని ప్రతీతి.
శ్లోకాలు, పద్యాలు పాడటానికి అనువైన ఈ రాగం పద్యనాటకాల ద్వారా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ రాగం నాదస్వరం వాయించేవారికి ఎంతో ఇష్టమైన రాగం. ఇది ఉదయరాగం. హిందుస్తానీలో దీన్ని సరిపోలే రాగం ‘ఆలైయా బిలావర్’. ఈ రాగంలో సంగీత ప్రారంభదశలో ‘రారావేణు గోపబాల’ గోపాలయ్య సర్వరచన చేసిన స్వరజతిని, వీణకుప్పయ్యర్ రచన ‘ఇంతచౌకసేయ’ అనే వర్ణాన్ని విద్యార్ధులకు నేర్పుతారు.
ఈ రాగంలో ప్రఖ్యాతినొందిన రచనలు:
దొరకునా ఇటువంటి సేవ, కనుగొంటిని శ్రీరాముని, నా జీవధార, నరసింహా నన్ను – త్యాగయ్య
పరిదానమిచ్చితే పాలింతువేమో – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
కామాక్షివరలక్ష్మి, హటకేశ్వర, శ్రీబాల సుబ్రహ్మణ్య – ముత్తుస్వామి దీక్షితార్
ఇంతపరాముఖ, ఇంతచౌక (వర్ణం) – వీణ కుప్పయ్య
పూరయమమ – నారాయణతీర్ధులు
ఎ షుందాళే పూంగోదే – అరుణాచల కవిరాయరుగారి రామనాటకములో రచన.
రారాగురు రాఘవేంద్ర -- బాలమురళీకృష్ణ
ఈ రాగంలో సినిగీతాలు
ఎవరునేర్పేరమ్మ ఈ కొమ్మకు – ఈనాటి ఈ బంధమేనాటిదో
నీతోనె ఆగేన బిలహరి – రుద్రవీణ
ఏదో, ఏదో అన్నది ఈ మసక, మసక వెలుతురు – ముత్యాలముగ్గు
రండయ్య పోదాము – రోజులు మారాయి
కలడందురు దీనులయెడ (పద్యం) – భక్త ప్రహ్లాద
కొళ్లాయి గట్టితి, కోక జుట్టితి (పద్యం) – భక్త పోతన
సౌమ్యశ్రీ రాళ్లభండి
తెలుగు సాహిత్యమందు విశేష ప్రజ్ఞగల ముత్తుస్వామి దీక్షితార్ తెలుగు కావ్యశిల్పాననుసరించి కృతులను రచించినట్టుగా మనకు గోచరిస్తుంది. అనగా విభక్తిపరంగా కృతులను రచించుట. ముత్తుస్వామి దీక్షితులు శైవ, వైష్ణవ, దేవీ, సుబ్రహ్మణ్య, గణపతి ఇలా అందరి ఆలయాలను దర్శించి వారిపై కృతులను రచించారు. ఆయన కృతులలో కాశీదేవతలైన విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, గంగాది మూర్తుల ప్రస్తుతేకాక నేపాలులోని పశుపతినాధుని ప్రస్తుతి, బదరీలోని నారాయణుని ప్రస్తుతి మనకు కన్పిస్తుంది. ఆయన విష్ణ్వీశభేద మెరుగని అద్వైత, స్వార్త మతస్ధుడు. శ్రీశంకరభగవత్పాదమతావలంబి, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య భావముల సమ్మేళనము సుందరముగా సమ్మిళితమై ఉంది.
రామాష్టపది అనే సంగీతరూపకాన్ని రచించిన ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతిల వారి వద్ద వేదాంతగ్రంథ అధ్యయనము చేయటం వల్ల ముత్తుస్వామివారిపై రామభక్తి ప్రభావం ప్రస్ఫుటం. మాంజిరాగంలోని ‘రామచంద్రేన సంరక్షితోహం’ అనే కీర్తనలో ఆయన శ్రీరాముడు త్రిమూర్తుల సమిష్టిరూపమని (రమా భారతి గౌరీరమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం) వర్ణించారు. అలాగే శ్రీరాముని పరబ్రహ్మతత్త్వాన్ని మాహురి రాగంలో ‘మామవ రఘువీరా’ అనే కృతిలో తెలిపారు. ఈ కృతిలో శ్రీరాముని పామరపండిత పావనకర నామధేయుడని, గురుగుహనుతుడని ముత్తుస్వామి స్తుతించారు.
క్షేత్రదేవతా కీర్తనలు: ముత్తుస్వామి తన జీతకాలమంతా క్షేత్రాటన చేస్తూ తత్తద్దేవతా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపారు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రానికున్న విశిష్టత ఆయన చేసిన ప్రతీ కృతీలో ఇనుమడించింది. దీక్షితారు వారు ఆయా క్షేత్ర దేవతలపై చేసిన కీర్తనలలో కొన్ని మచ్చుతునకలు. తిరుపతి వేంకటేశ్వరునిపై వరాళి రాగంలో ‘శేషాచల నాయకం భజామి’ అనే కీర్తన, కంచి కామాక్షిపై చేసిన అనేక కీర్తనలో కమలా మనోహరి రాగంలో ‘కంజదళాయతాక్షి’, హిందోళ రాగంలో ‘నీరజాక్షి కామాక్షి’, శుద్ధసావేరి రాగంలో ‘ఏకామ్రేశనాయకీ’ ప్రసిద్ధాలు. కాంచీపురంలోని కైలాసనాథునిపై కూడా దీక్షితార్ పెక్కు కృతులు రచించారు. వీటిలో వేగవాహిని రాగంలోని ‘కైలాసనాథం’, కాంభోజి రాగంలో ‘కైలాసనాథేన’ ప్రసిద్ధమైనవి. చిదంబర సమీపంలోని గోవిందరాస్వామిపై ఆయన చేసిన కృతులకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా మేచబౌళి రాగంలో రచించిన ‘గోవింద రాజేన’ అనే కృతి కర్ణాటక సంగీత సముద్రంలో ఈ రాగంలో రాసిన ఏకైక కృతని సంగీతజ్ఞలు అభిప్రాయం. అయతే, ఈ రాగంలో వేంకటముఖి రచించిన కొన్ని గీతాలు మాత్రం లేకపోలేదు.
అలాగే చిదంబరం సమీపంలోని వైదీశ్వరన్ దేవాలయ దేవతలపై చేసిన పెక్కు కృతులలో బాలాంబికాదేవిపై రాసిన ‘భజరేరే చిత్త బాలాంబికాం’ అనే కల్యాణరాగ కృతి, వైద్యనాథస్వామిపై కూర్చిన అఠాణ రాగంలోని ‘శ్రీ వైథ్యనాథం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.
పంచలింగ స్థల కీర్తనలు: ఆకాశాది పంచభూతముల ప్రత్యేకాంశలతో పంచలింగ క్షేత్రములు దక్షిణభారతంలో ప్రసిద్ధిగాంచాయి. వీటిలో శ్రీకాళహస్తిలోని లింగం స్వాయంభువు, వాయులింగము. ఇక కాంచీపురంలోని ఏకామ్రనాథుడు పృథ్వీలింగము, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరుడు ఆపోలింగం, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం, చివరగా చిదంబరంలోని శివలింగం ఆకాశలింగమని ప్రసిద్ధి. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని స్తుతిస్తూ, ‘శ్రీ కాళహస్తీశ’ అని, కాంచీపురంలోని ఏకామ్రనాధుని ప్రస్తుతిస్తూ, అనేక కీర్తనలు రచించినా భైరవి రాగంలోని ‘చింతయ మాకంద’ అనే కృతి పంచలింగకృతులలో ఒకటి. ‘అరుణాచలనాథం స్మరామ్మనిశ’, ‘జంబూపతే మాంపాహి’, ‘ఆనందనటన ప్రకాశం చిత్సభేశం’ మిగిలిన మూడు పంచలింగ కృతులు.
చిదంబర నటరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కేదార రాగంలో ‘ఆనందనటన ప్రకాశం’ కృతి నటరాజు ఆనందనృత్యానికి సంబంధించినదై ఎంతో రమణీయంగా నాట్యమునకు పనికివచ్చునట్టు సొల్లుకట్లు ఈ కృతికి అనుబంధంగా ఉండటం ఈ కృతి విశిష్టత.
అభయాంబ కృతులు: వైదీశ్వరన్ దేవాలయ అధిష్టాన దేవన అభయాంబపై రాగప్రస్తార సౌలభ్యమునందేకాక, తాంత్రిక విషయస్ఫురణమునందు కూడా గణ్యమైనవి. ‘అంబికాయాః అభయంబికాయాః’ అనే కేదార రాగ కృతియందు కుండలినీశక్తి నిగూఢమై ఉన్నది. అభయాంబపై దీక్షితార్ అన్ని విభక్తులందు కృతులు రచించారు.
1. అభయంబ జగదాంబ – కల్యాణి రాగం – ప్రథమా విభక్తి
2. ఆర్యామభయాంబాం – భైరవి రాగం – ద్వితీయా విభక్తి
3. గిరిజయా అపజయ – శంకరాభరణ రాగం – తృతీయా విభక్తి
4. అభయాంబికాయై – యదుకుల కాంభోజి రాగం – చతుర్థీ విభక్తి
5. అభయాంబికాయాః – కేదారగౌళ రాగం – పంచమీ విభక్తి
6. అంబికాయాః అభయంబికాయాః – కేదార రాగం – షష్ఠీ విభక్తి
7. అభయాంబికాయాం – శహనా రాగం – సప్తమీ విభక్తి
8. దాక్షాయణి – తోడి రాగం – సంబోధన ప్రథమా విభక్తి
ఈ కృతులకు చివరగా మంగళహారతిగా పాడే ముగింపు కృతి ‘శ్రీ అభయాంబ నిన్ను’ అనునది తెలుగు పల్లవితో శ్రీరాగంలో రచించారు. అయితే తర్వాత కాలంలో సంస్కృత, తమిళ భాషలలో ఈ మంగళహారతి ప్రాముఖ్యం పొందింది.
ఈ కృతి ముత్తుస్వామివారు రచించిన మణిప్రవాళ శైలిలో రచించిన అనేకానేక కృతులలో ఒకటి. మణిప్రవాళ శైలి కృతులలో బహుళప్రాచుర్యం పొందిన కృతి కాఫీరాగంలోని ‘శ్రీ వేంకటాచలపతే నిన్ను నమ్మితి’. ఈ మణిప్రవాళి శైలి కృతులలో ఆంధ్ర, తమిళ, సంస్కృత భాషలను ముత్తుస్వామి దీక్షితార్ వారు విశిష్టంగా వినియోగించినప్పటికీ, పల్లవికి మాత్రం తెలుగు భాషనే ఉపయోగించటం విశేషం. రాగప్రస్తారమునకు, పల్లవికున్న ప్రాముఖ్యాన్ని బట్టి సహజ సంగీత మాధుర్యయుక్త ప్రవాహమునకు తెలుగుభాషే అధికయోగ్యత కలదని పండితులు స్పష్టీకరించారు.
(తదుపరి భాగంలో తిరువారూరు క్షేత్రంపై, త్యాగరాజస్వామివారిపై ముత్తుస్వామి వారు చేసిన కీర్తనలను గురించి తెలుసుకుందాం.)
సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం 5వ బాణ చక్రంలో 5వ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు. కటపయాది సంఖ్యానియమంలో ఇమడ్చడానికి ఈ రాగం ముందు ‘ధీర’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ఈ రాగం ‘ధీర శంకరాభరణం’గా ప్రసిద్ధి కెక్కింది. ఇది సంపూర్ణ, సర్వస్వరగమక వరిక రాగము. ఈ రాగ స్వర స్థానములు షడ్జమము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము (సరిగమపదనిస / SR2G3M1PD2N3S). ఇందు అన్ని స్వరములు రాగచ్ఛయా స్వరములు. షడ్జము గ్రహ స్వరము. స,గలు న్యాస స్వరములు. ని,గ,మ,పలు జీవ స్వరములు. అన్నివేళలా పాడుకోగల రక్తి రాగము. శ్లోకములు, పద్యములు పాడటంతోపాటు రాగాలాపనకు కూడా చాలా అనువైన రాగం. స,ప,మలతో ఈ రాగంలో రచనలు ప్రారంభమవుతాయి.
ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ప్రతి రెండో స్వరము ఇందు కంపిత స్వరము. అలాగే మధ్యమము ఇందు కొన్నిసార్లు అర్ధ కంపితం. జంట స్వర, దాటు స్వర ప్రయోగాలు ఈ రాగానికి అందాన్ని చేకూరస్తాయి. హిందుస్థానీ యందు దీని సరిసమానమైన రాగం ‘బిలావల్’. దీనినే పూర్వం వేళావళి అని కూడా అనేవారు. సిక్కుల పవిత్ర గ్రంధం ‘గురు గంథ్ర సాహెబ్’లో కూడా ఈ రాగం ప్రస్తావన ఉంది. గురునానక్, గురు తేజ్ బహదుర్, గురు అర్జున్లు ఈ రాగంలో రచనలు చేశారు. పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ స్కేల్ దీనికి సమానము.
ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన నరసయ్యను చెప్పుకోవచ్చు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైంది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట.
చాలా జన్యరాగ సంతతిగల ఈ జనకరాగంలోని ప్రసిద్ధ జన్యరాగాలు: ఆరభి, బిలహరి, హంసధ్వని, శుద్ధ సావేరి, కదనకుతూహలం, దేవగాంధారి, కానడ, కురుంజి, అఠాణా, కేదారం, బేగడ, పూర్ణచంద్రిక, జనరంజని, దర్బార్, బేహాగ్, వసంత, పూర్వగౌళ, నారాయణి, నీలాంబరి, నారాయణ దేశాక్షి, కోలాహలము, శుద్ధవసంతం మరియు సహన మొదలగునవి.
ఈ రాగంలో ప్రసిద్ధికెక్కిన రచనలు: త్యాగయ్య ఈ రాగమందు దాదాపు 20 కృతులను రచించారు. ముత్తయ్య దీక్షితార్ శంకరాభరణంలో రచించిన నవావర్ణ కృతి, పాశ్చాత్య ప్రక్రియలో రచించిన చింతాయ ఆంజనేయం, గురుగుహ సరసిజ, పాహి దుర్గే, రామ జనార్ధన, పార్వతీపతే, సామగానప్రియ, వందే మీనాక్షి, సకలసుర వినుత మొదలగు 40 నొట్టు స్వర రచనలు ఈ రాగానికి ప్రసిద్ధిని చేకూర్చాయి.
సినీ సంగీతం: పాశ్చాత్యలు ఈ రాగాన్ని ఎంతగానో అభిమానించారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రంలో జూలియా అండ్రూస్ పాడిన ఈ రాగానికి చెందిన ‘డో ఎ డియర్, ఫీమ్యేల్ డియర్’ పాట బహుళ ప్రాచుర్యాన్ని పొందింది.
ఇక తెలుగులో శంకరాభరణం రాగము కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా తెలియనివారుండరు. ఆ సినిమాలోని ‘ఓంకార నాదానుసంధానమౌ గానమే’ అన్న పాట ఈ రాగంలోనిదే. అలాగే రోజా సినిమాలోని ‘చిన్ని, చిన్ని ఆశ’ పాట. భార్యాభర్తలలోని ‘జోరుగా, హుషారుగా షికారుపోదమా’, సితారలోని ‘వెన్నెల్లో గోదారి అందం’, బొంబాయిలోని ‘ఉరికే చిలకా, వేచి ఉన్నాను కడవరకు’, ఆరాధనలో ‘నా హృదయంలో నిదురించే చెలి’, విప్రనారాయణలో ‘బుద్ధేనాంజలి నమామి’ చెప్పుకోదగ్గవి.
ఇక భారతీయుల జాతీయగీతం ‘జనగణమణ’ బిలావల్ లోనే రూపకల్పన చేసుకుంది. హిందీ సినిమా పరిచయ్ లోని ‘సారె కె సారే గామాకొలేకేర్ గాతే చలే’, బావర్చీలోని ‘భోర్ ఆయి, గయా అంధియారా’ మొదలగు పాటలున్నాయి.
సౌమ్యశ్రీ రాళ్లభండి
|
|
|
|
|
|
|
|
|
|
ఎవ్వడే ఎవ్వడే ఓ భామ వీడెవ్వడే
ఎవ్వడే నేను పవ్వళించిన వేళ
పువ్వుబాణము వేసి రవ్వ చేసిపోయె ||
మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే
తళుకారు చెక్కు-టద్దముల వాడే
తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే
తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే ||
ఎలమావి తోటలో - నింపొంద నొకనాడు
యెలమి గౌరిపూజ - సలుపుచుండగా
అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు
కలువల శయ్యపై - గలసే మన్నది నిజమై ||
అంటూ సరళమైన అచ్చతెనుగు పదాలతో పండితపామరులను రజింపచేసిన పదాలను రచించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. క్షేత్రయ్యగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు వరదయ్య. కృష్ణాజిల్లాకు చెందిన మొవ్వ గ్రామానికి చెందినవాడు. ఈ మొవ్వని మువ్వ, మూవ, మవ్వ అని కూడా అంటారు. క్షేత్రయ్య జీవితానికి సంబంధించి స్ఫష్టమైన వివరాలు తెలియదు. అయితే ఈయన పదిహేడవ శతాబ్ధకాలంలో జీవించి ఉండి ఉంటాడని చారిత్రకారుల అభిప్రాయం. కాగా, వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించి, ఆయా దైవాలపేర మువ్వగోపాల పదాలను రచించటం ద్వారా ఆయనకు క్షేత్రయ్య అన్నపేరు వచ్చిందని కథనం.
క్షేత్రయ్య వరహూరు (వరయూర్ వరాహస్వామి), చిదంబరం (తిల్లై గోవిందుడు), కడప (వెంకటేశుడు), కంచి (వరదరాజస్వామి), వేదపురి (వేదనారాయణుడు), హేమాద్రి (సామి), యదుగిరి (చెలువరాయుడు), ఇనపురి (సామి), పాలగిరి (చెన్నడు), తిరుమల (వేంకటేశుడు), తిరవళ్ళూరు (వీరరాఘవుడు), శ్రీరంగం (రంగేశుడు), మధుర (మధురాపురీశుడు), సత్యపురి (వాసుదేవుడు), శ్రీనాగశైలము (మల్లికార్జునుడు), చలువ చక్కెరపురి, కోవళ్ళూరు మున్నగు క్షేత్రాలను దర్శించి ఆయా దేవుళ్లపేర్ల పదాలను రచించాడు. సుమారు నాలుగువేలకు పైగా క్షేత్రయ్య పదాలను రచించగా అందు నేడు మనకు లభ్యమవుతున్న పదాలు, మువ్వగోపాల ముద్రతో ఉన్నవి 372, రాజాంకితాలు, ముద్ర లేనివి 25 మాత్రమే.
అలాగే, క్షేత్రయ్య మధుర తిరుమలనాయకుని (1623-59), తంజావూరు విజయరాఘవుని (1633-73), గోలకొండ పాదుషా (1622-72) ఆస్థానాలలో అగ్రకవిగా విరాజిల్లాడని ఆయన పదాల ద్వారా వెల్లడవుతోంది. భాగవతా భక్తినిరూపకమైన క్షేత్రయ్య పదాలలో అష్టవిధనాయికా శృంగారంతోపాటు మధురభక్తి కూడా నిక్షిప్తమైవుంది. ముఖ్యంగా క్షేత్రయ్య తానే నాయిక అయి మువ్వగోపాలుని ప్రియునిగా భావించి వర్ణించిన మధురభక్తి అనన్యసామాన్యం. ''చూడరె అది నడిచే హోయలు సుదతి చేయు జాడలు; ఆడది కులకాంత అత్తింటి కోడలు, అలగోపాలునిని ఉదికి వెడలెను'' అనే పదంలో భాగవతులని గోపికా మధురభక్తిని స్పష్టం చేశాడు క్షేత్రయ్య.
క్షేత్రయ్య ఒకనాడు ‘సావిరహే తవ దీన కృష్ణా’ అనే జయదేవుని సంస్కృత అష్టపదికి నర్తకీమణులు చేసిన నృత్యాన్ని చూసి ప్రభావితమై తేనెలొలికే తెలుగులో అటువంటి పాటలు ఉంటే అందరికీ అర్ధమై మరింత రక్తికడతాయన్న భావన ఏర్పడింది. అచ్చ తెలుగులో అందరికి అర్ధమయ్యే పదాలు రాయాలన్న తపన పెరిగింది, అలాగే తెలుగు భాష ఉన్నంతకాలం తన పదాలు, పాటలు జీవించి ఉండాలని మువ్వగోపాలుని పేరు ప్రతినోట విన్పించాలన్న సంకల్పం ప్రభలమైంది. అందుకు అనుగుణంగా క్షేత్రయ్య సంగీత, సాహిత్యాలను, అభినయరీతులను ఆకళింపు చేసుకున్నాడు. ఆయన సంగీత, రాగ,తాళ విన్యాసాలలో, ఛందస్సు, వ్యాకరణాలలో పటిమ ఉన్నదనడానికి ఆయన పదాలే తర్కాణాలు. తంజావూరు రఘునాథరాయలను చూడటానికి వెళ్లినపుడు ఆయన చెప్పిన ఈ కందపద్యం అందుకు నిదర్శనం –
తము దామె వత్తురర్ధులు
క్రమ మెరిగిన దాతకడకు రమ్మన్నారా
కమలంబులున్న చోటికి
భ్రమరంబుల యచ్యుతేంద్ర రఘనాథనృపా
క్షేత్రయ్య మొట్టమొదట రాసిన పదం ఆనందభైరవిరాగం, ఆదితాళంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా.’ క్షేత్రయ్య రచనలు పదాలుగా ప్రసిద్ధి చెందాయి. పదం కూడా కీర్తనవంటిందే. అయితే ఇందు కవి తన భావాలను నాయికా-నాయకుల మధుర, శృంగార భావాలుగా వర్ణించి దేవునికి అంకితం చేస్తాడు. సంగీత, సాహిత్యాలు సమపాళ్లలో కల్గి, పల్లవి, అనుపల్లవి, చరణాలతో ఇది కూడి ఉంటుంది. క్షేత్రయ్య రాసిన ఈ మొదటి పదంలో మాత్రం మనకు పల్లవి, అనుపల్లవులు కన్పించవు.
క్షేత్రయ్య పదములలో ముఖ్యమైన రసము రసరాజమైన శృంగారము. సంభోగ, విప్రలంభాదులను గురించి అష్టవిధ నాయికలు పడే అనుభావలు ఇందు కథా వస్తువు. ఉదాహరణకు కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా దర్శించి క్షేత్రయ్య రాసిన అద్భుత పదమిది -
ప: మగువ తనకేళికా మందిరము వెడలెన్
అను: వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు
చ1: విడజారు గొజ్జంగి విరిదండ జడతోను
కడు చిక్కపడి పెనగు కంట సరితోను
నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను
తొదరి పదయుగమున దడబడెదు నడతోను
చ2: సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను
నగవగల ఘనసార వాసనలతోను
జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కూచముల విదియ చందురుల తోను
చ3: తరిదీపు సీయు సమసురతి బడలికతోను
యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను
పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు
మగువ తనకేళికా మందిరము వెడలెన్. (మోహన – ఝంప)
పై పదము అన్నమాచార్యులవారి ‘పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనమున విభుని గలసినది గాన’ అన కీర్తనను పోలి ఉండడం కాకతాళీయమే.
జయదేవుని అష్టపదులు సంస్కృతాన ఎంత అందంగా పొదగాయో, క్షేత్రయ్య పదాలు తెలుగు సొగసులను, సొబగులను అదేవిధంగా పొదవుకున్నాయని అనేకమంది పరిశోధకులు కొనియాడారు. ప్రాసలు, అనుప్రాసలు, ఎంచుకున్న అచ్చ తెనుగు పదాలు క్షేత్రయ్య కవితా సౌందర్యానికి ప్రతీకలు. మచ్చుకు కొన్ని --
మోనిపానక మిచ్చునా?
కొసరి కొసరి ముద్దులాడ నిచ్చునా”
తావి పువ్వులు దెచ్చునా? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా? మన సిచ్చునా?
దేవరే మొగడు గావలెనని భావజుని పూజలొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా, సిగ్గేలరా?
పడతి నే నొకచోట ప్రాణేశుడొకచోట
నెడబాసి మరునిచే నిడుములకు లోనై
కడలేని విరహాగ్ని గ్రాగి వేగితి చాల
పుడమిలో వేరె జన్మము లేదె సుదతి
నల్లని మేని వాడట ఓయమ్మ! వాడు –
నయము లెన్నో చేసునట!
చల్లగా మాటాడు నట! – సరసము వాని సొమ్మట!
కల్లగాదట వాడు – కళలంట నేర్చునట!
తెలుగు భాషలో పదకేళిక చేయడం సాధ్యం కాదనే అభిప్రాయమానాడు ఉండేది. సంస్కృత ప్రభావం అటువంటిది. ఆ దశలో అభినయానికి అనుగుణమైన పదాలను తెలుగలో రచించి పండితులు ముక్కుమీద వేలేసుకొనేటట్టు చేశాడు క్షేత్రయ్య. అయితే రావే, పోవే, ఒసే, ఏమే వంటి పదాలు కవిత్వమేమిటని విమర్శించిన వారూ లేకపోలేదు.
తంజావూరు విజయరాఘవ నాయకుల అస్థానంలో ఇటువంటి విమర్శలే ఎదురైనపుడు, కాంభోజి రాగం, త్రిపుట తాళంలో ఈ కింది పదం పల్లవి, అనుపల్లవి, రెండు చరణాలు రాసి వారి ఆస్థాన కవులను పూర్తిచేయమని అభ్యర్ధించగా, వారి వల్ల సాధ్యం కాలేదు.
‘‘వదరక పోపోవే వాడేల వచ్చీని వద్దూ రావద్దనవే
అది యొక్క యుగము, వేరే జన్మమిపుడు
అతడెవ్వరో, నేనెవ్వరో ఓ చెలియా
నిచ్చ నిచ్చలు, నేదో వచ్చీని రేపైన
వచ్చిననచు మదిలో
నిచ్చగా బరు వేడి, నిట్పూర్పుల చేత
నింతిరో పెదవులెండి
హెచ్చైన, వెన్నల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితిని నేటి మాటలే’’, అంటూ ఈ పదం సాగుతుంది.
తన పదాలలో స్త్రీ అనే పదాన్ని తరుణీ, ముదిత, కొమ్మ, అక్కరో, సుదతి, పడుపగత్తి, మానిని, జవ్వని, ఎలనాగ, ఉవిద, ముచ్చు, మొలక, కంజాక్షి అంటూ దాదాపు 100 పర్యాయ పదాల్లో సంబోధించాడు. అలాగే నాయకులను అన్నెకాడు, చిన్నెలవాడు, నళినాక్ష, ఎమ్మెకాడు అంటూ అనేక పర్యాయ పదాలతో సంబోధించి తెలుగు భాషా విస్తృతను చాటిచెప్పాడు.
క్షేత్రయ్య పదాలలో దృశ్యాలను సాహితీవేత్తలొక మాదిరిగా, చిత్రకళాకారులోక మాదిరిగా, సంగీతజ్ఞులొక మాదిరిగా, నృత్యకళాకారులు మరోకమాదిరిగా, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భాష అలంకార, ఛందస్సులను అధ్యయనం చేస్తారు. సంగీత, రాగతాళాలతోపాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తేనే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం, క్షేత్రయ్య నాయికా, నాయకులను మలిచిన తీరును, వారి భావాలను అర్ధం చేసుకోగలరని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అంటారు.
క్షేత్రయ 49 రాగాలలో పదాలను అల్లినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా కాంభోజి, పంతువరాళి, కేదారగౌళ, కల్యాణి, హుసేని, ముఖారి, తోడి, భైరవి, ఆనందభైరవి, మోహన, మధ్యమావతి, బిలహరి, శంకరాభరణం వాడారు. అయితే, కాంభోజి, కల్యాణి, హుసేని రాగాలను శృంగార రసాన్ని ఆవిష్కరించడానికి, ముఖారి, భైరవిలను శోకరసానికి, మోహన రాగాన్ని సంతోషాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారు. క్షేత్రయ్య ఎక్కువగా భాషాంగరాగాలానే వాడారని మంచాళ జగన్నాథరావుగారు చెప్పారు. అలాగే క్షేత్రయ్య ఎక్కువగా త్రిపుట తాళంలో పదాలను పొందుపర్చాడు. సాంప్రదాయానికి విరుద్ధంగా క్షేత్రయ్య పదాలను పాడేటప్పుడు మొదట అనుపల్లవినీ, తర్వాత పల్లవిని పాడుతారు. క్షేత్రయ్య పదాలను భరతనాట్యం, కూచిపూడి పద్దతులలో సొగసుగా అభినయించి, బోధించినవారిలో ప్రముఖులు బాలసరస్వతి, వెంపటి సత్యం, నటరాజు రామకృష్ణ, కలానిధి నారాయణన్ గార్లు.
సౌమ్యశ్రీ రాళ్లభండి
ఆధునికాంధ్ర కవిత్వంలో 1920 సంవత్సరంలో వచ్చిన సరిక్రొత్త మలుపు భావ కవిత్వ రంగప్రవేశం. 1910-20 మధ్య భావ కవిత్వ ఉద్యమానికి రాయప్రోలు, అబ్బూరి ప్రారంభకులు అయితే అఖిలాంధ్ర ప్రాచుర్యం తెచ్చినవారు కృష్ణశాస్త్రి. ఆనాటి యువతరాన్ని తన కవితాగానంతో ఆకట్టుకున్నారు.
బి.ఎన్. రెడ్డిగారి ప్రోత్సాహంతో 1942లో కవిగా చలనచిత్రరంగంలో ప్రవేశించి మళ్లీ ఇల్లాంటి సాహిత్యం పుట్టదన్నట్టుగా మల్లీశ్వరి పాటలు వ్రాశారు. ఆనాటి నుండి తుదిఘడియ వరకు కొన్ని వందల పాటలను వందకుపై చిలుకు చిత్రాలకు అందించి, సినీ సాహిత్యానికి సాహిత్య జగత్తులో ఉన్నతస్థానాన్ని కల్పించారు.
సినీ గీతాలలో కూడా ఉదాత్త కవిత్వ పరిమళాలను వెదజల్లిన, కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మన హృదయాలు దేనికోరకో వెదుకుతాయి. ఏఏకాంత సీమలోనో మేలుకొంటాయి. కొసరి కొసరి వీచే చిరుగాలి వీచికల్లా మేలుకొంటాయి.
ప్రకృతిలో ఎంత సౌందర్య సంపద ఉన్నా తనంత తానుగా సుకృతి కాలేదు. రససిద్దిని ఆయత్తం చేసుకున్న కవి వాక్కు అందుకు సంసిద్ధంగా ఉండాలి. అక్షర సౌందర్యం గుభాళించాలి.
‘‘చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురియదు,
వేలి కొసలు తాకనిదే వీణపాట పాడదు’’ (మంచిరోజులొచ్చాయి)
అంటూ చల్లని వానజల్లులా యెద లోతుల్లో పాటలు జాలువారితే కవికి మంచిరోజు.
మందారినికి, మధుపానానికి ఉన్న సంబంధం ఎట్లాంటిదో కవికి, ప్రకృతికి గల సంబంధము కూడా అట్లాంటిదే. కవిత్వంలోని విలక్షణతను సినీగీతాలలో స్పష్టంగా భాసిస్తూ కృష్ణశాస్త్రిగారి ప్రత్యేక వాణీని, బాణీనీ ప్రస్ఫుటం చేస్తుంది. నాగరికతని, సభ్యతా సంస్కారాన్ని హార్ధక సౌకుమార్యాన్ని విశృంఖల శృంగారం కోసం ఆయన ఎప్పుడూ బలిపెట్టలేదు.
‘‘పెరటిలోని పూలపాన్పు త్వరగా రమ్మంది,
పొగడనీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది’’ (బలిపీఠం)
అన్న పంక్తులలోని ఆర్ధ్ర శృంగారం భావుక హృదయాలకు తెలుస్తుంది. అందుకే ఆయన రచించిన ప్రతిగీతం శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకు పోయి నాలుకలపై నర్తిస్తుంటాయి. వాటికి పాటబడడమంటూ ఉండదు. మల్లీశ్వరి గీతాలే ఇందుకు నిదర్శనం. ఆయన పాటలన్నీ రసగుళికలే.
‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే,
అందాల చందాల, నీలాల రాగాల,
మమత లెరిగిన – మనసు తెలిసిన
జాలిగుండెల మేఘమాల’’గా
మేఘమాలను వర్ణించిన తీరు అత్యున్నత భావాంబర వీధుల్లో విహరించే కవి భావుకతకి సంకేతంగా నిలుస్తుంది. ఈ మేఘమాల మాటతో మరో మేఘసందేశాన్ని సృష్టించిన అపర కాళిదాసుగా కృష్ణశాస్త్రిగారు పలువురి ప్రశంసలందుకున్నారు.
వీరి సినీగేయాల్లో ప్రకృతి సౌందర్యం వర్ణనాత్మకమైనవి. లలిత పరిహాసాత్మకమైనవి. భక్తి, మధుర భక్తి భావనా విలసితమైనవి. సంయోగ, శృంగార మాధర్యోపేతమైనవి. వియోగ వేదనాభరితమైనవి, విషాదాత్మకమైనవి, మానవత, సామాజిక స్పృహలతో కూడు కున్నవి. జాతీయ భావనిర్భరమైనవిగా గోచరిస్తాయి.
కృష్ణశాస్త్రి పాటలు అనంత తరంగాలుగా అనంతరం మన హృదయాల్ని తట్టితట్టి పిలుస్తాయి. తెలుగు నుడి బ్రతికినంత కాలం మనలను సాదరంగా పలకరిస్తాయి. ‘కుశలమా, నీకు కుశలమేనా’ (బలిపీఠం) అని అంటూ ప్రతి మనిషిని అడుగు తూనే ఉంటాయి.
‘మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగే’, కరుణార్ధ్ర కంఠస్వరంలో తెలుగు జాతికి వెలుతురు వలయాలందిస్తాయి. ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం’ అంటూ తెలుగు చెవినిల్లుకట్టకొని హెచ్చరిస్తూనే ఉంటాయి.
కృష్ణశాస్త్రి పుట్టి పెరిగిన కాలం యుగసంధి. పెనుచీకటిలో లోకం కునారిల్లిపోవడం తాను కన్నులారా చూశారు. చీకటిని కొండలు దాటివెళ్లి పోమ్మని శాసించారు. వెలుగు వెండిరేకులను ఆహ్వానించారు. ఐనా చీకటి పూర్తిగా వైదొలగలేదు. వెలుతురు పూర్తిగా పునరాక్రమించనూలేదు. ఉన్న యదార్ధాన్ని ఆర్త హృదయంతో ఆక్రోశిస్తూ కూర్చోక సౌందర్య ప్రతీకగా మలచుకొని, ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకు వన్నెల’ను (చీకటి వెలుగులు) ఆహ్లాదించారు.
లోకపు మెడచుట్టూ గులాబీలు నవసౌకుమార్యాలను భావించారు. ఐనా చీకటి సిగపాయల ఎర్రని మందారాల కాంతి గుచ్ఛాల నవలోకించారు. సౌందర్యం ఏకాకి కాదు, దాని కాంతులు దూరదూరాల వ్యాపిస్తుంది. శివసుందరమయంగా సత్యమయ ధ్యానంగా, ఆనందధామంగా సాగుతుంది. అలాంటపుడు,
‘‘గల గల మనకూడదు ఆకులలో గారీ
జలజల మనరాదు అలలో కొండవాగూ,
నిదురోయే కొలను నీరు కదపగూడదు
ఒదిగుండె పూలతీగ ఊపరాదు’’ (చీకటి వెలుగులు)
నిజమే మరి, ఊరకనే తీగను కదిలించడమెందుకు? తీగకదిలితే స్వరమా ఊడిపోతుంది. తొడిమలపై కులికే పూలబాలలు కూలిపోతాయి. అది కృష్ణశాస్త్రి భావుకత, ఆర్ధ్ర మనస్కత.
అలవోకగా కనులార మోడ్చిన కవికి ప్రతి పులుగు ఎందుకో ఏదో చెప్పబోతుంది. రామచంద్రోదయ సమయంలో చెట్టుచెట్టూ కనులు విప్పి చూస్తుంది. తెలియని ఆర్తిలోనూ, ఆశల పెను కడలిలోనూ అర్రట్లాడిపోతున్న సమయంలో ఆ రాముని దివ్యసుందర రూపం చూసేసరికి తోచి తోచని సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన శబరిని మనముందు సాక్షాత్కరింప చేసిన దృశ్యము అపూర్వము.
‘‘అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ?
నీలమేఘ మోహనము నీ మంగళరూపము’’ (సంపూర్ణ రామాయణం)
స్వీయానుభవాన్ని అనుభూతిగా మార్చుకొని పాత్రలపరం చేయగల నేర్పు ఉంటే శబరినే కాదు, మందర అయినా కనులముందు నిలబడుతుంది.
కృష్ణశాస్త్రి పాటలు మన సంఘాన్ని పునఃనిర్మించే బాధ్యతలతో స్పర్శంచని తావులేదు. మన హృదయాలలో సకల మాలిన్యాన్ని క్షాళనం చేస్తూ చీకటి కోణాలన్నింటిపైనా సూర్యరశ్మి ప్రసరింప చేస్తాయి.
ఎవరూ అంటుకోని పనిని మాతృహృదయంతో నెరవేర్చే సంఘసేవకులు ఈ దేశానికి అంటరానివారు. దూరదూరంగా తరమబడుతున్నారు. భారంగా బ్రతుకులీడుస్తూ, బ్రతకడానికేనా వారు జన్మించారు అని కృష్ణశాస్త్రి గారిని కలవరపర్చింది. అందుకే ఆయన,
‘‘కలువపాపాయికి కొలను ఒడి ఉంది
చిలుక పాపాయికి చిగురు ఒడి ఉంది
ప్రాణములేని ఒక శిలకు గుడి ఉంది’’ (కాలం మారింది)
ఆదయనీయులకు మాత్రం ఏమీలేదు. వారి బ్రతుకలపై ఎవ్వరికి జాలిలేదు. అంటరానితనాన్ని, ఒంటరితనాన్ని అనాదిగా పదిలపర్చుకొన్న జాతి తన హృదయాలను మడిగా జాడీలలో దాచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్పృత్యతపై ధ్వజమెత్తారు. ‘‘అందాల మనదేశము, అందచందాల మన దేశము పెంపొందాలి కలకాలం’ అంటూ జాతీయాభిమానాన్ని వ్యక్తం చేశారు.
మాతృభాషా మాధుర్యానికి పరవశించిన కవి ‘పాడనా తెలుగు పాట, మంచి ముత్యాలపేట, మధురామృతాల తేట’ (అమెరికా అమ్మాయి) అంటూ తెలుగు వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘ఒళ్లంతా ఒయ్యారి కోక, కళ్లకి కాటుక రేఖ, మెళ్లోతాళీ, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమబొట్టు’ అంటూ తెలుగు ఆడపడుచుని మనోహరంగా వర్ణించారు.
కృష్ణశాస్త్రి ప్రకృతి కవి. అందుకే ఆకులో ఆకు, పూవులో పూవు, రెమ్మలో రెమ్మైనారు. ‘పచ్చని తోటల విచ్చిన పూవులు, ఊగేగాలుల తూగే తీగలు, కొమ్మల మోగే కోయిల జంట’లను స్తుతించారు. ‘మనసున మల్లెలూగించారు. కన్నుల వెన్నెల డోలలూగించారు.’
‘సడిసేయకే గాలి, సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే’ (రాజమకుటం) అంటూ తన రాజుకు నిద్రాభంగం కలగరాదని వేడుకుంటున్న ప్రియురాలి ముగ్ధప్రణమాన్ని రూపకల్పన చేశారు.
పురులు విప్పిన నెమళ్లు నాట్యమాడినట్లు, కృష్ణశాస్త్రిగారి పాటలలో మృదువైన తెలుగు పదాలు దొర్లాయి. ఆయన పాటలు నవీన రసహృదయాలకు ఒయాసిస్సులై దప్పికతీరుస్తూనే తీరని పిపాసను కలిగించాయి.
శేషభార్గవి దేవులపల్లి
మలహరి అనగా మలినం పోగొట్టునది అని అర్ధం. శుభప్రదమైన రాగం. ఇది ఔడవ,షాడవ ఉపాంగరాగం. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, పంచమం కాక శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, (స,రి,గ.మ,ప,ద,స / S R1 G3 M1 P D1 S). ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సదపమగరిస. దీనిని భక్తిరస ప్రధాన రాగంగా పేర్కొనవచ్చు. ఇది ప్రభాత రాగం. ఇందు మ,ప,దలు జీవ స్వరాలు.
ఈ రాగం గురించిన ప్రస్తావన సంగీతరత్నాకర, సంగీతమార్తాండ, రాగతాళ చింతామణి మొదలైన ప్రాచీన సంగీత పుస్తకాలందు మనకు కన్పిస్తుంది. ఇది పూర్వం వాడుకలో ఉన్నా ఇప్పుడు మరుగున పడిపోయింది. అయితే, ఈ రాగమందు కర్ణాటక సంగీతపితామహుడు పురందరదాసు అభ్యాసగానానికి అనువుగా నాలుగు పిళ్ళారి గీతాలు – శ్రీ గణనాథ, కుందగౌర, కెరయనీరను మరియు పదుమనాభా – రచించారు.
మలహరి రాగంలో ప్రసిద్ధ రచనలు:
1. పంచమాతాంగముఖ – ముత్తుస్వామి దీక్షితార్
2. అనంతపద్మనాభం – ముత్తయ్య భాగవతార్
3. ఇన్నిటిమూలంబీశ్వరుడాతని – అన్నమయ్య
మలహరి స్థానే నేడు సావేరి రాగం ప్రసిద్ధి చెందింది. ఈ రెండు రాగములకు అవరోహణ యందు నిషాదము మాత్రమే భేదము. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సనిదపమగరిస. ఇది ఔడవ, సంపూర్ణరాగం. ఇందు రి,మ,దలు రాగా ఛాయా స్వరాలు. ఈ స్వరాలు సావేరి రాగ లక్షణాన్ని వెలికి తీస్తాయి. ఈ స్వరంలో మధ్యమానికున్న ప్రత్యేకత దృష్ఠ్యా దీనిని ‘సావేరి మధ్యమం’ అని కూడా పిలుస్తారు. ఇది కరుణ, శోకరసాలు పలికించే రాగం. సూర్యోదయ, సూర్యాస్తమయాలలో పాడుకోడానికి అనువైన రాగం.
సంగీత త్రిమూర్తులు ముగ్గురూ మొత్తం 28 రాగాలలో కనీసం ఒక కృతైనా రచించారు. ఆ రాగాలలో ఒకటి సావేరి రాగం. ఈ రాగంలో త్రిమూర్తులు ముగ్గురూ కలిసి 26 రచనలు చేశారు. అందు 19 కేవలం త్యాగరాజే చేశాడు. ఈ రాగాన్ని భాషాంగ రాగంగా సంగీత రత్నాకర పేర్కొంది. ‘‘కావేరి స్నానం, సావేరి రాగం’’గా బహుళ ప్రచారం చెందిన ఈ రాగం కర్ణాటక సంగీతంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది. ఎంతో ప్రాచీనమైన ఈ రాగ ప్రస్తావన సంగీత రత్నాకర, సంగీత సమయసారగౌడ మేళానికి జన్యరాగమని బృహధర్మ పురాణం పేర్కొంది. ఈ రాగం సాలంగనాథ మేళ జన్యమని, గౌళ మేళజన్యమని, మల్లారి జన్యమని కూడా ప్రచారంలో ఉంది.
సావేరి రాగంలో ప్రసిద్ధ రచనలు:
1. సరసుడా (వర్ణం) – వెంకటరామ అయ్యర్
2. శంకరి శంకురు, దురుసుగా కృప జూచి, జనని నతజనపరిపాలిని – శ్యామశాస్త్రి
3. ఆంజనేయ, పరిపాహి గణాధిప (నవరాత్రి కృతి) – స్వాతి తిరునాళ్
4. శ్రీ రాజగోపాల, కరికళభ ముఖం – ముత్తుస్వామి దీక్షితార్
5. పరాశక్తి మను, రామబాణ త్రాణ, తులసీ జగజ్జననీ – త్యాగరాజస్వామి
6. ఎంతనేర్చినా – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్
7. శ్రీ కామకోఠి పీఠ – మైసూర్ సదాశివ బ్రహ్మం
8. మురుగా, మురుగా – పెరియస్వామి తూరన్
9. మెచ్చోనక రాగంబు – అన్నమయ్య
10. మాధవా మధుసూదన, హరియే సర్వోత్తమ – పురందరదాసు
11. సీతారామస్వామి, దినమే సుదినము - రామదాసు
సౌమ్యశ్రీ రాళ్లభండి
జగదానందకారక, కనకన రుచిరా కృతుల్లో ప్రత్యక్షం చేసుకున్న పరమాత్మ తనను రక్షించి దయతో బ్రోచునా అనే సందేహాన్ని, గౌళరాగంలో ‘‘దుడుకు గల’’ అనే కృతిలో ప్రస్తావిస్తారు త్యాగరాజస్వామి. ‘కనకనరుచిరా’ అన్నపాటలో చివర ఉదహరించుకున్న ధ్రువుడు సజ్జనుడు, సాపత్నిమాతయైన సురుచి కర్ణశూలములైన మాటలు, వీనులచురుక్కుమనిపించినా, పల్లెత్తుమాటైనా తిరిగి అనకుండా కార్యశూరుడైన, వినయకవచుడై కృతకృత్యుడైన ప్రయోజకుడు ఆ ధ్రువుడు! అలా ధ్రువోపాఖ్యానం జ్ఞాపకం తెచ్చుకున్నా ప్రస్తుతః తాను ఆ ధ్రువునికి సమానుడను కానన్న కించవల్ల తన కాతని మల్లె సమానఫలసిద్ధి అబ్బదేమో అనే సందేహం కలిగింది. తనకు దుడుకు ఉన్నదని ఆలోచించుకుంటారు. తన స్థితిని పూర్తిగా వివరించుకునే ప్రయత్నంచేసి, ఆ ప్రయత్నంలో పదేపదే తన్ను కించపరచుకుంటారు ఈ గౌళకృతిలో.
సౌఖ్యపుజీవనం కోసమే కాలం గడుపుతూ, దుర్విషయములను దురాశలను విసర్జించలేక, పరధనముల నాశించి, వానికొరకు ఇతరులను పొగడి, మది కరుగ యాచించి పలికి, కుతర్కుడై, రసవిహీనుడై, కులభ్రష్టుడై కాలము గడిపే దుడుకు మానవతను సాధింపక, చపలచిత్తుడై, మదమత్సర కామలోభమోహములకు దాసుడై, చిరుతప్రాయమునాడే భజనామృతసారవిహీనుడై, సతతమపరాధియైనట్టి వాని దుడుకు సతులకై కొన్నాళ్లు, ఆస్తికై కొన్నాళ్లు, ధనతతులకై కొన్నాళ్లు, తిరిగి శ్రమిస్తూ, పరస్త్రీలను, నీచ స్త్రీలను కామించి అనుభవించి, శ్రీహరిపదాబ్జభజన మరచి, సకలభూతలములయందూ తానైయున్న ఆ దేవుని తన మదిలో మాత్రమే లేకుండ చేసుకున్న దుడుకు ఈ రీతిగ అనేక రకముల దుడుకులు గల ‘తన్ను’ నికృష్ణుని, ‘బ్రోచే దొరకాడు’ వారసత్వపు ప్రభుత్వంగల వాడెవ్వడూ అని ప్పచ్ఛ చేస్తారు. ఈ ప్రశ్నకు జవాబు ఈ పాటలో లేదు. కాని నాలుగువ పంచరత్న కీర్తన, ఆరభిరాగంలో ‘‘సాధించెనే మనసా’’ అనే కృతిలో సంతరించారు త్యాగరాజస్వామి.
ఈ గౌళ కీర్తన యొక్క ప్రయోజనం అంతముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించడమే. త్యాగరాజు స్వకీయనిందమాత్రం కాదు. ఆ పరమ భాగవతుడు తన్నంతగా కించపరచుకుని తిట్టుకోవడం సమంజసమూ కాదు. అటువంటి దుడుకాయనకున్నదనడం సత్యమూ కాదు. స్వామివారి సత్ప్రవర్తనా, పవిత్ర జీవినమూ అందరూ ఎరిగినవే. వేరొకచోట స్వామివారు త్యాగరాజప్తునిగా శ్రీరాముణ్ణి పొగడడం నారదమౌని తపస్సుకే ఫలపరమావధి అన్నట్టు చెప్పారు. త్యాగరాజు శబ్దం శివునికి కూడా వర్తించినా కృతులలో అది తన సంతకమే, తను రచించిన విషయాన్ని సూచించే సంకేతమే అవుతుంది. ‘‘త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో’’ అని యదుకులకాంభోజిలో అనేసి తనపై తనకున్న ఆత్మ విశ్వాసాన్ని ప్రకటితం చేశారు. కనుక ఈ గౌళరాగకృతిలోని ‘‘దుడుకు మానిసి’’ త్యాగరాజస్వామి మాత్రం కాకూడదు. ఆ పాట నేను పాడుకుంటే ఆ ‘నన్ను’ నాకే చెంది ఆ దుడుకుగల మనిషిని, కొన్ని దుడకులేనా ఉన్న మనిషిని నేనే అవుతాను. అంచేత ఆ పాట పాడుకునే జిజ్ఞాసువులకు ఆ మాట చెందుతుంది. ఇక పాటలోని ప్రతిపాదనా, ప్రశ్నా జనసామాన్యానికి అన్వయించుకుంటే, అంత హైన్యస్థితికి దిగజారిన వారికి మోక్షం ఎలాగా అనే సామాన్య ప్రశ్నా, దానికి జవాబూ దొరుకుతాయి. తానెంత దైన్యస్థితికి దిగజారినా, ఎంతు బరువు బ్రతుకు గడుపుతున్నా, ఎంత నికృష్టుడైనా ఏ మానవుడు నైరాశ్యత చెందరవసరంలేదనీ, బ్రోచి రక్షించే దొరకొడుకు ఎవరు అని వెతుక్కుంటే దొరకుతాడనీ వ్యంగ్యంగా సూచించారు గురూత్తములైన త్యాగరాజస్వామి. ‘జగదానందకారక’ లోని శరణాగత జనపాలకుడూ, ‘కనకన రుచిరా’ లోని పరమదయాకర, కరుణాకరసవరుణాలయుడూ అయిన జానకీ ప్రాణనాయకుడే ఆ దొరకొడుకు! దశరధ దొరకొడుకు – దాశరధి!
‘‘సాధించెనే మనసా’’లో ఆ దొరకొడుకైన దాశరధి, త్యాగరాజనుతుడు. తన భక్తుని చెంతరాకనే, అమరికగా నాతని పూజగొని, సమయానికి తగు మాటలాడి, సౌఖ్యపు బ్రతుకు గడపడానికి ప్రయోజనకారకములయ్యే వ్వహార సూత్రాలు నిర్ధేశిస్తాడు. ఆ భగవంతుడు ముచ్చటగా మూడే సూత్రాలు చెప్పాడు:
అలుగవద్దు, అన్నాడు
విముఖులతో చేరబోకు, అన్నాడు
వెతగలిగితే తాళుకొమ్ము, అన్నాడు
రఘుకులేశుడైన రామచంద్రుడు, స్వప్రకాశుడైన శ్రీవేంకటేశుడు వేడుకున్నా తన్నుబ్రోవక, ఈ మూడు సూత్రాలు పలికి తిరిగిపోయినాడన్నారు. పరమభక్తవత్సలుడని, కలబాధల దీర్చువాడని, ఒక అభయహస్తముద్రతో తన్ను తిన్నగా మోక్ష స్థితికే చేర్చివేస్తాడనుకొని వేడుకుంటే, దగ్గరకైన రాకుండానే, దూరాన్నే నిలిచి, ఈ ప్రకారంగా నడచుకొమ్మని ఉపదేశించి చక్కా పోయినట్లు చెప్పి, చమత్కారంతో విశేష ప్రయోజనం సాధించారు. దేశికోత్తములైన త్యాగరాజస్వామి! ఏ ఆచార్యుడైనా జీవిత క్రమానికి సంబంధించిన నిబంధనలు వక్కాణించి చెప్పితే, అవి సామాన్యంగా శిష్యుల మనస్సులకెక్కవు. కాని త్యాగరాజస్వామి వంటి సద్భక్తుడు, తనకు, ఆ పరబ్రహ్మమైన శ్రీవేంకటేశుడే అయీ నిబంధనలని సూచించాడని చెప్పుతూ ఉంటే, ఆ పరదైవాన్ని ప్రత్యక్షదైవంగా ఎంచుకునే కలియుగ మానవులు ఆ మాటలపై నమ్మకమూ, స్వామివారిలో గురుత్వమూ కుదుర్చుకొనకుండా ఎలా ఉండగలరూ? తాను చెప్పదల్చుకున్న పాఠాన్ని పరోక్షంగా, అందులోనూ ఆ పరమాత్మ నోటితోనే చెపన్పించడం త్యాగరాజస్వామి వారి నేర్పరితనం. ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అని వేరొకచోట తానై వితర్కించుకొన్న త్యాగరాజస్వామి ఈ పంచరత్న కృతిలో, ‘అలుగవద్దు’ అని దేవదేవుని చేతనే (మళ్లీ) చెప్పించారు.
ఈ పాటలో ఇంకొక చమత్కారం ఏమిటంటే, ఆ చెప్పిన పరమాత్ముడు, సమయానికి తగరుమాటలాడినవాడూ, మామూలుగా తాను పూజించి, మనస్సులో దర్శించి పరవశం చెందే జానకీ ప్రాణనాయకుడుకాదు –రుక్మిణీ ప్రాణేశుడు! రంగేశుడూ, సద్గంగా జనేకుడూ, సంగీత సాంప్రదాయకుడూ అయిన శ్రీ కృష్ణుడు ఆ శ్రీకృష్ణుడైనా, తానూ ఇంకా మిగిలిన భక్తులై ఈ వరలో సందర్శించిన మూర్తి. ‘‘అలివేణువెల్ల దృష్టిచుట్టి వేయుడు, మ్రొక్కే వేణుగానలోలుడు కాడు – రాసక్రీడలాడే యువకుడుకాడు – పెంకెగోపాలుడు. గోపీజన మనోరధ మొసంగలేకనే గేలియజేసెడివాడు, పుట్టిన మరుగడియనుండీ వారికి గాక పరులవాడై దేవకీ వసుదేవుల ‘‘నేచిన’’ వాడు, నిజతనయుడను భ్రాంతితో యశోద ముదంబునను ముద్దుబెట్ట (ఆవిడ మాయామోహత్వానికి) నవ్వుచుండు హరి, వనితల సదా సొక్క చేయుడు, అందులకై తనకు మ్రొక్కించుకునే గడుసిరి, ‘అలుగవద్దు’ అని తనకు బోధించిన సన్మార్గ వచనములను (తానే) బొంకుజేసి తాపట్టిన పట్టు (దూరాన్నుంచి కబుర్లు చెప్పడమేగాని, దగ్గరకొచ్చి, లాలించి ప్రేమించి మోక్షమీయని పెంకెపట్టు – తానే కోపించినాడా అన్నట్టు) అలాంటి పట్టును ‘‘సాధించెనే’’ అంటారు త్యాగరాజస్వామి! ఆ మాటను పల్లవిలోనే అని మళ్లీమళ్లీ అనుకుంటారు! ఇటువంటి విరుద్ధ ప్రవృత్తితో పరమాత్ముడు తనకు ప్రత్యక్షమయ్యాడన్నారు. తాను కోని పూచించుకునే ఇష్టదైవం వేరు – ఉరమున ముత్యపుసరులచయముతో, కరమున శరకోదండకాంతితో, రుక్కలరాయని గేరుమోముగల సుదతి సీతమ్మ, సౌమిత్రి ఇరుప్రక్కల నిలబడి సేవించే ఆ వనజనయనుడు కాడు! ఆ స్థానంలో ఈ గోపాలుని నిలుపుకొనడంలో త్యాగరాజస్వామి వారందించే పాఠం ఏమిటో మనం ఊహించుకోవాలి. ఆశించిన ఫలం అదే రూపంలో అందకపోతే క్రుంగిపోకూడదు అనే పాఠాన్ని అందించారా? కావాలన్నప్పుడూ, అనుకొన్న రూపంలో దేవుడు దొరకకపోవచ్చుననీ, ఇంకో రూపంలో ప్రత్యక్షం కావచ్చుననీ, స్వర్గానికి నిచ్చెనగా దేవతామూర్తి నుపయోగించుకోబోతే, పెంకె గోపాలునిమూర్తిలో ప్రధానోపాధ్యాయుని లాగా, జాగ్రత్తగా మసలుకొమ్మని పాఠాలు చెప్పవచ్చుననీ, అయినా ఆ బోధనే మహా ప్రసాదమని స్వీకరించానీ, అలాంటి సత్ప్రవర్తన వల్లనే విముక్తి దొరుకుతుందనీ చెప్పడమే త్యాగరాజుల వారి తాత్పర్యమేమోననిపిస్తుంది. ఇంకొక ఆలోచన అతుల శౌర్య విభాసియైన పార్ధుని కనిమొనలో సారధ్యమొనరించి, అతడు విషాదయోగగ్రస్తుడై యుండగా, కర్తవ్యము నుపదేశించిన దేశికమూరి, జగత్తుకు గీతామృతమును ప్రసాదించిన జగద్గురువు, ఆ శ్రీకృష్ణుడు గనుక, గీతాబోధను గుర్తులో నుంచుకొని, తన రామునిచే పాఠాలు చెప్పించక, ఆచార్య స్థానంలో ఆ కృష్ణుని నిలబెట్టడం సమంజసమే అనిపిస్తుంది. ఏదిఏమైనా, సుశీలమే ఆవశ్య కర్తవ్యమని, త్రిసూత్రాత్మకమైన గురు బోధను అందించింది ఈ ఆరభి రాగపుటమోఘ కీర్తన!
(సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి)
తేటగీతి
మునుపు వరాహ సమూహము
లనిశము వర్తించుచోట నా హరి కిటియై
నెనవుగ నిల్చిన కతమున
ననఘ! వరాహాద్రిపేర నా నగమొప్పన్. (శ్రీ వేంకటాచల మహాత్మ్యము)
శ్వేతవరాహావతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించిన పిదప భూలోకంలో ఈ తిరుమల కొండనే నివాసంగా నేర్పర్చుకుని శ్రీహరి నివసించాడని బ్రహ్మాండపురాణం మనకు తెలుపుతోంది. అందువల్లే ఈ క్షేత్రం ‘ఆదివరాహ క్షేత్రం’ అనీ, ‘శ్వేతవరాహ క్షేత్ర’ మని, భూదేవితో కల్సి ఇక్కడ విహరిస్తున్నందున్న ‘భూవరాహ క్షేత్ర’ మని ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ స్వామిపుష్కరిణికి వాయువ్యదిశలో లక్ష్మీసమేతుడై శ్వేతవరాహుడు విరాజిల్లుతున్నాడు.
వరాహ దర్శనా త్పూర్యం శ్రీనివాసం నమేన్న చ
దర్శనా త్ప్రా గ్వరాహస్య శ్రీనివాసూ న తృప్యతి.
క్షేత్రసాంప్రదాయం ప్రకారం శ్వేతవరాహస్వామిని దర్శించకుండా వేంకటేశ్వరుని దర్శించరు. కాలక్రమేణా ఈ సాంప్రదాయాన్ని భక్తుల పూర్తిగా విస్మరిస్తున్నారు. శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నివసించగోరి, ఆలయ నిర్మాణానికి 100 అడుగులచోటును వరాహస్వామి వద్ద నుంచి యాచించి పుచ్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిఫలంగా, ప్రథమ పూజ, ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే దక్కేటట్టు శ్రీనివాసుడు వరాలచ్చినట్టు ప్రతీతి. నేటికి ఈ సాంప్రదాయం ప్రకారమే తొలిపూజ, తొలి నైవేద్యం శ్వేతవరాహస్వామికే జరుపబడతాయి. అంతేకాక, బ్రహ్మోత్సవ చివరిరోజు స్వామివారు భూదేవి, శ్రీదేవిలతో కలసి ఇక్కడకి విచ్చేసి పూజలందుకుంటాడు.
‘మహావరాహో గోవిందః’ అనే విష్ణు సహస్రనామం ఈ పురాణగాథను తెలుపుతుంది. గో అనగా భూమి, వింద అనగా పొందినవాడు. వరాహస్వామి నుండి భూమిని పొందినవాడు వేంకటేశ్వరుడే! అన్న స్మృతి మనకు గోవిందా అన్న నామం స్మరించిన ప్రతిసారీ కలగకమానదు.
ఆ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేటికి ఆవలివైపు నమస్కార భంగిమలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీనిని వ్యాసరాయలవారు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమల కొండకు నడిచే వెళ్లే మార్గంలో దాదాపు 30 అడుగులు గల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అల్లంత దూరం నుంచే చేరుకున్నారు వేంకటగిరని చాటి చెపుతుంది. అన్నమయ్య మాటలలో చెప్పాలంటే,
ఆకాసమంతయ నిండి యవలికిఁదోఁక చాఁచి
పైకొని పాతాళానఁ బాదాలు మోపి
కైకొని దశదిక్కులు కరములఁ గబళించి
సాకారము చూపినాడిచ్చడ హనుమంతుడు
గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా
ధరణి మేరు కటితటము గాఁగా
ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై
బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుడు.
ఆంజనేయునికి తిరుమల కొండకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తోస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఇందుకు తగిన దివ్యగాథ కూడా ఉంది. మతంగముని ఆదేశంతో వేంకటాచలంపై ఆకాశగంగ తీర్ధావరణలో తపస్సుచేసి అంజనాదేవి వాయుపుత్రునికి జన్మనిచ్చింది. అందుకే ఈ గిరి అంజనాద్రిగా పేరొందింది. మాతృశ్రీ తరిగిండ వేంగమాంబ తన వేంకటేశ్వర మాహాత్మ్యంలో ఇదే గాథను అద్భుతంగా వర్ణించింది.
అంజనాదేవి తపము మున్నచట జేసి
పొసగ హనుమంతుడను వరపుత్రుంగాంచె
నపుడు దేవతలెల్ల సహాయు లగుచు
నా గిరికి నంజనాద్రి పే రమర నిడిరి.
ఈ క్షేత్ర మహిమను అన్నమయ్య తన కీర్తనలో ఈ కిందివిధంగా కొనియాడాడు.
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడవాడి కొండ.
ప్రసన్నాంజనేయుడు, కోనేటి ఆంజనేయునితోపాటు శ్రీవారి ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో బేడి ఆంజనేయస్వామి కోవెల ఉంది. చేతికి, కాళ్లకు బేడీలతో స్వామివారికి అంజలి ఘటిస్తుండే ఈ మూర్తి వెనకాల కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
పొదలు సొంపగు నింపుల పూబొదలు వాసన నదులూ
మొదలూగల తామర కొలంకులపై మెదలు తుమ్మెదలూ
కదలి మలయానిలు వలపుల పస కదళీ వనములనూ
మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా||
ఎల్లప్పుడు పచ్చని చెట్లతో, పరిమళ ఝరులతో, పూదోటలతో, తుమ్మెదల ఝూంకారాలతో, అరటి తోటలతో శోభిల్లే అంజనాద్రిపై ఆ అంజనాసుతుడు ఊరక ఉండమంటే ఉంటాడా? అల్లరి, చిల్లరగా చిలిపి పనులతో విసిగిస్తున్న హనుమంతుని కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఆ వేంకటేశ్వరుని ముందు కదలకుండా అంజనాదేవి నిలబెట్టిందట. సార్ధక నామధేయుడై అప్పటినుండి వేంకటేశ్వరుని చేరువలో కొలువై ప్రతి ఆదివారం పంచామృతాభిషేకాలను, పూజా నివేదనాదులను పొందుతూ స్వామివారి కనుసన్నలలో మెదులుతూ భక్తులకు తృప్తిని కల్గిస్తున్నాడు.
అందిరిలోనా నెక్కుడు హనుమంతుడు
కందువ మతంగగిరికాడి హనుమంతుడు
కనకకుండలాలతో కౌపీనముతోడ
జనియించినాడు యీ హనుమంతుడు
ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ
పెనుతోక యెత్తినాడు పెద్దహనుమంతుడు
తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా
అవలయివల నేసె హనుమంతుడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతూ
ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుడు
తిరమైన మహిమతో దివ్యతేజముతోడ
అరసి దాసులగాచీ హనుమంతుడు
పరగ శ్రీ వేంకటేశుబంటై సేవింపుచు
వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు.
అంజనాచలమే నివాసమైన ఏలిక ఒకరు కాగా, అంజలి ఘటిస్తూ మక్కువతో బంటువైన ఘనుండు మరొకడు. ఇదే అభిప్రాయాన్ని అన్నమయ్య మరొక కీర్తనలో వెలిబుచ్చాడు.
అంజనాచలము మీద నతండు శ్రీ వేంకటేశుఁ
డంజనీ తనయుఁడాయ ననిలజుఁడు
కంజాప్తకుల రామఘనుడు దానును దయా
పుంజమాయ మంగాంబుధి హనుమంతుఁడు.
అందుకేనేమో అన్నమయ్య కూడా ఆ పెద్దహనుమంతునికి తన సంకీర్తనలలో పెద్దపీటవేశారు.
మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడా
యీతడా రాముని బంటు యీతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూడందు రాతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన యాతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి యితడా
ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడితడా
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతమున నితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా
చిరంజీవి యీతడా జితేంద్రియుడితడా
సురల కుపకారపుచుట్ట మీతడా
నిరతి శ్రీ వేంకటాద్రీని విజనగరములో
నరిది వరములిచ్చీ నందరికి నితడా
అని ఒక కీర్తనలో కీర్తిస్తే, మరో చోట...
పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు
వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు
పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు
అట్టి పవనుజుడుని,
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య
ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె
సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట యీతని మహిమ యేమని చెప్పేమయ్య,
అంటూ, అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము,
పదియారు వన్నెల బంగారు కాంతులతోడ పొదిలిన కలశాపుర హనుమంతుడు,
త్రివిక్రమమూర్తియైన దేవునివలెనున్నాడు భువిసేవించే వారి పాలి పుణ్యఫల మీతడు
తేరి మీద నీ రూపు తెచ్చి పెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని వేర్వేరు కీర్తనలలో కొనియాడాటంతోపాటు, ఆ శ్రీఆంజనేయుని, ప్రసన్నాంజనేయుని పవిత్ర ద్వాదశనామాలను ఈ కింది కీర్తనలో గానం చేసి భక్తులందరిని తరిపంచేశాడు.
తలచరో జనులు యీతని పుణ్యనామములు
సులభమునే సర్వశుభములు గలుగు
హనుమంతుఁడు వాయుజుఁ డంజనాతనయుండు
వనధిలంఘనశీలవై భవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుఁడే
ఘనుఁడగు కలశాపురహనుమంతుఁడు
లంకాసాధకుఁడు లక్ష్మణప్రబోధకుఁడు
శంకలేని సుగ్రీవసచివుఁడు
పొంకపు రామునిబంటు భూమిజసంతోషదూత
తెంకినేకలశాపురదేవహనుమంతుడు
చటులార్జునసఖుఁడు జాతరూపవర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటివాఁడు
నటన శ్రీ వేంకటేశునమ్మిన సేవకుఁడు
పటు కలశాపురప్రాంత హనుమంతుడు.
సౌమ్యశ్రీ రాళ్లభండి
శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది
కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలమ్
ద్వాపరే శేషశైలతే
కలౌ శ్రీ వేంకటాచలమ్
నామాని యుగభేదేన
శైలస్యాస్య భవంతి హి.
కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు.
కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ ||
వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ
శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ ||
సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ
నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ
ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ ||
వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ ||
అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు.
అదివో అల్లదిగో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము ||
అదె వెంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు డదెమ్రొక్కు డానందమయము ||
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ||
కైవల్య పదము వేం కటనగమదివో
శ్రీవేంకటపతికి సిరలైనది
భావింప సకల సంపదరూపమదివో
పావనముల కెల్ల పావనమయము ||
మాతృశ్రీ తరిగొండ వేంకమాంబ ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము’లో ఈ శ్రీనివాస పర్వతనామ ఔనిత్యాన్ని చాటుతూ,
శ్రీని నురంబున నిడికొని
శ్రీనారాయణుడు ప్రజకు సిరులిచ్చుచు నం
దానందింపుచు నుండగ
నానందాచల మనంగ నగ్గిరి యొప్పెన్ ||
అని ఈ పర్వతశ్రేణి ఆనందనియలంగా మారిన వృత్తాంతాన్ని వివరించింది. ‘వేం’ అనగా అమృతం, ‘కట’ అంటే ఐశ్వర్యం అని మరో అర్ధాన్ని కూడా తెలిపే వేంకటాచలం చూచినతోడనే ఇహపర సుఖాలతోపాటు ముక్తిని ప్రసాదిస్తుంది. సర్పాకారంలో అగుపించే ఈ శేషాద్రి శిఖర భాగాన (తల) శ్రీ వేంకటేశ్వరుడు (తిరుమల), మధ్యభాగాన (నడుము) శ్రీ నృసింహుడు (అహోబిలం), చివర భాగాన (తోక) శ్రీమల్లికార్జునుడు (శ్రీశైలం) వెలసి ఉన్నారని పురాణ గాథలు తెలుపుతున్నాయి. అనేక దివ్య తీర్థాలతో వెలుగొందుతున్న ఈ తీర్ధాచలంపై వక్షస్థలంలో వ్యూహాలక్ష్మిగా సాక్షాత్తు మహాలక్ష్మినే నిలుపుకున్న ‘కలౌః వేంకటనాయకుడు’ శరణన్నవారికి శరణిచ్చి రక్షిస్తూ ఆపదమొక్కులవాడని, గోవిందుడని సార్ధకనామధేయుడైయ్యాడు. ఇదే భావనను అన్నమయ్య తన కీర్తనలలో పదే, పదే పేర్కొని మనను చరితార్ధులను చేశాడు.
మతంగపర్వతము మాలవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు ||
కొలచినవారికెల్లా కోరినవరములిచ్చి
తలచినవారినెల్లా ధన్యులజేసి
పొలుపుమిగుల మంచిపువ్వలతోటనీడ
విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు ||
శరణన్నవారికి చనవిచ్చి రక్షించి
గరిమ బూచించువారి గరుణజూచి
పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు
విరివిగొన్నాడు శ్రీ వేంకటేశ్వరుడు ||
తను నమ్మినవారికి తగిన సంపదలిచ్చి
కని నుతించేవిరికి కామధేనువై
కనకమయములైన ఘనమైనమేడలలో
వినుతికెక్కెను శ్రీ వేంకటేశ్వరుడు||
సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతము యొక్క ఔనత్యమును గ్రహించి, పదుగురు సుళువుగా అభ్యసించడానికి మాయామాళవగౌళ రాగంలో స్వరావళులు మొదలు కీర్తనల వరకు రచనలు చేసిన సంగీతనిధి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. కన్నడ భాషలో విరివిగా రచనలు చేసిన పురందరదాసు నారదాంశమని ప్రతీతి. పురందరదాసు 1484వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలోని హంపి దగ్గర గల పురందరగడ్ లో కమలాంబ, వరదప్పనాయక్ దంపతులకు జన్మించాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించిన కారణాన ఆయనకు శ్రీనివాసుడని తల్లితండ్రులు నామకరణం చేశారు. అయితే ముద్దుగా శీను, శీనప్ప, తిమ్మప్ప, తిరుమలయ్య అని కూడా పిలిచేవారు. ఆయనకు 16వ ఏట సరస్వతీబాయితో వివాహం జరిగింది.
తండ్రి వజ్రాల వ్యాపారి కావటంతో సహజంగానే ఆ వ్యాపారం పట్ల పురందరదాసుకు ఆసక్తి ఏర్పడింది. అయితే పిన్న వయస్సులోనే పురందరదాసు సంస్కృత, కన్నడ భాషలలో మేటి అన్పించుకోవడమేకాక సంగీతాన్ని కూడా ఔపోసన పట్టాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో వ్యాపారంలో రాటుదేలిన పురందరదాసుని సహ వ్యాపారులు నవకోటి నారాయణ అని పిలిచేవారు. ఈ నవకోటి నారాయణ, పురందరదాసుగా పరివర్తన చెందడానికి సంబంధించి చరిత్రకారులు ఒక కథని ఊటంకిస్తారు.
ఒకనాడు శీనివాసనాయక్ వద్దకు ఆ వేంకటేశ్వరుడు ఒక పేద బ్రాహ్మణుని రూపంలో వచ్చి తన కుమారుని ఉపనయనం చేయడానికి సహాయాన్ని అర్ధించాడు. ఏ సహాయమూ చేయడానికి యిష్టపడని శ్రీనివాస నాయకడు స్వామిని రేపు, మాపు రమ్మని తిప్పించుకుని ఒక చెల్లని కాసును యిచ్చి వెళ్లమన్నాడు. శ్రీహరి చిద్విలాసంగా నవ్వుకుని శ్రీనివాస నాయకుని భార్య సరస్వతీబాయి దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. సహజంగానే జాలి గుండె గల ఆ యిల్లాలు తన ముక్కెర తీసి ఆ బ్రాహ్మణుడికి దానం చేసింది. అదే మహద్భాగ్యమని ఆ బ్రాహ్మణుడు ఆమె ముక్కెరను అమ్మి సోమ్ము చేసుకోవడానికి సరాసరి శ్రీనివాస నాయకుని దగ్గరికే వెళ్ళతాడు. శ్రీనివాస నాయకడు ఆ ముక్కెర తన భార్యదేనని గ్రహించి బ్రాహ్మణుడిని కాస్త ఆగమని చెప్పి యింటికి వెళ్ళి ముక్కెర ఎక్కడని భార్యను నిలదీసి అడిగాడు. సరస్వతీబాయికి ఏమి చేయాలో తోచలేదు. దేవుడి గదిలో పెట్టానని, తీసుకు వస్తానని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి, చండశాసనుడైన భర్తను ఒప్పించడం, నమ్మించడం సాధ్యం కాదని గ్రహించి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుని విషం త్రాగబోయింది. ఆశ్చర్యకరంగా విషపు గిన్నెలో ఆమెకు ముక్కెర కనపడింది. ఆమె పరమానందంతో ఆ గిన్నెలోని ముక్కెరను తీసి శుభ్రం చేసి తన భర్తకు అందించింది. ఆ ముక్కెరను చూచి శ్రీనివాస నాయకడు ఆశ్చర్యపోయి, భార్యను నిజం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆమె చెప్పిన కథ విని నిర్ఘాంతపోయాడు. ఆ ఏడుకొండల వాడే తనకు కనువిప్పు కలిగించడానికి మారు వేషంలో వచ్చాడని గ్ర హించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోసం వెతకగా అతను కన్పించలేదు. జరిగినది గ్రహించిన నవ కోటి నారాయణుడు తన సర్వస్వం దానం చేసి భక్తిమార్గంలో పడ్డాడు.
తనకు జ్ఙానోదయమైన ఆక్షణాన్నే శ్రీనివాసుడు అఠాణ రాగంలో “మోసహోదేనల్లో “అని మొదటి కీర్తన రచించారు. 1525లో వ్యాసరాయులవారు వీరిని హరిదాసులుగా ఆశీర్వదించి పురందరదాసు అనే పేరునిచ్చారు. నాటినుండి ఆయన భక్తిమార్గాన్ని అనుసరిస్తూ దాదాపు 4లక్షల 75వేల కీర్తనలను సంస్కృత, కన్నడ భాషలలో రచించారు. వీటిలో నేడు మనకు కేవలం వెయ్యి మాత్రమే లభ్యమయ్యాయి. కస్తూరి వాసనలతో ఘుమ, ఘుమలాడే కన్నడ భాషలో ఆయన చేసిన రచనలకు“దాసర పదగళు” లేక “దేవర నామగళు” అని పేరు. వీరి ముద్ర “పురందర విఠల”. వీరు సంగీత శిక్షణకు ఆరంభ రాగమైన మాయామాళవగౌళ రాగాన్ని అందించటంతో పాటు, స్వరావళులు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు రచించిన ఆది గురువు. పురందరదాసు రచనలలో చక్కని ఉపమానాలు, సామెతలు కల్గి, పురాణ, ఉపనిషత్తులలోని సారమంత నిగూఢమై ఉంటుంది. ఆయన దాదాపు 84 రాగాలను గుర్తించి రచనలు చేశారు. ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధుమాధవి వంటి అపూర్వ రాగాలతో పాటు నేడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళ్యాణి, వరాళి, తోడి, భైరవి, మరియు సావేరి వంటి రాగాల్లో కూడా ఆయన అనేక కీర్తనలు రచించారు. ఆయన రచనలలో శంకరాభరణ రాగంలో రాసిన జోజో శ్రీ కృష్ణ, తిరుపతి వేంకటేశ్వరునిపై రచించిన సింధుభైరవి రాగంలో వెంకటాచల నిలయం, ముఖారి రాగంలో శారదా స్తోత్రం,, మధ్యమావతి రాగంలో లక్ష్మీ స్తోత్రం, కాపీ రాగంలో జగదోద్ధారణ ఆడిసిదళె యశోద, నాటలో జయ, జయ, కళ్యాణ వసంతంలో ఇనుదయ బారడే, మధ్యమావతి, శ్రీ రాగంలో భాగ్యాదా లక్ష్మి బారమ్మా చాలా ప్రసిద్ధి చెందాయి.
వీరికి వరదప్ప, గురురాయ, అభినవ, మధ్యపతి అను నలుగురు కుమారులు, రుక్మిణీబాయి అని ఒక కూతురు. వీరు తమ అవసాన దశలో సన్యసించి, హింపి సమీపంలో ఒక మంటపంలో నివసించారు. ఈ మంటపానికి పురందరదాసు మంటపం అని పేరు. పురందరదాసు తమ 80వ ఏట రక్తాక్షి సంవత్సరం పుష్య అమావాస్యనాడు (1564) పరమపదించారు.
తేటగీతి