మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ప్రతి సంవత్సరం ఇది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇందులో కొత్తగా విశేషం ఏముంది అని మీరనుకుంటున్నారా? మీరనుకుంటున్నది నిజమే అందులో ఎటువంటి విశేషం లేదు. ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా సమాజంలో మార్పనేది ఏమీ లేదు. కానీ నాకు మాత్రం మహిళాదినోత్సవాలతో, మహిళా కమిషన్తో జర్నలిస్టుగా అనుబంధం ఉంది. 90వ దశకంలో వార్తా పత్రికల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఇదివరకు చివరిపేజి క్రీడలకి, దాని ముందు సినిమాలకి అని ఉండేవి. కాని రాను, రాను పాఠకులను ఆకర్షించడానికి అందరి వయసుకి తగ్గట్టుగా ప్రత్యేక పేజీలను ప్రచురించటం ఆనవాయితీ అయిపోయింది. ఈనాడులో వసుంధర ఉంటే, దానికి ధీటుగా వార్తలో చెలి అనే పేజీ ఉండేది. మహిళలు అనగానే కుట్లు, అల్లికలు, ముగ్గులు, వంటలు, వార్పులు, ఇల్లాలి ముచ్చట్లు ఇలాంటివే ఉండేవని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అదే విధంగా మహిళా విలేకర్లు అనగానే పైన ఉదహరించిన అంశాల మీద సాంస్కృతిక కార్యక్రమాల మీద వ్యాసాలు రాయటం, అడపా, దడపా మహిళలను ఇంటర్వ్యూ చేయడం వారి వృత్తిలో భాగాలు అని మీకు ఇప్పటికే తెలుసని నాకు తెలుసు. ప్రముఖ జర్నలిస్టుల పేర్లు చెప్పమంటే, వందమంది మగవారి పేర్లు చెప్పగలరు కానీ పట్టుమని పదిమంది మహిళా విలేకర్ల పేర్లు చెప్పలేరు. కారణం, రాజకీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, పార్లమెంట్ కార్యకలాపాలు, అధికార యంత్రాంగం వంటి వాటిని కవర్ చేయడానికి ఎక్కువగా మగవారినే పంపుతారు కానీ, మహిళా విలేకర్లను పంపరు. టీవిలు వచ్చాక, మొదట్లో జనాకర్షణకో ఏమో మహిళా విలేకర్లు మైకులు పట్టుకుని కన్పించేవారు. యాంకర్లగా కూడా వారే ఉండేవారు. నేడు కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదనుకోండి.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెపుతున్నానంటే, ఏదో స్త్రీవాదం, ఉద్యమాల గురించి మీకు బోరు కొట్టిద్దామని కాదు. నా పత్రికా విలేకరి ప్రయాణం కూడా మహిళల గురించి రాయటంతోనే మొదలైందని గుర్తుచేయడానికి, చెప్పడానికి. అందులోనూ కొత్తగా వచ్చే విలేకర్లను ఇలాంటి కార్యక్రమాలకే పంపిస్తుంటారు. ఇక్కడో విషయం చెప్పాలి, మా గురువుగారు రాజగోపాలన్ గారు కూడా మొదట్లో పత్రికా విలేకరిగా తన జీవితం మొదలయినప్పుడు, ఆయన ఉద్యోగం ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లడం, అక్కర మార్చురీలో యాక్సిడెంట్ కేసుల్లో మరణించినవారి వివరాలు, పోలీసు రిపోర్టులు తీసుకురావడం. ఆ ఉద్యోగంతో పోలిస్తే, కుట్లు, అల్లికలే ఉత్తమం. సరే కోతికొమ్మచ్చి ఆపి, కథలోకి వద్దాం. ఢిల్లీలో ఉన్న జాతీయ మహిళా కమిషన్ లో ఏదో సదస్సు ఉండి, వారు మా ఆఫీసుకు ఆహ్వానం పంపించారు. మీ ఊహాగానాలకి బహుమతులు లేవండోయ్. సహజంగానే ఆఫీసులో ఉన్న ఒక్కగానొక్క మహిళను, నేనుకాక వేరెవరు వెడతారండి. వెళ్లడం ఒకందుకు నాకు మంచిదే అయ్యింది. నాలో బెరుకు తగ్గి, ఆత్మధైర్యం వచ్చింది. ఒకరకంగా నేను వెళ్లిన మొట్టమొదటి సదస్సు అదే. ఆ సమయంలో జాతీయ మహిళా కమిషన్ కు ఛైర్ పర్సన్ గా మోహినీ గిరిగారు ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరిగారి కోడలు ఆవిడ. అలాగే పద్మజగారని సెక్రటరీ. అలాగే న్యాయ విభాగంలో సాధిక్ అని ఒక లాయర్ ఉండేవారు. వీరంతా తెలుగువారు కావటం నా అదృష్టం. ఆ సమయంలో ఢిల్లీకి దగ్గరలోని ఘజియాబాద్ లో ఒక దళిత మహిళను అగ్రకులాలకు చెందిన వారు దారుణంగా హింసించి, నీచాతి నీచంగా, ఆవిడ కుమారుల చేత గ్రామస్తులు చూస్తుండగా అత్యాచారం చేయించారు. ఆ బాధితురాలిని జాతీయ కమిషన్ పత్రికావిలేకర్ల ముందుకు తీసుకువచ్చి, ఆమె వ్యథను బయటపెట్టటంతోపాటు న్యాయం అందించడానికి వారి ప్రయత్నాలు వారు చేశారు. సరే నాకు తోచిన విధంగా నేను కూడా ఒక వార్తలా కాక, వార్తా కథనాన్ని వ్యాస రూపంలో చెలి పేజికి పంపిచాను. వారు కూడా అంతే శ్రద్ధగా అరపేజీ వ్యాసాన్ని ప్రచురించారు. కానీ కొన్ని జాతీయ పత్రికలు మాత్రం ఆరో పేజీలో ఎక్కడో ఒక మూల చిన్న వార్తను ప్రచురించారు. హిందీ, ఇంగ్లీషు పత్రికలు కూడా వీటికి రాజకీయ రంగు పులిమి వార్తను ప్రచురించారే తప్ప, ఆ మహిళ మనోవేదన గురించి మాట్లాడిన పాపాన ఒక్కరు పోలేదు. నేను మాత్రం మహిళల పట్ల వివక్ష, బాధితురాలి మనోవేదనను చొప్పిస్తూ, సభ్య సమాజ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ, వ్యాసం రాశాను. ఆ వ్యాసం మోహినీ గిరి, పద్మజగార్ల దృష్టిలో పడింది. వారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. సున్నితమైన అంశం గురించి నేను రాసిన విధానం చూసి, జాతీయ పత్రికా విలేకర్లు చేయలేని పనిని, ఒక ప్రాంతీయ పత్రికా విలేకరి అందునా కొత్తగా జర్నలిజంలో బుడి,బుడి అడుగులు వేస్తున్న నేను చేయటాన్ని కొనియాడారు. అప్పటి నుంచి నాకు జాతీయ కమిషన్లో పరపతి పెరిగిపోయింది. వారు ఏర్పాటు చేసే చిన్నా, పెద్ద కార్యక్రమాలన్నింటికి నాకు ప్రత్యేక ఆహ్వానాలు అందేవి. నేను కూడా నాకు వీలైనంతవరకు వారి కార్యక్రమాలకి హాజరయి, నాకు తోచిన విధంగా మహిళల సమస్యలకి సంబంధించిన వ్యాసాలను రాశాను. అది మహిళా సాధికారిత గురించి కావచ్చు, చట్టసభలలో మహిళల ప్రాతినిథ్యం గురించి కావచ్చు, మహిళా మంత్రులకు ఇచ్చే మంత్రిత్వశాఖల గురించి కావచ్చు, వేశ్యావృత్తిలో మగ్గిపోతున్న వేదవతుల గురించి కావచ్చు, ఇలా అనేక అంశాలను స్పృశించి, నాకు తోచినంతవరకు వ్యాసాలు తరుచూ చెలి పేజీకి రాసేదాన్ని. దానివల్ల నేనేదో మహిళోద్ధరణ చేశాను అని చెప్పను. కాకపోతే, మహిళలు వంటింటికే మగ్గిపోవట్లేదని చదువుకుంటున్నారని, ఉద్యోగాలు చేస్తున్నారని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచేవారికి, ఉద్యోగం చేస్తేనో, లేక చదువుకుంటేనో, మహిళలు ఉద్ధరించపడినట్లు కాదని గుర్తు చేయడానికి. మహిళలు అనగానే మన మస్తిష్కంలో బూజుపట్టిపోయిన భావజాలం గురించి ఎత్తిచూపాలన్నదే నా ప్రయత్నం. ఏదిఏమైనప్పటికీ, నా కొద్దిపాటి పత్రికా రంగ అనుభవంలో అనేకమంది మహిళలను కలిసాను. వారిని ఇంటర్వ్యూలు చేశాను.
అప్పట్లో హైద్రాబాదు నుంచి ఎవరు వచ్చినా ఆంధ్రాభవన్ లోనే ఎక్కువగా బస చేసేవారు. అలా వచ్చిన వారిలో రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఒకరు. నాకు అప్పటికి ఆవిడ ఎవరో కూడా తెలియదు. అలా చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు. సాహిత్య రంగంతో మమేకమైపోయి నేను పెరగలేదు. ఆవిడ రాసిన నవలను ఒక్కదానిని కూడా నేను చదవలేదు. అసలు ఆవిడ సాహిత్య రంగానికి చేసిన సేవలేంటో కూడా నాకు తెలియదు. కానీ, నేను మహిళను కనుక, అలాంటి పెద్ద రచయిత్రి ఢిల్లీకి వచ్చారు కనుక, నేను ఆవిడను ఇంటర్వ్యూ చేయాలి అంతే. చూశారా, మన భావాలు ఎంత మూసపద్దతిలో ఉంటాయో. నా తోటి విలేఖరి, ఆవిడ రచయిత్రని, ఒకటి, రెండు ఆవిడ రాసిన నవలల పేర్లు మాత్రం చెప్పారు. నామమాత్రపు ఆ సమాచారంతో నేను ఆవిడను కల్సి, ఇంటర్వ్యూ చేశాను. మరో కథనంలో అలా నేను చేసిన అనేక ఇంటర్వ్యూల గురించి ముచ్చటిస్తాను. ప్రస్తుతం మాత్రం వాసిరెడ్డి సీతాదేవిగారి గురించి తెలుసుకుందాం. ఆవిడ స్త్రీవాదని, ఆవిడ రచనలలో స్త్రీ సమస్యల గురించి ఆవిడ చర్చించిన విధానం గురించి నాకు ఏమీ తెలవదు. కానీ నేడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అంత పెద్ద రచయిత్రిని, ఉన్నతమైన వ్యక్తిని కలుసుకుని ముచ్చటించే అవకాశం దక్కిందని మాత్రం సంతోషిస్తుంటాను. ఆవిడ గురించి ఏమాత్రం తెలిసినా, ఆవిడ రచనలు చదివి ఉన్నా నా ఇంటర్వ్యూ మరో విధంగా ఉండేదేమో. కాని పరిణితి, పరిపక్వత లేని నేను చెలి పేజీ కొరకు, చేసిన ఇంటర్వ్యూలో ఆవిడ ప్రస్తావించిన విషయాలు నేటీకి మారలేదు. నాడు ఆగష్టు 5, 1997లో చెలి పేజీలో ప్రచురితమైన ఆ ఇంటర్వ్యూ మీ కోసం.
స్త్రీవాదం ఉద్యమం కాదు, దృక్పథం మాత్రమే – వాసిరెడ్డి సీతాదేవి
రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఆరుసార్లు అవార్డు పొందిన ఏకైక రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. సాహితీ జగత్తులో అతిగొప్ప పురష్కారంగా చెప్పుకోదగ్గ విశిష్ట పురష్కారాన్ని పొందిన ఈ రచయిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన సీతీదేవి సాహిత్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఈ తరం యువతీ, యువకులకు ఆమె ప్రతిభ అంతగా తెలియకపోవచ్చు. కానీ సాహిత్యాభిలాష ఉన్న ప్రతి ఒక్కరికీ సీతాదేవి సుపరిచితురాలే. ఇప్పటివరకు 29 నవలలు, తొమ్మది కథా సంకలనాలు, 10 అనువాదాలు, మూడు పిల్లల పుస్తకాలు ఇలా మొత్తం 61 పుస్తకాలు రాసిన సీతాదేవి 1957లో ప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్ చంద్ జీవితానికి పుస్తకరూపం ఇచ్చారు. ఆమె రాసిన ప్రముఖ నవల ‘మట్టి మనిషి’ని నేషనల్ బుక్ ట్రస్ట్ ‘మిట్టీకే ఆద్మీ’ పేరిట హిందీలో అనువదించి, ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎ ఫైనల్లో పాఠ్యపుస్తకంగా స్వీకరించింది.
నాగపూర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.లో పట్టభద్రురాలైన వాసిరెడ్డి సీతాదేవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ, అలహాబాద్ నుంచి హిందీ పరీక్షలు కూడా పాసయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి రిటైరయ్యారు. రిజర్వేషన్లపై ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సుప్రభాతం పత్రికకు రాసిన ‘ఊర్మిళ’ అనే నవల ఆమె చివరి నవల. ఆ తర్వాత రచనా వ్యాసాంగానికి దూరంగా ఉన్నారు. నాలుగు దశాబ్ధాల తన రచనా వ్యాసాంగానికి సంబంధించిన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇవ్వటం ద్వారా ఆమె మరోసారి సాహితీ అభిమానుల ముందుకు రానున్నారు. నేషనల్ బుక్ ట్రస్టులో సభ్యురాలైన వాసిరెడ్డి సీతాదేవి ట్రస్టు సమావేశాలలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ‘చెలి’ ఆమెని కలిసి కొద్దిసేపు ముచ్చటించింది.
రచనా వ్యాసాంగం ఎప్పుడు ప్రారంభించారు. ఆ ఆలోచన ఎలా కలిగింది?
ప్రతి వాళ్లు నన్ను ఈ ప్రశ్న అడుగుతుంటారు. వారందరికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. నేను ఆలోచించటం మొదలు పెట్టిన నాటి నుంచే రచనలు చేయటం ప్రారంభించాను. ‘ఆలోచన అనే కలంతో మస్తిష్కమనే పుస్తకంపై రచనలు చేస్తూ వచ్చాను.’ నేను ఒక చిన్న గ్రామంలో పుట్టాను. అప్పట్లో పరదా పద్దతి కూడా ఉండేది. స్త్రీ, పురుషుల మధ్య విబేధాలెందుకున్నాయి? ధనిక, పేద తేడాలెలా పుట్టాయి? వంటి అనేక ప్రశ్నలు నా మస్తిష్కంలో అలజడి సృష్టించేవి. అయితే నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే వారెవరూ అప్పట్లో లేరు. చాలామంది నా కో-రచయితలు మాకు చిన్ననాటి నుంచి చిలకమర్తిగారినో, కృష్ణశాస్త్రిగారితోనో పరిచయం ఉండేదని, వారే నాకు స్ఫూర్తని చెపుతూ ఉంటారు. అయినే నేను అలా రొటీన్ సమాధానం చెప్పలేను. ‘నాకు చుట్టూ ఉన్న వాతావరణం, సమస్యలు, సాంప్రదాయాలే స్ఫూర్తి.
మీ ఆలోచనలు కాగితంపై అక్షరరూపం ఎప్పుడు దాల్చాయి?
నేను మనసులోనే రాసుకున్న కథలను అక్షరబద్ధం 1951లో చేశాను. నా చిన్నప్పుడు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నన్నాళ్లు, ‘జీవితం అంటే ఏమిటి?’ అన్న ఆలోచన పదేపదే నాకు కలిగించింది. నేను చనిపోతే నా చుట్టూ ఉన్న ఏ వస్తువులో మార్పు రాదు. అన్ని అక్కడే ఉంటాయి. నేను మాత్రం ఉండను అన్న ఆలోచన వచ్చింది. దాని ఆధారంగానే ఒక క్షయతో బాధపడుతున్న రోగి జీవితం గురించి ఆలోచించినట్టుగా, చెట్టు మీద కోయిల మధుర గానమే జీవితమా, స్కూలు వెళ్లటం, హోంవర్కులు చేసుకోవటం ఇదేనా జీవితం అంటే అని ఒక వ్యాసంలాంటిది రాశాను. శరీరం పోతుంది ఆత్మ ఉంటుంది. ‘ఒక మహా నిస్తబ్ధత బద్ధలు కొట్టుకొని వచ్చిన చైతన్యం, మళ్లీ నిస్తబ్ధత అవటమే జీవితం అంటే’ అని అర్థం వచ్చేలా ‘జీవితం అంటే ఏమిటి’ అనే పేరుతో నా ఆలోచనలను పేపరు మీద ఉంచాను. అది అప్పట్లో ‘కిన్నెర’ పత్రికలో ప్రచురితమయింది. అయితే నేను రాసిన మొదటి కథ ‘ధర్మదేవత గుడ్డి కళ్లు.’ ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ కు ఈ కథను రాశాను. నా మొదటి కథలోనే మార్క్సిస్టు భావాలను వ్యక్తపర్చాను. ఈ పోటీలకు కొడవటిగంటి కుటుంబరావుగారు న్యాయనిర్ణేతగా వ్యవహిరించారు. ఆ కథకు నాకు మొదటి బహుమతి కూడా వచ్చింది. ఒక స్టూడెంట్ ఇలాంటి కథ రాయటం పట్ల కుటుంబరావుగారు హర్షం వెలిబుచ్చి, నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
రచనలు సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి?
అన్ని రచనలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పలేం. రచనలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనడం కంటే, సమాజం, రచనలని ప్రభావితం చేస్తుందంటే సమంజసంగా ఉంటుంది. ప్రజా ఉద్యమాల నుంచే సాహిత్యం పుడుతుంది. సమాజం భావ విప్లవం కలిగిస్తుంది.
ప్రస్తుతం చర్చల్లో ఉన్న స్త్రీవాదం, ఉద్యమం గురించి మీ అభిప్రాయమేమిటి?
స్త్రీవాదం ఒక ఉద్యమం కాదు. స్త్రీవాదం ఒక సిద్ధాతమూ కాదు. అది ఒక దృక్పథం మాత్రమే. అతివల శీరరం చట్టు అల్లుతున్న సాహిత్యాలన్నింటిని స్త్రీవాదం అనడం విచారకరం. ఏవో నాలుగు కవితలు, కథలు స్త్రీల గురించి రాసేసి, అదే స్త్రీ వాదమనటంలో అర్థం లేదు. ప్రతి సాహిత్యానికి కొన్ని హద్దులుంటాయి. స్త్రీవాదులమని చెప్పుకుంటున్న కొందరు ఒక చోట చేరి ఇష్టాగోష్టులు పెట్టుకొని, తమ అభిప్రాయాలను అప్పచెప్పుకున్నంత మాత్రాన అది ఉద్యమం అయిపోదు.
మీరు స్త్రీ వాదానికి వ్యతిరేకా?
కాదు. నేను 1952లో ‘ఎల్లమ్మ’ అని ఒక కథ రాశాను. అది స్త్రీవాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక పేద మహిళ భర్త పెట్టే హింసలు భరించలేక, తాళిని తెంచి వెళ్లిపోయి తన కాళ్లమీద తాను నిలబడడమేకాక, తనలాంటి మరో అభాగినికి మార్గదర్శకత్వం వహించి ఆత్మస్థైర్యం, విశ్వాసం కలిగిస్తుంది. అప్పట్లో రంగనాయకమ్మ కూడా స్త్రీవాదంపై పలు రచనలు చేసేవారు. ఏ రచనైనా ప్రజలలోకి వెళ్లాలి. వారిని ఆలోచించేటట్టు చేయాలి. ప్రస్తుత రచనలు ఎంతవరకు జనాల్లోకి వెడుతున్నాయి? ఈ రచనలన్నీ ఒక కూటమికి పరిమితమవుతున్నాయి. తప్పిస్తే, ప్రజలలో చైతన్యం కల్గించట్లేదు.
మరి రచనల్లో సమస్యలకి పరిష్కారం చూపక్కర్లేదా?
ఆలోచింపచేసేదే సాహిత్యం. మనం చూపే సమస్య మరొకరికి ఆమోదయోగ్యం కాకపోవచ్చు. పరిష్కారం చూపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. అందుకే సమస్యను ఎత్తి చూపాలి. క్రియేటివ్ రచయిత బోధకుడిలా ఉపన్యాసం ఇవ్వకూడదు. రచనలో తన పాత్రల ద్వారా ‘పంచదార గుళికల్లా’ సమస్యను వారి ముందుంచాలి. తద్వారా పాఠకుల్లో ఆలోచన రేకెత్తించాలి. ఉదాహరణకి నా కథ ‘ధర్మదేవత గుడ్డికళ్లు’లో ఒక పాత్ర ద్వారా ‘మనుష్యులంతా సమానమే, మనుష్యులందరికి కూడు, గుడ్డ, గూడు’ ఉండాలన్నందుకు నన్ను అరెస్టు చేశారని చెప్పటం ద్వారా నా భావాలనువ్యక్తం చేశాను. సాహిత్యం ఎల్లప్పుడు పరిష్కారాన్ని అంతర్గతంగా చెప్పాలే, కాని స్పష్టం చేయకూడదు.
మరి మీ మరీచిక నవల అదే పంథాలోకి వస్తుందా? అది నిషేధానికి కూడా గురైంది?
మరీచికలో నేను నక్సలైట్లకు మద్దతు పలికానని వివాదం రేగింది. ఆఖరికి ప్రభుత్వం నాకు డిప్యూటీ డైరెక్టరు పోస్టు నుంచి రివర్స్ ఇచ్చింది. నేను ఉమన్ అండ్ యూస్ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసే కాలంలో ఒక నక్సల్ యువతి ఎన్ కౌంటర్లో చనిపోయింది. ఆ అమ్మాయి తన తండ్రికి ఒక ఉత్తరం రాసింది. అది నాదగ్గరకు వచ్చింది. ఆ ఉత్తరం గురించి నేను నా నవలలో ప్రస్తావించాను. దాంతో నాకు నక్సల్స్ కు సంబంధం ఉందని భావించారు. కానీ, నేను నవలలో చెప్పదల్చుకుందొక్కటే, ఇలాంటి ఉద్యమాలు నిలబడాలన్నా, సఫలం అవ్వాలన్నా కార్మికులలోకి, కర్షకులలోకి, ప్రజలలోకి ఈ ఉద్యమాలు వెళ్లాలి. అప్పుడు విజయవంతం అవుతాయి. ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నాను. సిద్ధాంతం ప్రజలలోకి చొచ్చుకుని వెళ్లాలని మాత్రమే సూచించాను. అది ఏ సిద్ధాంతమైనా కావచ్చు. అయితే తర్వాత ఈ నవలపై నిషేధాన్ని ఎత్తివేశారు.
ఇలా నవలలను నిషేధించటం ఎంతవరకు సమంజసం?
నవలలను నిషేధించటమంటే భావస్వాతంత్ర్యాన్ని ధిక్కరించినట్టే. నా నవలను నిషేధించినప్పుడు వచ్చిన ప్రచారం వల్ల నాకు పేరు వస్తుందని కొందరు రచయితలు నా నవలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కూడా చేశారు. కానీ, జర్నలిస్టులు నాకు మద్దతును పలికి ఎంతో సహకరించారు. కోర్టులో కేసు నెగ్గాక తిరిగి నా పూర్వ పదవి నాకు లభించింది. ప్రతి రచయితకు తాను చెప్పదల్చుకునేది చెప్పే హక్కు ఉంటుంది. నా నవలలో కూడా నేను ఉద్యమాలు ప్రజలల్లోంచి రావాలన్నాను.
రచయితలలో స్పర్థల గురించి మీ కామెంట్?
దేనికైనా కొన్ని పరిమితులుంటాయి. ఆహ్లాదకరమైన స్పర్థ మరిన్ని మంచి రచనలు పుట్టడానికి ఆస్కారాన్నిస్తుంది. ఈ పరిస్థితి మన తెలుగులో లేకపోవటం దురదృష్టకరం. గ్రూపులు పుట్టుకొచ్చి, కొందరు రచయితలు ఒక కూటమిగా ఏర్పడుతున్నారు. పక్కవాళ్లకు పేను రాకూడదని పాటుపడుతున్నారు. మా కాలంలో నా గురించి పాఠకులకు ఎంత తెలుపో, రంగనాయమ్మ గురించి అంతే తెలుసు. ఇప్పుడు ప్రచారానికి ఎక్కువ ప్రాముఖ్యానిస్తున్నారు. శివశంకరి పేరు చెప్పగానే పాఠకులు గుర్తిస్తారు. అదే జయకాంతన్ పేరు చెపితే ఎవరికి తెలియదు. మన సాహిత్యం గొప్పతనాన్ని బయట ప్రపంచానికి చాటాలాలన్న తాపత్రయం మనవారిలో కొరవడింది. రావిశాస్త్రి, చలం, ఉన్నవ లక్ష్మీనారాయణల గురించి ఇతర ప్రాంతాలవారికి ఎంత తెలుసు? ప్రాంతానికొక గ్రూపు ఏర్పడి, రాయలసీమ రచయితలకు, తెలింగాణా వారితో పడదు. వారికి ఆంధ్రా రచయితలతో పడదు. గిర గీసుకొని అందులోనే ఉంటున్నారు. గ్రూపుల్లో ఒకరి రచనలను ఇంకొకరు పొగుడుకోవడానికి సమయం సరిపుచ్చుతున్నారు.
నేటికాలంలో రచనలు ఎలా ఉంటున్నాయి?
సాహిత్యాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చారు. ప్రతి పేజీని డబ్బు చేసి అమ్ముతున్నారు. క్షణికోద్రేకం కలిగించేవి, థ్రిల్ ఇచ్చే రచనలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ప్రతీ విషయాన్ని సెన్సేషనల్ చేయటం అలవడింది. ఎదిగి, ఎదగని వయసులో యువత వీటిని చదివి పెడదోవ పట్టడానికి నేటి రచనలు పూర్తిగా తోడ్పడుతున్నాయి. నాణ్యతగల రచనలు చేసేవారిని వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. రచనల్లో నాణ్యత లోపిస్తోంది. షాకింగ్ రాస్తేనే నవలలు హిట్ అవుతాయన్న దృక్పథం ఏర్పడింది.
నేడు పుస్తక పఠనం తగ్గుతోంది. మీరేమంటారు?
తగ్గుతోందనడంలో సందేహంలేదు. అయితే ఇది కొన్నాళ్లు మాత్రమే. మళ్లీ ప్రజలు పుస్తకాలను విరివిగా చదివే రోజు వస్తుంది. ఇదిరకు మహిళలు పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఇంటిపని అంతా అయిపోయాక, మధ్యాహ్నం వేళల్లో బజారులోకి వచ్చిన ప్రతి పత్రిక, నవల కొని చదివేవారు. కాని నేడు టెలివజన్లు, కేబుల్ నెట్ వర్క్లు పెరిగిపోయి పుస్తకాలు వైపు వారు చూడట్లేదు. మెదడుకు పనివ్వకుండా, శ్రమలేకుండా వారికి టీవి ద్వారా కాలక్షేపం జరుగుతోంది. దాంతో వారు టీవీలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఇప్పటికి సాహిత్యం పట్ల మక్కువ గలవారు పుస్తకాలు చదువుతూనే ఉన్నారు.
మీకు ఒక నవల రాయడానికి ఎంతటైం పడుతుంది. మీకు నచ్చిన మీ నవలలేంటి?
ఇదివరకు ఉద్యోగం చేస్తుండటంతో సమయం సరిపోయేదికాదు. దాంతో ఒక్కొక్కసారి నవల పూర్తి చేయడానికి చాలా వ్యవధి పట్టేది. ఏ నవల ఒక్కసారి సంపూర్ణంగా రాయలేదు. ఒక్కొక్కొసారి మూడు నవలలు కంటిన్యూగా రాసి పత్రికలకు పంపిన సందర్భాలు కూడా లేకపోలేదు. అప్పుడప్పుడు అన్పిస్తుంటుంది. నాకే కనుక ఇంకొంచెం తీరికి ఉండి ఉంటే, దీక్షగా ఒకే బిగిన నవలను రాయగలిగితే, నేను రాసిన చాలా నవలలను మరింత బాగా రాసి ఉండదానిని. ఇక నేను రాసిన నవలలో నాకు బాగా నచ్చినవి అంటే చెప్పటం కష్టం. అయితే అడవి మల్లె, సమత, మట్టి మనిషి, మరీచిక నాకు సంతృప్తినిచ్చాయి.
మీకు నచ్చిన ఇతర నవలలు, రచయితలు…
బాగా రాసేవాళ్లందరూ నాకు నచ్చినవారే. పుస్తకాలు రెండు రకాలు. మంచి పుస్తకాలు. చెడ్డ పుస్తకాలు. సమాజానికి మేలు చేసే ప్రతీ పుస్తకం నాకు నచ్చిందే.
చివరగా, మీ భవిష్యత్తు కార్యక్రమమేంటి? మళ్లీ నవల ఏదైనా రాస్తున్నారా?
ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఊర్మిళ తర్వాత మరే నవల రాయలేదు. తొందర్లోనే నా జ్ఞాపకాలను పుస్తకంగా వెలువర్చాలని అనుకుంటున్నాను. అదే నా చివరి రచన కావచ్చు. వీలైతే మహిళల సమస్య మీద నవల రాయాలని ఉంది. అలాగే నా నవలను నేను ఇంతవరకు ఎప్పుడు ప్రచురించలేదు. కాని ఊర్మిళ నవలను పుస్తక రూపంలో తీసుకురావాలని కూడా అనుకుంటున్నాను.
సౌమ్యశ్రీ రాళ్లభండి