తేటగీతి

తేటగీతి పరిచయం

పోతన పద్యం, అన్నమయ్య పదం, ఎంకిపాట కావేవి చర్చకి అనర్హం.తెలుగుతనం ఉట్టిపడే ప్రతి అంశం మన సంప్కృతికి, సాహిత్యానికి పట్టుకొమ్మలే.పరవళ్ళు తొక్కె గోదావరి తీరం, వేమన శతకం, రామదాసు కీర్తన, క్షేత్రయ్య పదాలు సాగరాన ఆవల ఒడ్డున నిలిచి పోయినా,ఈ తీరంతో మమేకం చేయాలన్న తాపత్రయానికి మరోపేరే తేటగీతి.


ఈ వేదిక ద్వారా మాకు తెలుగు భాషా, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఉన్న అభిమానాన్ని చూపటంతోపాటు విదేశాలలో పెరుగుతున్న మా పిల్లలకు మన సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించి, ప్రేరణ కల్పించాలనే చిరు ప్రయత్నానికి ఓ విజయదశమినాడు అంకురార్పరణ చేశాం.


ఎన్నో వెబ్ సైట్లు, ఎందరో మహానుభావులు, ఎన్నోవిధాలుగా తెలుగు భాషా, సంస్కృతి, సాహితీ, సంగీతాల గురించి రోజు చెపుతుంటే, మేము కొత్తగా చేయగలిగేదిమిటి? అనే ప్రశ్న మమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంది. అయితే, ఓనమాలు ప్రతీ ఒక్కరికీ ఎప్పుడొ ఒకప్పుడు కొత్తే. అక్షరాలు దిద్దే పిల్లవాడికి బాలశిక్ష కొత్తే! అలాగే మాకు కూడా! ఎదో చేయాలన్న తాపత్రయం, ఏమి చేయాలన్న దిక్కుతోచనితనం. కానీ, ఈ ఒక్క శబ్ధమే మాకు ప్రేరణ. ఆ ప్రేరణతోనే ముందడుగు వేశాం.


వెబసైట్ మొదలుపెడదామని అయితే అనుకున్నాంగానీ, దానికి రూపురేఖలు ఇవ్వటం దగ్గిరే మా ఊహలు నిలిచిపోయాయి.అందరికి ఎందులోనో అందులో కొంత ప్రవేశం ఉంది. మాలో ఒకరు భాషా ప్రవీణులైతే, మరొకరు సంగీతజ్ఞలు.మాకు తెలసినది ఇంత.తెలుసుకోవల్సింది ఎంతో!


తెలుగుదేశం విడిచి వచ్చినా, భాష మీద మమకారం మా చేత ఈ ప్రయత్నాన్ని చేయించింది. పెర్త్ లోని తెలుగువారినికాకా, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారిని కలిపి, కూర్చి, పేర్చడానికి ఈ సాంకేతిక యుగంలో ఈ సాలెగూడు (వెబ్) కంటే మరో తేలికైన,సులువైన మార్గం మాకు కన్పించలేదు.


ఈ వెబ్ సైట్ ను వీలైనంతవరకు తెలుగులోనే నిర్వహించాలన్నది మా సంకల్సం. మధ్య,మధ్య లో కుప్పిగంతులు వేస్తే అంటే,ఇంగ్లీషు తదితర భాషల్లో వ్యాసాలు మీకు కన్పిస్తే, క్షంతవ్యులం! అలాగే ఈ సైట్ లో వీలైనంతవరకూ మా తేటగీతి రాతలే ప్రధానం. కాకపోతే తెలుగుతనం కన్పించిన ఏ వ్యాసమైన సేకరించి మరింతమందితో పంచుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు.


మేము ముందే విన్నవించుకున్నట్టు, ఇది తెలుగువారి వేదిక ఇందులో అందరు తెలుగువారికి స్థానం ఉంది. కావున ఔత్సాహికులెవరైన తమకు నచ్చిన, మెచ్చిన అంశాలపై వ్యాసాలు రాసి మాకు పంపిస్తే అనువైన వాటిని ప్రచురిస్తాం. అలాగే మా తప్పులను క్షమించి, మాకు సలహాలు సహృదయంతో అందిస్తే ఆచరించి, ఈ సైట్ కు మెరుగులు దిద్దగలం.


ఎన్నో ఆశలతో, ఆశిస్సులతో... మీ తేటగీతి.




Copyright © 2012 by Thetageethi (తేటగీతి)