బాల్యం తిరిగిరాదు. ఈ మాట అక్షర సత్యం. మళ్లీ బాల్యంలోకి తిరిగివెళ్లిపోతే బావుండును అని ఒక్కసారైనా అనుకోనివారు మీలో ఎంతమంది ఉన్నారు? ఆ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకోని వారుండరు. జామచెట్లెక్కి కాయలు కోయడం, అమ్మిచ్చిన పల్లీపట్టీని కాకి ఎంగిలి చేసి స్నేహితులతో పంచుకోవడం ఆ మధుర క్షణాలు మళ్లీరావు. ఒకవైపు ఆడపిల్లల దాగుడుమూతలతో, మరోవైపు మగపిల్లల గోటీబిల్ల లేదా గిల్లిదండాలతో పల్లెలు, పట్టణాలు సందడి చేస్తుండేవి. అమ్మాయిల గచ్చకాయల చప్పుడు, అబ్బాయిల గోళ్లీకాయల గల,గలలతో వేసవి వచ్చిందంటే వీథి అరుగులు నిండిపోయేవి. వయోబేధం లేకుండా అందరూ ఆడుకునే కోతికొమ్మచ్చి, వీరి, వీరి గుమ్మడిపండులతో సమయం ఆహ్లాదకరంగా గడిచిపోయేది. ఆ రోజులు తిరిగి రావు. కానీ ఆ జ్ఞాపకాల దొంతరలోంచి కొన్ని పిల్లల ఆటలను, పాటలను నెమరేసుకుందాం.
ఆడపిల్లలు ఒక్కచోట చేరి చేతులు తడుతూ పాడే చెమ్మచెక్క పాట యుగాలు గడిచినా మారదు. ఇది అమ్మాయిల ఆట అంటారు కానీ, అబ్బాయిలు కూడా ఇందులో చేరేవారు. చిన్నప్పుడు అందరిళ్లలో అక్కాతమ్ముడు, అన్నాచెల్లి కలిసి ఆడిన ఆట, పాడిన పాట ఇది –
చెమ్మచెక్కచారడేసి మొగ్గ
అట్లు పోయ్యంగ ఆరగించంగ
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ
పగడాల చెమ్మచెక్క పందిరేయంగ
పందిట్లో పాపారాయుడు పరుగులెత్తంగా
పిల్లలు పాడుకునే ఈ పాటలు లయబద్ధంగా ఉండి వారికి మానసికోల్లాసాన్ని కలుగచేయడానికి ఉపయోగపడేవి. ఇవి భాషలోని సొగసుని పిల్లలకు పరిచయం చేసేవి. గొబ్బిపాటలు, బతుకమ్మ పాటలు, బొమ్మల పెండిండ్ల పాటలు మన సాంప్రదాయాల గురించి పిల్లలకు వినోదాత్మకంగా తెలియచేసేవి.
అందరూ కాళ్లుజాపుకుని కూర్చుంటే, ఒక్కక్కరి కాలిని తడుతూ,
కాళ్లాగజ్జా కంకాళమ్మ, వేగుచుక్క వెలగమొగ్గ
మొగ్గకాదు మోదుగునీరు, నీరు గాదు నిమ్మలవాయ
వాయగాదు వాయంటకూర, కూర గాదు గుమ్మడిపండు
పండు కాదు…..
ఇలాసాగిపోయే ఈ పాటను ఎంతసేపైనా పాడుకోవచ్చు. లయ, ముక్తపదగ్రస్తములతో నడిచే చరణాలు పిల్లలు ఇట్టే ఆకళింపుచేసుకుని పదసంపదను కంఠస్థం చేయడానికి అనువైన పాట. నేటి ఆధునిక అంత్యాక్షరికి జన్మదాత ఈ చిట్టిపాట.
అన్నలు, అక్కలు ఆటలకెడుతూ తమని వదిలేసి వేడితే ఏకొన్నక్కరాగం మొదలెట్టే పసిపిల్లలకు అమ్మలు, తాతయ్యలే నేస్తాలు. వారిని బుజ్జగిస్తూ అన్నం తినిపించినట్టు నటిస్తూ,
ఇల్లలికి ముగ్గేసి
పీటేసి ఆకేసి
అన్నంపెట్టి
పప్పుపెట్టి
నెయ్యేసి
పాలోసి పెరుగోసి
అత్తారింటికి దారేదంటే
ఇట్లాపోయి అట్లాపోయి
అంటూ వారికి చక్కలిగింతలు పెట్టి, వారు నవ్వుతుంటే మురిసిపోయి, వారితో కలిసి బాల్యంలోకి వెళ్లిపోయేవారు. పళ్లూడిన తాతలను చూసి బోసినోటి మనవళ్లు కూడా ఊరుకుంటారా?
మా తాత అందం చందమామ అందం
మా తాత గుండు గుమ్మడి పండు
మా తాత మీసం రొయ్యల మీసం
మా తాత పిలక పంచదార చిలక
అని వచ్చీరాని మాటలతో ఆటపట్టించేవారు. ఈ ఆటలు, పాటలు కుటుంబ సంబంధాలను పెంచడానికి దోహదపడేవి. ఇలాంటి చిట్టిగీతాల్లోనే మరికొన్ని పిల్లల ఆటలు –
గుడు గుడు గుంజం గుండేరాగం, పాములపట్నం పడిగే రాగం
చిన్నన్న గుర్రం చిందులు తొక్కె, పెద్దన్న గుర్రం పెండ్లికిపోయె
నా గుర్రం పాలకు పోయె, కత్తెయ్యనా? బద్దెయ్యనా?
వేన్నీళ్లు పోయనా? చన్నీళ్లు పోయనా?
ఒప్పులకుప్పా వయ్యారిభామ, సన్నబియ్యం చాయప్పు
చిన్నమువ్వ సన్నగాజు, కొబ్బరికోరు బెల్లపీచు
గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
రాజు ఎక్కే రంగలు గుర్రం
రాణీ ఎక్కే జీను గుర్రం
రాకుమారెక్కె రత్నాల గుర్రం
ఇక అష్టాచెమ్మా, వామనగుంటలు, వైకుంఠపాళీ, పులిమేక, నాలుగుస్తంభాలాట, బొంగరాలు, తొక్కుడు బిళ్ల, గుజ్జన గూళ్లు (లక్క పిడతలతో చేసిన వంటింటి సామానుతో ఆడుకునే ఆట), నాలుగురాళ్లాట, నేలా, బండా? కళ్లగంతలు, ఏడుపెంకులాట… ఏడదాగున్నాయో ఈ ఆటలన్నీ? కాలం చాటున మరుగునపడ్డాయి కొన్ని. మనం మరచిన, నేటి పిల్లలకు తెలియని తెలిగింటి ఆట, పాటలను అప్పుడప్పుడ మనం గుర్తు చేసుకుంటేనే భావితరాలవారికి అందించగలుగుతాం. అప్పుడప్పుడు ఈ ఆటలు మీ పిల్లలతో, పాపలతో ఆడండి మరోసారి బాల్యంలోకి తొంగిచూడండి.
సౌమ్యశ్రీ రాళ్లభండి
(పెర్త్ తెలుగుబడి పదవవార్షికోత్సవం, తెలుగు భాషాదినోత్సవ సందర్భంగా విడుదల చేసిన అక్షరవిపంచిక ప్రత్యేక సంచికకు వ్రాసిన వ్యాసం)